Total Pageviews

Wednesday, September 10, 2014

శ్రీ సాయి సత్ చరిత్ర-----------బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన యభయప్రధానవాక్యములు

శ్రీ సాయి సత్ చరిత్ర-----------బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన యభయప్రధానవాక్యములు

బాబా వారిభౌతికశరీరము మన దృష్టినుండి నిష్క్రమించెను, గాని వారి యనంత స్వరూపము లేదా సాయిశక్తి యెల్లప్పుడు నిలిచియేయుండును. ఇప్పటివరకు వారి జీవితకాలములో జరిగినలీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్తలీలలు జరుగుచున్నవి. దీనినిబట్టి బాబా శాశ్వతముగా నున్నారనియు తమ భక్తులకు పూర్వమువలె తోడ్పడుచున్నారనియు తెలియుచున్నది. ఎవరయితే బాబా సమాధి చెందక ముందు వారిని జూచిరో వారు నిజముగ నదృష్టవంతులు. అట్టి వారిలో నెవరైన ప్రపంచసుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొననిచో, వారి మనస్సులు భగవత్పరము కానిచో యది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడు కాదు ఇప్పుడుకూడ కావలసినది బాబాయందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, యింద్రియములు, మనస్సు బాబా సేవలో నైక్యము కావలెను. కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కినవారిని వేరే సంచరించునట్లు చేసినచో, ప్రయోజనము లేదు. పూజగాని ధ్యానము కాని చేయ పూనుకొనినచో, దానిని మనః పూర్వకముగను ఆత్మశుద్ధితోడను చేయవలెను.

పతివ్రతకు తన భర్తయందుగల ప్రేమను, భక్తుడు గురువు నందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికి మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలులేదు. జీవితపరమావధిని పొందుటకు తండ్రిగాని, తల్లిగాని, సోదరుడుగాని యింక తదితరబంధువు లెవ్వరుగాని తోడ్పడరు. ఆత్మసాక్షాత్కారమునకు దారిని మనమే వెదుగుకొని మనమే ప్రయాణము సాగించవలెను. నిత్యానిత్యములకు భేదమును తెలిసికొని, ఇహలోక పరలోకములలోని విషయసుఖములను త్యజించి మన బుద్ధిని, మనస్సును స్వాధినమందుంచుకొని మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపై నాధారపడుటకంటె మన స్వశక్తియందే మనకు పూర్తి నమ్మకము ఉండవలెను. ఎప్పుడయితే నిత్యానిత్యములకు గల భేదమును పాటించెదమో, ప్రపంచము అబద్ధమని తెలిసికొనెదము. దానివలన ప్రపంచవిషయములందు మోహము తగ్గి, మనకు నిర్వ్యామోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మస్వరుపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. ఇదియే అద్వైతభజనము లేదా పూజ. ఎప్పుడయితే మనము బ్రహ్మమును, లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించెదమో, మనము కూడ వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారము పొందెదము. వేయేల, గురువు నామమును జపించుట వలనను, వారి స్వరుపమునే మనమున నుంచుకొని ధ్యానించుటచేతను వారిని సర్వజంతుకోటియందు చూచుట కవకాశము కలుగును. మన కది శాశ్వతానందమును కలుగజేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును. "మంచిగాని చెడ్డగాని, ఏది మనదో యది మనదగ్గర నున్నది. ఏది యితరులదో, యది యితరులవద్ద నున్నది."
ఓ సాయి! నీ పాదములు పవిత్రము లయినవి. నిన్ను జ్ఞప్తియందుంచుకొనుట మిగుల పావనము. కర్మబంధములనుండి తప్పించు నీ దర్శనము కూడ మిక్కిలి పావనమయినది. ప్రస్తుతము నీరూప మగోచరమయినప్పటికి, భక్తులు నీయందే నమ్మక ముంచినచో, వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటి కగపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గరనుండిగాని యెంతోదూరమునుండిగాని యీడ్చెదవు. వారిని దయగల తల్లివలె కౌగిలించుకొనెదవు. నీ వెక్కడున్నావో నీ భక్తులకు దెలియదు. కాని నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కాని నీవు శక్తివలన నిరాడంబరభక్తుల రక్షించెదవు. ఆంతరికముగను, అదృశ్యముగను ఆటంతయు నాడెదవు. కాని దానితో నీకెట్టి సంబంధము లేనట్లు గనిపించెదవు. నీవే పనులన్నియును నెరవేర్చుచున్నప్పటికి ఏమియు చేయనివానివలె నటించెదవు. నీ జీవితము నెవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపములనుండి విముక్తి పొందుట యెట్లన-శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుని కోరికలను నీవు నెరవేర్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభసాధనము. ఈ సాధనవల్ల మన పాపములు, రజస్తమోగుణములు నిష్క్రమించును. సాత్వికగుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే యనగా నాత్మనేయనుసంధానము చేసెదము. ఇదియే గురువునకు సర్వస్యశరాణాగతి. దీనికి తప్పనిసరి యొకేగుర్తు - మన మనస్సు నిశ్చలము శాంతము నగుట. ఈ శరణాగతి గొప్పదనము, భక్తి, జ్ఞానములు, విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమానరాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము, ఒకటి వెనుక నింకొకటి వెన్నంటి వచ్చును.

ఒకవేళ బాబా ఎవరైన భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే యుండి, యింటి వద్దనుగాని దూరదేశమునగాని వానిని వెంబడించుచుండును. భక్తుడు తనయిష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము, బాబా అచ్చటకు భక్తునికంటె ముందుగా బోయి యేదో ఒక ఊహించరానిరూపమున నుండును. కథవల్ల నేర్చుకొనవలసిన నీతి :- బాబా మాటలు అక్షరాలా సత్యములనియు బాబాకు తన భక్తులందుగల ప్రేమ యమితమనియు తెలియుచున్నది. ఇదియేగాక, వారికి జంతువులయందు కూడ సమాన ప్రేమ యుండెను. వారు వానిలో నొకరుగాభావించెడివారుశ్రీసాయి ముఖము పావనమైనది. ఒక్కసారి వారివైపు దృష్టి నిగిడించినచో, గత యెన్నో జన్మల విచారమును నశింపజేసి యెంతో పుణ్యము ప్రాప్తించినటుల జేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో, మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనమానందమును పొందెదము. గంగానదిలో స్నానము చేయువారి పాపములన్నియు తొలగును. అట్టి పావనమైన నది కూడ యోగు లెప్పుడు వచ్చి తనలో మునిగి, తనలో ప్రోగైన పాపములన్నిటిని వారి పాదధూళిచే పోగెట్టదరాయని యాతురుతతో జూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొనిపోవునని గంగామాతకు తెలియును. యోగులలో ముఖ్యాలంకారము శ్రీసాయి. పావనము చేయు ఈ క్రింది కథను వారినుండి వినుడుభగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరుగెత్తును.
ఈ కథవల్ల మనము నేర్చుకొనిన నీతి యేమన ఎవరు చేసిన దానిని వారే యనుభవించవలెను. ఇతరులతోగల సంబంధములన్నిటిని, బాధను కూడ అనుభవించవలెను. తప్పించుకొను సాధనము లేదు. తన కెవరితోనైన శత్రుత్వమున్నయెడల దానినుండి విముక్తినిపొందవలెను. ఎవరికైన ఏమైనను బాకీయున్న దానిని తీర్చివేయవలెను. ఋణము గాని, శతృత్వశేషముకాని యున్నచో దానికి తగిన బాధ పడవలెను. ధనమునందు పేరాసగలవానినది హీనస్థితికి దెచ్చును. తుట్టతుదకు వానికి నాశనము కలుగజేయును.
సద్గురుని లక్షణములు
ఎవరు మనకు వేదవేదాంతములను, షట్ శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాసనిశ్వాసములను బంధించెదరో, బ్రహ్మమును గూర్చి అందముగా నుపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయుమందురో, ఎవరు తమ వాక్శక్తిచే జీవితపరమావధిని బోధించగలరో కాని ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరయితే చక్కని సంభాషణలవల్ల మనకు ఇహపరసుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరాత్మసాక్షాత్కారమందు మన కభిరుచి కలుగునట్లు జేసెదరో యెవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున పుస్తకజ్ఞానమేగాక ఆచరణయందనుభవము కూడ పొంది యున్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మసాక్షాత్కారమును స్వయముగ పొందని గురువు దానిని శిష్యుల కెట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందయినను శిష్యులనుండి సేవనుగాని ప్రతిఫలమునుగాని యాశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయ తలచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయేగాక తనతో సరిసమానముగా జూచును. సద్గురుని ముఖ్యలక్షణమేమన, వారు శాంతమున కునికిపట్టు. వారెన్నడు చాపల్యమునుగాని చికాకు గాని చెందరు, తమ పాండిత్యమునకు వారు గర్వించరు, ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే.

హేమడ్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును, సహవాసమును పొందెనని తలంచెను. బాబా యౌవనమందు కూడ ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము గాని, స్నేహితులుగాని, యిల్లుగాని, ఎట్టి యాధారముగాని లేకుండెను. 18 ఏండ్ల వయస్సునుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకొనిరి. వారొంటరిగా, నిర్భయముగా నుండెడివారు. వారెల్లప్పుడాత్మానుసంధానమందు మునిగి యుండెడివారు. భక్తుల స్వచ్ఛమైన యభిమానమును జూచి వారి మేలుకొరకేవైన చేయుచుండెడివారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి యుండెడివారు. వారు భౌతికశరీరముతో నున్నప్పుడు తమ భక్తులకు ఏ యనుభవముల నిచ్చుచుండిరో, యట్టివి వారు మహాసమాధిచెందిన పిమ్మటకూడ తమయందభిమానము గల భక్తులు అనుభవించుచున్నారు. అందుచే భక్తులు చేయవలసిన దేమన - భక్తివిశ్వాసములనెడు హృదయదీపమును సరిచేయవలెను. ప్రేమయను వత్తిని వెలిగించవలెను. ఎప్పుడిట్లు చేసెదరో, యప్పుడు జ్ఞానమనే జ్యోతి (ఆత్మ సాక్షాత్కారము) వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమలేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానమెవరికి అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తియుండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమితప్రేమ యుండవలెను. ప్రేమను మన మెట్లు పొగడగలము? ప్రతి వస్తువు దానియెదుట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమ యనునదే లేని యెడల చదువుటగాని, వినుటగాని, నేర్చుకొనుటగాని నిష్పలములు. ప్రేమ యనునది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా నొకటి తరువాత నింకొకటి వచ్చును. దేనినిగూర్చిగాని మిక్కిలి చింతించనిదే దానియందు మనకు ప్రేమ కలుగదు. యదార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అదియే ప్రేమ; అదే మోక్షమునకు మార్గము. స్వచ్ఛమైన మనస్సుతో నెవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు బోయి వారి పాదములపై బడినచో, తుట్టతుద కతడు రక్షింపబడును. సాయిబాబా ప్రేరేపించి వారి యిష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారకి సర్వస్యశరణాగతి యొనర్చి వారి యందే ధ్యానము నిలుపుట మాకర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దాక్షములకంటె తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట, తపస్సు కంటె మేలు. సద్గురుని ధ్యానించుట యన్నింటికంటె మేలయినది. కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు, వారి యాకారమును మనస్సున భావించుకొనుచు, వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో, వారికొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసారబంధమునుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో, సాయి తప్పనిసరిగ మనకు సహాయము చేయును. తుదకు మోక్షము నిచ్చును. . బాబా కోపము మారురూపముతో నున్న యాశీర్వాదమే
బాబా నానాతో నిట్లనెను. "నానా! అనవసరముగా చీకాకు పడుచుంటి వేల? ఇంద్రియములను వాని పనులను జేయనిమ్ము. వానిలో మనము జోక్యము కలుగ జేసికొన గూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించియున్నాడు గాన అందరిని చూచి సంతసించుట మన విధి. క్రమముగాను, మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరచియుండగా, వెనుక ద్వారము గుండా పోనేల? మన హృదయము స్వచ్ఛముగా నున్నంతవరకు, నేమియు దోషము లేదు. మనలో చెడ్డ యాలోచన లేనప్పుడితరులకు భయపడనేల? నేత్రములు వానిపని యవి నెరవేర్చు కొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేల?"
బాబా చెప్పినదాని భావము నానా యిట్లు చెప్ప దొడంగెను. "మనస్సు సహజముగా చంచలమైనది. దానిని ఉద్రేకించునట్లు చేయరాదు. ఇంద్రియములు చలింపవచ్చును. శరీరమును స్వాధీనమునం దుంచుకొనవలెను. దాని యోరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయములవైపు పరుగెత్తును. కాని, మనము వానివెంట పోరాదు. మనము ఆ విషయములను కోరగూడదు. క్రమముగాను, నెమ్మదిగాను, సాధన చేయుటవలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడగూడదు. కాని వానిని మనము పూర్తిగ స్వాధీనమం దుంచుకొనలేము. సమయానుకూలముగా వాని నణచి సరిగా నుంచుకొనుచుండవలెను. నేత్రములందమైనవానిని జూచుటకొరకే యివ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు గాని, లజ్జకుగాని యవకాశము లేదు. దురాలోచనలు మనస్సునందుంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా నింద్రియములను సులభముగాను, సహజముగాను స్వాధీనము చేసికొనవచ్చును. విషయము లనుభవించుటలో కూడ నీవు భగవంతుని జ్ఞప్తియందుంచుకొనెదవు. బాహ్యేంద్రియముల మాత్రము స్వాధీనమందుంచుకొని మనస్సును విషయములవైపు పరుగిడనిచ్చినచో, వానిపై అభిమాన ముండనిచ్చినచో, చావుపుట్టుకల చక్రమునశింపదు. ఇంద్రియవిషయములు హానికరమయినవి. వివేకము (అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట) సారథిగా, మనస్సును స్వాధీనమందుంచుకొన వలెను. ఇంద్రియముల నిచ్చవచ్చినట్లు సంచరింప జేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదమును చేర గలము. అదియే మన గమ్యస్థానము. అదియే మన నిజమైన యావాసము. అచటనుండి తిరిగి వచ్చుటలేదు."
భక్తుల కాశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక! వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు. మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయీ! మాయందు కనికరించుము. మమ్ము కటాక్షింపుము. చందనవృక్షములు మలయపర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును గురిపించి చల్లదనము కలుగజేయుచున్నవి. వసంతఋతువునందు పుష్పములు వికసించి వానితో దేవుని పూజ చేయుటకు వీలు కలుగ జేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులును పవిత్రములు.
సాయిబాబా "నా భక్తుని సప్తసముద్రముల మీద నుంచిగూడ పిచ్చుక కాలికి దారముకట్టి యీడ్చినట్లు లాగుకొని వచ్చెదను." అను వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే నాకర్షింపబడడనియు, వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసెను. ఇదంతయు విని కాకాసాహెబు సంతసించి, "సాయిబాబా వద్దకుపోయి, వారిని దర్శించి కాలుయొక్క కుంటితనమునకంటె నా మనస్సుయొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమైన యానందమును కలుగజేయమని వేడుకొనెద"నని నానాసాహెబుతో చెప్పెను. బాబా యిట్లనెను. "ఆ విషయమై నీవేమాత్రము చింతింపనవసరము లేదు. అది నా సంకల్పము ప్రకారము నీ కివ్వబడెను. తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవేకర్తవని యనుకొనవేల? మంచి గాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని యనుకొనరాదు. గర్వాహంకారరహితుడవయి యుండుము. అప్పుడే నీ పరచింతన యభివృద్ధి పొందును."

సద్గురు సాయియొక్క గొప్పదనము
శ్రీ సాయి సమర్థునకు సాష్ఠాంగనమస్కారము చేసి వారి యాశ్రయమును పొందెదము. వారు జీవజంతువులయందును, జీవములేని వస్తువులయందు కూడ వ్యాపించియున్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మస్వరూపమువరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగాగలవాని యన్నిటియందు వ్యాపించియున్నారు. జీవరాశియందంతటను కూడ వ్యాపించియున్నారు. భక్తులందరు వారికి సమానమే. వారికి మానావమానములు లేవు. వారికిష్టమైనవి యయిష్టమయినవియు లేవు. వారినే జ్ఞప్తియందుంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటిని నెరవేర్చి మనము జీవితపరమావధిని పొందునట్లుచేసెదరు.

ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహాకష్టము. విషయసుఖములనెడు కెరటములు దురాలోచలనే ఒడ్డును తాకుచు ధైర్యమను చెట్లను కూడ విరుగగొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము, అసూయలను మొసళ్లు నిర్భయముగా సంచరించును. అచట నేను, నాది యను సుడిగుండములును, ఇతర సంషయములును గిర్రున తిరుగుచుండును. పరనింద, అసూయ, ఓర్వలేనితనము అను చేప లచట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికి సాయి సద్గురువు దానికి అగస్త్యునివంటి వాడు (నాశనముచేయువాడు). సాయిభక్తులకు దానివల్ల భయమేమియుండదు. ఈమహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావవంటి వారు. వారు మనలను సురక్షితముగ దాటించెదరు.
ప్రార్థన
మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగనమస్కారము చేసి వారి పాదములు బట్టుకొని సర్వజనులకొరకు ఈ క్రింది ప్రార్థనము చేసెదము. మా మనస్సు అటునిటు సంచారము చేయకుండు గాక. నీవు దప్ప మరేమియు కోరకుండు గాక. ఈ సత్ చరిత్రము ప్రతి గృహమందుండు గాక. దీనిని ప్రతినిత్యము పారాయణ చేసెదెముగాక. ఎవరయితే దీనిని నిత్యము పారాయణ చేసెదరో వారి యాపదలు తొలగిపోవుగాక.
ఫలశ్రుతి
ఈ గ్రంథమును పారాయణ చేసినచో గలుగు ఫలితమునుగూర్చి కొంచెము చెప్పుదుము. పవిత్రగోదావరిలో స్నానము చేసి, షిరిడీలో సమాధిని దర్శించి, సాయి సత్ చరిత్రము పారాయణ చేయుటకు ప్రారంభింపుము. నీ విట్లు చేసినచో నీకుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధకలుగును. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయు చున్నచో నీ పాపములన్నియు నశించును. జననమరణములనే చక్రమునుండి తప్పించుకొనవలెనన్నచో సాయికథలను చదువుము. వాని నెల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొనుము, వారి పాదములనే యాశ్రయింపుము; వానినే భక్తితో పూజింపుము. సాయికథలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో నందు క్రొత్తసంగతులను గ్రహించగలవు. వినువారిని పాపములనుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణస్వరూపుమునే ధ్యానించినచో క్రమముగా నది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. ఆత్మసాక్షాత్కారమును పొందుట బహుకష్టము. కాని నీవు సాయి సగుణస్వరూపముద్వారా పోయినచో నీప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్యశరణాగతి వేడినచో నతడు 'తాను' అనుదానిని పోగొట్టుకొని నది సముద్రములో గలియునట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో ననగా జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థలలో నేదయిన యొక్క యవస్థలో వారియందు లీనమయినచో సంసారబంధమునుండి తప్పుకొందువు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోను, పూర్తినమ్మకముతోను పారాయణ చేసి వారము రోజులలో ముగింతురో, వారి యాపద లన్నియు నశించగలవు. దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారము వృద్ధియగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలమాధారపడియున్నది. ఈ రెండును లేనిచో నెట్టి యనుభవమును కలుగదు. దీనిని గౌరవముతో పారాయణ చేసినచో, శ్రీ సాయి ప్రీతి చెందును. నీ యజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యముల నొసంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో నది యపరిమితానందమును కలుగజేయును. ఎవరు హృదయమునందు తమ శ్రేయస్సును కోరేదరో వారు దానిని జాగరూకతతో పారాయణ చేయవలయును. అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో, సంతసముతో జన్మజన్మములవరకు మదిలో నుంచుకొనును. ఈ గ్రంధమును గురుపౌర్ణమినాడు (అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమినాడు) గోకులాష్టమినాడు, శ్రీ రామనవమినాడు, దసరానాడు (అనగా బాబా పుణ్యతిథినాడు) ఇంటివద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసినయెడల వారల కోరిక లన్నియును నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మినయెడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు. దీనిని పారాయణ చేసినయెడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు. అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నియు పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును.
ఓ ప్రియమైన భక్తులారా! పాఠకులారా! శ్రోతలారా!
మీకు కూడ మేము నమస్కరించి మీ కొక మనవి చేయుచున్నాము. ఎవరి కథలను ప్రతిరోజు, ప్రతినెల, మీరు పారాయణ చేసితిరో వారిని మరువవద్దు. ఈ కథల నెంత తీవ్రముగా చదివెదరో, వినెదరో - అంత తీవ్రముగా మీకు ధైర్యము, ప్రోత్సాహము, సాయిబాబా కలుగచేసి, మీచే సేవ చేయించి, మీ కుపయుక్తముగా నుండునట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు, చదువరులును సహకరించవలెను. ఒండొరులు సహాయము చేసికొని సుఖపడవలెను.
ప్రసాద యాచనము
దీనిని సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము. ఈ దిగువ కారుణ్యమును జూపుమని వారిని వేడెదము. దీనిని చదువువారును, భక్తులును హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక! సాయి సగుణస్వరూపము వారి నేత్రములందు నాటిపోవును గాక! వారు శ్రీ సాయిని సర్వజీవములయందు చూచెదరు గాక! తథాస్తు.

0 comments:

Post a Comment