Total Pageviews

Tuesday, September 10, 2013

దుఃఖాలను పోగొట్టే ద్వారకామాయి

షిర్డీలో సాయిబాబా నివాసమున్న మసీదు ద్వారకామాయి. ప్రస్తుతం ద్వారకామాయి ఫోటో ఉన్న స్థలంలో బాబా కాళ్ళు బారజాపుకుని కూర్చునేవారు. అలా కూర్చున్నప్పుడు వారి కాళ్ళు ముందున్న స్తంభం వరకూ వచ్చేపట. గురుస్థానం నుంచి బాబా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మసీదు శిధిలావస్థలో ఉంది. బాబా ఇక్కడ ధునిని ప్రతిష్టించారు. ఇటుకలు, మట్టి రాలిపడుతూ ఉండేవి. ఇక్కడ బాబా స్నానానికి ఉపయోగించే స్నానపు రాయి ఉంది. ఇక్కడ ఉన్న బాబా చిత్రానికి చాల మహత్తు ఉంది. విల్లీపార్లేకి చెందిన శ్యాంరావు ఆర్.వి. జయకర్ ఈ చిత్రం గీశాడు. బాబా ఆశీస్సులతో ఆ పటాన్ని ఇంటికి తీసుకువెళ్ళి పూజలో పెట్టుకుందామనుకుని బాబా వద్దకు ఆ పటం తీసికెళ్ళాడు. నేను నిష్క్రమించాక ఈ పటం ద్వారా నేను నా భక్తుల శ్రేయస్సు చూస్తుంటాను. ఈ ఫోటో ఇక్కడే ఉండనీ’ అన్నారట సాయిబాబా.
అనేకమంది భక్తులు నేటికీ తాము తమ నివాసాలకు వెళ్లేందుకు బాబా అనుమతి ఇక్కడి నుంచే పొందుతారు. ఇక్కడనుంచే చాలామందికి బాబా నుంచి ఆదేశాలు అందుతుంటాయి. ఇక్కడ ఓ పక్కన బస్తాలో గోధుమలుంటాయి. బాలాజీ పాటిల్ నెవాస్కర్ అనే భక్తుడు తన పంటను బాబాకు సమర్పించి బాబాకు తనకు తిరిగి ఇచ్చిన దానితోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈయన తరువాత ఆయన కొడుకు కూడా అలాగే చేసేవాడు. అతని స్మృతికి చిహ్నంగా ఓ గోధుమల బస్తాను నేటికీ అక్కడ ఉంచుతూ ఉంటారు. షిరిడీలో రెండు తిరగళ్ళు మనకు కనిపిస్తాయి. ఒకటి ఇక్కడ, మరొకటి సమాధి మందిరంలో. బాబా వీటితో గోధుమలు విసిరేవారట. మసీదులో ఓక పక్కన జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఈ జ్యోతి ఉన్న స్థానంలో బాబా నీటితో దీపాలు వెలిగించారు. ఇక్కడ గల ఒక కుండలో నీటిని బాబా ఎంతోమందితో తాగించేవారు. అయినా అందులో నీరు తరిగేది కాదు. ఇప్పటికి చాలామంది భక్తులు అందులోని నీరు తాగుతారు.
ద్వారకామాయి దక్షిణం వైపు రెండు పాదాలు ఉన్నాయి. రోజూ ఆరతి అయ్యాక బాబా ఇక్కడ కొద్దిసేపు కూర్చునేవారు. ధుని నుంచి ఊదీ తీసి భక్తుల నుదుట పెట్టేవారు. ''మీకు శుభం జరుగుతుంద''ని ఆశీర్వదించేవారు. 1886లో మూడు రోజులపాటు శరీరాన్ని విడిచిపెట్టి బాబా తిరిగి వచ్చిన అద్భుత ఘటన జరిగిన స్థలమిది. అందుకు గుర్తుగా ఇక్కడ తాబేలు బొమ్మ ప్రతిష్టించారు.
శ్యాంసుందర్ అనే గుర్రాన్ని బాబా అమితంగా ప్రేమించేవారు. హారతి సమయంలో దానిని చక్కగా అలంకరించి ఇక్కడ నిలబెట్టేవారు.
భక్తులకోసం బాబా వంటచేసే సమయంలో ఇక్కడ ఉన్న గుంజకు ఆనుకుని కూర్చునేవారు. తమ గురువుకు గుర్తుగా సాయి ఇక్కడ అగ్నిని ప్రజ్వలింపచేశారు. దీనిని ధుని అంటారు. అది నేటికీ అఖండంగా వెలుగుతూనే ఉంది. దీనిలోని భస్మాన్ని ఊదీ అంటారు. ఈ ఊదీని ధరిస్తే అనారోగ్యాలు పోతాయి.
ద్వారకామాయి గురుకులం లాంటిది, ఎందరో ఇక్కడ జ్ఞానసిద్ధి పొందుతుంటారు.సాయిచరిత్ర చదివితే ఇక్కడ బాబా లీలలు ఎన్నో జరిగినట్లు తెలుసుకోవచ్చు. బాబా సమాధికి ఒక వారం రోజుల ముందు ఒక పులి సద్గతి పొందింది. 1969 దీని విగ్రహాన్ని మసీదులో ప్రతిష్టించారు. ఈ విగ్రహం పక్కనే ఉన్న రాయి మీదనే సాయంత్రం వేళ సాయిబాబా కూర్చునేవారు.
ద్వారకామాయిని దర్శించుకుంటే చాలు దుఖాలు పోయి సుఖసంతోషాలు సొంతమౌతాయి.

1 comment: