Total Pageviews

Thursday, July 25, 2013

శ్రీపాద శ్రీవల్లభుల అవతారం :




శ్రీపాద శ్రీవల్లభుల అవతారం :
మానవులను తరింపజేయదలచిన భగవంతుడు, వారికి ధర్మ మార్గం పై ఆసక్తి కలుగజేయడానికి ధర్మాన్ని ముందు తానే ఆచరించి చూపాలి కనుక, మానవరూపంలో భూమిపై అవతరిస్తాడు.ఈ కలియుగంలో కూడా అలాగే పవిత్ర గోదావరీ తీర సమీపంలో పిఠాపురం అనే గ్రామంలో ఆయన అప్పలరాజు శర్మ, సుమతి మాత అనే పుణ్యదంపతులకు శ్రీపాద శ్రీవల్లభునిగా 1330 వ సం|| భాద్రపద శుక్ల చతుర్ధినాడు ఉదయం శుభముహూర్తంలో జన్మించారు.

ఈ దంపతులకు మొదట కొంత మంది పిల్లలు పుట్టి చనిపోయారు.వీరు నిత్యమూ భిక్షకై వచ్చేవారిని శ్రీదత్త రూపాలుగా భావించి భిక్ష సమర్పించేవారు. ఒక అమావాశ్యనాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధకర్మ ప్రారంభించారు.కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండకమండలములు ధరించిన సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. శ్రాద్ధ కలాపంలో ఉన్న ఆమె భర్తకు ఈ విషయం తెలియదు. వచ్చిన భిక్షువు శ్రాద్ధ భోక్తయైన పరమేశ్వరుడేనని తలచి ఆయనకు భిక్ష ఇచ్చింది. ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు యదార్ధమైన తన దత్తాత్రేయ రూపంలో దర్శనమిచ్చి - "తల్లీ నీ అచంచలమైన విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను, " శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చెయ్యకమునుపే నేను పరమేశ్వరుడినన్న విశ్వాసంతో భోజనం పెట్టావు. నీ అభీష్టమేమిటో చెప్పు. నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు." అప్పుడు సుమతీ మాత "పరమాత్మా నీవు భక్తుల కోరికలీడేర్చే కల్పవృక్షానివి. నీవు నన్ను తల్లీ అని సంబోధించావు. కనుక నేను ప్రత్యేకంగా వరమడుగవలసిన పనిలేదు. నీవిచ్చిన మాట నిలుపుకోచాలు అన్నది."

భక్తిశ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధిశక్తికి ఆశ్చర్యచకితుడైన స్వామి - "అమ్మా నాతో సమానమైన పుత్రుడే నీకు జన్మిస్తాడు, కానీ నువ్వు చెప్పినట్లే అతను చెయ్యాలని నువ్వు నిర్బంధించకూడదు. అతడు చెప్పినదే అక్షరాలా అమలుజరపాలి. " అప్పుడు మాత "స్వామి నేను మానవమాత్రురాలిని పుత్రవ్యామోహం కలుగడం సహజం, కనుక సమయానుకులంగా అట్టి వివేకాన్ని నీవే కలుగజేయాలి అన్నది. " ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి స్వామి నవ్వి, ఆశీర్వదించి అంతర్హితులయ్యరు.

ఆ విధంగా ఆ పుణ్యదంపతులకు జన్మించిన శ్రీపాద వల్లభులు 16 సంIIల ప్రాయం వరకూ పిఠాపురంలో వుండి, అటు తర్వాత సన్యసించి పాదచారియై ద్వారక, కాశీ, బృందావనం మొ|| క్షేత్రాలు దర్శిస్తూ బదరీ వెళ్లి, అటు తర్వాత గోకర్ణం వెళ్లారు.అక్కడ మూడు సంవత్సరాలుండి ఆ క్షేత్రమహాత్మ్యాన్ని పునరుద్ధరించి తర్వాత కృష్ణాతీరంలోని కురువపురానికి వెళ్లి అక్కడ 14 సంవత్సరాలు తపస్సు చేసి అక్కడే తమ స్థూలరూపాన్ని మరుగుపరచారు.

రవిదాసు కథ :
--------------
కురువపురంలో రవిదాసు అను రజకుడు స్వామివారిని నిత్యం సేవిస్తూవుండేవాడు. స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తుండేవాడు. అతని భక్తిశ్రద్ధలకు మెచ్చిన స్వామి ఒకనాడు నాయనా నీవు నిత్యం భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నావు, నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు. నాటి నుండి అతనికి సంసారచింత నశించి మరింత భక్తిశ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు. ప్రతిరోజూ అతడు స్వామియొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతుండేవాడు. అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకోవడానికి వెళ్తుండేవాడు.

ఒకనాడు రవిదాసు తన కులవృత్తి చేసుకోవడానికి నదీ తీరానికి వెళ్లినప్పుడు అక్కడ సుందరయువతీ జనంతో కలిసి విహారార్ధమై నదికి వచ్చిన ఒక యవనరాజును, అతని వెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్నీ చూచాడు. ఆ దృశ్యాన్ని చూచి సమ్మోహితుడై, తాను నిరంతరం చేసుకొనే శ్రీపాదుల వారి నామస్మరణ మరచి, తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ వుండిపోయాడు. తర్వాత అతడు మానవజన్మమెత్తాక ఇటువంటి వైభవము, సుఖము అనుభవించకపోతే జీవితే వ్యర్ధం అనుకొన్నాడు. ఇంతలో మధ్యాహ్నం అయింది, శ్రీపాద స్వామి అనుష్టానానికి నదీ తీరానికి వచ్చారు. అతడు స్వామికి నమస్కరించి తాను సమ్మోహితుడై చూచిన దృశ్యం వివరించి, అయినా అఙ్ఞానం వల్ల అలా భ్రమించానేగానీ మీరున్న స్థితియే నిజమైన సౌఖ్యమివ్వగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు.

నాయనా నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకొనే జీవిస్తున్నావు అందుకనే నీవు అతనిని చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలుగడంలో ఆశ్చర్యమేమీ లేదు, నాయనా నీవు రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా! నిస్సంకోచంగా చెప్పు అన్నారు.
దానికి రవిదాసు వెంటనే స్వామి! నా అఙ్ఞానం మన్నించి నన్ను మన్నించి అనుగ్రహించు అని వేడుకున్నాడు. నాయనా మనసులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే, ఇలాటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి.అవి కలిగాక ఇంద్రియాలను, మనస్సును తృప్తి పరుచుకోవాలి . లేకుంటే యిలాటి వాసనలు మిగిలివున్నంత వరకూ మళ్లీ మళ్లీ జన్మిస్తుండవలసిందే, నీకు ఆ రాజసౌఖ్యాలు ఈ జన్మలోనే కావాలా? లేక మరుజన్మలో కావాలా? సంకోచించకుండా చెప్పు! అన్నారు. అప్పుడతడు నాకిప్పుడూ వయసయిపోయింది, ఈ జన్మలో ఇంతటి సుఖం లభించినా నేను తృప్తిగా దాన్ని అనుభవించలేను. కనుక నాకవి మరుజన్మలో లభిస్తే వాటిని ఆజన్మాంతమూ అనుభవించగలను అన్నాడు. నీలో రాజ్యకాంక్ష, సుఖలాలస బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరుజన్మలో మృధుర దేశంలో యవనరాజ వంశంలో జన్మిస్తావు అన్నారు. స్వామీ మీరిచ్చిన వరం నాకు ప్రీతికరమైనదే కానీ మరుజన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చెయ్యవద్దు. మీయందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించండి. అప్పుడూ నాకు మతద్వేషం ఉండకూడదు అన్నాడు. అప్పుడు శ్రీపాద స్వామి ఇప్పుడు నీవెట్టి వైభవం చూచావో అట్టిదే మరుజన్మలో పొందుతావు. అప్పుడు మేమవతరించవలసిన అవసరమొస్తుంది. వృద్ధాప్యంలో నీకు మా దర్శనమవుతుంది, తక్షణమే నీకు ఙ్ఞానోదయం అవుతుంది. భయంలేదు నీవికవెళ్లి రావచ్చు అని ఆశీర్వదించి, ఒక వింతైన నవ్వుతో అతనివైపు చూచారు. ఆ రజకుడు అక్కడిక్కడే మరణించాడు.

తిరుమలదాసు కథ :
--------------------
రవిదాసు తండ్రి తిరుమలదాసు, అతడు శ్రీపాద వల్లభుని అవతారంలో ఉన్న దత్తప్రభువుకి చేసిన సేవకి, అతన్ని శిరిడీ సాయి అవతారంలో వచ్చినప్పుడు అనుగ్రహిస్తానని ఆశీర్వదించారు.ఈ వాక్కు ఎలా ఫలించిందో చూద్దాం. ఆచార్య ఎక్కిరాలభరద్వాజ గార్కి బాబాగార్ని ప్రత్యక్షంగా సేవించుకున్న దామోదర్‌ రాస్నే కుమారుడు నానాసాహెబ్ రాస్నేగారు ఈ వృత్తాంతం ఇలా చెప్పారు - నానాసాహెబ్ రాస్నేగారు శ్రీగాడ్గీ మహరాజ్ గారికి ఒకరోజు తన ఇంట ఆతిధ్యం ఇచ్చి వారి గురుసేవ గురించి అడిగినప్పుడు ఇలా చెప్పరట - సాధారణంగా మా వృత్తాంతం మేమెవరికీ తెలుపము.మా తల్లిదండ్రులు రజకులు. శేవ్గాఁవ్ పతర్దీ అనే ఊళ్లో ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాణ్ణి. ఒకరోజు దివ్యవర్ఛస్సు గల ఫకీరొకరు మా గ్రామానికి వచ్చారు, అయన ముస్లీం అన్న భావంతో ఎవరూ ఆయనకు భిక్ష వెయ్యలేదు. మా దుకాణంలో కూడా యజమాని అతన్ని భిక్ష ఇవ్వకుండా కసురుకున్నాడు. నాకు ఆయన్ని చూడగానే భిక్ష వెయ్యలనిపించి, పరుగున పోయి రొట్టెలు, కూర తెచ్చేసరికి ఆయన వెళ్లిపోయారు.నేను ఆయనను వెతుకుతూ పోయేసరికి ఒక ఏకాంత ప్రదేశంలో జొన్నకంకులు కోసుకుని తింటూ కనిపించారు. నన్ను చూచి కోపంతో నీవిక్కడికెందుకొచ్చావ్? అని గర్జించారు.

గాడ్గీ మహరాజ్ : మీకెవరూ భిక్షవేయలేదని గమనించి ఇంటి నుండి భిక్ష తెచ్చాను అన్నాను.
ఫకీర్ : ఓహో! నేనేమి కోరితే అదిస్తావా? ఏం అన్నారు.
గాడ్గీ మహరాజ్ : నా దగ్గరలేని డబ్బు తప్ప మీరేమి కోరినా ఇస్తాను అన్నాను,
ఫకీర్ : అయితే నీ ప్రాణమివ్వు అన్నారు పంతంగా.
గాడ్గీ మహరాజ్ : అది నేనివ్వగలిగింది కాదు. మిరే తీసుకోండి. నాకీ జీవితమంటే విరక్తి పుట్టింది అన్నాను.

ఆ ఫకీరు నవ్వి నా తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. వెంటనే నా హృదయంలో చెప్పలేని మార్పు వచ్చింది. వారి సన్నిధి తప్ప మరేమీ కావాలన్పించలేదు.వారికి భిక్ష ఇచ్చాక ఇంటికి వెళ్లి, నాకొక గొప్ప గురువు దొరికారని నేనిక సంసారంలో జీవించలేనని చెప్పి వేగంగా ఫకీరు వద్దకు చేరుకున్నాను.ఆయన నన్ను చూస్తూనే ఉగ్రులై దుష్టుడా ఇచ్చింది చాలలేదా ఇంకా పీడించుకు తినాలని వచ్చావే? అని గద్దించి పక్కనున్న శ్మశానంలోకి వెళ్లారు.నేను మిమ్మల్ని విడిచి బ్రతకలేను అంటూ వారిని అనుసరించాను.అక్కొడక సమాధి పక్కన గుంట త్రవ్వి.అందులో రెండు కుండలు నీరు పోయమన్నారు,నేను అలానే చేసాను. ఆయన ఆ నీరు మూడు దోసిళ్లు తాగి నన్నూ తాగమన్నారు.అవి తాగగానే నాకు చాలా సేపు బాహ్య స్మృతి లేకుండాపోయింది.నాకు స్పృహ వచ్చే సరికి ఆయన ఎటో వెళ్లిపోయారు.నేను ఆయనకోసం చాలాకాలం వెదకి చివరకు శిరిడీలోని మసీదుకు చేరాను. లోపల తెరలు దించివున్నాయి.అక్కడ ఫకీరు స్నాం చేస్తున్నారు. నేను తెర పైకెత్తి చూచాను. నన్ననుగ్రహించిన ఫకీరే ఆయన! నన్ను చూస్తూనే పట్టరాని కోపంతో ఆయన "లంజకొడకా! ఇప్పటికే నా రక్తమాంసాలు పీక్కుతున్నావ్, ఎముకలు కూడా తినాలని వచ్చావట్రా?"అని ఒక ఇటుకరాయి విసిరారు.అది నా నొసట తగిలి నెత్తురుకారింది. మరుక్షణమే ఆయన ప్రేమగా నిన్ను పూర్ణంగా అనుగ్రహించాను.భగవంతుని అనుగ్రహం నీకెప్పుడూ ఉంటుంది,నిన్నందరూ దైవంగా కొలుస్తారు. ఇక నా వెంట తిరుగవద్దు అన్నారు.కొంతకాలానికి ఆయనే గాడ్గీ మహరాజ్గా ప్రసిద్ధిచెందారు, లోకపూజ్యులై ఎన్నో ధర్మశాలలు, పాఠశాలలు స్థాపించారు. వీరు సంకీర్తన చేస్తుంటే వేలాది మంది భక్తులు చేరేవారు.

శివశర్మ - అంబిక వృత్తాంతం :
-----------------------------
కురువపురంలో శివశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు, అతని భార్య అంబిక మహాపతివ్రత. పూర్వకర్మ వలన వారికెంతో మంది పిల్లలు పుట్టి కొద్దికాలంలోనే చనిపోతుండేవారు. చివరికి ఒక కొడుకుమాత్రం నిలిచాడు. దురదృష్టవశాత్తు ఆ బిడ్డ జడుడు, మూఢుడు, మందబుద్ధి గలవాడయ్యడు. నిష్ప్రయోజనమైన సంతానం వల్ల కలిగిన దిగులుతో అతను చిక్కిశల్యం అవసాగాడు. శ్రీపాదుల వారి సమక్షంలో ఒకనాడు వేదం పఠించిన అతను మౌనంగా నిలుచున్నాడు, అతని దిగులుకు కారణమేమిటని అడిగిన స్వామికి తన కుమారుని వృత్తాంతం వివరించాడు. ఇది పూర్వకర్మ ఫలితమేనని చెప్పి నీ కుమారుడు ఉద్ధరింపబడాలంటే వాని పూర్వజన్మ పాపమును మొదట హరించాలి. అప్పుడే అతను పాండిత్యానికి అర్హత పొందగలడని, నీవు నీ జన్మను త్యాగం చేసినచో నీ బిడ్డని యోగ్యుడైన పండితుని చేయగలనని స్వామి పలికారు.అందుకు ఆ పండితుడు నా బిడ్డడి కోసం నేను శరీరం త్యజించడానికి సంసిద్ధుడననే అని పలికాడు.

కొంతకాలం తర్వాత శివశర్మ మరణించాడు. అంబిక తన కొడుకుతో బిచ్చమెత్తుకుని జీవించసాగింది. ఆ బాలుణ్ని గ్రామస్తులు అవహేళన చెయ్యడం, చులకనగా మాట్లాడటం చేస్తుండేవారు. ఆ పరిహాసాలు రోజురోజుకి ఎక్కువవడంతో వాటిని భరించలేక ఆ బాలుడు
ఆత్మహత్య చేసుకోవడానికి పరుగెత్తసాగాడు. అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లికూడా నిస్సహాయురాలై, తను కూడా ఆత్మాహత్య చేసుకోడానికి పరుగెత్తసాగింది. దారిలో వారికి శ్రీపాద స్వామి ఎదురై బ్రాహ్మణుడా తొందరపడవద్దు. పూర్వకర్మ వల్ల నీకీ దుస్థితి దాపురించింది. దీనికితోడూ నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య, ఆత్మహత్యా దోషాలు చుట్టుకుంటాయి. అవి నివారింపరానివి. అందువల్ల జీవించి కష్టాలను ఓర్పుతో అనుభవించి దుష్కర్మల శాశ్వతంగా విముక్తుడవటం మంచిది అన్నారు.

అందుకు అంబిక స్వామీ, ఒక వంక భర్తను కోల్పోయి, మరొకవంక వ్యర్ధుడైన ఈ పుత్రుని వల్ల ఎలాంటి సద్గతులు నేను పొందగలను?నన్ను చూడటమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు. మేమిక బ్రతికి చెయ్యగలిగేదేముంది అన్నది. ఆత్మహత్య వల్ల మరొక పాపం చుట్టుకుంటుందని తెలియజేసి - నీ మిగిలిన జీవితమంతా శివపూజలోనే గడుపు, అలా చేస్తే నావంటి కుమారున్ని పొందగలవు అన్నారు. మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దాని వల్ల ప్రయోజనమేమిటో నాకర్ధం కాలేదు దయచేసి వివరించండి అన్నది.అప్పుడామెకు శివపూజ వల్ల యశోద ఎలా కృష్ణునికి తల్లి కాగలిగిందో తెలిపి, శివపూజ మహిమ వల్ల నీవుకూడా అలాగే అవుతావు అన్నారు. స్వామీ శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా!? ఈ జీవితశేషం నేనెలా గడపాలి? మహానుభావా అందరి పరిహాసాలకు గురవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన మరణిస్తాడో తెలియదు, నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది.ఆ కరుణాసముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆ బాలుని తలపై పెట్టి ప్రణవముచ్చరించారు. ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి అంతటి ఙ్ఞానీ, వక్తా అయ్యాడు.

వల్లభేశుని వృత్తాంతం :
----------------------
వల్లభేశుడనేవాడు పేద బ్రాహ్మణుడు. ఇతనికి శ్రీపాద స్వామి ఆశీర్వాదంతో వివాహం జరిగింది. ప్రతి సంవత్సరం నియమంగా స్వామి వారిని దర్శించి సేవించుకొనేవాడు. కొంతకాలానికి స్వామివారు తమ అవతారాన్ని చాలించారు. ఆ తర్వాత ఇతడు పసుపు వ్యాపారం ప్రారంభించి, కురువపురం వచ్చి స్వామివారి పాదుకలను దర్శించుకొని వ్యాపారం వృద్ధిలోకి వస్తే వేయి మంది బ్రాహ్మలకి భోజనం సమారాధన చేస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుండి అతని వ్యాపారం క్రమంగా అభివృద్ధి చెంది మంచి లాభాల్ని ఆర్జించాడు. తన కోరిక నెరవేరడంతో స్వామి వారికిచ్చిన మాట ప్రకారం తన మొక్కు చెల్లించడానికి కావల్సినంత డబ్బు తీసుకుని కురువపురం బయలుదేరాడు. మార్గమధ్యంలో అతనికి నలుగురు అపరిచితులు అతనికి పరిచయమయి తాము స్వామి వారి భక్తులమేనని ప్రతి సంవత్సరం యాత్ర చేస్తామాని చెప్పారు. వారు యాత్రికుల రూపంలో వున్న దొంగలని గ్రహించేంత దూరదృష్టి వల్లభేశునికి లేకపోవడంతో వారి మాటలు నమ్మి వారితో కలసి ప్రయాణించసాగాడు.

మార్గమధ్యంలో ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి రాగానే ఆ దొంగలు వల్లభేశుని తల నరికి చంపి, అతని దగ్గరున్న ధనం అపహరించారు. ఈ దుర్ఘటన ఎవరూ పసిగట్టకూడదని తలచి అతని శవాన్ని దహనం చేయడానికి ప్రయత్నించసాగారు. ఐతే వల్లభేశుడు మరణించే ముందు చివరి క్షణాల్లో "శ్రీ పాద వల్లభా" అని కేక పెట్టాడు. అందువల్ల భక్తరక్షకూడైన శ్రీపాద స్వామి జడలు, భస్మము, త్రిశూలమూ ధరించిన యతి రూపంలో ప్రత్యక్షమయి త్రిశూలంతో ఆ దొంగలను సంహరించారు. వారిలో ఒకడు మాత్రం ఆయన పాదాలపై పడి తనకే పాపమూ తెలియదని, తెలియక వారితో కలిసానని చెప్పి తెలియక చేసిన తప్పిదాన్ని మన్నించమని శరణు వేడతాడు. సర్వసాక్షియైన స్వామి అతన్ని మన్నించి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేశుని శరీరం పై చల్లి తెగిపడివున్న తలని అతని మొండానికి అతికించమని ఆదేశించారు. అతను ఆ పని చేస్తుండగా శ్రీపాద స్వామి వల్లభేశుని పై తమ కృపాదృష్టిని సారించి వెంటనే అంతర్ధానమయ్యారు. వల్లభేశుడు తిరిగి బ్రతికాడు.

అతనికి జరిగిందేమీ గుర్తులేదు.తనతో వచ్చిన అపరిచితులు చచ్చిపడివుండటం చూచి, పక్కనున్న అతన్ని "వీళ్లందరూ ఎలా మరణించారు? నువ్వొక్కడ్డివే ఎలా బ్రతికావు?" అని అడిగాడు. అప్పుడతడు, "అయ్యా ! ఇప్పుడొక అద్భుతమైన దైవలీల జరిగింది. మనతోపాటు వచ్చిన వారు దొంగలు, వాళ్లు నిన్ను చంపి నీ ధనమపహరించారు. ఇంతలో ఒక యతి వచ్చి ఈ దొంగలను చంపి మిమ్మల్ని బ్రతికించారు అంటూ జరిగిన వృత్తాంతం వివరించాడు. తనని రక్షించినది సాక్షాత్తూ శ్రీపాద వల్లభ స్వామేనని గ్రహించిన వల్లభేషుడు ఎంతో పరితపించాడు. అయినా తనని పునరుజ్జీవుతుణ్ని చేసినందుకు సంతోషించి కురువపురం చేరి స్వామి పాదుకలను సకల ఉపచారాలతో పూజించాడు. ముందు తాను మొక్కుకున్నట్లు వేయిమందికి కాక, నాలుగువేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారిని సత్కరించాడు.

నిర్యాణం :
----------
శ్రీ పాద వలభ స్వామి 1950, హస్తా నక్షత్రము, ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి రోజున తన భక్తుడైన శంకరభట్టుకి తమ రూపాన్ని గుప్త పరచవలసిన సమయం ఆసన్నమైందని తెలియజేసి, తన చరితామృతాన్ని రచించి మూడ సంవత్సరాల తర్వాత తమ పాదుకల వద్ద వినిపించమని తెలియజేసారు. ఆ తర్వాత కురువపురం వద్ద కృష్ణానదిలో మునిగి అంతర్హితులయ్యారు.

1 comment:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete