శ్రీసాయి పిచ్చి ఫకీరులా కన్పించినా, వారి దివ్య లీలలెన్నో ఆకాశంలో నక్షత్రాలలా, సముద్ర తీరాన యిసుక రేణువులలా, మనస్సులో పుట్టే ఆలోచనలలా భక్తులకనుక్షణమూ అనుభవమవుతూ, వారి హృదయాలను పులకింప జేస్తుండేవి. అవి ఆయన ప్రయత్నంతో ప్రదర్శించినవి గాక పువ్వులకు పరిమళంలాగా, ఆకాశంలోని సంధ్యారాగంలా ఎంతో సహజంగానూ, సందర్భోచితంగానూ వుండేవి. వజ్రాల హారంలోని బంగారు తీగలా, పూలమాలలోని దారంలా
యీ లీలలన్నింటిలో శ్రీసాయినాథుని సర్వజ్ఞత్వం అడుగడుగునా తొంగిచూసు వుంటుంది. దానిని గుర్తుంచు కోగలవారు ఎవరినీ ఏమీ అడగనక్కరలేదు.
సదాశివ్కు ఉదయం 9 గంటలకే భోజనం చేయడం అలవాటు. కనుక ఆ రోజు 11 గంటలు కావటంతో అతనికెంతో ఆకలిగా వుంది. కాని అతడు బిడియంతో మశీదులోనే కూర్చుండిపోయాడు. ఇంతలో ఒక భక్తుడొచ్చి బాబాకు పాలకోవా సమర్పించాడు. సాయి దానిని ఆత్రంగా అందుకొని సదాశివ్ కు ఒక బిళ్ళ విసిరారు. అతడు దానిని ప్రసాదంగా యింటికి తీసుకెళ్ళాలనుకున్నాడు. "అది నీకిచ్చింది చేతిలో పట్టుకోవడానికి గాదు!" అన్నారు బాబా. అది తిన్నాక అతనికి మరో బిళ్ళ విసిరారు. అతడది యింటికి ప్రసాదంగా వుంచుకోగానే మరల సాయి అలానే అన్నారు. అదికూడా తినగానే అతనికి ఆకలి తీరింది.
ఒకసారి హరిభావూ తన తల్లికి చెప్పకుండా రామేశ్వరం బయలుదేరి, దారిలో శిరిడీ వచ్చాడు. సాయి అతని వద్దనున్న డబ్బంతా దక్షిణగా తీసుకొని, 'ఇంటికి వెళ్ళు, రామేశ్వరం నీ కోసం పస్తుంది. నీవు వెళ్ళకుంటే మరణిస్తుంది' అన్నారు. అతడిలు చేరేసరికి అతని తల్లి నిరాహారియై, ‘బాబా, నీవు మహాత్ముడివైతే నా బిడ్డ తిరిగి రావాలి' అని రోజూ ప్రార్ధిస్తున్నదని తెలిసింది. తల్లి రామేశ్వరమంత పవిత్రమైనదని బాబా భావం.
సారే శిరిడీలో తానుకొన్న స్థలం చూడ్డానికి తన భార్యను బయలుదేరమన్నాడు. ఇంతలో అతని మామగారు, ఆడపిల్ల స్థలం చూచేదేమిటని అడు చెప్పడంతో ఆమె రానన్నది. తన మాట కాదన్నదన్న కోపంతో ఆమెను కొట్టడానికి కొరడా తీసుకున్నాడు సారే. ఆ క్షణమే అతనిని మశీదుకు రమ్మనమని బాబా కబురు పంపారు. అతడు వెళ్ళగానే ఆయన, "ఏమిటి నీ గోల? అమ్మాయి స్థలం చూడకపోతేనేమి?" అని మందలించారు. తన యింట జరిగే ప్రతిదీ ఆయనకు తెలుస్తుందని సారే గుర్తించాడు. అలానే ఒకసారి
శ్రీమతి ప్రధాన్ ఆయనకు పాదపూజ చేస్తుండగా, "నీవు వెంటనే యింటికెళ్ళు" అన్నారు బాబా, ఆమె వెళ్ళేసరికి పాప గుక్కపెట్టి ఏడుస్తున్నది. ఆమె పాపను సముదాయించి మరలా మశీదుకు వెళ్ళింది. "ఇప్పుడు పూజ పూర్తి చేసుకో!" అన్నారు సాయి.
నూల్కర్ మొదటిసారి శిరిడీ వెళుతూ దక్షిణగా రూ. 20/-లు బాబాకు సమర్పించాలనుకున్నాడు. సాయిని దర్శించి, ఆయన కళ్ళలోకి చూస్తూనే, అంతటి మహాత్ముణ్ణి దర్శించుకోగలగడం మహాభాగ్యమనుకున్నాడు. బాబా వెంటనే దక్షిణ కోరారు. అతడొక బంగారు నాణెమిచ్చాడు. సాయి దానిని త్రిప్పిచూస్తూ, "దీని విలువెంత?" అన్నారు. "పదిహేను రూపాయలు" అన్నాడు నూల్కర్, సాయి దానిని తిరిగిచ్చి, ఇది నీవుంచుకోని రూపాయలివ్వ' అన్నారు. అతనిచ్చిన రూ. 15/-లు తీసుకొని, "నాకు. రూ. 10/-లే ముట్టాయి. ఇంకా రూ. 5/-లు యివ్వ" అన్నారు. అతడిచ్చాడు. ఆ విధంగా అతడివ్వదలచిన రూ. 20/-లే తీసుకున్నారు బాబా. అలానే శ్రీమతి బాపత్ నాలుగణాలు యిచ్చినప్పుడు ఆయన నవ్వుతూ, "మిగిలిన నాలుగణాలివ్వక యీ పేద బ్రాహ్మచ్టెందుకు మోసగిస్తావు?' అన్నారు. ఆమె సిగుపడి మరో నాలుగణాలిచ్చింది. కారణం మొదట ఆమె ఎనిమిది అణాలివ్వదలచిందట!
దాసగణు శిరిడీ వెడుతుంటే కోపర్గావ్లో స్టేషన్ మాష్టర్, సాయిని పిచ్చి ఫకీరని నిందించాడు. బాబాను స్వయంగా చూచి మాట్లాడమని చెప్పి, దాసగణు అతనిని శిరిడీ తీసుకొచ్చాడు. సాయి మశీదులోని కుండలన్నీ బోర్లిస్తున్నారు. కారణమడిగిన స్టేషన్ మాష్టర్తో,"నా దగ్గరకు వచ్చే కుండలన్నీ తలక్రిందులుగానే వస్తున్నాయి" అన్నారు. అంధమైన అవిశ్వాసంతో వచ్చేవారి హృదయాలు బోర్లించిన కుండలు, వాటిని జ్ఞానంతో నింపడం సాధ్యంగాదు. విశ్వాసంతో గాని, లేక కనీసం జిజ్ఞాసతోగాని వచ్చేవారి హృదయాలు సరియైన కుండలు, వాటిని నింపవచ్చు. కాని చిత్రం, ఆ మాటతో సాయి అతని హృదయమనే కుండను సరిజేశారు, విశ్వాసంతో నింపారు.
ఒకడు సాయి నిష్కారణంగా కోపించడం చూచి ఆయన పిచ్చివాడని తలచి, తానిచ్చిన దక్షిణంతా తిరిగి తీసుకోవాలనుకున్నాడు. కాని బాబా అతడడుగక ముందే అతని భార్యకు పైకమిచ్చి, "ఇంతవరకూ మీరిచ్చిన దక్షిణ నాకొద్దు, తీసుకో!" అన్నారు.
ఇంతవరకూ ఎక్కడెక్కడో వున్న మానవుల యొక్క పరిస్థితులు హృదయగతభావాలు బాబాకు అనుక్షణమూ తెరచి వున్న పుటలలాగా ఎలా తెలుస్తుండేవో గమనించాము. ఎక్కడెక్కడ ఏ భక్తులు ఆపదలో వున్నారో వారికేమి జరుగనున్నదో ఆయనకు తెలుసు. వాళ్ళకు శ్రేయస్కరమైతే, అట్టి ఆపదను నివారిస్తుండేవారు.
0 comments:
Post a Comment