Total Pageviews

Monday, February 4, 2013

శ్రీ సాయి సత్ చరిత్రము ముప్పదిరెండవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ముప్పదిరెండవ అధ్యాయము

గురుని, దేవుని వెదుకుట; ఉపవాసము నామోదింపకుండుట

గురుని, దేవుని వెదుకుట; ఉపవాసము నామోదింపకుండుట

ఈ అధ్యాయములో హేమాడ్ పంతు రెండు విషయములను వర్ణించెను.

1. బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసెను, వారి ద్వారా దేవుని గనెను. 2. గోఖలేగారి భార్య మూడురోజు లుపవసింప నిశ్చయించుకొనగా నామెచే బాబా యెట్లు బొబ్బట్లు తినిపించెను.

ప్రస్తావన

ప్రారంభమున హేమాడ్ పంతు సంసారమును, అశ్వత్థవృక్షముతో పోల్చుచు, గీతలో చెప్పిన ప్రకారము, దాని వ్రేళ్ళుమీదకు కొమ్మలు క్రిందకు గలవనెను. దాని కొమ్మలు క్రిందవైపు మీదివైపుగూడ వ్యాపించి యున్నవి; అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని యంకురములు ఇంద్రియ విషయములు. దాని వ్రేళ్ళు కర్మను చేయించుచు మానవప్రపంచమువరకు వ్యాపించి యున్నవి. దాని స్వరూపము గాని దాని యాధారముగాని, దాని యాద్యంతములు గాని ఈలోకమున తెలియరావు. వైరాగ్యమను పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్ళుగల అశ్వత్థవృక్షమును నరికి, ఏ యతీతమార్గము ననుసరించిన తిరిగి జన్మలేదో యట్టిదాని ననుసరించవలెను.

అట్టి దారియందు నడచుటకు, దారి చూపు మంచిగురువు సహాయము మిక్కిలి యవసరము. ఒకడెంత పండితుడై నప్పటికిని వేదవేదాంగములను బాగుగ చదివినప్పటికిని, తన గమ్యస్థానమునకు సురక్షితముగ పోలేడు. మార్గదర్శియే యుండి సహాయపడి సరియైన దారి చూపినచో, మార్గములో నున్న గోతులనుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును.

ఈ విషయములో బాబా యనుభవము బాబాయే స్వయముగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడచుకొన్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించను.

అన్వేషణము

ఒకానొకప్పుడు మేము నలుగురుము మత గ్రంథములు చదువుచు అజ్ఞానముతో బ్రహ్మము నైజముగూర్చి తర్కించ మొదలిడితిమి. మాలో నొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెను గాని యితరులపై నాధారపడరాదు అనెను. అందుకు రెండవవాడు మనస్సును స్వాధినమందుంచుకొన్నవాడే ధన్యుడనియు మనము ఆలోచనలనుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటె వేరైనది ఈ ప్రపంచములో మరేదియు లేదనియు చప్పెను. మూడవవాడు దృశ్యప్రపంచము సదాపరిణామ శీలమైన దనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణ మవసరమనియు చెప్పెను. నాలుగవవారు (అనగా బాబా) "పుస్తక జ్ఞానమెందుకు పనికిరానిది. మనకు విధింపబడిన కర్మను మనము పూర్తిచేసి, తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై బెట్టి శరణు వేడవలెను. గురువే దైవము; సర్వమును వ్యాపించిన వాడు. ఇట్టి ప్రత్యయ మేర్పడుటకు, దృఢమైన యంతులేని నమ్మక మవసరము" అనెను.

ఈ ప్రకారముగా తర్కించుచు, మేము నలుగురు పండితులము భగవంతుని వెదకుట కడవులలో తిరుగ నారంభించితిమి. తక్కిన ముగ్గురును వారి స్వతంత్రబుద్థి నుపయోగించి వెదక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు (బంజారా) మమ్ములను కలిసి "ఇప్పుడు చాలా ఎండగా నున్నది. ఎంతదూరము పోవుచున్నారు? ఎక్కడికి పోవుచున్నా" రని యడిగెను. అడవులు వెదకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెదకుటకు పూనుకొంటిరని యతడు తిరిగి నడిగెను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి, యతడు కనికరించి యిట్లనెను. "అడవుల సంగతి పూర్తిగ తెలియకుండ మీ యిష్టము వచ్చినట్లు తిరుగరాదు. అడవులలో సంచరింపదలచినచో మీ వెంట నొక మార్గదర్శి యుండియే తీరవలెను. అనవసరముగా ఈ ఎండ వేళప్పుడు ప్రయాస పడెద రెందుకు? మీ రహస్యాన్వేషణము నాకు జెప్పనక్కరలేదు. అయినను మీరు కూర్చుండి, భోజనము చేసి, నీళ్ళు త్రాగి కొంత విశ్రాంతి దీసికొనిన పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండు" డనెను. అతడంత మృదువుగా మాట్లాడినను, వానిని నిరాకరించి నడువ సాగితిమి. మా కన్ని సంగతులు దెలియును, కాన ఇతరుల సహాయమక్కర లేదనుకొంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి. చెట్లు దగ్గరగాను, ఎత్తుగాను నుండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి యటునిటు చాలసేపు తిరిగితిమి. తుట్టతుద కెక్కడనుండి బయలుదేరితిమో యచ్చటికే యదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలిసికొని యిట్లనెను. "మీ తెలివితేటలపై నాధారపడి మీరు దారి తప్పిరి. చిన్నదానికిగాని, పెద్దదానికి గాని సరియైన మార్గము చూపుటకొక మార్గదర్శి యుండియే తీరవలెను. ఉత్తకడుపుతో నేయన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో నెవ్వరు కలియరు. పెట్టిన భోజనము వద్దనకుడు. వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు. భోజనపదార్థము లర్పించుట శుభసూచకములు." ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చేయుమని బతిమాలెను. ఈ యాతిథ్యమున కిష్టపడక నిరాకరించి పోతిమి. విచారించక భోజనము చేయక ఆముగ్గురు తిరిగి సాగిపోవ నారంభించిరి. వారి హఠ మావిదముగా నుండెను. నేను మాత్రమాకలితోను, దాహముతోను నుంటిని. బంజారా ప్రదర్శించిన యసామాన్యప్రేమకు లొంగిపోతిని. మేమెంతో తెలివైనవార మనుకొంటిని కాని, దయా దాక్షిణ్యములకు దూరమయితిమి. బంజారా చదువుకొన్నవాడు కాడు; యోగ్యతలు లేనివాడు; తక్కువజాతివాడు. కాని, వాని హృదయము ప్రేమమయము. భోజనము చేయుమని మమ్ముల వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండ ఎవరయితే యితరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని యెంచి వాని యాతిథ్యము నామోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని యనుకొంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని (అనగా బాబా) నీళ్ళు త్రాగితిని. 

ఏమి యాశ్చర్యము! వెంటనే మాగురువుగారు వచ్చి మాయెదుట నిలచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరచితిని అప్పుడు వారు "నాతో వచ్చుట కిష్టపడెదరా? మీకు కావలసిన దేదో నేను జూపెదను. నాయందు విశ్వాసమున్న వారికే జయము కలుగును" అనిరి. తక్కినవారు వారి మాటలకు సమ్మతింపక యెక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి యాజ్ఞకు లోబడితిని. అంతట వారు నన్నొక బావి వద్దకు దీసికొని పోయినారు. నా కాళ్ళను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు గట్టి బావిలో నీళ్ళకు మూడడుగుల మీదుగా నన్ను వ్రేలాడదీసిరి. నా చేతులతో గాని, నోటితో గాని నీళ్ళను అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధముగా వ్రేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4, 5 గంటల తరువాత వారు మరల వచ్చి నన్ను బావిలోనుంచి బయటికి దీసి, యెట్లుంటివని యడిగిరి. "ఆనందములో మునిగియుంటిని. నేను పొందిన యానందమును నావంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు" అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతుష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి, నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారివద్ద నుంచుకొనిరి. తల్లి పక్షి పిల్లపక్షులను జాగ్రత్తగా జూచునట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాల అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా యభిమాన మంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగలించుకొని వారిని తదేక దృష్టితో నెల్లప్పుడు చూచుచుండవలె ననిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటే మేలనిపించెడిది. అది యటువంటి బడి. అందులో ప్రవేశించినవారెవరును రిక్తహస్తములతో బయటకురారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా యిల్లు, నా యాస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా యింద్రియము లన్నియు తమతమ స్థానములు విడచి, నా కండ్లయందు కేంద్రీకృతమయ్యెను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యెను. నాధ్యానమంతయు నా గురువుపైననే నిల్పితిని. నాకింకొక దానియందు స్పృహలేకుండెను. వారిని ధ్యానము చేయునప్పుడు నా మనసు, నా బుద్ధి స్తబ్ధమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని.

ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాప పడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్యశక్తిని గురించి తన ఋజువర్తనము గూర్చి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కాని, హృదయము మృదువుగా నుండదు. అత డనేకవిషయముల గూర్చి మాట్లాడును. తన మహిమను తానే పొగడుకొనును. కాని యతని మాటలు భక్తుల హృదయమందు నాటవు, వారిని యొప్పింపజేయవు. ఆత్మసాక్షాత్కార మతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యుల కేమి మేలు చేయును? వారి కేమి లాభము? కాని, పైన పేర్కొన్న గురువు మరొక రకమువారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమలేకయే యాత్మజ్ఞానము దానిమట్టు కది నాయందు ప్రకాశించెను; నేను కోరుట కేమియు లేకుండెను. సర్వము దానిమట్టు కదియే పగటి ప్రకాశమువలె బోధపడెను. తల క్రిందుగను, కాళ్ళు మీదుగను నుంచుటవలన గలుగు ఆనందము గురువుకే తెలియను.

నలుగురిలో ఒకడు కర్మఠుడు (అనగా కర్మలయందు నమ్మకము గలవాడు). అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియును. రెండవవాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడవవాడు భక్తుడు, భగవంతునికి సర్వస్యశరణాగతి చేసినవాడు, భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు దెలిసిన విద్యపై నాధారపడి, దేవుని వెదకుటకు పోయిరి. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురిలో నొకరు. పరబ్రహ్మస్వరూపులైకూడ వారెందుచేత నితరులతో కలిసి తెలివితక్కువగా ప్రవర్తించిరని యెవరైన నడుగవచ్చును. ప్రజాభిప్రాయమును, వారి మంచిని సంపాదించుటకును, వారికొక యుదాహరణము జూపుటకును, వారిట్లు చేసిరి. వారు అవతారపురుషులై నప్పటికి ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని యాహారము నామోదించిరి. అన్నము పరబ్రహ్మస్వరూపమని వారి నమ్మకము. బంజారా వాని యాహారమును నిరాకరించినవారు కష్టముల పాలయిరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలుకాదని వారు బోధించిరి. తైత్తరీయోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును, గౌరవించి పూజించి మతగ్రంథముల నభ్యసింపవలెనని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములుగాని, మనస్సుగాని, బుద్ధిగాని, ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయపడవు. గురువు గారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము, అర్థము, కామము, మన కృషివల్ల లభించును. కాని నాలుగవదియగు మోక్షము గురువు సహాయము వలననే పొందనగును.

సాయి దర్బారులోనికి అనేకమంది వచ్చి, వారికి తెలియు విద్యలను ప్రదర్శించి పోయెడివారు. జ్యోతిష్కులు రాబోవు విషయములు చెప్పుచుండెడివారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగువారు బాబా దర్శనమునకై వచ్చెడివారు. ఒక మహారు (మాలవాడు) వచ్చి జోహారు చేసి యీ సాయి 'మాయి బాప' (తల్లియు తండ్రియు) అనియు, వారు మన చావుపుట్టుకలను తుడిచివేయుదురనియు చెప్పెను. గారడివాండ్రు, గ్రుడ్డివాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాథసంప్రదాయమువారు పగటి వేషములవారు కూడ సమాదరింపబడుచుండిరి. తన వంతు రాగా, ఆ బంజారా కూడ గాన్పించెను. తన పాత్రయు ముగించెను. మన మిప్పుడింకొక కథను విందుము.

గోఖలేగారి భార్య - ఉపవాసము

బాబా యెన్నడు ఉపవసించలేదు. ఇతరులను కూడ ఉపవాసము చేయనిచ్చువారు కారు. ఉపవాసము చేయువారి మనస్సు స్థిమితముగా నుండదు. అట్టివాడు పరమార్థ మెట్లు సాధించును? ఉత్తకడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలెను. కడుపులో తడి కలుగ జేయు ఆహారము గాని, పౌష్టికశక్తి గాని లేనప్పుడు భగవంతుడి నేకండ్లతో చూడగలము? వేయేల మన యవయవము లన్నియు వాని శక్తిని అవి సంపాదించుకొన్నప్పుడు, అవి మంచిస్థితిలో నున్నప్పుడే, మనము భక్తిమొదలగు సాధనముల నాచరించి దేవుని చేర గలము. కాబట్టి ఉపవాసము గాని మితిమించిన భోజనముగాని మంచిది గాదు. ఆహారములో మితి, శరీరమునకు మనస్సునకు కూడ మంచిది.

గోఖలే గారి భార్య, కానిట్ కర్ గారి భార్యవద్దనుంచి దాదా కేల్కరుకు జాబు తీసికొని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదములవద్దమూడురోజులుపవసించి కూర్చొను నిశ్చయముతో వచ్చెను. అంతకు ముందురోజు బాబా దాదా కేల్కరుతో తన భక్తులను హోళిపండుగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పియుండెను. వారుపవసించినచో బాబా (తన) యొక్క ఉపయోగ మేమనెను. ఆ మరుసటిదినము ఆ స్త్రీ కేల్కరుతో పోయి బాబావద్ద కూర్చుండగా బాబా వెంటనే యామెతో "ఉపవాసము చేయవలసిన యవసరమేమి? దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు బెట్టి నీవు కూడ తినుము." అనెను. హోళీ పండుగ వచ్చెను. కేల్కరుభార్య బయట చేరెను. దాదాభట్టు ఇంట్లో వండుట కెవరు లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితముగా నుండెను. గోఖలేగారి భార్య దాదాభట్టు ఇంటికి బోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే యుండెను. ఇతరులకు బెట్టెను, తాను తినెను. ఎంత మంచికథ! ఎంతచక్కని నీతి!

బాబా సర్కారు

బాబా తన బాల్యములో జరిగిన కథను ఈ విధముగ చెప్పెను. "నా చిన్నతనములో భుక్తికొరకు వెదకుచు బీడ్ గాం వెళ్ళితిని. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లికపని దొరికెను. శ్రమ యనక కష్టపడి పని చేసితిని. యజమాని నాపనికి సంతుష్టి చెందెను. నాకంటె పూర్వము ముగ్గురు కుర్రవాళ్ళు పనిలో నుండిరి. మొదటివానికి 50 రూపాయలు రెండవవానికి 100 రూపాయలు, మూడవవానికి 150 రూపాయలు, నాకీమూడు మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయల జీత మిచ్చెను. నా తెలివితేటలు జూచి, యజమాని నన్ను ప్రేమించి నన్ను మెచ్చుకొని, నిండుదుస్తులిచ్చి, నన్ను గౌరవించెను. (తలపాగా, శెల్లా) వీనిని వాడకుండ జాగ్రత్తగా దాచుకొంటిని. మానవు డిచ్చినది త్వరలో సమసిపోవునుగాని, దైవమిచ్చునది శాశ్వతముగా నిలుచును. ఇంకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు "తీసికో, తీసికో" అనును కాని, ప్రతివాడు నావద్దకు వచ్చి 'తే,తే' యనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువా డొక్కడును లేడు. నాసర్కారు యొక్క ఖజానా (ఆధ్యాత్మిక ధనము) నిండుగానున్నది. అది యంచువరకు నిండి పొంగిపోవుచున్నది. నేను "త్రవ్వి, ఈ ధనమును బండ్లతో తీసుకపొండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యము నంతయు ఆచికొనవలెను." అనుచున్నాను. నా ఫకీరు చతురుత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిగుల యమోఘమైనవి. నా సంగతి యేమి? శరీరము మట్టిలో కలియును. ఊపిరి గాలిలో కలియును. ఇట్టి యవకాశము తిరిగి రాదు. నే నెక్కడికో పోయెదను; ఎక్కడనో కూర్చుండెదను; మాయ నన్ను మిగులబాధించుచున్నది. ఐనప్పటికి నావారికొరకు ఆతురపడెదను. ఎవరయిన నేమైన సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరయితే నా పలుకులను జ్ఞప్తియందుంచుకొనెదరో, వారమూల్యమైన యానందమును పొందెదరు.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ముప్పదిరెండవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|


0 comments:

Post a Comment