Total Pageviews

Thursday, August 21, 2014

మనసే మందిరంగా చేసి సాయిని ఆరాధిద్దాం

మనసే మందిరంగా చేసి సాయిని ఆరాధిద్దాం
saibabaసాయిబాబాకు ఆర్భాటాలు, ఆడంబరాలు అక్కర్లేదు. నిండైన మనసు చాలు. మనసునే మందిరంగా చేసి సాయిని ఆరాధిద్దాం. సాయిబాబా పాదాలను ఆశ్రయించడమే ఆరాధన. మనసులో నిరంతరం బాబాను తల్చుకోవడమే నివేదన.
సాయిబాబాకు భక్తుల గురించే ధ్యాస. మనని భవబంధాలనుండి ఎలా విముక్తుల్ని చేయాలి, అశాశ్వతమైన అనుబంధాల నుండి ఎలా బయట పడేయాలి, ఆధ్యాత్మిక చింతన పెంచి జీవితాన్ని సార్ధకం చేయాలి అనే ఆయన చింత. భగవంతుడు మనిషికి అవసరమైనవన్నీ ఇచ్చి భూమ్మీదకు పంపాడు. మరి అలాంటప్పుడు భగవంతుడు తాను ఇచ్చిన ఆస్తులను, మానవులు సవ్యంగా ఖర్చు పెట్టాలని ఆశిస్తాడు కదా. కనుక మనం దేన్నీ దుర్వినియోగం చేయకూడదు. మనకు ఉన్న ఆస్తులను సద్వినియోగం చేసుకుంటూ, తోటివారికి ఉపయోగపడుతూ, జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి.

వివిధ సందర్భాల్లో సాయిబాబా అన్న మాటలు గుర్తుచేసుకుందాం...
ప్రజల్ని సన్మార్గంలో పెట్టమని భగవంతుడు నన్ను పంపాడు. కానీ, ఈ రోజుల్లో ప్రజలు కాస్తయినా దేవుడిపట్ల భక్తిశ్రద్ధలు లేకుండా కాలం గడుపుతున్నారు. క్షణికమైన మొహావేశాల్లో పడి కొట్టుకుపోతున్నారు. సత్సంగాలపై ధ్యాస, నమ్మకం లేవు. సత్యం మాట్లాడుతూ, ధర్మాన్ని ఆచరించమంటే, అసత్యాలు చెప్తూ, అధర్మంలో తేలుతున్నారు. భక్తిభావన నిలుపుకుంటే మీకే శ్రేయస్కరం. నా ప్రయత్నాన్ని నేను చిత్తశుద్ధితో చేస్తాను.
పుడుతున్నాం. తింటున్నాం. కాలయాపన చేస్తున్నాం. పుట్టడం, ఆయుష్షు ఉన్నంతవరకు జీవించడం - ఇదేనా జీవితం? ఇందులో ఏమైనా జీవితపరమార్ధం ఉందా? మన జీవితానికి గమ్యం అంటూ ఉండనవసరం లేదా? సరైన, నిర్దుష్టమైన గమ్యాన్ని నిర్ణయించుకుని దాన్ని చేరేందుకు ప్రయత్నించాలి. మనిషి తనను తాను తెలుసుకోలేనంతవరకూ, గమ్యాన్ని నిర్దేశించుకునేంతవరకు జ్ఞానం లేనట్లే. గమ్యం తెలిసివాడే జ్ఞాని. సద్గురువు బోధనలు వింటే, వాటిని పాటిస్తే జీవితం సార్ధకమౌతుంది.
పుట్టినవారు గిట్టకమానరు. అందరూ మట్టిలో కలిసిపోవలసిందే. అయితే, చావుపుట్టుకల మధ్య ఉన్న జీవితాన్ని సార్ధకం చేసుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. తోటివారితో వీలైనంత వినయవిధేయతలతో మాట్లాడాలి. జలసాలు, విలాసాలకు దూరంగా నిరాడంబరంగా గడపాలి.
''ఇంద్రియాలను అదుపులో ఉంచుకో
సౌశీల్యాన్ని, సౌజన్యాన్ని అలవర్చుకో
ఎక్కువగా మాట్లాడకు
ఎదుటివారు చెప్పేది విను
సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించు
వంతులు, వాడులాతలు వద్దు
అహంకారాన్ని విడిచిపెట్టు
కోపతాపాలకు దూరంగా ఉండు
దేనిమీదా ఇష్టాన్ని పెంచుకోకు
దేన్నీ ద్వేషించకు
మనోవికారాలకు దూరంగా
నిర్వికారంగా ఉండటం అలవర్చుకో
శ్రద్ధ, సబూరీలను సమర్పించు
ఇదే నిజమైన గురుదక్షిణ''
ఇవన్నీ సాయిబాబా సూక్తులు. అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు ఎంత స్పష్టంగా ఉన్నాయి కదూ! ఆచరించేందుకు ప్రయత్నించండి

0 comments:

Post a Comment