Total Pageviews

Wednesday, August 28, 2013

భక్తిపూర్వక హృదయాలే సాయి మందిరాలు

సముద్రాలు, నదులు దాటేటప్పుడు మనం ఓడ నడిపే వానిపైనే భారం వేస్తాం. క్షేమంగా దరిచేరుస్తాడనే నమ్మకమే మనల్ని అవతలి ఒడ్డుకు చేరుస్తుంది. చింతలు, చికాకులతో కూడిన ఈ జీవిత సంద్రాన్ని క్షేమంగా దాటించే సరంగు సాయే.
'సాయి' అనే స్మరణ జీవన్మరణ రూపమై సంసారమనే చిక్కుముడిని విప్పే తరుణోపాయం. అన్నిటి కంటే అత్యంత శ్రేష్టం, సులభ సాధనం భగవన్నామ స్మరణే. ఈ శరీరంలో పటుత్వం ఉన్నంత వరకు, శ్వాస ఆడినంత కాలం జాగు చేయక 'సాయి' నామాన్ని స్మరించి తరిద్దాం.
బాబా అసాధారణ బుద్ధి కుశలత గలవారు. బాబా ఆచరింప సాధ్యం కాని విషయాలను ఆచరించమనలేదు. తన భక్తులకు ఆసనాలు, యోగాభ్యాసాలు నేర్పలేదు. మంత్రోపదేశాలు చేయలేదు. మహిమలు చూపలేదు. అన్నిటినీ పక్కన పెట్టి, కష్టాలు, చింతలు, కోరికల్ని గాలికొదిలి మనసా, వాచా, శిరసా, కర్మణా 'సాయి...సాయి' అనే నామాన్ని సదా హృదిలో ఉంచుకోమన్నారు. సర్వ బంధాలను తెంచుకుని స్వేచ్ఛ పొందటానికి ఇదే సులభోపాయం. పంచాగ్నుల నడుమ కూర్చుని మంత్రాలు ఉచ్చరించటం, యాగాలు, మంత్రజపాలు చేయటం, అష్టాంగ యోగాలు ఆచరించటం అందరికీ సాధ్యం కాదు. మరి, భగవంతుని కృపను పొందటానికి అందరికీ ఆచరించతగిన మార్గమేది? అదే సాయిపథం. అదే సాయితత్వం.
మనసు ఆలోచనల పుట్ట. ఏదో ఒక ఆలోచన చేయటమే దాని పని. ఆలోచన అనేది లేకుండా మనసు నిమిషమైనా ఉండదు. ఆలోచనలకు మంచి, చెడు ఉండదు. ఉదాహరణకు తలవని తలంపుగా రావణుడి గురించి ఆలోచన వస్తే అతను చేసిన చెడు కార్యాలే గుర్తుకు వస్తాయి. అదే రామున్ని తలుచుకుంటే ఆయన ధర్మనిరతి మదిలో మెదులుతుంది. అంటే మంచి కాని, చెడు కాని దేని గురించి తలుచుకుంటే దాని ఆలోచనలే కలుగుతాయి. అలాంటప్పుడు మనం 'సాయి'ని తల్చుకుందాం. బాబా భావాల్నే మనసులో నింపుకుందాం. సాయితత్వాన్ని చదువుదాం. విందాం. మననం చేసుకుందాం. వాటిలోని సారాన్ని జీర్ణం చేసుకుందాం. నిజ జీవితంలో సాయి సూక్తుల్ని ఆచరించటానికి ప్రయత్నిద్దాం. మనలోని భయాల్ని, సంశయాలను పారద్రోలి పారమార్థికం కలిగించేది 'సాయి' మంత్రమే. అది మంత్రము కాదు, శక్తిపాతం.
సాయితత్వం దేహాభిమానాన్ని నశింపచేస్తుంది. అహంకారాన్ని అణచివేస్తుంది. హృదయ గ్రంథుల్ని తెగ్గొడుతుంది. సదాచిదానంద రూపుడైన సాయిని హృదయంపై ఆవిష్కరిస్తుంది.
"భక్తి నిండిన హృదయంలో నాకు చోటివ్వండి. నాకు పూజతంతులతో పనిలేదు. నన్నే నిరంతరం జ్ఞప్తియందుంచుకోండి. మీ హృదయాల్లో శాశ్వతంగా కొలువుంటాను. రేయింబవళ్ళు 'సాయి' అనే నామాన్ని జపిస్తే మనఃచాంచల్యాలు,మాలిన్యాలు మటుమాయం అవుతాయి."
సాయి భగవానుడు భక్తులకు చేసిన వాగ్దానం ఇది. మన మన మనసులు అంతర్ముఖం కావాలి. హృదయాలు సాయి మందిరాలు కావాలి. అప్పుడు ఎక్కడ చూసినా 'సాయి' కనిపిస్తారు.

0 comments:

Post a Comment