Total Pageviews

Wednesday, June 5, 2013

మూగబోయిన పారాయణ చైతన్యం






మూగబోయిన పారాయణ చైతన్యం పారాయణ గురువు శ్రీ తిరుమల శెట్టి వేంకట సుబ్బారావు ఇక లేరు సాయి తత్త్వ ప్రచార యజ్ఞం లో నాటి దాసగణు మహరాజ్, సావిత్రిబాయి టెండూల్కర్ నుండి ఎందరివో విభిన్న మార్గాలూ, విభిన్న పంధాలూ. పాటల ద్వారా కొందరు సాయిని కీర్తిస్తూంటే, పరిశోధనల ద్వారా మరికొందరు సాయితత్త్వ రహస్యాలని వెలికి తీస్తున్నారు. ప్రవచనాలద్వారా ప్రచారాన్ని కొనసాగించేవారు కొందరయితే, నామ సంకీర్తనలద్వారామరికొందరు, లిఖిత యజ్ఞాలద్వారా, సత్యవ్రతాల నిర్వహణ ద్వారా, రచనలద్వారా, ప్రదర్శనల ద్వారా, నృత్యాలద్వారాసాయి తత్త్వ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఎందరో మహానుభావులు. వీరందరి పంధాకీ భిన్నంగా శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము అనే శ్రీ సాయి సచ్చరిత శ్రవణ పారాయణ ను ప్రాచుర్యంలోకి తెచ్చి సాయి తత్త్వ ప్రచారంలో ఒక వినూత్నమైన, విభిన్నమైన పంధాకి శ్రీకారం చుట్టి పారాయణ చైతన్య గా పిలిపించుకున్న శ్రీ తిరుమలశెట్టి వేంకట సుబ్బారావుది నలుగురూ నడిచిన దారి కాదు, వేలమందిని నడిపించిన దారి, వేలమందికి పారాయణ అలవరిచిన దారి, పారాయణనే ఆలంబనగా, పారాయణే చుక్కానిగా చేసిన దారి. ’ నాకధలూ, బోధలూ విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును, బ్రహ్మానందమునూ పొందెదరు. భక్తిశ్రద్దలతో నాకధలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకూ, తృప్తికీ యిదియే మార్గము’ . సమర్ద సద్గురుని వాక్కులను మనసా వాచా త్రికరణ శుద్దిగా తాను నమ్మి ఆచరించడమే కాక, వేలమందిచేత ఆచరింపజేయడం, అదీ పదిహేడు సంవత్సరాలుగా కొనసాగించడం సామాన్య విషయం కాదు. సచ్చిదానంద స్వరూపుని అపార కృపా కటాక్షాలవలన మాత్రమే సాధ్యపడే విషయమిది. 6 తేదీ సెప్టెంబరు1953 తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురప్పాడు లో కీర్తి శేషులు శ్రీ తిరుమలశెట్టి సూర్యనారాయణ, శ్రీమతి చంద్రకాంతమ్మ దంపతులకు మూడవ సంతానంగా, తొలి మగ బిడ్డడి గా జన్మించిన శ్రీ తిరుమలశెట్టి వేంకట సుబ్బారావు, ఇంతింతై, వటుడింతై అన్నట్టు పారాయన చైతన్య గా పరిణితి చెందిన తీరు సాయి పరిశోధకులకు పరిశోధనాంశం, సాయి చరిత్రకారులకు చారిత్రాత్మక అంశం, సాయి ఆశ్రితులకి అనుసరణీయం మరియూ సామాన్యులకు ఆశ్చర్యకరం. కాకినాడ పి.ఆర్.కాలేజి లో బి.కాం చదువుకుని 1978 లో రెవెన్యూ శాఖలో వుద్యోగంలో చేరిన శ్రీ తిరుమలశెట్టి వేంకట సుబ్బారావు1994 ఉగాది నాడు అంటే ఏప్రియల్ 11 తేదీన కొవ్వాడలో స్వగృహంలో సాయినాధుని సిమెంట్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. లౌకికంగా వృత్తి ధర్మాన్ని, సంసార భాద్యతలనీ నిర్వహించుకుంటూకూడా తొలి రోజులలోనే వాడ వాడలా సాయి ప్రచారాన్ని కొనసాగిస్తూ వచ్చిన శ్రీ సుబ్బారావు 1996 జనవరి ఒకటవ తేదీన సాయి ప్రచారంలో ఒక చారిత్రాత్మకమైనఉద్యమానికి అంకురార్పణ చేసారు, కోరిన భక్తుల ఇళ్ళ వద్ద శ్రీ సాయి సచ్చరిత పారాయణ పేరిటశ్రీ షిరిడీ సాయిబాబా జీవిత చరిత్రసామూహిక సప్తాహ శ్రవణ పారాయణ కార్యక్రమం ప్రారంభించారు. భక్తులు కోరిన మాత్రంచేత షిరిడి, కాశీ, తిరువణ్ణామలై, శ్రీశైలం, అన్నవరం, శాంతి ఆశ్రమం వంటి ఆద్యాత్మిక క్షేత్రాలలోనూ, హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ వంటి నగరాలలోనూ సామూహిక పారాయణా కార్యక్రమాన్ని కొనసాగించారు. 1997 మే నెల తొమ్మిదవ తేదీన కొవ్వాడలో షిరిడీ సాయిబాబా మందిర శంఖుస్థాపన జరిపి తొమ్మిది నెలలలో నిర్మాణం పూర్తిగావించి1998 ఫిబ్రవరి నెల 6 తేదీన సాయినాధుని పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు, మరో పద్దెనిమిది నెలలలో అంటే 1999 నవంబరు 22 వతేదీన శిఖర ప్రతిష్ట చేసారు. అప్పటినుండి ప్రతి మొదటి ఆదివారం బాబా మూలవిరాట్ పాలరాతి విగ్రహానికి భక్తులచే పంచామృత అభిషేకం, ప్రతి పౌర్ణమి నాడు సాయ సత్య వ్రతాలను నిర్వహించడం, ప్రతి ఆఖరి ఆదివారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం మరియీ ప్రతి గురువారం, భక్తులుకోరిన రోజున అన్నదానం జరుపడం మందిరం వద్ద ప్రతినెలా నిర్వహించబడుతున్న నిత్యకార్యక్రమాలు. పారాయణ పధమ్ ఒక వంక నడుపుతూనే, మరొక వంకశ్రీ సాయి సత్యవ్రతాలుకోరిన భక్తుల ఇంట జరిపించడం, సాయి దీక్షా కార్యక్రమాలను కొనసాగించడం, ఇవన్నీ లౌకిక జీవితాన్ని కొనసాగిస్తూనేసాయే ధ్యాసగా, సాయే ధ్యానంగా, సాయి వూసులతోనే ప్రతి క్షణం, క్షణ క్షణం, అనుక్షణం జీవితాన్ని కొనసాగించిన సాయి చైతన్య స్వరూపులు శ్రీ సుబ్బారావు. పారాయణలూ, సత్యవ్రతాలూ, సాయి దీక్షలకే పరిమితం కాకుండా సాయి పరిశోధకుడు శ్రీ యం.పి.సాయినాధ్ తో కలిసి 200 నుండి సాయి పధంలో ఎంతో ముందున్నామని చెప్పుకునే మహామహులకు కూడా తెలియని సాయి సమాచారాన్ని సేకరించి పుస్తకాలుగా, వ్యాసాలుగా అందించారు. సుందరీ కాండ పేరిట రాధాకృష్ణ మాయి గురించిన సమాచార పొత్తమైనా, సాయినాధుని ధుని పేరిట ధుని గురించిన గ్రంధమైనా, కళ్యాణసాయి పేరిట సాయి జీవితకాలంలోనూ, వివాహాల గురించిన సమాచారాన్నందించిన పుస్తకమైనా, చిన్ని నా బిడ్డకు శ్రీ సాయి రక్ష అంటూ సంతానార్దులూ, సంతానం క్షేమార్దుల కోసం ప్రచురించిన పుస్తకమైనా దేనికదే విలక్షణమే, అద్భుతమే. షిరిడీలో తొలిసారి గురుపూర్ణిమ జరిపిన తేదీ సేకరించడంలోనూ, సాయిబాబాని దర్శించిన తెలుగువారు గురించిన సమాచారం సేకరించడంలోనూసాయినాధ్-సుబ్బారావు ద్వయం కృషి చిరస్మరణీయం. ప్రత్తి నారాయణీయంలో సాయి వాక్సుధ శ్రీ సుబ్బారావు, శ్రీ సాయినాధ్ పరీశోధనా కాంక్షకు నిలువెత్తు నిదర్శనం. పదములు చాలును సాయి, నీ పదకమలములే పదివేలు, స్వప్న సుందరుడు సాయి, శ్రీ సాయి సత్యవ్రతం, అమృత కలశాలు, అమృత ధారలు, అమృత ప్రభోధాలు, సాయి సచ్చరిత పారాయణ ఫలితమ్ఇలా ఎన్నెన్నో, తరగని గని లాటి సమాచారాన్ని సాయి భక్తులకి అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ సుబ్బారావు. శ్రీ సాయి సచ్చరిత భావ సుమమాల పేరిట శ్రీ సాయి సచ్చరిత లోని ప్రతి అధ్యాయాన్ని గురించిన వివరణాత్మక, విశ్లేషణాత్మక, తులనాత్మక అధ్యయనాన్ని అధ్యాయాల వారిగా శ్రీ యం.పి.సాయినాధ్ తో కలిసి సంయుక్తంగా గత 2009 నవంబరు నుండి సాయి దర్శన్ పత్రికలో ధారావాహిక గా ప్రచురిస్తున్నారు. ధారావాహిక జయసాయి దైవమాసపత్రిక, సద్గురుకృప మాసపత్రిక, సాయి సన్నిధిలలో కూడా ఏకకాలంలో ప్రచురింపబడడం విశేషం. వీటికి తోడు మార్కాపూర్ నుండి వెలువడుతున్న సాయి సన్నిధి, పొదిలి నుండి వెలువడుతున్న సాయి జ్యోతి సాయి తత్త్వ మాస పత్రికలకు ప్రతినెలా రచనలనందించడమేకాకుండా పత్రికా నిర్వహణకు కావాల్సిన సలహాలను అందిస్తూ వుండేవారు, హైదరాబాద్ నుండి వెలువడు తున్న జయ సాయి దైవ మాస పత్రిక కి సంపాదక మండలి సభ్యులిగా కొనసాగుతున్న శ్రీ సుబ్బారావు సాయి సంకల్ప, సాయి వాణి, సద్గురుకృప, చెన్నయ్ నుండి వెలువడుతున్న సాయి సుధ, బెంగళూరు నుండి వెలువడుతున్న సాయిపదానంద త్రైమాసిక పత్రికలకి కూడా తమ రచనలను అందించారు. 50 పారాయణలు ముగిసిన సందర్బంగా డిసెంబరు 22, 1998 నుండి జనవరి 1, 1999 వరకు కొవ్వాడ సాయిమందిరం వద్ద సర్వశ్రీ అమ్ముల సాంబశివరావు, తోట భాస్కరరావు వంటి సాయి తత్త్వ ప్రచారకుల సమక్షంలోనూ, 75 పారాయణ ను షిరిడీ లోనూ, 108 పారాయణ ముగింపు మహోత్సవాలు డిసెంబర్ 21, 2001 నుండీ డిసెంబర్ 31, 2001 వరకూ వెదురుపాటి గాడ్ గారు, పూజ్యశ్రీ పరిపూర్ణానందస్వామీ, పరమహంస వేదానంద, మాతా జ్ఞానేశ్వరి, రావుజీ, శంకరయ్య వంటి ఆద్యాత్మికవేత్తలసమక్షంలో కొవ్వాడలోనూ, 111, 132 మరియూ ౩౩౩ పారాయణలను తిరిగి షిరిడీ లోనూ 150 పారాయణ ముగింపు వుత్సవాలను డిసెంబర్ 21, 2003 నుండి డిసెంబరు 31, 2003 వరకు పూజ్యశ్రీ పరిపూర్ణానందస్వామి, శ్రీ బషీర్ బాబా, శ్రీ చాగంటి కోటీశ్వరరావు వంటి ప్రముఖ ఆద్యాత్మిక వేత్తల సమక్షంలో కొవ్వాడలోనూ, ౩౦౦వ పారాయణ ముగింపు వుత్సవాలను మార్చి 17, 2010 నుండి మార్చి 24, 2010 వరకు పద్మశ్రీ శోభానాయడు బృందం వారిచేఅంతా సాయి మయంనృత్య నాటిక తోపాటుగా సంగీతవిభావరి మరియూ పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి, మాతా అన్నపూర్ణేశ్వరి, శ్రీ ప్రేమ్ సిద్దార్ద, శ్రీ చాగంటి కోటేశ్వరరావు, శ్రీ సాయి విశ్వచైతన్య, శ్రీ రావుజీ, శ్రీ డి. శంకరయ్య, శ్రీ హెచ్. ఆర్. లక్కరాజు, శ్రీ ఓరుగంటి రామకృష్ణ ప్రసాద్, శ్రీ ఆలూరు గోపాలరావు, శ్రీ ఆర్. హరనాధ్ బాబు మరియూ ప్రముఖ సినీ హాస్య నటుడు శ్రీ కృష్ణ భగవాన్ వంటి ప్రముఖుల సమక్షంలో కొవ్వాడ లో, 311 పారాయణ మాతా జ్ఞానేశ్వరి80 జన్మదినం సందర్బంగా అక్టోబర్ 5, 2010 నుండి అక్టోబరు 13, 2010 వరకు శాంతి ఆశ్రమంలోనూ, 335 పారాయణ డిసెంబరు 11, 2011 నుండి డిసెంబరు 18, 2011 వరకు శ్రీశైలంలోనూ విజయవంతంగా నిర్వహిస్తూరావడం శ్రీ సుబ్బారావు లోని అకుంఠిత దీక్షకి తార్కాణం. అంతేకాదు వారణాసి కి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వెంట పయనించి అక్కడ కూడా శ్రీ సాయి సచ్చరిత పారాయణ గావించిన చరితార్దుడు శ్రీ సుబ్బారావు. కార్యక్రమాల అన్నిటి వెనుక వారి దార్శనికత అడుగడుగునా గోచరిస్తూవుంటుంది. ఒక ఏదాది ముందునుండీ వుత్సవాలలో పాల్గొనే ప్రముఖుల అనుమతిని తీసికొవడం దగ్గరనుండీ, ప్రణాళికా బద్దంగా ఆహ్వానితులకు కూడా వ్యక్తిగత లేఖలను వ్రాయడంవరకూ, వుత్సవాలకు సంబందించిన ప్రతి అంశాన్నీ కూలంకషంగా శోధించి ఎవరికి భాద్యత అప్పగించాలో అన్నది నిర్ణయించుకునివ్రాసికుని పెట్టుకోవడం వారి నిబద్దత కి అద్దంపడుతుంది. పరమపూజ్య పరిపూర్ణానంద, పరమహంస వేదానంద, పూజ్యశ్రీ సత్యపదానంద ప్రభూజీ, బషీర్ బాబా, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, శ్రీ సాయి విశ్వ చైతన్య, శ్రీ కృష్ణావఝ్ఝుల రాజేంద్రప్రసాద్, బళ్ళ వెంకటేశ్వర రావు, పద్మశ్రీ శోభానాయుడు, కొంపల్లె విశ్వం మరియూ ఇంకా ఎందరో సాయి బంధువులతో శ్రీ సుబ్బారావు మమేకమయ్యారు. అందరి సాయి స్వరూపుల సహాయ సహకారాల వలనే ఇన్ని పారాయణలు చేయగలిగామని చెప్పుకున్న వినమ్రశీలి శ్రీ సుబ్బారావు. 352 పారాయణ నుండి 399 పారాయణ వరకు కొవ్వాడ లో నిర్వహించి, 400 పారాయణను షిరిడీలో సెప్టెంబరు 2, 2013 నుండి 400 మందితో నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తిచేసారు, మహానుభావులు భవిష్యత్తుని దర్శిస్తారంటారు. బహశః అందువలనేమో, సంవత్సరం ఫిబ్రవరి 18, 19, 20 తేదీలలో సుమారు 40 మంది సాయి తత్త్వ ప్రచారకుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించిన 375 పారాయణ ముగింపు వేడుకలు ఇంకా మన స్మృతి పధంలోంచి చెరిగిపోలేదు. “మరణ కాలమున మనస్సునందున్న కోరిక గాని, యాలోచన గానీ ఆవ్యక్తి భవిష్యత్తును నిశ్చయించును. భగవద్గీత 8 అధ్యాయమున 5-6 శ్లోకములలో శ్రీ కృష్ణుడిట్లు చెప్పియున్నాడుఎవరయితే వారి యంత్యదశ యందు నన్ను జ్ఞప్తి యందుంచుకుందుతోవారు నన్ను చేరుదురు. ఎవరయితే యేదో మరొక దానిని ధ్యానించెదరో, వారు దానినే పొందుదురు........అంత్యసమయమునందుమనస్సును నిలకడగా నిలుపవలెనన్నచో నిత్యము దాని నభ్యసించుటవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్రియందుంచుకుని యెల్లప్పుడు భగవన్నామస్మరణచేసినచో, మరణ కాలమందు గాబరా పడకుండా వుండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందురు. భక్తులు యోగులకు సర్వస్య శరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులగు యోగులు దారి చూపి, యంత్య కాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము.” (31 అధ్యాయము, శ్రీ సాయి సచ్చరిత్రము). మేనెల 7 వతేదీతో ముగిసిన తన జీవన యానంలోని చివరి వారం లో హైదరాబాద్ లో ప్రముఖ నటుడు శ్రీ శ్రీకృష్ణ భగవాన్ ఇంట శ్రీ సాయి సచ్చరిత్ర, శ్రీ గురుచరిత్రలు పారాయణ చేయించి అస్వస్దతకి గురయినందున షిరిడీ ప్రయాణం మానుకుని 8 తేదీన కాకినాడ కు తిరుగుప్రయాణమైనపారాయణ చైతన్యుని సికంద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కలిసిన శ్రీ యం.పి.సాయినాధ్ వారు ఎంతో మక్కువతో, ఆతృతతో వ్రాయించుకున్నమా పాండురంగడు, కరుణామయుడు సాయిచివరి అధ్యాయం వ్రాతప్రతి ని అందుకు చదివిన శ్రీ సుబ్బారావు కంట నీరొలకడం, వారి వదనం ఆనందంతో వెలిగిపోవడం శ్రీ సాయినాధ్ గమనించడం జరిగింది. (అంతకుమునుపే శ్రీకృష్ణ భగవాన్ గృహంలో ముందుభాగాలు చదివి వినిపించడం జరిగింది) తన స్నేహితుడి కుమార్తె వివాహసందర్బంగావిడుదల చేయదల్చుకున్నకల్యాణసాయిప్రచురణ కొరకు వివాహ తేదీ దగ్గరయిపోతున్నాకూడా ఆత్ర పడని శ్రీ సుబ్బారావుమా పాండురంగడు, కరుణామయుడు సాయికోసం తనని ఎంతగానో ఆత్ర పరిచారని శ్రీ సాయినాధ్ చెప్పారు. మరొక 18, 19 గంటలలో కాయం వదలబోతున్న చైతన్య స్వరూపులు శ్రీ సాయి సచ్చరిత్రము లోని 50 అధ్యాయము లోని బాలా సాహెబ్ దురంధర్ షిరిడిలో గురువారము నాడు చావడి యుత్సవము చూసు భాగ్యము కలిగినప్పుడు, హారతి సమయమందు బాబా ముఖమందు బాలారాము ధురందర్ పాండురంగని తేజస్సుని, మరునాడు కాకడ ఆరతి నందు కూడా అదే తేజస్సుని దర్శించుకున్నట్లుగామా పాండురంగడు, కరుణామయుడు సాయివ్రాతప్రతి ని హృదయానికి హత్తుకున్నారే మొ అనిపిస్తుంది. పారాయణ పారాయణ పారాయణ జీవనమంతా పారాయణతో నే గడిపిన శ్రీ తిరుమలశెట్టి వేంకటసుబ్బారావు 9వతేదీ వుదయానికి కాకినాడ చేరుకుని 386 పారాయణ ప్రారంభింపజేసి, భోజనం చేసి గురువారమ్ మధ్యాహ్నం 2 గంటల తర్వాత సాయి లో ఐక్యం కావడం 50 అధ్యాయం లోఅంత్యకాలములో నిన్ను విమానములో తీసికుని పోయెదనుఅని కాకాదీక్షిత్ కి బాబా చేసిన వాగ్దానాన్ని నిలుపుకున్న సంఘటన కి పోలివుండడం ఎంతమాత్రం అతిశ్రయోక్తి కాదు. “నా భక్తుల రక్షణ నా సమాధినుండి యే వెలువడును. నా సమాధి నుండియే నా సర్వకార్యములను నిర్విస్తాను. సమాధినుంచే నా మానుషు శరీరము మాట్లాడుతుందిఏకాదశ వచానాలలోని సాయి వాగ్దానాలు స్పూర్తి గానో, కాయం చాలించినా తను ప్రారంభించిన పారాయణ యానం కొనసాగుతున్న వైనం గమనించడానికో శ్రీ తిరుమలశెట్టి వేంకట సుబ్బారావు గారు తన రెండు నేత్రాలను దానం చేసారు. వారి పార్దివ శరీరం నుండి ఆసుపత్రిలో వారి నేత్రాలను వైద్యులు తీసి ఇద్దరు అంధులకు అమర్చేందుకు శ్రీ సుబ్బారావు వారసులు ఏర్పాట్లు చేసారు. కొండంత విషాదాన్ని దిగమింగుకుని శ్రీ సుబ్బారావు మాతృమూర్తి శ్రీమతి చంద్రకాంతం, భార్య శ్రీమతి రామకృష్ణవేణి, కుమారులు శ్రీ సూర్యనారాయణ, శ్రీశ్రీనివాస్ లూ, వారి అనుచర గణమూ అందుకు సహకరించడం శ్రీ సుబ్బారావు ఆశయాల పట్ల వారికున్న చిత్తశుద్దికి నిదర్శనం. వారి పారాయణ యానంలో అడుగులోఅడుగువేసినడిచిన ప్రతి సాయిబంధువు తరపున ఇది అశృతర్పణం. రచన: శ్రీ చాగంటి సాయిబాబా,జట్నీ, ఒడిషా శ్రీ యం.పి.సాయినాధ్, హైదరాబాద్. 18.5.2013. (శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం, కొవ్వాడ పారాయణ సభ్యులు అందించిన సమాచారమ్ ఆధారంగా).



నివాళులు
మే 9 వ తేదీ సాయంకాలం నా ఫోన్ లో వచ్చిన సందేశం నన్ను దిగ్భ్రాంత పరిచింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ సాయిమందిరం వ్యవస్థాపకులు, శ్రీ సాయి సత్యవ్రత సాధకులు, శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ ధురీణులు శ్రీ తిరుమలశెట్టి వేంకట సుబ్బారావు సాయిలో ఐక్యం కావడమే అందుకు కారణం.
ఆరంభింపరు నీచ మానవులు ...........’ అన్నారు భర్తృహరి (అనువాదం ఏనుగు లక్ష్మణ కవి). ఈ రోజుల్లో ఏ పనైనా చాలామంది తొందరగా మొదలు పెట్టేస్తున్నారు. కొందరే మొక్కవోని దీక్షతో దాన్ని కొనసాగిస్తున్నారు. మొదలు పెట్టిన దానిని నేర్పు, ఓర్పులతో కడదాకా చేస్తున్నవారు కొందరే. వారిలో కొందరు ఎవరంటే.........................
ఎన్నో సంవత్సరాలుగా సాయినామ ప్రచారమ్ చేస్తున్న శ్రీ డి.శంకరయ్యగారు, పన్నెండు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా సాయిదర్శన్ ను పట్టుకొస్తున్న శ్రీ రావుజీ గారు, ఎక్కడెక్కడో వెదకి పట్టుకుని సాయి సాహిత్యాన్ని తెలుగువారికి అందిస్తున్న శ్రీ యం.పి.సాయినాధ్ గారు, ఎస్ ఎమ్మ్ స్ సాయిబాబా గా పేరుతెచ్చుకున్న శ్రీ చాగంటిసాయిబాబా గారు, 385 పారాయణలు సామూహికంగా చేయించిన శ్రీ తిరుమలశెట్టి వేంకట సుబ్బారావుగారు సాయి మార్గంలో వీరి కృషి అంతా యింతాకాదు.
అలాంటిది ఒక్కసారిగా కొవ్వాడ సుబ్బారావుగారు మన మధ్య లేకుండాపోయారనే వార్త అశనిపాతమే అయింది. ఓర్పు, క్రమశిక్షణ, వివాద రాహిత్యం, అందర్నీ ప్రేమించడం, ఎవరిలో ఏమాత్రం ప్రతిభ వున్నా అది అందరికీ చెప్పడం, వారిని తమ కొవ్వాడ రప్పించుకోవడం, ఏ కాస్త పరిచయమున్నా వారికి ఈ రోజుల్లో కూడా పోస్టు కార్డులు రాసి పలుకరించడం ఇవన్నీ ఒక్క తిరుమలశెట్టి వేంకటి సుబ్బారావు లోనే వున్నాయి. ఆయన అద్భుత శ్రామికుడు, నిత్య కార్మికుడు, మర్మం తెలీని మానవుడు.
నెలల తరబడి శిరిడీలో వుండిపోయే నాకు చాలామంది పెద్దలు అక్కడే పరిచయమయ్యారు. వారిలో ముఖ్యులు సుబ్బారావుగారు, రావుజీ గారు. తొలి పరిచయంలోనే సుబ్బారావు గారు శిరిడీలో నాచేత సత్సంగం చేయించారు.
అప్పట్నించీ ఆపరిచయం అలా పెరిగి పెద్దదై 375 వ పారాయణ వేడుకలకు మహామహులమధ్య అతి చిన్న సాధకుడినైన నన్నూ కొవ్వాడ రప్పించింది. కొవ్వాడలో మరింత సన్నిహితులమయ్యాం.
ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కక్కడై తోచు సూర్యుడొక్కడే సమస్తజీవులకు ఆయన ఒక్కొక్క సూర్యుడిలాగ కనిపిస్తాడు. సుబ్బారావుగారూ అంతే! ఆయనతో ఏమాత్రం సాన్నిహిత్యం వున్న మనిషినైనా సుబ్బారావు గారు తనతోనే ఎక్కువ చనువుగా వుంటారు అనుకుంటాడు. అదీ ఆయన గొప్పదనం, తరగని ధనం, కృషికి ఇంధనం.
ధ్యానం, మౌనం అంటూ ఫోన్ ని అతి తక్కువగా వాడే మనిషిని నేను. అలాటిది నాకే నాలుగు రోజులలో 50-60 ఫోన్ కాల్స్  వచ్చాయి. మిగిలిన వారికి చాలా వచ్చివుంటాయి. కొవ్వాడ మందిర సభ్యులు, సుబ్బారావు గారి శిష్యులు ఒక్కసారిగా దిక్కులేని వాళ్లం అయిపోయాం సార్ అన్నారు. నేను కూడా అంటూ వారిని ఊరడించాను. సెప్టెంబరు మొదటి వారంలో శిరిడీలో 400 పారాయణ ప్లాన్ చేసారు సుబ్బారావుగారు. తప్పకుండా అది జరిపించడం ఆయన అనుచరగణం బాధ్యతే కాదు, నాలాంటి సేవకుల, సాధకుల నైతిక బాధ్యత కూడా. మంచిపని ఏదైనా సరే, మధ్యలో ఆగిపోకూడదు.
నివాశి’ అని రాస్రున్నా కానీ, నేనూ మీ వాడినే సుబ్బారావుగారూ! అయినా మీ అంతటివాడిని కాను. పోతన్నగారి భాగవతంలోని కందపద్యం నాకంఠానికి అడ్డంపడుతోంది. శ్రీ కృష్ణ నిర్యాయాణానికి వెళ్లి వచ్చిన అర్జునుడు అన్నతో అన్నపద్యం ఇది
మన సారధి, మన సచివుడు
మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడున్
మన విభుడు, గురువు, దేవర
మనలను దిగనాడి చనియె మనుజాధీశా
సాయి చరణ్ దీప్
(కొంపెల్ల విశ్వం)
చెన్నై 93.
****************************
దశాబ్దాలతరబడిగా సాయి సేవలో తరిస్తూ, పారాయణ రసాన్ని వర్షిస్తూ, భక్తిభావాన్ని స్పృశిస్తూ, సాయి తత్త్వాన్ని స్మరిస్తూ సాయి చెంతకు చేరుకున్న పారాయణ గురూజీ సుబ్బారాయా! దిక్కు మాకెవరయా?
హృదయవేధనతో
ఆర్.ఎస్.హరనాధబాబు, గుంటూరు.
*********************
అందరూ బాగుండాలనీ, అలావుండాలంటే అది ఒక సాయికే సాధ్యమనీ, అందరికీ సాయి తత్త్వమును పారాయణ అనే పాలుగా రంగరించి అందరికీ వుగ్గుపాలగా పోయడానికి తపించి, తపించీ తన తనువుని సాయి తత్త్వ ప్రచారంలో అరగదీసిన అమృతయుడు శ్రీ తిరుమలశెట్టి వేంకటసుబ్బారావు గారు. అందుకే అయ్యారు అమరజీవి. సాయి అనుగ్రహ పాత్రులు కాగలిగారు కనుకనే అమావాస్య గురువారం 9వతేదీ భోజనానంతరం మధ్యాహ్నం రెండుగంటల తర్వాత సాయిలాగే సాయి లో ఐక్యమయ్యారు. ఈ ఆశయముకొరకు తన తనువునీ, మనసునీ అర్పించి అమరులయ్యారు. వారి ఆశయసిద్ధికి నావంతు  కృషి నేనూ చేస్తానని హృదయపూర్వక నివాళులర్పిస్తున్న
సాయిసోదరి
యం. ఉషారాణి, తిరుపతి.
**************************
ఓం శ్రీసాయిరాం
శ్రీ తిరుమలశెట్టి వెంకటసుబ్బారావు 9.5.2013న సాయిసన్నిధి చేరారని తెలుపుటకు మిక్కిలి చింతించుచున్నాము. శ్రీ సుబ్బారావుగారు వారి యొక్క ఆధ్యాత్మిక జీవిత ప్రయాణములో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఆధ్యాత్మిక స్థితిలో  ఉన్నతస్థితికి చేరిన వ్యక్తి, వ్యక్తిగా ఉత్తమసంస్కారం కలిగి తనకు తాను ఆదర్శంగా వుంటూనే నలుగురికి ఆదర్శవంతముగా నిలిచినటువంటి మహోన్నతమైన వ్యక్తి.క్రియాశీలుడు,.......,నలుగురు కోసం తానున్నానని ఎప్పుడు ఇతరుల క్షేమం సాయి అంకుఠిత భక్తుడు.
శ్రీ సుబ్బారావుగారు తాను అనుకున్న పనిని శ్రద్దతో,నిబద్దతతో త్రికరణసుద్దిగా చేయడములో అందరికి ఆదర్శవంతముగా నిలిచిరని చెప్పడం అతిశయోక్తి కాదేమో. మనచుట్టు అనేకమంది సాయిభక్తులు వున్నప్పటికి ఎవరిభక్తి వారిది.వారివారి జీవనవిదానములో అనేక మార్పులకు మూలమైన సాయిదర్శనం, సాయినామస్మరణ, సాయిపారాయణ అత్యంత విలువైనదిగ భావించారు శ్రీ సుబ్బారావుగారు.
సాయినామస్మరణలో,సాయిపారాయణలో అనేకులు పునీతమైనట్లుగా శ్రీ సుబ్బారావుగారు, వారి జీవితము పునీతమైనది. శ్రీ సుబ్బారావుగారి హృదయసంకల్పం 500 సప్తాహముతో సాయినామస్మరణలో మన ప్రాంతమంతా సాయిమయం చేయాలని, ప్రతి హృదయములో సాయిని నెలకొల్పాలని దివ్యసంకల్పముతో 388 సార్లు సప్తాహం చేయించి 389 సప్తాహం పారాయణ ప్రారంభముతో సాయిసన్నిధికి చేరుకోవడంతో వారి జన్మ సార్ధకమైనదని నా భావన.
ప్రతి భక్తుడు కోరుకునేది భక్తితో కూడిన ముక్తిమార్గానే. అనేకమంది వారివారి జీవనవిదానంలో ప్రత్యేకమైన మార్పులు,చేర్పులు తెచ్చుకుంటూ,ఉత్తమోత్తమైనా ఆద్యాత్మిక జీవనం సాగిస్తున్న ఈ తరుణంలో,బాబాగారి భక్తుడు, పారయణసామ్రాట్ శ్రీ సుబ్బారావుగారి ఆత్మకు శాంతికలగాలని వారి కుటుంబానికి బాబాగారు అండగ వుండాలని, వారి జీవితం మనందరికి ఆచరణమైనదిగా భావించి వారి కుటుంబానికి సాయిభక్తులమైన మన అందరి పక్షాన వారికి సంతాపాన్ని శ్రీసాయిమాస్టర్ సత్సంగ్, HMT HILLS,KUKATPALLY తరుపున తెలియజేస్తున్నాను.

"మానవత్వం మూర్తిభవించిన వాడే మనిషి"
 మనిషిలోని మానవతకు భక్తి
 భక్తి,ముక్తి మార్గం కావలన్నదే బాబాగారి మాట"

జి.జి.రామారావు
వ్యవస్థాపక అధ్యక్షులు
శ్రీ సాయిమాస్టర్ సత్సంగ్ 
హైదరాబాద్ 
*****************************

సవినయ శ్రద్ధాంజలి
60సవంత్సరాల ముందు తెలుగువారికి శ్రీసాయిబాబా జీవితచరిత్ర అనువదించి ధన్యుడైనాడు శ్రీ పత్తి నారాయణరావుగారు. ఆంధ్రదేశమంత శ్రీ సాయిసచ్చరిత్ర పారాయణ అశేష సంఖ్యలో భక్తులచే పారాయణ చేయించి కీర్తి శేషుడైనాడు, శ్రీ తిరుమలశెట్టి వెంకట సుబ్బారావుగారు. మానవజన్మ సార్ధకత భగవంతుడుని చేరుకోవడమే.వివిధ సాధనముల ద్వారా, భగవంతుడ కృప పొందుటయే జీవితలక్ష్యం. లక్ష్యం,సంకల్పం,అంకుటితదీక్ష,పారాయణగురువు శ్రీ సుబ్బారావుగారిలో మూర్తీభవించాయి.
అనితర సాధ్యముగా బాబావారు ఆదేశించిన శ్రద్ద-సబూరితో మమేకమై శ్రీ సాయిసచ్చరిత్ర నిరంతర పారాయణ అయన జీవితగమ్యం.దానికొరకు ఎటువంటి అడ్డంకులు ఎదురైనా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వెంబడించినా,ఎదురొడ్డి తన జీవనలక్ష్యం సాదించాడు.
శ్రీ పత్తి నారాయణరావుగారు అందించిన శ్రీ సాయిసచ్చరిత్ర వైభవాన్ని ప్రసస్థ్యాన్ని అందరికి తెలియపరిచి యావథ్బారత సాయి సాహిత్యానికి వన్నే తెచ్చి అమరజీవిగా నిలబడ్డాడు. మూల గ్రంధమైన మరాటిసచ్చరిత్ర ఒకే వ్యక్తితో ఎన్ని సార్లు పారాయణ జరిగినదో తెలియదుగాని, తెలుగు సాయిసచ్చరిత్ర వేలకొద్ది సాయి భక్తులుచే పారాయణం చేయించి తెలుగు వారికి ఖ్యాతి తెచ్చారు.
ఇలా,అయన గురించి వ్రాయాలన్న, మట్లాడాలన్న, తెలుగు అక్షరములో పదాలు సరిపొవేమో అని అనిపిస్తుంది. ఇంతటి నిరంతర కృషి చేసిన సాయి భక్తుడు శ్రీ సుబ్బారావుగారు తెలుగు వారి మదిలో శాశ్వతముగా నిలిచిపోతారు.
నాన్న! నీ సేవను నేను గుర్తించాను. నీ జన్మ ధన్యమైనది. ఇక చాలు నా వడిలోకి వొడి వొడిగ రా! నా సన్నిధిలో చేరుకొ అని సాయినాధుని పిలుపు అందుకున్నాడు. శ్రీ సాయిలో ఐక్యమైనాడు. అదే శ్రీ సాయికి ప్రియమైన గురువారము రోజున.
ఆయన నడిచిన బాటలో మనము పయనించి అయన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు సాగడమే మనము అర్పించే నిజమైన శ్రద్దాంజలి.

పి.అప్పారావు, రాజమండ్రి.

*********************************
శ్రీ తిరుమలశెట్టి వెంకట సుబ్బారావుగారి ఆకస్మిక మరణవార్త గౌరవనీయులైన శ్రీ ముళ్ళపూడి సాయినాధగారి ద్వార వినగానే ఆశ్చర్యపోయాను.ఆంధ్రప్రదేశ్ సాయిభక్త బృందానికి తీరనిలోటు.వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సంతాపాన్ని తెలియపరుస్తున్నాము.
అలనాడు శ్రీ సాయిబాబా వారు శ్రీ ఉపాసని బాబాను ఖండోభ మందిరములో 4సం||లు ఉంటే నా అంతటి వాడివవుతావన్నారు. కాలపరిస్థితుల వల్ల శ్రీ ఉపాసనిబాబా 3 1/2 సం||లకే ఖండోభ మందిరం విడిచి వెళ్ళారు.
అలాగే శ్రీ తిరుమలశెట్టి వెంకట సుబ్బారావుగారు షిరిడిలో 400వ సాయిసచ్చరిత్ర పారాయణము చేయపూనారు కాని (387)వ పారాయణము శ్రీ కృష్ణ భగవాన్ గృహములో సాయి సత్సంగం 01.05.13 నుండి 07.05.13 నాడు హైదరాబాదులో పూర్తి చేసి శిరిడికి బాబా ధర్శనార్ధం  బయలుదేరవలసినవారు. అనారోగ్య కారణాల వల్ల శిరిడి ప్రయాణాన్ని రద్దు చేసి ఇంటికి తిరిగివెళ్ళారు. అందుకేనేమో "సాయిబాబావారి అష్టోత్తర శతనామావలి"లో కాలయ నమః,కాల కాలయ నమః,కాలతీతాయ నమః, కాలదర్పదమనాయ నమః అన్నారు.ఇది సాయిలీలే కదా!
ఇంకోమాట "శ్రీ సద్గురుకృప" మాసపత్రికలో శ్రీ ముళ్ళపూడి సాయినాధగారు మరియు కీ.శే.శ్రీ తిరుమలశెట్టి వెంకట సుబ్బారావుగారు కలిసి, ప్రత్తి నారాయణ గారి  సాయిసచ్చరిత్ర 32వ అధ్యాయము వరకు రామాయణ,మహాభారత , ఉపనిషత్తుల మరియు ప్రసిద్ది చెందిన కొందరి యోగుల ఉపమానాలతో చాల చక్కగ సాయిభక్తులకందించారు.మున్ముందు కూడా మిగిలిన 21 అద్యాయాలను కూడ పూజ్యశ్రీ శ్రీ ముళ్ళపూడి సాయినాధ్ గారు సాయి భక్తులు నిరాశ చెందకుండా అందిస్తారని ఆశిస్తున్నాము. వారికి శ్రీ సాయిబాబా ఆయురారోగ్యాలను ఎల్లవేళాల  ప్రసాదించి భక్తుల కోరికలు తీర్చుకాక.

సాయియాదగిరి.టి
రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు
ఆకాశవాణి
హైద్రాబాదు.
ఓమ్ సాయినాధాయ నమః
శ్రీ సుబ్బారావు గారితో మొదటి పరిచయం తిరువణ్ణామలై లో అప్పుడు వారు పారాయణ సప్తాహం జరిపిస్తున్నప్పుడు జరిగింది. వారితో బాబా గురించిన విషయములు మా దంపతులం చర్చించినాము. అదే స్పూర్తితో నెల్లూరులో మాఇంట్లో 1912 నవంబరు లో వారి సలహాతో నా భార్యా మితృల తో కలిసి పారాయణ నిర్వహించినాము. తర్వాత వారిని శ్రీ శంకరయ్య కుమార్తె పెళ్ళిలో కలిసికునే భాగ్యమ్ కలిగింది.  నేను నెల్లూరునుండి వచ్చిన మితృలను పరిచయం చేసాను. అప్పుడు వారు శ్రీ సాయినాధ సంకలీకరించిన కళ్యాణ సాయి పుస్తకములు అందరికీ పంచిపెట్టారు. అప్పటినుండి వారు ప్రతీ కార్యక్రమము గురించి మాకు తెలియ పరుస్తూ వున్నారు. ఈ మధ్య మేము షిరిడి, కాశీ యాత్రలు చేసికుని నెల్లురు వచ్చిన తర్వాత 3.5.13 న వారు పంపిన కార్యక్రమములు చూసి ఎంతో సంతోషముతో వారికి  8 వతేదీన జాబు వ్రాసినాను. ఇంతలోనే వారు సాయినాధుని చేరినారనే వార్త నేను ప్రతిరోజూ వెళ్ళే సాయి మందిరము లోనే తెలియుట సాయి లీల. నాకు ఆశ్చర్యమూ, దుఖఃము కలిగినవి. వారిని ఇంతతొందరలో ఎందుకు తీసికుని వెళ్ళారో, ఆ సాయినాధుడే చెప్పాలి.
డాక్టర్ పి.హరనాధ్,
16-3-44, రామలింగాపురం
నెల్లూరు,
8790407155

********************


సద్గురు సాయినాధ్ మహరాజ్ అందించిన శ్రద్ద, సబూరి అనే ఆయుధాలతో, జీవన సమరంలో విజయపతాకాన్ని ఎగురవేసిన కీర్తి శేషులు శ్రీ తిరుమలశెట్టి వేంకట సుబ్బారావుగారు చిరస్మరణీయులు. వారి వదనంలో ప్రస్ఫుటంగా కనిపించే అనంతమైన ప్రశాంతత, వారి మాటలలో అడుగడుగునా ప్రతిబింబించే అప్యాయతా, వారి ప్రతిపనిలో అనుక్షణం తొణికిసలాడే అనురాగం నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. సాయినాధుని అంకిత భక్తాగ్రేసురలో ఒక ధృవతార రాలిపోయింది. సాయి దర్బారు మూగపోయింది. తనలో ఐక్యంచేసికున్న సాయినాధుడే తీర్చాలని ప్రార్దిస్తూ, మనందరకూ ఆదర్శప్రాయుడైన కీర్తిశేషులు సుబ్బారావు కి హృదయపూర్వక శ్రద్దాంజలులు.
యం.కనకాచారి, హైదరాబాద్.
**************************8
ఇంకా ఎన్నో సంతాప సందేశాలు అందుతూనేవున్నాయి.

0 comments:

Post a Comment