Total Pageviews

Tuesday, August 6, 2013

సదా సాయి స్మరణతో సర్వం సాధ్యమే!


సదా సాయి స్మరణతో సర్వం సాధ్యమే!
గాలిలేని చోట దీపం ఎంతో నిశ్చలంగా, స్థిరంగా వెలుగుతుంది. దానిని గాలిలో ఉంచగానే వెలుగులోని స్థిరత్వం పోతుంది. చివరికి ఆ గాలి దీపాన్నే ఆర్పేస్తుంది. మనసు కూడా అంతే. ఆది స్వర్గం, నరకం, దేనినైనా సృష్టిస్తుంది. మనసును తదేక ధాన్యంతో స్థిరంగా ఉంచుకోవాలి. లేదంటే కోరికలనే సుడిగాలి దానిని అల్లకల్లోలం చేస్తుంది. మనసు కలత చెందుతుంది. ఆందోళన, ఒత్తిడి కలుగుతాయి. ఫలితంగా చేసే పనులపై ఏకాగ్రత లోపిస్తుంది. అంకిత భావం కరవుతుంది. చివరకు జీవితమే గతి తప్పుతుంది. గాలివాటుకు ఎటుపడితే అటు కొట్టుకుపోయే గాలిపటంలా మారుతుంది.
భగవంతరావు క్షీరసాగర్‌ అలాంటి వాడే. అతని తండ్రి విఠలునికి పరమభక్తుడు. ప్రతి సంవత్సరం నియమం తప్పకుండా పండరిపురం వెళ్లి విఠలుని దర్శనం చేసుకునే వాడు. ఇంటి వద్ద కూడా విఠలునికి నిష్టగా పూజలు చేసేవాడు. అతని మరణాంతరం అతని కొడుకు భగవంతరావు కొన్నాళ్లు తండ్రి మాదిరిగా పూజలు నిర్వహించాడు. తరువాత ప్రాపంచిక విషయాల్లో పడి ఆ విషయాన్ని మరచిపోయాడు. చివరకు తండ్రికి శ్రాద్ధం పెట్టడం కూడా మరచిపోయాడు. తల్లిదండ్రులు పిల్లల్ని కనగలరు కాని వారి బుద్దుల్ని కనలేరు కదా ! అయితే సమయం వచ్చాక సద్గురువు మందలించి సక్రమమైన మార్గంలో పెడతారు.
బాబా అంటనే తప్పులు దిద్దే దేవుడు. ఒకసారి బాబా తన సంకల్పంతో భగవంతరావును షిర్డీకి రప్పించారు. మసీదులో అతనిని అందరి ముందు నిలబెట్టి ఇలా అన్నారు.వీడి తండ్రి నా స్నేహితుడు. విఠోభాకు గొప్ప భక్తుడు. కానీ వీడు తండ్రి మరణాంతరం విఠోభాను, నన్ను పూజించడం మానేశాడు. ఎన్నడూ నైవేద్యం పెట్టి ఎరుగడు. నన్ను విఠలుడిని కూడా మాడ్చాడు. అందుకే వీణ్ణి ఇక్కడికి ఈడ్చుకొచ్చాను. వీడు చేస్తున్నది తప్పని చెప్పి చీవాట్లు పెట్టి తిరిగి పూజలు ప్రారంభించేలా చేస్తానన్నారు బాబా.బాబా ఎందరినో దారిలో పెట్టారు. తప్పొప్పులు చెప్పి చెయ్యిపట్టి నడిపించాడు. పూజ క్రమం తప్పినా, పనులు మానుకుని మసీదును పట్టకునే వేలాడినా ఊరుకునే వారు కాదు. ఎవరి పనులు వారు చేసుకుంటూనే ఇష్టదైవాన్ని స్మరించుకోమని చెబుతుండేవారు. మనసును స్థిరంగా ఉంచుకోవటం, నిర్మలంగా భగవంతుని ధ్యానించడం వల్ల ఏకాగ్రత కుదురుతుందని చెప్పేవారు. పూజ కావచ్చు. మన ఉన్నతికి దోహదం చేసే లక్ష్య సాధన కావచ్చు. మనం ఏ పని చేసినా మనసును ఏకాగ్రం చేసుకుని శ్రద్ధతో చేయాలి. కోరికలు వ్యామోహాలు మనసులో అలజడిని సృష్టిస్తాయి. అవి సుడిగుండం వంటివి. అందులోనుంచి బయటకు రావు.

0 comments:

Post a Comment