Total Pageviews

Friday, July 17, 2015

శ్రీ సాయి సత్ చరిత్రను పారాయణచేయవలసిన పధ్ధతి9collected by http://telugublogofshirdisai.blogspot.in/2015/07/blog-post_6.html)

శ్రీ సాయి సత్ చరిత్రను పారాయణచేయవలసిన పధ్ధతి     
ఆంగ్ల మూలం : లెఫ్టినెంట్.కల్నల్.ఎం.బీ.నింబాల్కర్ 
         

ప్రతీ సాయి భక్తుడు శ్రీ సాయి సత్ చరిత్రను పారాయణ చేస్తారు, చేస్తున్నారు. కాని పారాయణ అనేది ఏవిధంగా చేయాలి అనే విషయం గురించి శ్రీ ఎం.బీ.నింబాల్కర్ గారు వివరించారు.  ఏవిధంగా చదవాలో శ్రీ సాయిబాబాయే సత్ చరిత్రలో చెప్పారు.  మనమందరమూ పారాయణ చేస్తాము.  కాని మనసు పెట్టి చదవాలి.  పారాయణ ఎప్పుడయిపోతుందా, ఎప్పుడు లేద్దామా అనే ఆలోచన మన మనసులోకి రాకూడదు.  కాస్త ఆలస్యమయినా సరే కుదురుగా కూర్చొని మనసు పెట్టి చదవాలి.  పుస్తకం చదువుతున్నపుడు ఆనాడు బాబా వారు జీవించిన రోజులలో మనము ఉన్నట్లుగాను, ఆయన సమక్షంలో ఉన్న భక్తులలో మనము కూడా ఒకరుగా ఉన్నట్లుగా భావించుకుని చదివితే ఆ అనుభూతే వేరు. చదివిన తరువాత మరలా రాత్రి పడుకునేముందు మరొక్కసారి మననం చేసుకోండి.  
ఇక చదవండి. 
ఓం సాయిరాం 

ఒక భక్తుడు సాయి సత్ చరిత్రను 12సార్లు చదివాడు.  అయినాకాని ఎటువంటి అనుకున్న ఫలితాన్ని సాధించుకోలేకపోయాడు.  నేను అతనిని నాసమక్షంలో చదవమన్నాను.  ఒక ఎక్స్ ప్రెస్ రైలు తన గమ్యస్థానానికి సాధ్యమయినంత తొందరగా చేరుకుందామని అత్యంత వేగంగా పరుగుపెట్టినట్లుగా అతను చాలా వేగంగా చదవడం మొదలుపెట్టాడు. 


 నిజానికి భక్తులు చిలుక పలుకులు పలికినట్లుగా చదవడం కూడా   సరియైన పధ్ధతి కాదు.  మనం అనుకున్న ఫలితం సాధించుకోవాలంటే, గ్రంధాన్ని కానివ్వండి, స్తోత్రాన్ని కానివ్వండి, ఏదయినా సరే దానిలోని అర్ధాన్ని, సారాంశాన్ని, పూర్తిగా అర్ధం చేసుకొనే విధంగా, అందులో మన మనస్సు, ఆలోచనలు పూర్తిగా లీనం చేసి, భావోద్వేగంతో చదవాలి.


జ్ఞానేశ్వరిలో నామదేవుడు ఈ విధంగా చెప్పాడు.  'కనీసం ఒక శ్లోకాన్నయినా అనుభవించాలి లేక అభ్యసించాలి.  ఇక్కడ నామదేవుడు 'అనుభవించమనే' చెప్పాడు తప్ప చదవమని చెప్పలేదు. అనగా ఊరికే చదివినందువల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని దాని అర్ధం.  ఒక్క శ్లోకం కాని పద్యం కాని పూర్తిగా అర్ధం చేసుకొని, దానిని ఆచరిస్తే వారి జీవితం జ్ఞానంతో నిండి ఎంతగానో ప్రకాశవంతమవుతుంది. 

శ్రీ సాయి సత్ చరిత్రలో హేమాడ్ పంత్ కూడా ఇదే విషయం చెప్పారు.  "ఊరికే చదివినందువల్ల ప్రయోజనం లేదు.  చదివి అర్ధం చేసుకొని దానిని ఆచరణలో పెట్టాలి.  లేకపోతే బోర్లించిన కుండ మీద నీరు పోసినట్లుగా నిష్ప్రయోజనం" (అ.21) ఇంకా ఆయన ఇలా చెప్పారు.  అర్ధం చేసుకోకుండా చదివినదంతా, ప్రేమ భక్తి లేకుండా చేసిన పూజవంటిది.  అనవసర శ్రమ తప్ప మరేమీ కాదు. (అ.14)  
          

ఒక పవిత్ర గ్రంధాన్ని ఏవిధంగా చదవాలో శ్రీసాయి సత్ చరిత్రలో సాయిబాబాయే స్వయంగా చెప్పారు.  దీనికి సంబంధించి మూడు ఉదాహరణలున్నాయి.
               

1. 18వ.అధ్యాయంలో, సాఠే వారం రోజులలో గురుచరిత్ర పారాయణ పూర్తిచేసినపుడు, ఆరోజు రాత్రి బాబా తన చేతిలో గురుచరిత్రను పట్టుకొని దానిలోని విషయాలను సాఠేకు బోధించుచున్నట్లుగా అతడు దానిని శ్రధ్ధగా వినుచున్నట్లు"సాఠే కు కలలోదర్శనమిచ్చారు.  సాఠేకు ఈ స్వప్నం ఏమిటో అర్ధం కాక బాబానడిగి దాని భావం తెలిసికొని చెప్పమని కాకాదీక్షిత్ ని కోరాడు.  "గురుచరిత్ర ఇంకొక సప్తాహము పారాయణ చేయవలెను.  ఆగ్రంధాన్నే జాగ్రత్తగా అందులోని అర్ధాన్ని ఆకళింపు చేసుకొంటూ పఠించిన, ఆతడు పావనుడయి మేలు పొందగలడు.  భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధములనుండి తప్పించును" అని ఆస్వప్నముయొక్క భావాన్ని వివరించారు బాబా. 

2) 41వ.ధ్యాయములో బాబా బీ.వీ.దేవ్ కు కలలో దర్శనమిచ్చి తన సమక్షంలో జ్ఞానేశ్వరిని చదవమని చెప్పారు.  ఇంకా యిలా చెప్పారు "చదువునప్పుడు తొందరపడవద్దు.  దానిలోని భావాన్ని అర్ధం చేసుకొంటూ జాగ్రత్తగా చదువు" అని చెప్పారు.
       

3) 21వ.ధ్యాయములో వీ.హెచ్.ఠాకూర్ కి 'అప్పా అనే కన్నడ యోగి 'విచారసాగరామనే' గ్రంధాన్నిచ్చారు.  బాబా ఠాకూర్ తో "అప్పా చెప్పినదంతయు నిజమే.  కాని అవన్నియూ అభ్యసించి ఆచరణలో పెట్టవలెను ఊరికినే గ్రంధాలను చవువుట వలన ప్రయోజనము లేదు.  నీవు చదివిన విషయమును గూర్చి, జాగ్రత్తగ విచారించి, అర్ధము చేసుకొని ఆచరణలో పెట్టవలెను.  లేనిచో ప్రయోజనము లేదు.  గురువనుగ్రహము లేని పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము" అని చెప్పారు. 
         

ఏదయినా గ్రంధాన్ని పఠించేటప్పుడు దానిలోని విషయాలు సరిగా బోధపడాలంటే ఏకాగ్రత అవసరం.  మనసు స్థిరంగా  ఉండాలి.  అందుచేత మనము సాయి సత్ చరిత్రను పారాయణ చేస్తున్నపుడు మన మనస్సు లౌకిక విషయాలవైపు మరలకుండా స్థిరంగా ఉంచుకోవాలి.  
    

మనసును ప్రశాంతంగా ఉంచుకొని పారాయణ చేసినపుడే మనం అనుకున్న ఫలితాలను సాధించుకోగలం.  హేమాడ్ పంత్ 21వ.అధ్యాయంలో అనంతరావు పాటంకర్ గురించి చెప్పారు.  పాటంకర్ ఎన్నో వేదాలను, ఉపనిషత్తులను  చదివినా కాని, అతని మనస్సుకి శాంతి ఉండేది కాదు.  అతడు సాయిని దర్శించుకున్నపుడు బాబా అతనికి తొమ్మిది గుఱ్ఱపు లద్దెలను ప్రోగుచేసుకొన్న వర్తకుని కధను, మనస్సును కేంద్రీకరించుకున్న విషయాన్ని వివరించారు.  పాటంకర్ కి ఈ గుఱ్ఱపు లద్దెల గురించి ఏమీ అర్ధం కాక దాదా కేల్కర్ ను అడిగినపుడు కేల్కర్ "తొమ్మిది గుఱ్ఱపు లద్దెలనగా నవవిధ భక్తులు అవి " శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, నమస్కారం, దాస్యము, సఖ్యత్వము, ఆత్మనివేదనము అని వివరించారు.  ఈనవవిధ భక్తులలో ఏదయినా ఒక మార్గమును హృదయపూర్వకముగా ఆచరించిన భగవంతుడు సంతుష్టి చెందును.  భగవంతుడు భక్తుని గృహమందు ప్రత్యక్షమగును.  భక్తి లేని సాధనములన్నియూ అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంధముల పారాయణ వాటిని యితరులకు బోధించుట అన్నీ నిష్ప్రయోజనము.    

ఇక ముగించేముందుగా సంత్ జ్ఞానేశ్వర్ బోధించిన బోధనని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొందాము.  "చక్రవాక పక్షులు శరదృతువులో చంద్రుని వెన్నెల కిరణాలనుఏవిధంగా ఆస్వాదిస్తాయో ఆవిధంగానే శ్రోతలు ఈ కధలలోని సారాన్ని ఆస్వాదించి అనుభవించాలి."

సాయి లీలాస్ ఆర్గ్.నుండి
ఆంగ్లమూలం లెఫ్టినెంట్. కల్నల్. శ్రీ ఎం.బీ. నింబాల్కర్
(సాయి పదానంద - అక్టోబర్ 1994)     

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

0 comments:

Post a Comment