సాయితో సా యి బా ని స అనుభవాలు -- 20
ఈ రోజు సాయితో సా యి బా ని స అనుభవాలలో 20వ అనుభవాన్ని తెలుసుకుందాము.
ఈ రోజు సాయితో సా యి బా ని స అనుభవాలలో 20వ అనుభవాన్ని తెలుసుకుందాము.
సాయితో సాయి బా ని స అనుభవాలు 20శ్రీ సాయి సచ్చరిత్ర 42, 43, 44 అధ్యాయాలలో శ్రీ సాయి మహాసమాధి గురించిన వృత్తాంతము, సాయి భక్తులందరికీ తాము అనాధలమయ్యాననే భావన ఎలా కలిగిందో అంతా విపులంగా విశదీకరింపబడింది. నేను 1918 విజయదశమినాడు షిరిడీలో ఉండి ఉంటే నేను ఆయన మహాసమాధి సంఘటనను చూసి ఉండేవాడినే కదా, కాని నేను జన్మించినది 1946 లో. అందు చేత శ్రీ సాయి మహాసమాధి సంఘటన అనుభూతిని నేను పొందలేకపోతున్నానే మరి ఈ జన్మలో అటువంటి అనుభూతిని పొందాలనే కోరికతో ఉన్నాను. ఈ కోరికను సాయి నెరవేరుస్తారా అని ఆలోచించ సాగాను. ఈ ఆలోచన ఒక తెలివితక్కువ ఆలోచనగా ఎవరయినా భావించవచ్చు. కాని సాయినాధులవారు తన భక్తుల కోరికలను యెల్లప్పుడూ తీర్చడానికి సిధ్ధంగా ఉంటారు. శ్రీ సాయినాధులవారు ఈ నా కోరికను ఈ జన్మలో 1992 లో తీర్చినారు. ఆ అనుభవాన్ని మీకు ఇప్పుడు తెలియపరుస్తాను. నా పినతల్లి కామేశ్వరమ్మ, నా పినతండ్రి సోమయాజులు దంపతులకు పిల్లలు లేని కారణంగా నేను వారి వద్ద పెరిగినాను. నా తల్లితండ్రులు తమ ఉద్యోగరీత్యా ఉత్తరభారత దేశంలో ఉండేవారు. నా పినతండ్రి సోమయాజులుగారు తెలుగు పండితులు. చాలా మంది బీద విద్యార్థులకు విద్యాదానం అన్నదానం చేస్తూ ఉండేవారు. నేను వారి వద్ద నా బాల్యము అంతయు గడిపాను. ఆయన తన 78 వ ఏట 23.01.1992 న విపరీతముగా జ్వరముతో బాధపడ్డారు. వెంటనే నేను, ఆయన దత్తతకుమారుడు కలిసి వారిని మల్కాజిగిరిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించినాము. 25.01.1992 నాడు, డాక్టర్స్ అన్ని పరీక్షలు పూర్తి చేసి, ఆయన శరీరములోని ముఖ్య అవయవాలు పనిచేయటములేదని ఆయన బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. 27.01.1992 నించి ఆయన నోటిద్వారా ఏవిధమయిన ఆహారము తీసుకోలేని స్థితిలో ఉన్నారు. శ్రీ సాయి షిరిడీలో 28.09.1918 నించి జ్వరముతో బాధపడుతూ 01.10.1918 నించీ ఆయన మహాసమాధి చెందిన దినము 15.10.1918 వరకు ఎటువంటి ఆహారము తీసుకోలేదు. శ్రీ సోమయాజులుగారి దత్తత కుమారుడు తన యింటినిర్మాణము పూర్తిచేసుకుని 29.01.1992 నాడు గృహప్రవేశానికి శుభముహూర్తము నిర్ణయించుకున్నాడు. దానికి కావలసిన ఏర్పాటులన్నీ కూడా ముందుగానే జరిగిపోయాయి. ఇంతవరకు ఆ యింటినిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఖర్చుచేయడం జరిగింది. తన తండ్రి బ్రతికిఉండగా గృహప్రవేశము సజావుగా జరుగుతుందా లేదా అని అతను ఆందోళన పడసాగినాడు. ఇటువంటి సంఘటనే మనకు శ్రీ సాయి సచ్చరిత్రలో కనపడుతుంది. శ్రీ సాయి సశరీరంతో ఉన్నసమయములో గోపాల్ ముకుంద్ బూటీ ఒక లక్ష రూపాయలు వెచ్చించి బూటీవాడాని నిర్మించినాడు. శ్రీ సాయి ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న సమయములో శ్రీ సాయి ఈబూటీవాడాలో ప్రవేశిస్తారా లేదా అనే సంశయంతో ఉన్నాడు. నా మనసుకూడా శ్రీ సోమయాజులుగారు తనకుమారుడు నిర్మించిన నూతన గృహములో ప్రవేసిస్తారా లేదా అని ఆందోళన కలిగింది. అంతా సజావుగా జరిగిపోవాలని శ్రీ సాయినాధులవారిని వేడుకున్నాను. 29.01.1992 నాడు, నా పినతండ్రిని ఆస్పత్రినుండి ఆంబులెన్స్ లో తీసుకునివచ్చి గృహప్రవెస కార్యక్రమాన్ని పూర్తిచేసినాము. గృహప్రవెశ కార్యక్రమము అనుకున్నప్రకారముగా విజయవంతముగా జరిగింది. మానవుడు ఒకటి తలిస్తే దైవము మరొకటి తలుస్తాడనే సామెత ఇక్కడ జరగసాగింది. నా పినతండ్రి సోమయాజులుగారి ఆరోగ్యము క్షీణించ సాగింది. గృహప్రవేశము పూర్తి అయినతరువాత వారిని సికిందరాబాదులోని గాంధి ఆస్పత్రిలో చేర్చినాము. గాంధీ ఆస్పత్రిలో వారికి వైద్యము ప్రారంభించినారు. నేను 30.01.1992 నాడు ఉదయము గాంధీ ఆస్పత్రికి చేరుకున్నాను. నేను గాంధి ఆస్పత్రి చేరుకుని అక్కడి డాక్టర్స్ తో మాట్లాడినాను. వారు శ్రీ సోమయాజులుగారు కొన్ని గంటలు మాత్రమే బతుకుతారు అని చెప్పినారు. నేను నా పినతండ్రి దగ్గిరకి వెళ్ళినాను. ఆయన నన్ను శ్రీ సాయి సచ్చరిత్ర తీసుకుని అందులోని యధాలాపముగా ఒక పేజీ తీసి చదవమన్నారు. యధాలాపంగా ఒక పేజీ తీసి చదవసాగాను. అది 27 వ అధ్యాయము. అందులో బాబా ఖాపర్డే భార్యతో అన్న మాటలు, "రాజారం రాజారాం అని ఉచ్చరించు. ఈ విధంగా చేసిన నీజీవిత లక్ష్యం నెరవేరుతుంది. నీమనసుకు శాంతి లభిస్తుంది". ఈ సందేశాన్నే నేను వారికి తెలియచేసాను. శ్రీ సోమయాజులుగారు రాజారాం రాజారాం అని ఉచ్చరించ సాగినారు. మధ్యాహ్న్నము 12 గంటలకు మధ్యాహ్న హారతి చదివి వినిపించమన్నారు. మధ్యాహ్న ఆరతి అనంతరము వారు తిరిగి రాజారాం మంత్రము జపించసాగారు. డాక్టర్స్ వచ్చి శ్రీ సోమయాజులుగారికి అంతిమ క్షణాలు వచ్చినాయని చెప్పినారు. ఆ సమయములో వారి దత్తత కుమారుడు వారి పక్కన లేడు. నేను గాంధీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి గుడిలోకి వెళ్ళి తులసి ఆకులను తీసుకుని వచ్చి తులసి తీర్ధమును తీసుకుని ఆయన నోటిలో పోసినాను. అప్పుడు సమయము మధ్యాహ్న్నము ఒంటిగంట ముప్పయి నిమిషాలు. నా పినతండ్రి సోమయాజులుగారు రెండు గుటకలు తులసితీర్ధమును లోపలికి తీసుకుని నా ఒడిలో ఆఖరి శ్వాస వదలినారు. నేను రెండవసారి తీర్ధమును పోసినపుడు ఆ తీర్ధము ఆయన నోటినుండి బయటకు వచ్చివేసింది. 15.10.1918 విజయదశమినాడు నానాసాహెబ్ నిమొంకర్ శ్రీ సాయికి తులసి తీర్ధము ఇచ్చినారు. శ్రీ సాయికి ఆయన రెండవసారి పోసిన తీర్ధము బయటకు వచ్చివేసింది. శ్రీ సాయి దశమి ఘడియలలో మధ్యాహ్నము తన ఆఖరి శ్వాసను 2.30 నిమిషాలకు తీసుకున్నారు. శ్రీ సోమయాజులుగారు ఏకాదశి ఘడియలలో మధ్యాహ్న్నము 1.30 నిమిషాలకు తన ఆఖరి శ్వాసను తీసుకున్నారు. ఆయన ఆఖరి శ్వాస తీసుకున్న అనంతరము నేను వారి దత్తకుమారుడికి శ్రీ సోమయాజులుగారి మరణము గురించి తెలియచేసి శ్రీ సోమయాజులుగారి పార్ధివ శరీరాన్ని వారి దత్తత కుమారుడు నిర్మించిన నూతన గృహానికి తీసుకుని వెళ్ళినాము. శ్రీ సోమయాజులుగారి శరీరాన్ని నూతన గృహములో కొద్ది గంటలు ఉంచి ఆయన పార్ధివ శరీరానికి గంగా జలముతో స్నానము చేయించి, 30.01.1992 గురువారము సూర్యాస్తమయమునకు ముందుగా మల్కాజిగిరిలోని శ్మశాన వాటికకు తీసుకునివచ్చి ఆయన దత్తకుమారుని చేత దహనసంస్కార కార్యక్రమును పూర్తి చేయించినాను. తదుపరి దశదిన కర్మకాండలు పూర్తి చేయించినాను. ఈ సంఘటనలన్నిటిలోనూ ఆనాడు 1918 విజయదశమినాడు శ్రీ సాయి మహాసమాధి సంఘటనలను గుర్తు చేసుకున్నాను.
0 comments:
Post a Comment