Total Pageviews

Monday, August 5, 2013

సాయి పై విశ్వాసం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు


బాబా దయగల తండ్రి, ప్రేమను పంచే మాతృమూర్తి. బాబా కరుణా కటాక్షాల కోసం మనం ఎన్నో విధాల వేడుకుంటాం. ప్రార్థిస్తాం మన కష్టసుఖాలను చెప్పుకుంటాం. 'కొట్టినా పెట్టినా నువ్వే బాబా !' అని సర్వశ్రేయోదాయి సాయి అని ప్రార్థించిన చేతులతోనే, బాబా మాటలు కాదని మన చేతుల్ని హస్తసాముద్రికులు, జ్యోతిష్యుల చేతుల్లో పెడతాం.
సాయి కృపను పొందటానికి, సాయిపథంలో నడవటానికి విశ్వాసమే తొలిమెట్టు. మనం సాయిపథంలో నడవాలంటే బాబా చెప్పిన విషయాలను తూచా తప్పకుండా పాటింలి. బాబా పైనే విశ్వాసం ఉంచాలి.

"నిన్ను నువ్వు నమ్ముకో. నీలోని భగవంతుడిని నమ్ముకో" అనేది బాబా ఉపదేశం. మనలోని భగవంతుడు సాయినాథుడే కనుక మన భారాలు, విచారాలు అన్నింటినీ బాబాపైనే వేద్దాం. మన జీవిత నౌకను మోక్షమనే తీరానికి క్షేమంగా దరిచేర్చే బాధ్యతను బాబాయే తీసుకుంటారు.
సావిత్రీబాయి టెండూల్కర్, రఘునాథ్ టెండూల్కర్ ల కుమారుడు బాబు టెండూల్కర్. బాబు వైద్య విద్య రెండవ సంవత్సరం చదువుతుండగా జ్యోతిషులు అతని జాతక చక్రాన్ని చూశారు. ఆ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా లేవని, ఎంత చదివినా ప్రయోజనం లేదని జ్యోతిషులు చెప్పారు. మరుసటి ఏడాది కష్టపడి చదవనవసరం లేకుండానే పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడని కూడా చెప్పారు. బాబు దిగులుపడ్డాడు. అప్పట్నుంచి చదవటం మానేసి నిర్లిప్తంగా గడపటం మొదలుపెట్టాడు.కుమారుని వాలకం చూసి సావిత్రీబాయి కలత చెందింది. ఆమె తల్లి మనసు తల్లడిల్లింది. రఘునాథ్ కూడా కొడుకుని చూసి బెంగపెట్టుకున్నాడు. సావిత్రీబాయి ఎన్నో విధాల బాబుకు నచ్చజెప్పి చూసి విఫలమైంది. కష్టంలోను, సుఖంలోను తమ వెన్నంటి ఉండే బాబా వద్దకు వెళ్ళింది. కొడుకు పరిస్థితి బాబాకు చెప్పుకుని కంటతడి పెట్టుకుంది. బాబా హృదయం ద్రవించింది. "జాతకాలు, జన్మకుండలిని పట్టించుకోవద్దు. సాముద్రికాన్ని చూడొద్దు. నాపై విశ్వాసం ఉంచి బుద్ధిగా చదువుకోమను. ఈ సంవత్సరమే అతను పరీక్ష ఉత్తీర్ణుడవుతాడు" అని బాబా అభయం ఇచ్చారు. సావిత్రీబాయి ఇంటికి తిరిగి వెళ్లి బాబా చెప్పిన మాటల్ని బాబుకి చెప్పింది.బాబా ఇచ్చిన అభయంతో బాబు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. శ్రద్ధగా చదివాడు. పరీక్షలు కూడా రాశాడు. కానీ, ఉత్తీర్ణుడవుతాననే నమ్మకం లేదు. అందుకే పరీక్షా ఫలితాలు విడుదలైనా చూసుకోలేదు. ఓ మిత్రుడు వచ్చి పరీక్షలో ఉతీర్ణుడవయ్యావు, ఇంటర్వ్యూకు కూడా పిలుపు వచ్చిందని బాబుతో చెప్పాడు.బాబాపై ఉంచిన నమ్మకమే బాబును గట్టున పడేసింది. బాబాపై మన విశ్వాసం చెదిరిపోనిదే అయితే మనం సాధించలేనిది ఏమీ లేదు.

0 comments:

Post a Comment