Total Pageviews

Wednesday, September 17, 2014

భక్తి ఉన్నచోటే భగవంతుని నివాసం

భక్తి ఉన్నచోటే భగవంతుని నివాసం...........
జీవితంలో సాధించాలనుకున్నవి సాధించలేకపోవడానికి నిద్ర, బద్దకం ప్రధాన కారణాలని సద్గురు సాయిబాబా ఉద్బోధించారు. నిద్రకు మనిషి బానిస కారాదనీ,అతిగా నిద్రపోవడం,అసలు నిద్ర లేకపోవడం రెండూ జబ్బులేనని బాబా స్పష్టం చేశారు.మనం ఏవిషయంలోనైనా రాజీపడతామేమోకానీ,నిద్ర విషయంలో రాజీపడం.అవసరమైన సమయంలో నిద్రపోకపోవడం, అకాలనిద్రలో గడపడం రెండింటివల్లా అనర్ధాలు ఉన్నాయి. అందుకే బారెడు పొద్దెక్కేవరకూ నిద్రపోరాదనీ,సూర్యభగవానుడు ప్రత్యక్ష్యమయ్యే సమయానికి కాలకృత్యాలు తీర్చుకుని ఆయనకు అర్ఘ్యం సమర్పించాలని పాతతరానికి చెందిన వారు ఇప్పటికీ ఉద్బోధిస్తూ ఉంటారు. అతిగా నిద్రపోతే సూర్యభగవానునికి కోపం వస్తుందనేది హెచ్చరిక కావచ్చు,కానీ, సూర్యోదయం దాటిన తరువాత నిద్రపోతే శరీరం మనం చెప్పిన మాట వినదు. రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే, వేకువ జామునే లేచి మన పనులు పూర్తి చేసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. పెద్దల మాటలు చాదస్తపు మాటలుగా అనిపించవచ్చు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవి దివ్యౌషధాల వంటివి. ఉదయం వేళల్లో మనసు ప్రశాంతంగా ఉం టుంది.ఆ సమయంలో దైవ ధ్యానం చేస్తే మనసులో దేవుని రూపం స్థిరంగా నిలుస్తుంది. మనసు మన అధీనంలో ఉంటుంది. అందుకే, ఉదయం ప్రార్ధనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. భక్తి ప్రాధాన్యాన్ని గురించి సద్గురు సాయిబాబా ఎక్కువ బోధించేవారు. నాకు పూజలు, షోడశోపచారాలు,అష్టాంగయోగాలు అవసరం లేదు. భక్తి ఉన్న చోటే నా నివాసం. భక్తినిండిన హృదయంలో నాకు చోటు ఇవ్వండి. నేనక్కడ శాశ్వతంగా కొలువై ఉంటాను' అని బోధించారు. ఇవి సాధారణమైన మాటలుగా కనిపించవచ్చు, లోతుగా ఆలోచిస్తే ఎంతో పారమార్థికం ఉంది.భక్తి లేకుండానే మనం పూజలు చేస్తున్నాం. భక్తి లేకుండానే మనం ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తున్నాం. ఇవన్నీ పరుల కోసమేనని వేరే చెప్పనవసరం లేదు. భక్తి మనకూ, దేవునికీ మాత్రమే పరిమితం కావాలి తప్ప బహిరంగ ప్రదర్సన కారాదు.ఆధునిక కాలంలో అంతరంగ భక్తి కన్నా, బాహ్యమైన భక్తికే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది.సాయిబాబా ఉపదేశం సారాంశం ఇదే.తనను దగ్గరగా చూడాలని ముందుకు తోసుకుని వచ్చిన వారి కన్నా, దూరంగా కూర్చున్న వారిని ఉద్దేశించే ఆయన మాట్లాడేవారు. సాయిసచ్ఛరిత్రలో ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి. తమ మనసులో ఉన్న దానిని బాబా ఎలా కనిపెట్టారా అని వారు ఆశ్చర్యపోయేవారు. బాబా సర్వాంతర్యామి అనీ,ఆయనకు తెలియని విషయం ఏమీ లేదని ఆ తరువాత వారు తెలుసుకుని వారిని శరణుజొచ్చారు.
ఇతరేతర విషయాలపై ఆలోచనలు పెట్టుకుని దేవుని పటం ముందు, సద్గురువు ముందు కూర్చుని భక్తిని ప్రదర్శించేవారికి బాబా చురకలంటించేవారు. దైవ సన్నిధానంలో, గురువు సన్నిధానంలో ఇతర విషయాల గురించి ఆలోచించకుండా, ధ్యానం చేసేవారే బాబా కృపకు పాత్రులవుతారు. ....సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

0 comments:

Post a Comment