Total Pageviews

Sunday, April 21, 2013

శ్రీ సాయి నాధుని " దివ్య మంగళ స్వరూపం "

శ్రీ సాయి నాధా !
ఆ.వె. భాను బింబ మంత ప్రజ్జ్వలత్ కాంతులు
చంద్ర బింబ మంత చల్ల దనము
నీదు శిరసు నందు నెగడొంద గంటి రా
శ్రీని వాస సయి ! శిరిడి రాజ !

ఆ.వె. ఉత్త మాంగ కాంతు లుజ్జ్వ లింపగ నీక
నెట్టన తల గుడ్డ కట్టి నావు
ప్రజ్జ్వ లించు ప్రభలు పరిహృత మయ్యేన ?
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

ఆ.వె. ఫాల భాగ మందు పారాడు శాంతమ్ము
కట్టు చేల దాచి పెట్ట లేక
మోము దమ్మి నరసి మురిసేని విరిసేని
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

కం . శ్రీ కరములు భవ హరములు
శ్రీ కేతన మెత్తి నట్లు చెలువము లై శ్రీ
లా కారము దాల్చెనొ యన
సాకారపు శృతుల గంటి జయముర సాయీ !

కం . జగతికి వెలుగులు ‌‌. అగతిక
జగతికి జగ మెరిగి నట్టి సద్గతు లై శీ
ఘ్ర గతిం గాచు కటాక్షపు
సుగతులు నీనయన గతులు శుభకర సాయీ !

ఆ.వె. తీరి విరిసి నట్టి తెల్ల దామరల లో
దూరి తిరుగు నట్టి తుమ్మెద లన
కడు మనో మైన కంటి పాపలు గంటి
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

కం . నన సంపెగ సొబగున నా
నన మున కోటేరు దీర్చు నవ్విధి సొబ గై
కొన దేరి నాసి కాగ్రము
ఘన దీక్షను జాట గంటి ఘనముగ సాయీ !

కం . అధరములో మధు రోక్తుల
సధనములో త్రిభువన హిత సంభాషణ ది
వ్య ధిషణ వేదములో యన
నధర మధుర బింబ ఫలము లరసితి సాయీ !

కం . పలు జన్మల తపమున పు
వ్వులు నీ గళ సీమ జేరు పుణ్యము బడసెన్
వలమురి శంఖమొ యన మం
గళ మయ గళ సీమ గంటి ఘనముగ సాయీ !

కం . భూజనుల కండ దండలు
ఈ జగతిని నాదు కొనగ నేర్పడినవి నీ
యాజాను బాహు దండలు
మా జన్మకు సుగతు లట్లు మాన్యుడ సాయీ !

ఆ.వె. అభయ ముద్ర దాల్చి యరచేత దక్షిణ
హస్త మెత్తి జగతి నాదు కొనెడు
నీదు చేతి చలువ పాదు కొంటిర తండ్రి !
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

కం . పాయని దయకు నిధానము
హాయికి కడ లేని చోటు అమృత మయ మౌ
నీ యేద పై తల నానిచి
హాయిగ ఏడ్వంగ నాకు ఆశర సాయీ !

ఆ.వె. ఎడమ కాలి తొడకు కుడి కాలు కీలించి
పైన నెడమ చేయి పాదు కొల్పి
కొంద రాయి నెక్కి కూర్చుంటివా తండ్రి !
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

కం . నీ పదములు శ్రీ పధములు
ఈ పృధ్వికి యెన్న దగిన యేడు గడలు మా
కాపద మొక్కుల తెరువులు
మా పాలిటి కల్ప తరులు మాన్యుడ సాయీ !

ఆ.వె. హే సమస్త విశ్వ సృష్ఠి కారక ప్రభో !
హే సంస్త ప్రాణి హృదయ వర్తి !
తే నమోస్తు దివ్య తేజో శుభాకార 1
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

0 comments:

Post a Comment