Total Pageviews

Friday, July 24, 2015

ఒక శిఖరం కూలిపోయింది!

ఒక శిఖరం కూలిపోయింది!
తెలుగు రాష్ట్రాలలో సాయి భక్తి ని వ్యాపింపజేసిన మహోన్నత మానవతా మూర్తి ఇకలేరు!
హైదరాబాద్ నగర శివార్లలోని కీసర గుట్ట సమీపంలోగల రామవరం మండలం, రామలింగంపల్లి గ్రామంలోని ’సాయిధామం’ వ్యవస్థాపకులు, శ్రీ సాయి సేవా సమితి ట్రస్టు ద్వారా అనేక సామాజిక, ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాలను గత 3 దశాబ్దాలుగా నిర్వహించి, సచ్చిదానంద సద్గురు సాయి వాణి అనే తెలుగు మాసపత్రికకు గత దశాబ్ద కాలంగా గౌరవ సంపాదకునిగా వ్యవరించిన పూజ్యశ్రీ సత్య పదానంద ప్రభూజీ గురువారం వుదయం సాయిలీనులయ్యారు. వారి అంత్యక్రియలు ఈ వుదయం సాయిధామం ఆశ్రమంలో వారి ఆశ్రయంలో పెరిగిన దత్తపుత్రుడు శ్రీ రాము నిర్వహించారు.
సాయి భక్తి ప్రచారంలోనే గాక సాయి ధామం ఆశ్రమం చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలకి వారు చేసిన గ్రామ కళ్యాణోత్సవం, గ్రామ ధర్మజ్యోతి సేవలు చిరస్మరణీయం.
వారి ఆశ్రమంలో ద్వారవతి పేరుతో శ్రీ సాయిబాబా ఆలయం, ధుని, ఉష పేరిటి బాలికల శిశుమందిరం, ప్రత్యూష పేరిట బాలుర శిశుమందిరం, సంధ్య పేరిట అరక్షిత వృద్దాశ్రమం, ప్రశాంతి పేరిట వానప్రస్ధ విభాగం, అన్నపూర్ణ పేరిట నిత్యాన్న దాన మందిరం, ఆరోగ్య పేరిట ప్రకృతి, హోమియో మరియూ యోగ వైద్యశాల, భారతి పేరిట గ్రంధాలయం, సాయి విద్యాధామం, సురభి అన్న గోశాల, సాయి కళ్యాణి అనే ఆడిటోరియం నిర్వహించబడుతున్నాయి. సర్వతోభద్ర పేరిట గుంటూరు జిల్లాలో శ్రీ సాయినాధ ఆలయం, సత్తెనపల్లిలో కోదండ రామసాయి సన్నిధానం కూడా వారు స్థాపించినవే.
ఈ వుదయం జరిగిన మహపురుషుని మహాభినిష్క్రమణ యాత్రలో సాయి తత్త్వంలో తలలు పండాయి అనుకునే పెద్దలెవరూ లేకపోయినా, ప్రభూజీ ఆదరణలో, ఆశ్రయంలో పెరిగిన పిల్లలతో అంతిమ యాత్ర కొనసాగింది. ఎందరో యువతీయువకులు, పిల్లలూ, వారి ఆశ్రితులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
సాయిధామం ధర్మాధికారిణి, సచ్చిదానంద సద్గురువాణి సంపాదకురాలు మాతా శుకవాణి, మరియూ ఆశ్రమవాసులందరికీ సాయి టీవి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నది.
పూజ్యశ్రీ సత్యపదానంద ప్రభూజీ కి వినయపూర్వక సుమాంజలి!
LAST JOURNEY OF PUJYASHRI SATYA PADANANDA PRABHOOJI AT SAIDHAMAM THIS MORNING.
PHOTOS: SAI TV.

0 comments:

Post a Comment