Total Pageviews

Wednesday, January 7, 2015

సాయి తత్వం :

మనకు నిత్య జీవితంలో విభిన్న తత్వాలు గల ప్రాణులు గోచరిస్తాయి. భిన్నత్వం సామాన్యులలోనే కాదు గొప్పవారిలో సైతం ఉంటుంది. భక్తులపట్ల మహాదేవుడు భోళాశంకరుడు. కాని విష్ణువు, బ్రహ్మ అలా కాదు. ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము వంటివి తత్వములో భిన్నత్వం వలన రూపుదాల్చినవే. సర్వజనులకు ఆమోదయోగ్యమైన దైవము శ్రీ షిరిడీ సాయినాథుడు. వీరి తత్వం వైఖరి కొంచెం భిన్నంగా ఉన్నట్లు అగుపడినా లోతుగా పరిశీలిస్తే సత్యం, ప్రత్కేత గోచరిస్తుంది.
పిలిస్తే పలికే దైవం శ్రీ సాయినాథుడు. ఇందుకు దృష్టాంతరములు అనేకం. ఒక పర్యాయము తాజుద్దీన్ గృహం అగ్నికి ఆహుతి అగుతూ ఉండినది. తాజుద్దీన్ సాయినాథుని ప్రార్థించగానే ఇల్లు రక్షింపబడినది. కొలిమివద్ద పనిచేసే మహిళ భర్త పిలుపుతో దఢాలున లేచింది. ఒడిలో యున్న పిల్లవాడు కొలిమిలో పడబోగా ‘బాబా’ అని మొరపెట్టుకుంది. బాబా రక్షించాడు.
అందరి దైవం ఒకటే అనే తత్వం ఈయనది. ఆలోచనలు భిన్నమయినవి అయినా, రూపాలు భిన్నమయినవయినా భగవంతుడు ఒకడే అనేది ఈయన సిద్ధాంతం. అందుకే తరచుగా బాబా ‘సబ్ కా మాలిక్ ఏక్ హై’ అని అంటుండేవారు. ఈయన మసీదులో సర్వమత ప్రార్థనలు జరిగేవి. ఏ మతమునకు ప్రాధాన్యత ఇవ్వక అన్ని మతములను కలుపుకుపోవడం సాయితత్వం.
కోరికల విషయంలో సాయి వైఖరి స్పష్టం. లౌకికంగా సంతృప్తి పొందక అలౌకికము సాధించలేడు అనేది సాయి తత్వం. కోరికలతో గూడిన మనసు సర్వేశ్వరునిపై లగ్నం కావాలి అంటే కోరికలు తీరాలి. నడిచే దైవం సాయి. కోరికలు ఈడేరినవాడు మనసుపై అదుపు సాధించి మోక్షగామి కాగలడు అనేది సాయితత్వం.
త్యాగం అనేది సాయి తత్వములలో ముఖ్యమయినది. త్యాగనిరతి సాయి యొక్క పరిపూర్ణ తత్వము. ఒక పరి షిరిడీలో ప్రవేశించిన ప్లేగు వ్యాధిని స్వీకరించి షిరిడిలో నివసించే ప్రజలను కాపాడాడు. సోదరి సమానురాలు అయిన ఆమె కుమారుడు తాత్యాకు బదులు తన ప్రాణం తృణప్రాయంగా సమర్పించినాడు. ఋణముపట్ల బాబా తత్వము నిక్కచ్చిగా యుంటుంది. నిన్ను ఎవరు అడగలేదు, ఇస్తాను అని ఇవ్వకపోతే అది రుణమే. రుణము నుంచి వెంటనే విముక్తులు కావాలి అనేవారు. అప్పు చేసి షిరిడీ రానవసరం లేదు. నేను లేని చోటు లేదు అన్నారు. శ్రద్ధ, సబూరి అనే రెండు నాణెములు ఇవ్వమని అడిగేవారు. ఏ వ్యక్తి అయినా ప్రవర్తనలోగాని వేష భాషలలోగాని ఆడంబరములకు పోకుండా సాదా సీదాగా ఉండాలి అనేవారు. ఉత్సవాలకు ఆడంబరాలకు ఆయన చాలా దూరం. ప్రతి ఒక్కరిలో ఆకలి బాధ గమనించి తీర్చుట ఆయన తత్త్వం. పశుపక్ష్యాదులకు కూడా ఇది వర్తింపచేసేవారు.
ఎవరికి ఎంత ప్రాప్తమో శ్రీ సాయినాథునికి తెలుసు. అంతా నీకు తెలుసు బాబా సర్వం నీవే అని అంటారు కాని చెబితే వినేవాడు ఏడి అని ఒక సందర్భములో బాబా అన్నారు. ఒక పేద బాహ్మణుడు శ్రీసాయినాథుని కలిసి తాను పేదరికంలో ఉన్నానని తనను పేదరికం నుంచి రక్షించమని కోరాడు. అపుడు బాబా ఈ పేదరికం నువ్వు అనుభవించక వేరే దారి లేదు అని బాబా చెప్పగా ఆ బ్రాహ్మణుడు వినలేదు. నేను ఇచ్చినా నీకు నిలవదని చెప్పినా ఆ విప్రుడు మాట వినలేదు. సరే నీ ఖర్మ అంటూ ఆ విప్రుని చేతికి ఒక మూట ఇచ్చి ఇంటికెళ్లి నీవు, నీ భార్య కలిసి ఈ మూట విడదీయండి అని చెప్పగా సమ్మతించిన బ్రాహ్మణుడు ఆ మూట తీసుకొనెను. ఉత్సాహము ఆపుకోలేని ఆ బ్రాహ్మణుడు మూట విప్పగా అందులో విప్రునికి మాంసం ముద్ద గోచరించెను. ఆ మూటను నదిలో విసరగా బంగారుముద్దగా మారెను. నీట మునిగెను. బాబా సెలవిచ్చినది అక్షరాలా నిజమని భావించి విప్రుడు గృహోన్ముఖుడు అయినాడు.
పై చెప్పబడిన అంశములు సాయి అనే మహాసముద్రంలోని కొన్ని నీటి బిందువులు మాత్రమే. సాయితత్వం పూర్తిగా అవగాహన చేసుకున్నవారు అరుదు. ఆయన తత్వం అనే్వషిస్తూ వున్నవారి సంఖ్య తక్కువేమీ కాదు....
సర్వం శ్రీ శిరిడీ సాయి పాదారవిందార్పణమస్తు
సర్వేజనా సుఖినోభవంతు...

0 comments:

Post a Comment