శ్రద్ధ - సబూరి
బాబా తనభక్తులను పిచ్చుక కాళ్ళకు దారం కట్టి లాగినట్లుగా తనవద్దకు రప్పించుకుంటానని చెప్పారు. మొదట్లో సాయిపై నమ్మకం లేకపోయి ఉండవచ్చు. బాబాకు తన భక్తులు ఎంత దూరంలో ఉన్నా సరే, ఏదో ఒక సంఘటన ద్వారా, వారి మనసులను ప్రభావితం చేసి తన భక్తులుగా మార్చుకుంటారు. మనసులో కోరుకున్న కోరికలను కూడా వెంటనే తీర్చి మనకి ఆశ్చర్యాన్ని కలుగ చేస్తారు. ఆ సమయంలో మనకి అది ఒక అధ్బుతమయిన సంఘటనగా కలకాలం గుర్తుండిపోతుంది. ఆవిధంగానే బాబా వారు నాకు షిరిడీలో ఆయన దర్శనానికి వెడుతున్నపుడు మనసులో బాబాకి ప్రసాదం, కనీసం గులాబీలయినా తీసుకెళ్ళకుండ, ఉత్త చేతులతో వెడుతున్నమని తలచుని బాధపడినప్పుడు వెంటనే నా కోర్కెను తీర్చారు. (నా మొట్టమొదటి అనుభూతి). ఆవిధంగా బాబా క్రమక్రమంగా మనకు ధృఢమయిన భక్తి ని కలిగిస్తారు. మనం ఇక వెనుకకు తిరిగి చూసుకోనక్కరలేదు. ఈ రోజు సాయిప్రభ మాసపత్రిక డిసెంబరు, 1987 సంచికలోని ఒక అద్భుతమయిన బాబా లీల తెలుసుకుందాము.
ఓం సాయిరాం
ఒక నానుడి.
"ఉదారంగా ఉండు. అప్పుడు ఇతరులలో ఇంకా చనిపోకుండా నిద్రాణస్థితిలో ఉన్న ఔదార్యం నీ ఔదార్యంతో కలవడానికి సిధ్ధంగా ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే నీ ఔదార్యాన్ని నువ్వెప్పుడూ కోల్పోవద్దు. నీవల్ల ఇతరులు కూడా ఉదారంగా తయారవుతారు."
ఇతరులలో అంతర్గతంగా నిద్రాణ స్థితిలో ఉన్న కొద్దిపాటి విశ్వాసాన్ని గాని, నమ్మకాన్ని గాని బలోపేతం చేయడానికి మనం సహాయం చేయగలిగినపుడు అందరం కలిసి 'సాయి - నమ్మకం' అనే శక్తివంతమయిన ప్రవాహాన్ని సృష్టించగలం. మనం ఏదయినా విత్తనాన్ని నాటినపుడు అది బలంగా పెరిగి మొక్కవడానికి కావలసిన ఎఱువులను వేస్తాము. అదే విధంగా సహనం, ఓర్పు, పట్టుదల వీటిని కనక మనం ఎల్లప్పుడూ శ్రధ్ధగా ఆచరణలో పెట్టినపుడు సాయి మీద నమ్మకాన్ని మనం మరింతగా వృధ్ధి చేసుకోవచ్చు.
పైన చెప్పిన వివరణకి అనుబంధంగా, తన భక్తురాలికి సాయి చూపించిన అనుభవాలను, చమత్కారాలను మీకిప్పుడు తెలియచేస్తాను.
అయిదు సంవత్సరాల క్రితం సుధ, అనే అమ్మాయి మాయింటి ప్రక్కనే ఉండేది. ఆమెకు క్రొత్తగా పెళ్ళి అయింది. ఒక రోజు గురువారం నాడు, నేను మాయింటికి తాళం వేస్తుండగా "ఆంటీ! ప్రతీ గురువారం నాడు మీరు ఎక్కడికి వెడుతూ ఉంటారు" అనడిగింది సుధ. ప్రతి గురువారం నేను 'ప్రసన్న సాయి మందిరానికి వెడుతూ ఉంటానని చెప్పాను. "ఓ! అయితే మీకు సాయిబాబా మీద అంత నమ్మకం ఉందన్నమాట" అని మామూలు ధోరణిలో అంది. అంతకుముందు చాలా కాలం క్రితం ఆమె మాయింటికి వచ్చినపుడు మా యింటిలో ప్రతి గదిలోను సాయిబాబా చిత్రపటాలను చూసింది. అప్పుడామె "నేను సాయిబాబా గురించి విన్నాను గాని, ఆయనగురించి నాకసలేమీ తెలీదు" అని చెప్పింది. "నీకంతగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే చాలా మంచిది" అన్నాను. ఎవరయితే ఆయన లీలలని గానం చేస్తారో, వింటారో వారిపై సాయి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని అన్నాను.
"అదే కనక నిజమయితే నాకాయన చరిత్ర, కధలు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది" అంది సుధ. అప్పటినుండి ఆమెకు శ్రీ బీ.వీ.నరసిసిం హస్వామిగారు రచించిన 'లైఫ్ ఆఫ్ సాయిబాబా' పుస్తకంలోని బాబా జీవిత కధలు, సంఘటనలు వివరించి చెప్పడం మొదలుపెట్టాను. ఆమెలో దైవభక్తి, మంచి ఆధ్యాత్మిక గుణాలు ఉండటం వల్ల నేను చెప్పేవన్నీ వెంటనే ఎంతో ఉత్సాహంతో ప్రతి విషయాన్ని త్వరగానె గ్రహించి అర్ధం చేసుకొనేది. సాయిబాబా మీద ఆమె విశ్వాసం మరింతగా ప్రకాశించింది.
ఒక గురువారం నాడు తనకు కూడా నాతో సాయిమందిరానికి రావాలనుందనే కోర్కెను వెల్లడించింది. నాతో సాయి మందిరానికి వచ్చిన తరువాత బాబాను చూసి ముగ్ధురాలయి ప్రతి గురువారం బాబా గుడికి రావాలనుందని చెప్పింది. మేము వెళ్ళిన ప్రతిసారి దారిలో బాబా గురించి ఆయన మహిమల గురించే ఎక్కువగా మాటాడుకునేవాళ్ళం.
దురదృష్టవశాత్తు ఆమె అత్తగారికి బాబా అంటే యిష్టం లేదు. ఆవిడకి, సుధ క్రొత్తగా సాయిబాబాను పూజించడం యిష్టం లేకపోయింది. ఆవిడనుంచి సుధకు వ్యతిరేకత ఎదురయింది. సాయిబాబా గురించి వ్యతిరేకంగా అతి కఠినంగా మాట్లాడి సుధకి బాగా చివాట్లు పెట్టింది.
ప్రతివారం సాయి మందిరానికి వెళ్ళద్దని హెచ్చరించింది. నువ్వు సాయిబాబా మందిరానికి వెడుతున్నావంటే అదంతా సాయి యిష్టప్రకారమె జరరుగుతోందని సుధని ఓదార్చాను. పిచ్చుక కాళ్ళకి దారం కట్టి లాగినట్లుగా బాబా తనభక్తులని తనవద్దకు రప్పించుకుంటారని చెప్పాను. ఒక్కసారి కనక బాబా ఎవరినయినా తన భక్తునిగా అంగీకరించినట్లయితే యిక వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం లేదని నేను సుధకి నచ్చ చెప్పడంతో ఆమె తన అత్తగారి హెచ్చరికలని, వ్యతిరేక మాటలని లక్ష్యపెట్టలేదు.
బాబాని పూజించడం మొదలు పెట్టినప్పటినుండి తను ఒక విధమయిన మానసిక ప్రశాంతతను ఎంతో పొందుతున్నానని ఒక రోజున ఆమె నాతో చెప్పింది. "తొందరలోనే నేను నాలో ఉన్న కోపాన్ని జయించాను. ఇతరులను క్షమించడం కూడా అలవాటయింది. నాలో ఉన్న మానసిక ఆందోళన, భయం అన్నీ మాయమయ్యాయి. ఇప్పుడు ఏవిషయాలు నన్ను బాధించడంలేదు. ఇది చాలా అద్భుతం" అని చెప్పింది సుధ.
"ఇది నాకేమాత్రం విచిత్రమనిపించటంలేదు. సాయిబాబా మనకు మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తారు. ప్రాపంచిక చెడుమార్గాలకు మనం లోను కాకుండా, ప్రమాదాల బారిన పడకుండా మనలని తప్పించి కాపాడుతారు" అని చెప్పాను.
"నాకు తెలియని విషయాలకీ, నామదిలో చెలరేగే ప్రశ్నలకి బాబానించి సమాధానాలు కూడా పొందుతున్నానని" చెప్పింది సుధ.
సుధ సాయిమందిరాన్ని దర్శించేటప్పుడు ఆమెకి కొన్ని చిన్న చిన్న అనుభవాలు కలగటంతో సాయిబాబా మీద ఆమె నమ్మకం మరింతగా ధృఢపడింది. ఒక గురువారం నాడు 'బాబా మందిరంలో కుంకుమని ప్రసాదంగా ఎందుకివ్వరని" నన్ను ప్రశ్నించింది. అదేరోజున బెంగళూరునుండి ఒకావిడ మందిరానికి వచ్చి బాబాకి కుంకుమ అర్చన చేయించింది. ఆరోజున మాకు ఊదీతోపాటుగా కుంకుమ కూడా ప్రసాదంగా లభించింది.
ఇంకొకసారి బాబా మందిరానికి వెళ్ళినపుడు ఆమెకు బాబాని బోగన్ విల్లా (కాగితం పూలు) పూలతో అర్చించవచ్చా లేదా అనే సందేహం కలిగింది. దానిని గురించి తెలుసుకోవాలనుకుంది. బాబాని సుగంధపరిమళాలు వెదజల్లే లిల్లీ పూల తో (ట్యూబ్ రోజెస్) పూజించడం చూశాను గాని, ఆమె వేసిన ప్రశ్నకు నాకూ సందేహం కలిగింది.
సరిగా అదేరోజున అప్పుడే బాబాకి తెల్లని లిల్లీ పూలతో అర్చన చేశారు. బాబాకి తెల్లటి లిల్లీపూలతో అర్చన చేసిన తరువాత ఆయన మీదనుండి రాలిపడిన పూలలో ఎఱ్ఱటి బోగన్ విల్లా పూలు కూడా మాకు కనిపంచాయి. "బాబా నాప్రశ్నకు సమాధానమిచ్చారు" అని సుధ ఎంతో సంతోషపడిపోయింది. మరొక గురువారం నాడు, మందిరంలో బాబావిగ్రహం వద్ద లక్ష్మీదేవి ఫొటో ఒక్కటి కూడా లేదేమిటి అంది. మాయిద్దరి మనసులు ఉద్విగ్నతతో నిండి మేము ఆశ్చర్యపడేలా ఆరోజు బాబావారి విగ్రహం ముందు వెండి ఫ్రేముతో చేయబడ్డ లక్ష్మీదేవి ఫొటోను చూశాము. మందిరంలో ఎవరో ఆఫొటోను తెచ్చి పెట్టారు.
సాయిబాబా ఆవిధంగా క్రమంగా ఆమె మనసును ప్రభావితం చేసి, ఆమె భక్తి మరింత ధృధపడేలా నాద్వారా సహాయం చేశారు.
"ఎవరయితే ప్రేమతో నానామాన్ని స్మరిస్తారో, ఉచ్చరిస్తారో వారి కోరికలన్నీ తీరుస్తాను, వారిలోని భక్తిని పెంపొందిస్తాను" అన్న బాబా మాటలు ఎంత వాస్తవం!
సుధ ఇప్పుడు ప్రతిరోజు సత్ చరిత్ర పారాయణ చేస్తూ, ప్రతీ గురువారం శ్రీసాయి శతసహస్రనామాలు చదువుతుంది. మొట్టమొదట్లో ఆమె పూజించడానికి సాయిబాబా చిత్రపటాన్ని పూజగదిలో కాక హాలులో పెట్టింది. కొద్ది నెలలతరువాత పూజగదిలో మిగతా దేవతా విగ్రహాలకి దూరంగా పెట్టింది. ఇపుడు పూజగదిలో ఉన్న అందరి దేవతామూర్తులతో కలిసి బాబా కొలువై ఉన్నారు.
క్రమక్రమంగా ఆమెలో ఈ మార్పు వచ్చింది. ఏదో ఒకరోజున ఆమె బాబాలొనే దేవుళ్ళందరినీ చూడగలగే స్థాయికి చేరుకొంటుందని నేను భావిస్తున్నాను.
నా ప్రభావం వల్లనే తన జీవిత దృక్పధంలో గణనీయమయిన మార్పు వచ్చిందని సుధ నాతో అంటూ ఉంటుంది. అది నావలన కాదనీ, అంతా సాయి అనుగ్రహంతోనే జరిగిందని చెప్పాను.
"ఒక్కొక్కసారి మనం చేసిన పనులు చిన్నవే కావచ్చు. కాని అవి అవతలి వ్యక్తియొక్క జీవితంలో ఎంతో ప్రముఖంగా ప్రభావాన్ని చూపి వారి జీవితంలో మంచి మార్పుని తీసుకొని వచ్చినపుడు అది మనకు శాశ్వతమయిన ఆనందం కలిగిస్తుందని" నాకెక్కడో చదివినట్లు గుర్తు. సాయిబాబా నాకిటువంటి సంతృప్తిని కలిగించి, ఆయనతో నా సత్సంగాన్ని స్థిరపరిచారు.
శ్రీమతి విజయా గోపాలకృష్ణ
మైసూర్
సాయిప్రభ డిసెంబరు 1987
సాయిబంధువులకు ఒక మనవి: ప్రచురింపబడిన బాబా లీలను చదివారు కదా. ఆంగ్లంలో బాబాని పూజించిన పూలు ట్యూబ్ రోజెస్ అని వుంది. ట్యూబ్ రోజెస్ కోసం గూగుల్ లో వెతికినప్పుడు లిల్లీ పువ్వుల చిత్రాలు వచ్చాయి. అందుచేత లిల్లీ పువ్వులు అని వ్రాయడం జరిగింది. ట్యూబ్ రోజ్ కి సరియైన అర్ధం లిల్లీపూలు సరియైనదేనా? ఒకవేళ తప్పయితే సరిదిద్దుకోవడానికి . ఎవరికయినా తెలిస్తే నా నంబరుకి ఫోన్ చేసి తెలపండి. లేక నా మైల్ ఐ.డి. కి పంపినా సరే.
ఓంసాయిరాం
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment