Total Pageviews

Saturday, August 16, 2014

శ్రీ సాయి సత్ చరిత్ర-----------బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన యభయప్రధానవాక్యములు

శ్రీ సాయి సత్ చరిత్ర-----------బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన యభయప్రధానవాక్యములు

తల్లీ! నాకు కడుపునిండ గొంతువరకు భోజనము పెట్టినావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడు ఇట్లనే చెయుము. ఇది నీకు సద్గతి కలుగజేయును. ఈ మసీదులో గూర్చుండి నేనెన్నడసత్యమాడను. నాయందట్లే దయ యుంచుము. మొదట యాకలితో నున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుంచుకొనుము".
"హిందువుల దైవమగు శ్రీరాముడును, మహమ్మదీయులదైవమగు రహీమును ఒక్కరే. వారిరువురిమధ్య యేమీ భేదములేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట యెందులకు? ఓ అజ్ఞానులారా! చేతులు-చేతులు కలిపి రెండు జాతులును కలిసిమెలిసి యుండుడు. బుద్ధితో ప్రవర్తింపుడు. జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదమువల్లగాని, ఘర్షణవల్లగాని ప్రయోజనములేదు. అందుచే వివాదము విడువుడు. ఇతరులతో పోటీ పడకుడు. మీయొక్క వృద్ధిని, మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో నేదైన అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము. ఎవరైవ మీకు కీడుచేసినచో, ప్రత్యుపకారము చేయకుడు. ఇతరులకొరకు మీరేమైన చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు." సంగ్రహముగా ఇదియే బాబా యొక్క బోధ. ఇది యిహమునకు పరమునకు కూడ పనికివచ్చును.
భక్తుల యిష్టానుసారము తనను పూజించుటకు బాబా యొప్పుకొనినను ఒక్కొక్కప్పుడు బాబా మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పళ్ళెమును విసరివేయుచు కోపమునకు అవతారమువలె గనబడుచుండెను. అట్లయినచో బాబాను సమీపించు వారెవ్వరు? ఒక్కొక్కప్పుడు భక్తుల దిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనముకంటె మెత్తగా గనిపించుచుండెడివారు. ఇంకొకప్పుడు క్షమాశాంతముల ప్రతిమవలె గాన్పించుచుండెను. బయటికి కోపముతో వణకుచు, యెర్రకండ్లు ఇటునటు ద్రిప్పునప్పటికి, మాతృప్రేమ యనురాగముల ప్రవాహమువలె నుండువారు. వెంటనే తన భక్తులను బిలచి యిట్లనెను. "భక్తులను కోపించినట్లు తానెన్నడు నెరిగియుండలేదనెను. తల్లులు బిడ్డలను తరిమివేసినట్లయిన, సముద్రము నదులను తిరుగగొట్టినచో బాబా తన భక్తులను నిరాదరించును. భక్తుల యోగక్షేమములను ఉపేక్షించును. బాబా తన భక్తుల సేవకులమనిరి.
బాబా మాటలు క్లుప్తముగను, భావగర్భితముగను, అర్థపూర్ణముగను, శక్తి వంతముగను, సమతూకముతోను నుండెడివి. వారు ఎప్పుడు తృప్తిగా, నిశ్చింతగా నుండువారు. బాబా యిట్లనెను "నేను ఫకీరయి నప్పటికి, యిల్లుగాని భార్యగాని లేనప్పటికి, ఏ చీకు చింతలు లేనప్పటికి ఒకేచోట నివసించుచున్నాను. తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడు ఆమె నన్నావరించుచున్నది. ఈ భగవంతుని మాయ బ్రహ్మ మొదలగు వారినే చికాకు పరచునప్పుడు, నావంటి ఫకీరనగ దానికెంత? ఎవరయితే భగవంతుని ఆశ్రయించెదరో వారు భగవంతుని కృపవల్ల ఆమె బారినుండి తప్పించుకొందురు." మాయాశక్తి గూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన జీవస్వరూపములని ఉద్ధవునకు చెప్పియున్నాడు. తనభక్తుల మేలుకొరకు బాబా యేమి చేయుచున్నారో వినుడు. "ఎవరు అదృష్టవంతులో యెవరి పాపములు క్షీణించునో, వారు నాపూజ చేసెదరు. ఎల్లప్పుడు సాయి సాయి యని నీవు జపించినచో నిన్ను సప్తసముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము. నీవు తప్పక మేలుపొందెదవు. పూజా తంతుతో నాకు పని లేదు. షోడశోపచారములుగాని, అష్టాంగ యోగములు గాని నాకు అవసరములేదు. భక్తి యున్నచోటనే నా నివాసము."
మన పరిస్థితులు బాగుండునంతవరకు మనము భగవంతుని తలచము అను సంగతి యందరికి తెలిసినదే. కష్టములు మనల నావరించునపుడు మనము భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకొనెదము. అట్లనే భీమాజి కూడ భగవంతుని స్మరించెను. ఈ విషయమై బాబా భక్తుడగు నానా సాహెబు చాందోర్కరుతో సలహా చేయవలె ననుకొనెను. కావున వారికి తన జబ్బుయొక్క వివరములన్నియు దెలుపుచు నొక లేఖ వ్రాసి యతని యభిప్రాయ మడిగెను. బాబా పాదములపై బడి బాబాను శరణు వేడుకొనుట యొక్కటే యారోగ్యమునకు సాధనమని నానాసాహెబు చాందోర్కరు జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబు సలహాపై ఆధారపడి షిరిడీ పోపుట కేర్పాటు లన్నియు చేసెను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందర బెట్టిరి. నానాసాహెబు శ్యామగూడ నచ్చట ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మ పాపకర్మల ఫలితమని చెప్పి, దానిలో జోక్యము కలుగ జేసికొనుటకు బాబా యిష్టపడకుండెను. కాని రోగి తనకు వేరే దిక్కులేదనియు, నందుచే చివరకు వారి పాదముల నాశ్రయించితిననియు మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను. వెంటనే బాబా హృదయము కరిగెను. వారిట్లనిరి. "ఆగుము, నీ యాతురతను పారద్రోలుము; నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ, బాధ లున్న వారైనను ఎప్పుడయితే మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నియు నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ద్రహృదయుడు. వారీ రోగమును బాగుచేసెదరు. అందరిని ప్రేమతోను దయతోను కాపాడెదరు."
బాబా యిట్లు చెప్పనుద్దేశించెను. "నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను. శరీరముతో నేనిచ్చట నున్నప్పటికి సప్తసముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియును. ప్రపంచమున మీ కిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే యుండెదను. నా నివాసస్థలము మీ హృదయమునందే గలదు. నేను మీ శరీరములోనే యున్నాను. ఎల్లప్పుడు మీ హృదయములలోను సర్వజనహృదయములందుగల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు; పావనులు; అదృష్టవంతులు."

0 comments:

Post a Comment