Total Pageviews

Tuesday, September 17, 2013

సాయిమహరాజ్ సాక్షాత్తు నిర్గుణపరబ్రహ్మ. సాయిసత్ చరిత్రే వేదప్రమాణం.



           ఓం సాయిరాం

ప్రియమైన సాయి బంధువులారా!



'స్వదేసీకాశ్యైవకీర్తనం స్వయంతు అనంతస్య శివస్యకీర్తనం            

 స్వదేసీకాస్యైవ నామస్మరణం స్వయంతు అనంతస్య శివస్య నామస్మరణం  ||' 

ఒక గురువుయొక్క వైభవాన్ని గానం చేయడమంటే సర్వశక్తిమంతుడయిన భగవంతుని కీర్తించడమే.   తన గురువుయొక్క నామాన్ని స్ఫురణకు తెచ్చుకోవడమంటే దానర్ధం భగవంతుని గుర్తు చేసుకోవడం తప్ప మరేమీ కాదు.

ఈ మాటలు అన్నది ఎవరో కాదు. విశ్వమంతటికీ అధిపతియైన పరమశివుడు పార్వతీమాతతో పలికిన మాటలు. (స్కాంధపురాణంలో పరమేశ్వరునికి, పార్వతీమాతకు మధ్య జరిగిన సంభాషణలే గురుగీతగా ప్రసిధ్ధి చెందింది.  గురువుయొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ, శివునికి, గురువుకు గల ఏకత్వాన్ని పార్వతికి వివరించాడు.  నిజమయిన భక్తుడు, గురువుకి, శివునికి (అనగా సర్వశక్తిమంతుడయిన భగవంతుడు) మధ్య భేదం లేదనే విషయాన్ని గుర్తించాలని, పరమశివుడు తానే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడు.  ఆయన యింకా యిలా చెబుతున్నారు "ఎవరయితే గురువు వేరు, భగవంతుడు వేరు అని తలుస్తారో వారు గురువుయొక్క గొప్పతనాన్ని అర్ధం చేసుకోనివారు (శివా గురోర్భిన్నత్వ).

గురువుయొక్క విశిష్ట లక్షణం ఏమిటంటే తాను సర్వశక్తిమంతుడయిన పరమాత్మతో సమానుడయినప్పటికీ (అనగా సాక్షాత్తు పరబ్రహ్మ) మానవజాతిని ఉద్దరించడంకోసం, తన అమూల్యమైన బోధనలద్వారా వారియొక్క ఆధ్యాత్మిక మార్గంలోనున్న అడ్డంకులను తొలగించి వారిని సరియైన మార్గంలో నడిపించి చివరికి వారు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు  యిప్పటికీ ఒక రూపంలో ప్రకటితమవుతూ వారిని గమ్యాన్ని చేరుస్తున్నాడు.

ఆవిధంగా గురుతత్వాన్ని బోధిస్తూ పరమ శివుడు యింకా యిలా చెపుతున్నాడు. "అటువంటి విశిష్టమయిన లక్షణం గురువులో మాత్రమే ఉంది.  అందుచేత ఓ! పార్వతీ! గురువునే మొట్టమొదటగా పూజించాలి.  గురువు తరువాతే ఎవరయినా.  గురువుకంటే భగవంతుడు స్వయంగా గొప్పవాడు కాదని, శ్రీశంకరుడు ప్రవచించిన పలుకులు ఎంత అధ్బుతమైనవి !

పరబ్రహ్మను గురించి చెప్పిన ఈ విశిష్టమయిన లక్షణాలన్నీ కూడా శ్రీషిరిడీసాయిబాబాలో గురుతత్వంగా సంపూర్ణంగా మూర్తీభవించి ఉన్నాయి.



కేవలం సగుణరూపంగా సాయిని గురించి వర్ణించడం చాలా కష్టసాధ్యమయిన విషయం.  అందుచేత, ఈ చరాచర సృష్టికి కారణమయిన ఆయన యొక్క నిర్గుణరూపాన్ని కనక పరిగణలోకి తీసుకుంటే మనం మంత్రముగ్ధులమై నిశ్శబ్దంగా ప్రేక్షక పాత్ర వహించవలసినదే.

ఏకత్వంగా వ్యక్తముగాని సర్వశక్తిమంతుడయిన భగవంతుడు మన ప్రియమైన సాయిసమర్ధునిగా షిరిడీ చిన్నగ్రామంలో తనకు తానుగా (స్వయంగా) ప్రకటితమయ్యారు.  ప్రియమైన సోదరులారా సాయి మన గురువు, భగవంతుడు అన్నీ ఆయనే.  అంతే కాదు ఆయనే మన శ్వాస.  సాయి 1918 సం.లో సమాధి చెందారు. కాని, (అనగా పతనావధి మరణావధి శాస్ర్త్రం చెప్పినప్రకారం కారణ జన్మమయిన భౌతిక శరీరం విసర్జించవలసినదే) సమాధి చేయబడినది ఆయన శరీరమే కాని ఆయన చెప్పినటువంటి శాశ్వత బోధనలు, సూత్రాలు కాదు.  శాశ్వతమయిన ఈసూత్రాలు కాని, తత్వం గాని సృష్టిలోని ప్రతి అణువులోను కణములోను నిక్షిప్తమై ఉన్నాయి.  అంతేకాదు ఈ సృష్టిలోని భూభాగాలను దాటుకొని అంతులేకుండా విస్తరించి ఉన్నాయి (అనాద్యంతావినాషితత్వం).

శ్రీసాయి మహరాజ్ యొక్క ఈలీలావిశ్వంభరత్వాన్ని అర్ధం చేసుకోవాలంటే శ్రీ అన్నాసాహెబ్ ధబోల్కర్ అనబడే  హేమాద్రిపంతు రచించిన "శ్రీసాయి సత్ చరిత్రను" ఆశ్రయించవలసినదే.  (వాస్తవానికి శ్రీసాయిబాబాయే స్వయంగా రచయితకు చెప్పిన మాటలు" నీ అహంకారాన్ని నాపాదాలవద్ద వదలిపెట్టు . నాచరిత్రను నేనే నీచేత వ్రాయించుకుంటాను" - సాయి భక్తులు దయచేసి హేమాడ్ పంతుగారి సాయి సత్ చరిత్ర రెండవ అధ్యాయాన్ని పరిశీలించండి.)

సోదరులారా! 'శ్రీసాయి సత్ చరిత్రను ఆశ్రయంచవలసినదిగా మీకు నేను మరొక్కసారి గుర్తు చేస్తున్నాను.  సాయిసత్ చరిత్రనే ఎందుకు చదవాలి? అనే ప్రశ్న మీకు ఉదయిస్తే భాగవత పురాణంలోని కొన్ని విషయాలను మీకు చెబుతాను.  దానిలో 'పరమహంస సంహిత అనబడే బ్రహ్మ విద్యను గూర్చిన సారమంతా ఉంది.  శ్రీమద్భాగవతంలో పరమాత్మ దైవాంశ హంసగా చతుర్ముఖ బ్రహ్మ ముందు ప్రకటితమయ్యి కొన్ని శ్లోకాలలో బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించింది. దివ్యమైన హంస చెప్పిన ఈశ్లోకాలే హంసగీతగా ప్రసిధ్ధి చేదాయి.  ఈ శ్లోకాల సంఖ్య చాలా కొద్ది మాత్రమే అయినప్పటికీ అందులోని ప్రతి గీతం, ప్రతి అక్షరం, మాటలోను, మనలను ఆపరమాత్మతో ఏకత్వం చేయడానికి సహాయపడే నిగూఢమయిన వేదాంతసారం యిమిడి ఉంది.  అదేవిధంగా శ్రీసాయి సత్ చరిత్రలోని ప్రతి అక్షరం, ప్రతిమాట, బ్రహ్మజ్ఞానంతో మర్మగర్భమయి ఉంది.  బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలనుకునేవాడు తన జీవితంలో నిరంతరం సాధన చేస్తూ ఉండాలి.  

ఆధ్యాత్మిక సాధన బ్రహ్మ చింతన, భజన, పూజ, వ్రతాలు మొదలైనవాటితో ప్రారంభమవదు.  మనం ఎంతవరకు పరిపూర్ణులుగా ఉన్నాము, సంఘంలో మనం ఎంతవరకూ సవ్యంగా బాధ్యతలను నిర్వహిస్తున్నాము (ఈప్రపంచంలో మనం జన్మించినందుకు) వీటితోనే ఆధ్యాత్మిక సాధన ప్రారంభమవుతుంది. (అది ఒక కుమారుడుగా లేక కుమార్తె, భర్త, భార్య, ఒక పౌరునిగా, వృత్తిరీత్యా కానివ్వండి).  ఇదే కనక అసత్యమయితే శ్రీకృష్ణపరమాత్మ అర్జునునకు కర్మ మార్గాన్ని ఎందుకు ఉపదేశించాడుఅందుచేత ఆధ్యాత్మికంగా ఎదగాలంటే సంఘంలో మనం చేయవలసిన విధులు మనం చేయాలి. (అలాగే సమాజంలో కూడా)  ఈ విధులన్నీ కూడా భౌతికవాదంతో ముడిపడి ఉన్నాయి.  ఇక ఈ భౌతిక ప్రపంచంలో 'అవసరాలూ 'కోరికలూ ఏది ఎంచుకోవాలో అది ప్రజల అభిమతానికే వదలివేయబడింది.  అందుచేత వివేకం కలవాడు మొదటిదానినే ఎంచుకుంటాడు.  అది సాధకుడిని భూమిమీద స్థిరంగా ఉంచుతుంది.  ఆధ్యాత్మిక మార్గంలో ఎదగడానికి అది తొలిమెట్టు.  కాని, తరువాతది మాత్రం తీరని దాహం.  మనం ఎంత సంపాదించినా యింకా యింకా సంపాదించాలనే తపన.  మన అధోగతికి అదే కారణం.   ఇక తిరిగి అసలు విషయానికొస్తే, బ్రహ్మవిద్యలో బంగారు గని అయినటువంటి శ్రీసాయి సత్ చరిత్రను చదువుతాము.  మన కోరికలను తీర్చుకొనే ఉద్దేశ్యంతో (కామితార్ధప్రదాయని) పారాయణ చేస్తాము. ఆవిధంగా చేయడం తప్పా? దానికి స్థిరమయిన సమాధానం, "కాదు".  సాయిబాబా, సాయిసత్ చరిత్ర వేరు కావు.  (బ్రహ్మ, బ్రహ్మవిద్య వేరగునా?)  సత్ చరిత్రలో శ్రీసాయి స్పష్టంగా చెప్పిన మాటలు "సముద్రం తనను చేరు నదులనెప్పుడైన తిరుగగొట్టునా? తల్లి తన బిడ్డలనెక్కడయినా తరిమి వేయునాఅలాగే నావద్దకు వచ్చినవారిని నేనెట్లు త్రిప్పి పంపగలనుయదార్ధానికి గురువు ప్రేమించే తల్లి అవతారం.  తన వద్దకు లౌకికమయిన కోర్కెలతో గాని, ఆధ్యాత్మికత కోసం వచ్చేవారిని గాని ఎవ్వరినీ ద్వేషించరు.  ప్రారంభంలో తన భక్తులయొక్క ప్రాపంచిక కోరికలను తీర్చడం సద్గురువుయొక్క విశిష్ట లక్షణం.  (కోర్కెలు వివేకంతో కూడుకొని మంచిగా ఉండాలి.)  తరువాత ఈప్రాపంచికమయిన కోర్కెలన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి అడ్డంకులని భక్తుడు తెలుసుకునేలా చేసి, సాధకుని మనసులో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు.

కాబట్టి భక్తుడయినవాడు "నేను సత్ చరిత్ర పారాయణ చేశాను.  నాకోరికలన్నీ తీరాయి" అని చెప్పి దూరమవకూడదు.  వాస్తవానికి సాయిసత్ చరిత్ర కోర్కెలను తీర్చే కల్పవృక్షం. అందులో సందేహం లేదు.

కాని, ప్రియమైన సాయి బంధువులారా!  సాయి సత్ చరిత్ర మనలను యిక కోర్కెలు లేని స్థాయికి తీసుకొని వెళ్ళే పవిత్ర గ్రంధం.  (నిర్వికల్పావస్థ లేక విషయనాసక్త స్థితి)

వాస్తవానికి, మనం కోర్కెలు లేని స్థితికి చేరుకోవాలంటే మొదటగా మన కోరికలు తీరాలి.  (దయచేసి గమనించండి, మనం కోరుకొనే కోరికలు మంచివయితే మనం మార్గంలో ముందుకు వెడతాము.  చెడు కోర్కెలయితే అవి మనకు చెడు ఫలితాలనిస్తాయి)  గురు భక్తులుగా, జీవితంలో మనం ప్రతి దశలోనూ గుర్తుంచుకోవలసినదేమిటంటే, మనం శ్రీసాయిని లౌకికపరమయిన ఏకోరికను కోరుతున్నప్పటికీ లేక సాయిసత్ చరిత్రను పారాయణ చేయునప్పుడుగాని, ఒక స్థిరమయిన విషయం మీదనే కేద్రీకరించాలి. "--బాబా, నేను ఈ కోరిక తీరడంకోసం నిన్ను ప్రార్ధిస్తున్నాను.  సాయిసత్ చరిత్రను పారాయణ చేస్తున్నాను.  ఒక్కసారి నాకోరిక తీరగానే నేను ఈ సంసారంలో భవబంధాలు లేనివానిగా మిగిలిపోవాలి. ఇదే నాకోరిక. ఈకోరికను నేను ప్రాపంచికపరమయిన లాభం కోసం కాక, భవిష్యత్తులో నేను నీవద్దకు చేరే మార్గంలో పునాదిరాయిగా భావిస్తాను"  ఈవిధంగా కనక మనము శ్రీసాయిని ప్రార్ధించినా, లేక సత్ చరిత్ర పారాయణ చేసినా మన కోర్కెలు సిధ్ధిస్తాయి.  అంతే కాకుండా మనకి ఆధ్యాత్మికంగా ఉన్నతస్థితి ఖాయం.  క్రమంగా సాధకునికి భవబందాలు తొలగిపోయి చివరికి శ్రీసాయిని యిలా ప్రార్ధిస్తాడు. "బాబా! చివరిసారిగా నాది ఒకటే కోరిక అది నేను యిక ఏకోరికలు లేనివానిగా ఉండాలి".  ఇదే సద్గురువులో ఉండే సౌదర్యం.  ఇది సాయిబాబాలో సంపూర్ణంగా ప్రకటితమయి ఉంది.



శ్రీమధ్బాగవతంలోని "హంసగీత" వలె సాయిసత్ చరిత్ర మనకు "సాయిగీత".  మానవ జాతినే కాదు, ఈవిశ్వాన్నంతటినీ ఉధ్ధరించడానికి శ్రీసాయి తనే స్వయంగా  దైవహంసగా (పరమహంస) హేమాడ్ పంత్ ద్వారా ఆలపించారు.  సాయే 'జగద్గురు అనడంలో ఎటువంటి సందేహము లేదు.  ఎవరయినా, సాయి సత్ చరిత్ర గ్రంధముల సారమే కదా అని ప్రశ్న్నించేవారికి, తమకు తామే ఎంతో విజ్ఞానులమని భావించుకునేవారికి, దయచేసి సత్ చరిత్రను సమగ్రంగా మరియొకసారి  చదవమని నేను వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను. నిజమైనటువంటి సత్సారమును గ్రోలమని అభ్యర్ధిస్తున్నాను.

శ్రీసాయిసత్ చరిత్రను మనం ఏకాగ్రతతో చదివినప్పుడు, 'ఒక పెద్దమనిషి శ్రీసాయి వద్దకు వచ్చి తనకు వెంటనే బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని' అడిగిన సంఘటన ఉన్న అధ్యాయంలో మనకు వేదం యొక్క సిం హగర్జన వినపడుతుంది.  

 20వ.అధ్యాయంలో బాబా దాసగణుమహరాజ్ కు కాకా సాహెబ్ పనిపిల్ల ద్వారా ఈశావాస్యోపనిషత్తులోని బ్రహ్మజ్ఞానముయొక్క ఉపనిషత్తుల సారాంశాన్ని వివరించారు.  తుమ్మెద ఝుంకారనాదం చేస్తూ మకరందం గ్రోలుతుంది.  అదేవిధంగా సాధకుడు వేదాంతమనే కొలనులో పూర్తిగా వికసించిన కమలమనే సద్గురువు నుండి బ్రహ్మజ్ఞానమనే మకరందాన్ని గ్రోలుతాడు.  గీతాచార్యుడు అయిన శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు సత్ చరిత్రలోని ప్రతి అధ్యాయంలోను ప్రతిధ్వ్యనిస్తాయి.  కర్మ, భక్తి, జ్ఞానయోగం, పురుషోత్తమప్రాప్తి యోగముతో కలిసినటువంటి  2, 3, 4,  మరియు 15వ.అధ్యాయాలలో బ్రహ్మనిరూపణ గురించిన అనేక భావాల మధ్య సమన్వయం, ధర్మ స్థాపన గురించి బాగా వివరింపబడింది. సాక్షాత్తు భగవత్ స్వరూపుడయిన శ్రీకృష్ణుడు స్వయంగా భగవద్గీత అర్జునునకు ఉపదేశించినట్లు శ్రీసాయి తనయొక్క సాయి గీతను స్వయముగా హేమాడ్ పంతుకు బోధించి ప్రకటించారు. 

ముఖ్యంగా కావలసినది తన గురువుమీద గట్టి నమ్మకమని మూలేశాస్త్రి కధలో వివరింపబడింది.  గురువుకు భగవంతునికి మధ్య భేదం లేదు యిద్దరూ ఒకటేనని మేఘశ్యాముని కధ ద్వారా మనకు అవగతమవుతుంది.  మనము ఏ ఆహారాన్ని అయినా స్వీకరించే ముందుగా భగవంతునికి బ్రహ్మార్పణము గావించాలి (అనగా భగవంతునికి అర్పించాలి). ఈ విషయాలన్ని కూడా అన్నాసాహెబ్ ధబోల్కర్ ద్వారా తెలియపర్చబడ్డాయి.

తన గురువుమీద గట్టి నమ్మకం ఉండాల్సిన అవసరం గురించి మూలేశాస్త్రి కధలోను, గురువు భగవంతుడు యిద్దరూ సమానమే అని అర్ధం చేసుకోవలసినదానిని గురించి ప్రస్తావిస్తూ మేఘశ్యాముని కధలోనూ, మనము ఏదయినా సరే తినే ఆహారాన్ని ముందుగా భగవంతునికి అర్పించిన తరువాతనె స్వీకరించాలని (బ్రహ్మార్పణ) యివన్నీ కూడా అన్నసాహెబ్ ధబోల్కర్ గారి ద్వారా చెప్పించబడ్డాయి.

అన్నాసాహెబ్ యిదే కధను సత్ చరిత్రలో శ్రీకృష్ణుడు, సుధాముల కధను గుర్తుకు తెచ్చుకుంటారు.  శ్రీకృష్ణుడు, సుధాముల కధలో, "మిత్రమా!  చాలా కాలం తరువాత మనము కలిసాము కదా! నాకు ఏమి తెచ్చావు తినడానికి" అని సాక్షాత్తు శ్రీమహావిష్ణువు రూపమయిన శ్రీకృష్ణుడు సుధాముని ఉత్తరీయమున ఉన్న అటుకుల మూటనుండి అటుకులను  స్వయముగా ఆరగించాడు.  ఆరకముగా భగవంతుడే భక్తుని నుంచి నివేదన కోరుకుంటాడు.   మనం ముఖ్యంగా వేదాంతపరంగా అర్ధం చేసుకోవలసినదేమిటంటే, మనం ఏదయినా ఆహారాన్ని స్వీకరించేముందు మొట్టమొదటగా దానిని భగవంతునికి నివేదించి భుజించాలి. అనగా ఆత్మ నివేదన భతవంతునికి అర్పించాలి.  దీని భావం జీవుడు తన ఆత్మను అనగా జీవాత్మను పరమాత్మతో ఏకీభవింపచేయుట.   (ఇక్కడ వేదాంతంలో చెప్పిన మాటలను గుర్తు చేసుకోండి - "బ్రహ్మార్పణం, బ్రహ్మహివిహ్ బ్రహ్మజ్ఞాను బ్రహ్మ్నాహుతం ---")  



ఇంతకుముందు చెప్పిన కృష్ణసుధాముల కధను వ్యాస భాగవతంలోనుండి గ్రహింపబడినదా లేక రచయిత హేమాద్రిపంతు సుధాముని అపహాస్యం చేశాడా అన్న విషయాల మీద మనకు చర్చ అనవసరం.  మనం కనక సత్ చరిత్రను కూలంకషంగా (సమగ్రంగా) చదివితే శ్రీ హేమాడ్ పంతు ఎంతటి భగవద్భక్తుడో అర్ధమవుతుంది.  నిజానికి హేమాడ్ పంతే కనక అంతటి నిజమయిన భక్తుడే కాకపోయినట్లయితే సాయి మహరాజ్ తన చరిత్రను అతని చేతనే ఎందుకు వ్రాయించుకుంటారుధబోల్కర్ "తాను ఒక మందమతినని, తనను నిమిత్తమాత్రునిగా చేసి, బాబా అనుగ్రహించి బాబా తన చరిత్రను తనచే వ్రాయించుకున్నారని ఎంతో అణకువతోను నిరహంకారంతోను చెప్పారు.  అన్నాసాహెబ్ ధబోల్కర్ వంటి  జ్ఞాని, వినయశీలుడు అన్ని విషయాలు తెలుసున్నవాడు (పరిపక్వజ్ఞాని) ఈ విధంగా మాట్లాడగలడానిజానికి శ్రీహేమాడ్ పంత్ సకల వేదాంత విషయాలలోను, శాస్త్రాలలోను, ప్రావీణ్యం కలవాడు. 

అయినప్పటికీ ఆయన తన శాస్త్ర విజ్ఞానాన్ని కీర్తిప్రతిష్టల కోసం ఎన్నడు ఉపయోగించుకోలేదు.  ఎవరినీ విమర్శించలేదు.  గురువు అనుగ్రహం లేకుండా పుస్తకజ్ఞానం ఎందుకూ పనికిరాదనుకున్నారు.  గురువుని అన్వేషిస్తూ చివరికి షిరిడీ చేరుకున్నారు.  బ్రహ్మ విద్యారూపమయిన సాయిబాబా లో తన గురువుని కనుగొన్నారు.  ధబోల్కర్ వంటి భగవత్ భక్తుడు భాగవతోత్తముడైన సుదాముని గురించి అంత తక్కువ చేసి మాట్లాడగలడా?

యిటువంటి గొప్ప రచయిత సాయి సత్ చరిత్రను 20వ.శతాబ్దంలో రచించాడు.  యిప్పటికీ కూడా ఈగ్రంధం ఉపనిషత్తుల సారాంశాన్ని ప్రబోధిస్తూ మనకు బ్రహ్మజ్ఞాన మార్గానికి తీసుకొని వెడుతుంది. ప్రాచీన గ్రంధాలలోని ప్రతీ శ్లోకము, ప్రతీ మంత్రం లాగే, ఈ గ్రంధంలోని ప్రతీ  అక్షరం, ప్రతీ పదం కూడా అంతే గొప్పవి.  ఈ కలియుగంలో ఎప్పుడయితే మహాగ్రంధాలయొక్క వాస్తవమైన అర్ధాలను వ్యాఖ్యాతలు తమ యిచ్చవచ్చిన రీతిలో పిచ్చి తలంపులతో వ్యాఖ్యానాలు చేస్తారోఅప్పుడు సనాతన ధర్మం యొక్క అసలయిన వాస్తవమయిన మూల సూత్రాలు లేక భావనలు అర్ధం చేసుకోవడంలో అల్పత్వం ఏర్పడుతుంది. అటువంటి సమయంలోఎవరయితే గురువుయొక్క కధలను భక్తిభావంతో గానం చేస్తారో, వారికి అవి దారిచూపే మార్గదర్శకాలవుతాయి.  జ్ఞానదీపాలవుతాయి.

గురుచరిత్ర చదివిన సాధకునికి ప్రాపంచిక కోర్కెలు సిధ్ధిస్తాయి.  అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి సాధకుడు చేసే కర్మాచరణలు ఆఖరికి గమ్యాన్ని చేరుస్తాయి.  యిక్కడ మనం చెప్పుకోవలసినది గురుచరిత్ర అనగా 'శ్రీసాయిసత్ చరిత్ర కావచ్చు లేదా 'శ్రీగురుచరిత్ర (శ్రీగురుచరిత్ర త్రిమూర్తుల అవతారం దత్తాత్రేయునిగా అవతారం, ఆయన మొదటి రెండు అవతారములు శ్రీపాదశ్రీవల్లభ, శ్రీనరసిం హసరస్వతిస్వామి వారల గురించి తెలియచేస్తుంది).  శ్రీగురుచరిత్ర త్రిమూర్తుల అవతారమయిన సద్గురువు గురించి ప్రబోధిస్తుంది (హరిహర బ్రహ్మాత్మక గురు) త్రిమూర్తుల శక్తులన్ని (మనవేదాలలో చెప్పినటువంటివి) గురుతత్వంగా గురువులో ప్రకటితమవుతాయి.  సాధకుడు త్రిమూర్తుల అవతారంగా మూర్తీభవించిన సమర్ధ సద్గురుని పూజించినపుడు స్వతస్సిధ్ధంగానే త్రిమూర్తుల శక్తిని అనుగ్రహంగా  పొందుతాడు. (బ్రహ్మతో కూడిన సరస్వతి జ్ఞానాన్ని, విష్ణుమూర్తితో కూడిన లక్ష్మీదేవి భక్తి అనే సంపదని, పరమశివునితో కూడిన పార్వతీదేవి వైరాగ్యశక్తి).  భక్తులారా, అందుచేతనే మనకు సాయి చరిత్రే గురుచరిత్ర .  మనసద్గురువు సాయే.  "సాక్షాత్తు సరస్వతీ రూపం".  అందుచేత ఖచ్చితంగా సత్ చరిత్రలోని ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి వాక్యం, 'సారస్వతవిద్య, అనగా అదే 'మహాభాగవత సరస్వతీ తప్ప మరేమీకాదు.

గురుపూర్ణిమనాడు  (ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి) గురుభక్తులందరూ కూడా గురువుని 'పరబ్రహ్మ గా పూజిస్తారు.  వేదవ్యాసమహాముని జన్మదినమే గురుపూర్ణిమ.  దీనినే వ్యాసపూర్ణిమ అంటారు.  వేదం యొక్క సారాన్నంతటినీ (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము) వేదాంగాలనే నాలుగు వేదాలుగా ఆయనే విభజించారు.  యింకా ఆయన మహాభారతాది పురాణాలను రచించారు.  మనవేదాలలోను, పురాణాలలోను, బ్రహ్మజ్ఞానాన్ని గురించి ఎంతో మహోన్నతంగా వివరింపబడింది.  ఈబ్రహ్మజ్ఞానం చివరికి తన లక్ష్యాన్ని చేరుకునేలా సరియైన మార్గాన్ని సూచించి సాధకునికి మార్గదర్శకమవుతుంది.

అంతటి మహోత్కృష్ట కార్యానికి వ్యాసమహర్షి కారణభూతుడవడం వల్లనే ఆయన శిష్యులందరూ ఆయనను తమ గురువుగా పూజించారు. (అనగా ఎవరయితే చీకటి అనే అజ్ఞానాంధకారం నుండి జ్ఞానమనే వెలుతురువయిపు సరియైన మార్గంలో నడిపిస్తారో).  అందువల్లనే ఆషాఢమాసంలో వచ్చే గురుపూర్ణిమ 'గురుపూర్ణిమ గా ప్రసిధ్ధి చెందింది.  ఆధ్యాత్మిక ప్రగతిని ఆశించేవానికి వేదవేదాంత సారంలోని సూత్రాలన్ని కూడా సరైన మార్గాన్ని విశదపరుస్తాయి.  యివన్ని కూడా సద్గురువులో ప్రకటితమయి ఉన్నాయి.  అందుచేత గురుతత్వమే వేదాంత తత్వం.

నేనిక్కడ 'సద్గురువు అని చేబుతున్నానంటే అనేకులైన గురువులందరి మధ్య వ్యత్యాసాన్ని చూపటంలేదు.  సాయిభక్తునిగా నన్ను నేను అనుకోవాలంటే నాయిష్టదైవమైన సాయిసమర్ధుని గురువులందరిలోనూ చూడగలగాలి.  ఎవ్వరిలోనూ భేదభావాన్ని చూడకూడదు.  వాస్తవానికి భగవాన్ రమణమహర్షి, శ్రీరామకృష్ణపరమహంస, శ్రీవివేకానంద, శ్రీశంకరాచార్య, యింకా గురువులు ఎవరయినా కానివ్వండి, గురువులందరిలోనూ ఉన్న 'గురుపరబ్రహ్మతత్వం' ఒక్కటే.  మరొక్కమాటలో చెప్పాలంటే వ్యాసమహర్షి చెప్పిన వేదాంత తత్వం సద్గురువులో ప్రకటితమయి ఉంటే కనక, అప్పుడు గురువుకూడా వ్యాసమహర్షితో సమానుడే.

అందుచేత వ్యాసమహర్షి, శ్రీసాయినాధుడు యిద్దరిలోను ప్రకాశించే 'పరబ్రహ్మసద్వస్తు ఒక్కటే కాబట్టి ఒక గురువు గొప్పా, లేక మరొక గురువు గొప్పా అనే చర్చ నిష్ప్రయోజనం.

సాయిమహరాజ్ సాక్షాత్తు నిర్గుణపరబ్రహ్మ.  సాయిసత్ చరిత్రే వేదప్రమాణం.  మనం సాయిబాబాని తప్ప మరెవరినీ శరణువేడనక్కరలేదు.  'శ్రీసాయిసత్ చరిత్రే' మనకు శిరోధార్యం.  సాయిసమర్ధుడు మన మనస్సునుఆలోచనలను, చర్యలను అన్నిటినీ కూడా ప్రక్షాళనం చేసి మనలను అనుగ్రహించు గాక.

జయ జయ సద్గురు సాయిసమర్ధ అనంతకోటి బ్రహ్మాండనాయక శ్రీసాయినాధ ప్రరబ్రహ్మణేనమః - సమర్ధ సద్గురు శ్రీసాయినాధాయ మంగళం - జయతు జయతు శ్రీసద్గురు సాయి సత్ చరిత్ర సర్వదా దిగ్విజయతం.   

 తెలుగు అనువాదం త్యాగరాజు గారు నరసాపురం

0 comments:

Post a Comment