పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద్ సరస్వతి స్వామి మహరాజ్
(టెంబె స్వామి)
టెంబె స్వామి వారి 159 జయంత్యుత్సవ (13.8.2013) సందర్బముగా
టెంబె వంశస్తులైన పుణ్యదంపతులు గణేష్ భట్, రమాబాయి లు మహరాష్ట్ర లోని మానెగావ్ కి చెందిన వారు. గణేష్ భట్ దత్తనామ స్మరణని నిరంతరం గావించుకుంటూ, తరచూ శ్రీ క్షేత్ర గాణుగాపురము వెళ్లి శ్రీ నరసింహసరస్వతి స్వామి వారిని పూజించుకునేవారు. స్వామి వారి సేవలో భట్ పన్నెండు సంవత్సరాలు గడిపారు. ’నువ్వు యికపై గాణుగాపూర్ రానవసరం లేదు. నీవు గృహస్థువి, నీయింటికి పో, నీ మనో వాంఛ నెరవేరుతుంది, నేను వచ్చి నిన్ను కలిసుకుంటాను’ అని భట్ కి శ్రీ నరసింహసరస్వతి స్వామి స్వప్నం లో భట్ ని ఆదేశిస్తారు. ఆ దంపతుల పుణ్య తత్పరతకి మెచ్చిన దత్తాత్రేయుడు ఆనంద నామ సంవత్సర శుక్ల పంచమి దినాన అనగా 1854 ఆగస్టు 13 వ తేదీన ఆ దంపతులకి కుమారుడుగా జన్మించాడు. ఆ బాలుడికి వాసుదేవశాస్త్రి గా నామకరణం చేసారు. దిన్దదిన ప్రవర్దమానమవుతున్న వాసుదేవుడు నియమానుసారమ్ ఉపనయనానంతరం సంధ్యావందనాది సంస్కారాలను , గురుచరిత్ర నిరంతర పారాయణనూ, వేదాభ్యాసమునూ కొనసాగించాడు, తన వంట తానే చేసికుంటూ భగవంతునికి నిత్యమ్ నైవేద్యమునిస్తూ వుండేవాడు. జ్యోతిష్యమూ, సంస్కృతమూ నేర్చుకున్నాడు. తన 21 యేట అన్నపూర్ణాబాయి ని వివాహమాడాడు. నిష్టతో కూడిన సాధన వలన వాసుదేవుని మాటకి ’మంత్ర సిద్ధి’ యేర్పడి కష్టాలనుండి, దుఖా:ల నుండి ప్రజలకి వుపశమనం కలిగేది.
నిరంతర శ్రీగురుచరిత పారాయణ వలన వాసుదేవునికి దత్రకటాక్షమ్ అపారంగా వుండెడిది. ఒకసారి వాసుదేవుడు ఒక అడవిమార్గం గుండా వెడ్తున్నప్పుడు ఒక పులి ఎదురైంది, భయపటిన వాసుదేవుడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. దత్తుడు ఆత్మారామ్ జడియే అనే ధైర్యశాలి రూపంలో వచ్చి అయనని రక్షించాడు. నర్సోబా వాడికి వెళ్ళాలని తన ప్రగాడ వాంఛను ఆయన తల్లి అంగీకరించలేదు. ’నీ తల్లి నీవు నర్సోబా వాడికి వెళ్లడానికి అనుమతిస్తుంది, అందుకు కావాల్సిన వనరులు నీకు సమకూరుతాయి, నీవు నర్సోబావాడికి వెళ్లు’ అని ఒక బ్రాహ్మణ బాలుడి రూపంలో దత్తుడు వాసుదేవుడిని స్వప్నంలో ఆదేశిస్తాడు. మరునాడు వుదయానికల్లా అన్నీ సమకూరుతాయి, వాసుదేవుడు ’బోరుగావ్’లో విశ్రమిస్తాడు. ’నర్సోబా వాడిలో వున్న గోవిందస్వామి అనే యోగిని దర్సించుకోమ’ ని ఎవరో ఆదేశించినట్లుగా స్వప్నిస్తాడు వాసుదేవుడు. జీర్ణ వస్త్రాలతో వున్న వాసుదేవుడిని మండపందగ్గర పురోహితులు అడ్డగిస్తారు. ’మండపం దగ్గర యేమి జరుగుచున్నదో చూడు, యెంతోదూరం నుండి వచ్చిన పేదబ్రాహ్మణుని పురోహితులు గుడిలోనికి అనుమతించడంలేదు’ అని దత్తుడు ప్రక్కనే మఠంలో వున్న గోవిందస్వామిని ఆదేశిస్తారు, గోవిందస్వామి మాటమీద పురోహితులు వాసుదేవుడిని గుడిలోనికి అనుమతిస్తారు. అక్కడి పాదుకలను వాసుదేవుడు నిరంతరం ఒక మాసం పాటు వాసుదేవుడు పూజించుకుంటాడు. ’మిరాజ్ లో వున్న శంకర భట్టు నుండి శ్రీ గురుచరిత్ర తీసికుని పారాయణ చేయమ’ ని స్వప్నాదేశమిస్తారు దత్తుడు వాసుదేవునికి. శంకర భట్టు ఎవరికీ తన గురుచరిత్ర గ్రంధాన్ని ఎవరికీ యివ్వడు, అందువలన దత్తుడు శంకరునికీ స్వప్న దర్శనమిచ్చి ఆ గ్రంధాన్ని వాసుదేవునికిమ్మని ఆదేశిస్తారు. వాసుదేవుడు శ్రీ గురుచరిత్రని నిరాహారంగా సప్తాహ పారాయణ చేస్తాడు. కొంతకాలం తర్వాత గోవిందస్వామి దత్తోపాసన చేయమని వాసుదేవునికి చెప్తారు. ’అగ్నినీ మరియు సూర్యుడ్నీ మనం వుపాసిస్తూనే వున్నాము కదా, మరి అదనంగా దత్తోపాసన యెందుకు?’ అని ప్రశ్నిస్తాడు వాసుదేవుడు. ఆ రాత్రి దత్త భగవానుడు గోవిందస్వామికి స్వప్నంలో మంత్రపదేశం చేస్తారు. తటాలున లేచిన గోవిందస్వామి ’వాసుదేవ శాస్త్రీ! దత్తు భగవానుడు మంత్రాన్నుపదేశించారు, యెలా సాధన చేయాలో నీకు వుపదేశిస్తాను’ అంటారు. గోవిందస్వామి మరియూ శ్రీ దత్తుడూ ఒక్కరే అని గ్రహించిన వాసుదేవుడు గోవిందస్వామి ని తన గురువుగా స్వీకరించి సాధన ప్రారంభిస్తాడు.
ఒక నాడు దత్తభగవానుడు వాసుదేవుడ్ని మానెగావ్ లో ఏడు సంవత్సరాలుండమని ఆదేశిస్తారు. దారిలో ’కగల్’ అనేగ్రామం లో దత్తభగవానుని విగ్రహం కొనడానికి ఆగిన ఆయన వద్దకు అకస్మాత్తుగా ఒక శిల్పి వచ్చి ’గత రాత్రి స్వప్నంలో దత్తభగవానుడు ఈ విగ్రహాన్ని తమకి ఇవ్వమని ఆదేశించార’ ని చెప్పి దత్త విగ్రహాన్నిస్తాడు. మానేగావ్ చేరిన వెంటనే ఒక విధవ రాలు వచ్చి కొంతభూమి ని ఇచ్చి ’తన భర్త స్వప్నంలో కనిపించి ఆ భూమిని వాసుదేవునికి ఇమ్మ’ ని చెప్పాడని అంటుంది. వాసుదేవుడు ఆలయాన్ని నిర్మించి దత్తభగవానుని ప్రతిష్టిస్తాడు, ఎప్పుడూ ప్రసన్న మూర్తిగా వుండే ’శ్రీ దత్తుని’ మూర్తితో వాసుదేవుడు సంభాషిస్తూ వుండేవాడు.
దత్తజయంతి రోజున వాసుదేవుని బంధువు మరణిస్తాడు, వుత్సవాలకి ఆటంకంకలుగుతుందని ఆవిషయం దాచిపెడతారు. వుదయమే ఆలయంలోకి వెళ్ళిన వాసుదేవుని తో ’శివ శివా! నన్ను తాకకు, నువ్వు మైల పడ్డావు’ సర్వజ్ఞుడైన దత్తుడు పలుకుతాడు. మరొకసారి ఆప్రాంతంలో చంద్రగ్రహణం కనిపించదని ఆలయం లో నిత్య పూజలూ, నైవేద్యాలూ నిర్వహించాలని పురోహితులు నిర్ణయించుకున్నప్పుడు దత్తుడు వాసుదేవునికి స్వప్నదర్శనం లో ’రేపు గ్రహణం కనిపిస్తుంది, నిత్య భోగాలు నిర్వహించవద్దు’ అనిఆదేశిస్తారు. మరునాడు అది నిజమవుతుంది. మరొక సారి వాసుదేవుడు తన తల్లితో నర్సోబావాడిలో ఒక సత్రంలో వున్నప్పుడు ’ఈ సత్రం పూర్తిగా నాశనమైపోయింది, తక్షణమ్ ఇక్కడనుండి వెళ్లిపొండి’ అని దత్తుడిచ్చిన స్వప్నాదేశంతో బయటిపడిన వెంటనే ఆ సత్రం కూలిపోతుంది.
దత్తుని ఆదేశాన్ననుసరించి వాసుదేవుడు శ్రీ గురుచరిత్రని మరాఠినుండి సంస్కృతములోనికి అనువదించి దత్తుని ఆదేశించినట్లుగానే ’ద్విసహస్రి’ అని పేరుపెడ్తారు, అయినా 200 శ్లోకాలకన్నా తక్కువున్న శ్రీగురుచరిత్ర సంస్కృత గ్రంధానికి ’ద్విసహస్రి’ వి అని పేరిడేందుకు సందేహిస్తాడు. ’దేవి సప్తశతి’ లో కూడా సగం శ్లోకాలు, మిగిలిన సగం శ్లోకార్దాలూ వుండడాన్ని దత్త భగవానుడు గుర్తుచేసి వాసుదేవుని సందేహాన్ని తొలగిస్తారు.
ఒక సారి భార్యతో కలసి తీర్ఠయాత్రలకి పోతున్న వాసుదేవుడు ’గంగాఖేడ’ లో స్వప్నదర్శనమిచ్చి ’ఈరోజు నుండి నాలుగోరోజున మీ ఇద్దరినీ నాలో కలుపుకుంటాను’ అని చెప్తాడు. వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించే వాసుదేవుడు తనకు సన్యాసమ్ స్వీకరించాలని వుందనీ, తన భార్యని తీసికుని వెళ్ళమని భగవాన్ దత్తుని వేడుకుంటాడు. ఆమె కలరా వలన మరణిస్తుంది. కర్మకాండలన్నీ పూర్తయిన రాత్రి దత్తాత్రేయుడు వాసుదేవునికి స్వప్నంలో ఆయన గురువు గోవిందస్వామి రూపంలో దర్శనమిచ్చి, వాసుదేవుని కుడిచెవిలో ’ఓమ్’ అని ఉపదేశించి, ఎల్లవేళలా ఆ మంత్రాన్ని జపించమనీ, బిక్షతో మాత్రమే జీవించమనీ ఆదేశిస్తారు. మరునాడు వుదయం వాసుదేవుడు గోదావరి ఒడ్దుకు వెళ్ళి సన్యాసాశ్రమ స్వీకరణ కి వలసిని క్రతువులన్నీ ఎందరో బ్రాహ్మణుల సమక్షంలో ఏర్పాట్లు చేస్తారు, ఎవరైనా యోగ్యుడైన పుంగవుడు ఎవరైనా వచ్చి తనకి సన్యాసాశ్రమాన్ని ఉపదేశించాలని వాసుదేవుడు అభిలషిస్తాడు. ఇంతలో ఎవరో పిలిచినట్లుగా గోదావరి ఒడ్డునుండిఒక సన్యాసి వచ్చి సన్యాసాశ్రమానికి వలసిన క్రతువులు నిర్వహించి, వాసుదేవునికి సన్యాసాశ్రమ ధర్మాన్ని వుపదేశించి మాయమైపోతాడు. క్రతువులన్నీ నిర్వహించిన తర్వాత వాసుదేవుడు తనకి సన్యాసాశ్రమాన్ని వుపదేశించిన సన్యాసి కి భిక్ష సమర్పిద్దామని వెతికితే వారు కనిపించరు. అందరూ సాక్షాత్ దత్తాత్రేయుడే ఆ రూపంలో వచ్చి వాసుదేవునికి సన్యాసాశ్రమ ధర్మాన్ని వుపదేశించారని భావిస్తారు. ఆతర్వాత ఉజ్జయిని లో నివసించే పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ నారాయణానందసరస్వతీ స్వామి వారి వద్దనుండి పవిత్ర దండాన్ని పొందవల్సిందిగా దత్తభగవానుడు వాసుదేవుడిని ఆదేశిస్తాడు. వీరు సమర్ద సంప్రదాయానికి చెంది కరంజీ లో నివసిస్తుండే స్వామి నరసింహసరస్వతి వారి కుటుంబానికి చెందిన వారు. అప్పటినుండి వాసుదేవుడు శ్రీ మద్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద సరస్వతి మహరాజ్ గా ప్రాచుర్యము పొందారు. వీరు టెంబే కుటుంబీకులవడంచేత టెంబేస్వామి అని కూడా వీరిని పిలుస్తారు. ఉత్తారాది నుండి దక్షిణాది వరకు నడకతో యాత్రసాగించి 24 చాతుర్మాసాలు పాటించారు. వారి బోధనలు, రచనలూ, వారి గొప్పదనము వలన వారు దత్త భగవానుని అవతారమేనని నిరూపితమైనది.
మహరాజ్ ఒక సారి కాశి వెడుతూ అడవిలో దారి తప్పి, దగ్గరలో ఏ గ్రామమూ కనిపించనపుడు, దత్త భగవానుడు ఒక కొండ పిల్లవాని రూపంలో వచ్చి దారిచూపి దగ్గరలోని ఒక గ్రామందగ్గర వదులుతారు. బ్రహ్మావర్తమ్ లో చాతుర్మాస వ్రతము సమయయాన ఋగ్వేదం వలె 3505 శ్లోకాలతో దత్తపురాణాన్ని సంస్కృతములో రచించారు. అలాగే హిమాలయాలలోని బదరీకి వెడుతున్నప్పుడు మంచుకొండ వారి దారిని అడ్డగించినప్పుడు, ఇద్దరు వ్యక్తులు ఆ మంచు కొండలోనుండి వచ్చి ఆవల వైపు దారి లేదనీ, మంచుని దాటడం ప్రమాదమనీ హెచ్చరిస్తారు. నారాయణ దర్శనమ్ చేసికోకుండా వెనుదిరిగేది లేదన్న మహరాజ్ సమాధానాన్ని విన్న ఆ ఇద్దరూ మాయమైపోతారు. వారిద్దరూ ఎవరైవుంటారా అని మహరాజ్ ఆశ్చర్య పోతుండగా, నరుడూ, నారాయణడూ ఆయనకి కొద్ది క్షణాలపాటు కొద్ది దూరంలో దర్శనమిస్తారు.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ వద్దనున్న ’పెథ్లాద్’ లో చాతుర్మాస సందర్బంగా మరాఠీ భాషలో ఒవి చందస్సులో 1000 పద్యాలతో దత్తలీలామృతసింధువు అనే కావ్యాన్ని రచించారు. అక్కడవున్న సమయంలో నరక చతుర్దశి ముందురాత్రి ’రేపు నన్ను అభషేకించుమ’ని దత్తుడు స్వప్నంలో మహరాజ్ ని అడుగుతారు. ’నేను సన్యాసిని, వేడి నీరూ, సుగంధ ద్రవ్యాలూ నేనెక్కడినుండి తేగలను? దానికి బదులుగా నిన్ను విభూతితో అభిషేకిస్తాను’ అని జబాబిస్తారు మహరాజ్. మరునాడు వుదయం అలాగే విభూతితో అభిషేకించి, పీఠంమీద విగ్రహాన్ని వుంచి భిక్షకు వెడ్తారు మహరాజు. భిక్షతో తిరిగొచ్చిన మహరాజుకి అశరీర వాణి వినిపిస్తుంది ’ఈరోజు దీపావళి పర్వదినమ్, నన్ను అభిషేకించలేదు, ఇప్పుడు నైవేద్యం పెట్టడానికి వచ్చావు. ఇక్కడెవరూ నీ నైవేద్యం కోసం ఎదురుచూడడం లేదు. ఇదిగో నేను వెళ్లిపోతున్నాను, నదిలోకి’. విగ్రహం అక్కడలేదు, మహరాజు వెంటనే నది ఒడ్డుకు పరిగెత్తారు, విగ్రహం కోసం వెతుకుతున్నప్పుడు, నీటి అడుగునుండి ఒక పసిపాప ఏడుపు వినిపిస్తుంది. నీటివైపు చూసిన మహరాజు కి నీటిలో మెరిసిపోతూ విగ్రహం కనిపిస్తుంది. మహరాజ్ విగ్రహాన్ని పసిపాపను ఎత్తుకుని వచ్చినట్లుగా ఆలయానికి తీసికుని వస్తారు. ఇంతలో గ్రామ వాసులు అభిషేకానికి కావల్సిన ఏర్పాట్లు చేస్తారు. అభిషేకం పూర్తవుతుంది. సన్యాసివయివుండి విగ్రహారాధననెలా చేస్తున్నావన్న ప్రశ్నకి మహరాజ్ ’ప్రతివారూ సగుణొపాసన చేయాలి, యెందుకంటే శాస్త్రాలన్నీ సగుణొపాసనని సమర్ధిస్తున్నాయి. రాజశాసనం వలె శాస్త్రాలను అనుసరించాలి, రాజు రాజభవనంలోనే నివశించాలి, సామాన్యుడిలా జీవిస్తానంటే ఆయనకి తగిన గౌరవమ్ లభించడు. అలాగే రాజాధిరాజైన దత్తభగవానుడ్ని ఆరాధించాలి, మరేవిధంగా రాజాదిరాజుకి మన ఆరాధన ని సమర్పించుకోగలము? సగుణొపాసన చేయకుండా నిర్గుణొపాసన అనే సర్వొత్కృష్టమైన జ్ఞాన సముపార్జన అసాధ్యం’ అని మహరాజ్ సగుణొపాసన ప్రాముఖ్యతని బోధించారు.
గిర్నార్ పర్వతముపై పాదుకలను దర్శించుకున్న ప్రభాశతీర్థానికి వచ్చారు. ఇక్కడ దత్తభగవానుని ఆదేశంతో ’ద్విసహస్రి’ గురుచరిత్రి మొదటి తొమ్మిది అధ్యాయాలపై భాష్యం వ్రాసారు, తన దగ్గర మానేగాం లో వ్రాసిన మూలగ్రంధం లేకపోయినా భాష్యాన్ని పూర్తిచేసారు. ద్వారకలో మిగిలిని 14 అధ్యాయాలపై భాష్యం వ్రాసారు. మూల గ్రంధం లేకపోయినా ’ద్విసహస్రి’ గురుచరిత్ర పై భాష్యం పూర్తిఅవడం తన వలన కాని పని అనీ, దత్తభగవానుడే ఆపనిని పూర్తిచేసారని మహరాజ్ చెప్పారు. మహత్పురా లో చాతుర్మాస సమయంలో స్థానిక మాండలికంలో దత్తపురాణంలోని లీలలన్నీ ’దత్తమహత్మ్యం’ పేరున వ్రాసారు. అదే సమయంలో ’త్రిశతి గురుచరిత్ర్’ పేరుతో మూడువందల శ్లోకాలు వ్రాసారు.
ప్లేగుతో బాధపడుతూ మృత్యుముఖాన వున్న కర్ణాటక బ్రాహ్మణుడు అప్పా నిగిదీకర్ ప్రగాఢమైన కోరిక ను తీర్చడానికి ఆయనకి మహారాజ్ తక్షణ సన్యాసాన్ని ఉపదేశించారు. పద్మాసనమ్ లో ఆసీనులై వుపదేశముని స్వీకరిస్తూ ’ఓమ్’ కారాన్ని జపిస్తూ చివరి శ్వాస విడిచారు అప్పా. టెంబె స్వామి వంటి మహాయోగి పుంగవులైన సద్గురువులు మాత్రమే మరొకరికి సర్వోత్కృష్టమైన నిష్క్రమణ ని ప్రసాదించగలరు. తరువాత మహరాజు కూడా ప్లేగుకి గురయ్యారు. దత్తభగవానుడు ఆసమయంలొ ఆయనని ఆరువేల ఏడువందల ఏబది శ్లోకాల ’సమ శ్లోకి గురు చరిత్ర’ ని సంస్కృతమ్ లో వ్రాయమని మహరాజ్ ని ఆదేశించారు. తీవ్రమైన అనారోగ్యముతోనైనా మహరాజు ఆ బృహత్కార్యాన్ని పూర్తిచేయగలిగారు, దత్త భగవానుని కృపవలన.
వాడి మీదుగా ఉత్తరాదికి వెడుతూ గాణుగాపురమ్ సమీపములోని కమలాపూర్ లో మహరాజ్ ఆగారు. ఆరాత్రి ఒక భారీ ఆకృతి తో చేతులు మోకాళ్లకి తగులుతున్న వ్యక్తిని స్వప్నించారు మహరాజు. ’నీవు దేశమంతా తిరుగుతున్నావు, నన్నసలు పట్టించుకోవడంలేదు’ అన్నారావ్యక్తి. ’ఆయన ఎవరా’ అని తెలిసికొనగోరి దత్తుడ్ని ప్రార్దించారు మహరాజ్. ’ఆయననే ఎరుగవా? వారు అక్కల్ కోట స్వామి. ఆయన వద్దకు నిన్ను రప్పించుకుని ఆయన చరిత్ర వ్రాయించుకోవాలన్నది ఆయన కోరికేమొ’ అని జవాబిచ్చారు దత్త భగవానుడు. ’నా రుచులన్నీ దత్తభగవానుని దివ్యపాదపద్మములకే అంకితము. వారి గొప్పతనాన్ని తమరు నాకు వెల్లడిస్తే వారి గురించిన గ్రంధం వ్రాయగలను’ అన్నారు మహరాజ్. కమలా పూర్ నుండి పండరీ పురము ముందుగా వెళ్లి అక్కడనుండి గాణుగాపురము వెళ్ళవలెనని మహరాజ్ అనుకున్నారు. కానీ దత్త భగవానుడు ’అక్కల్ కోట మీదుగా గాణుగా పురము వెళ్ళుము, అక్కడ పాదుకలని దర్శించుకుని మూడురోజులు అక్కడే వుండము, అక్కడ భక్త తుకరామ్ గతమూడు సంవత్సరాలుగా నాదర్శనమునకై కేవలం ఫలాలను సేవిస్తూ వేచియున్నారు, ఆయనకి నీద్వారా నాద్వారా దర్శనమిస్తాను, అందువలన అలా వెళ్లమ’ ని ఆదేశించారు. మార్గమధ్యంలో అతిసారవ్యాధికి గురైనా మహరాజు తన ప్రయాణాన్ని కొనసాగించి అక్కల్ కోట లో స్వామి సమర్ధ ని దర్శించుకుని, షేగాన్ వెళ్లి గజానన్ మహరాజ్ ని దర్శించుకున్నారు. గజానన్ మహరాజ్ చరితము లో ఈ సంగతి వుటంకించబడింది.
తన పదునాలుగవ చాతుర్మాస దీక్షను మహరాజు నర్సి అనేగ్రామం లో సాగించారు. ఆయన అనుగ్రహ భాషణం వినడానికి వచ్చిన భక్తులతో ఆ ప్రదేశమ్ నిండి పోవడంతో వారి దర్శనం కావడం కష్టతరమైంది. అప్పుడు మహరాజు రెండురూపాలను ధరించి ఆవరణ లోపల వేదికపైనా, వెలుపల రావి వృక్షం దిగువన కూర్చుండి రెండుచోట్లా దర్శనమిచ్చారు.
బరోడాలోని గరుడేశ్వర్ లో నర్మదా నదీతీరంలో మహరాజు విడిది చేసివున్నప్పుడు కొందరు ముస్లీము భక్తులు తమ బాధలను చెప్పు కోవడానికి మహరాజ్ ను దర్శించుకున్నారు. ప్రతిరోజూ పఠిస్తూవున్నా తమకే తెలియని పవిత్ర్ ఖురాను లోని కొన్ని కల్మానులను మహరాజు నోటివెంట విన్న వారు ఆశ్చర్యపోయారు.
ఒక సారి మహరాజ్ తన పాదయాత్రలో శృంగేరీ శంకరాచార్యులు శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారిని దర్శిమ్చుకున్నారు. మహరాజ్ ని సత్కరించిన శంకరాచార్యులు ’ఈ యోగి పుంగవుడు మానవ రూపంలో అవతరించిన దత్తాత్రేయుడే’ అని చెప్పారు.
మహరాజ్ తన దేశాటన లో భాగంగా ఆంధ్రపదేశ్ లోని తిరుపతి, శ్రీ కాళహస్తి, వెంకటగిరి, నెల్లూరు, శ్రీశైలం లను దర్శించారు. 1908 వ సంవత్సరంలొ ’ముత్యాల’ లో చాతుర్మాస దీక్షని ముగించిన తర్వాత హంసలదీవి కి వచ్చి సముద్రస్నానం చేసారు. మచిలీపట్నం గుండా ప్రవహించే సప్తగోదావరి ని దర్శించుకున్నారు. 1910 వ సంవత్సరం లో రాజమహేంద్రవరం (నేటి రాజమండ్రి) లో శృంగేరీ శంకర మఠ తీరాన దత్తాత్రేయుని విగ్రహాన్ని ప్రతిష్టించి ’భక్త వత్సలుడు’ అని పేరుపెట్టారు. వారు రాజమండ్రిలో విడిది చేసిన కాలంలో నాందేడు నుంది పుండలీకరావు అనే భక్తుడు తన స్నేహితులతో వచ్చి మహరాజు ని దర్శించుకున్నాడు. పుండలీక రావు తిరుగుప్రయాణమవుతుండగా మహరాజ్ ఒక కొబ్బరికాయని రావుకిచ్చి ’దీనిని షిరిడీలో వున్న నా సోదరుడు సాయిబాబా కి నా తరపున సమర్పించండి. నన్ను మరువవద్దనీ, నన్ను ప్రేమతో గుర్తుతెచ్చుకుంటూ వుండమనీ మనవి చేసానని చెప్పండి. యోగులు ఎవరికీ నమస్కారము చేయరు, కానీ సాయిబాబా సంగతి వేరు’ అన్నారు. షిరిడీ చేరుకున్న రావు బృందమును వారు ఏమీ చెప్పకముందే ’నా సోదరుడిచ్చిన కొబ్బరికాయ యేది’అని ప్రశ్నిస్తారు. దారిలో జరిగినది వివరించి రావు మరొక కొబ్బరికాయ తెస్తానని అంటాడు. ’నా సోదరుడిచ్చిన ఆ కొబ్బరి కాయకి సాటి ఏదీరాదు’ అంటారు. సనాతన సంప్రదాయ పరాయణుడైన పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద సరస్వతీ మహరాజ్ మరియూ హిందువో, ముసల్మానో తెలియని, ఆహార్యంలో ముస్లీమనిపించే సమర్ధ సద్గురు సాయినాధ మహరాజు లు ఇరువురూ ఒకరినొకరు సోదరులు గా పిలుచుకోవడం ఆసక్తిని కలిగిస్తుంది.
ఆ తర్వాత స్వామి కాకినాడ సముద్రములో స్నానించి పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురం గ్రామవాసులు తమ గ్రామం దత్తావతారుడు శ్రీ పాద శ్రీవల్లభులవారి జన్మ స్థలమన్న సంగతిని మర్చిపోయివుండదాన్ని గ్రహించిన మహరాజ్ పిఠాపురం ప్రాముఖ్యతని ప్రజలకి వివరించారు. మహరాజ్ ఆంధ్రదేశ పర్యటన ఆంధ్ర ప్రాంతములో దత్త సంప్రదాయ విస్తరణ కి ప్రధాన కారణమైంది.
దేశమంతా పాదచారియై పర్యటించిన మహరాజ్ దత్తసంప్రదాయ సర్వోత్కృష్ణత ను చాటారు.రోగులను, ఆర్తులను, పాముకర్చిన వారిని, దెయ్యాలు పట్టిన వారిని రక్షించడమే కాకుండా అందరినీ విపత్తుల బారినుండికూడా కాపాడారు. దత్తపురాణాన్ని, శ్రీగురుచరిత్రనీ ప్రాచుర్య పరిచారు. నరసింహసరస్వతి స్వామి వారి కాలంనుండీ నాలుగువందల సంవత్సరాల పాటు మరాఠీ భాషకే పరిమితమై వున్న శ్రీ గురుచరిత్రను 1903 లో మహరాజు సంస్కృతము లోనికి అనువదించిన తర్వాతనే తెలుగుతో సహా మిగిలిన భారతీయభాషలకి అందుబాటులోనికి వచ్చింది. ఇష్టదైవము పట్లవున్న భక్తిని గురువువైపు మరలించడాన్ని శ్రీ గురుచరిత్ర బోధిస్తుంది. ఈ ఆధాత్మక విజయం లో మహరాజ్ పాత్ర అప్రతిహతం. విగ్రహారాధన అపరిపక్వమైనదనీ, ధ్యానం మాత్రమే సర్వోత్కృష్టమైన సాధన అనే ధ్యాన సాంప్రదాయవాదుల వాదనకి దత్తాత్రేయుని అవతారంగా ఆరాధించబడిన ఆధ్యాత్మిక ప్రపంచంలోని సర్వోన్నతమైన స్థానాన్నధిష్టించిన శ్రీ వాసుదేవానంద సరస్వతి విగ్రహారాధనని వదులుకోకపోవడం, దత్తభగవానుడు కూడా అందుకు సమ్మతించడం సమాధానంగా భావించుకోవచ్చును.
ముందుగానే సూచించినట్లుగా దత్త భగవానుని ముందు ఆసీనులై ఆషాఢ శుక్ల పాడ్యమి రోజు న 1914 లో మహరాజు తన శరీరాన్ని వదిలారు. సస్యాసాశ్రమ సంప్రదాయానుసారం వారి శరీరాన్ని నర్మదా నదిలో వదిలారు. బరోడాకి 70 కిలోమీటర్ల దూరంలో వారి శరీరం విడిచిన ప్రదేశంలో సమాధి గరుడేశ్వర్ కి సమీపంలో వారి సమాధిమందిరం నిర్మించబడింది. దత్త సంప్రదాయంలో ఆప్రదేశం ఒక పుణ్యక్షేత్రం.
జైగురుదేవ దత్త
0 comments:
Post a Comment