Total Pageviews

Sunday, July 19, 2015

శ్రీ షిరిడీసాయి వైభవం మన సమస్యలు - శ్రీసాయి సత్ చరిత్ర సమాధానాలు9article from https://www.blogger.com/blogger.g?blogID=3618206558150917369#editor/target=post;postID=6391465669859772834)

దీ గ్లోరీఆఫ్ షిరిడీసాయి పాతసంచిక అక్టోబరు 2009 వ.సంవత్సరం లోని ఒక బాబా లీల చదవండి. 

శ్రీ షిరిడీసాయి వైభవం 
మన సమస్యలు - శ్రీసాయి సత్ చరిత్ర సమాధానాలు

శ్రీసాయి సత్ చరిత్ర ఒక మహిమాన్విత గ్రంధమని మన సాయి భక్తులందరికీ అనుభవమే.  శ్రీ సాయి సత్ చరిత్ర, బాబా, వేరు కాదు.  సాయి సత్చరిత్రలో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి.   ప్రతీ మాట, పదం అన్నీ కూడా బాబా వారు స్వయంగా చెప్పిన మధుర వాక్కులు.  సత్ చరిత్రను ప్రతీ రోజు పారాయణ చేసేవారు తమ సమస్యలకు బాబా వారి సమధానాలను కూడా సత్ చరిత్ర ద్వారానే తెలుసుకుంటూ ఉంటారు.  ఏదయినా సమస్య ఎదురయినప్పుడు కనులు మూసుకొని బాబాని మనస్పూర్తిగా ప్రార్ధించి పరిష్కారం చూపించమని చరిత్రలోని ఏదో ఒకపేజీ తీసి చూస్తే ఆ సమస్యకు పరిష్కారం కనపడుతుంది.


ఈ రోజు మీరు చదవబోయేది అటువంటి సంఘటనే.  ఇక చదవండి.

ఇది శ్రీహరికిరణ్, హైదరాబాదు వాస్తవ్యులు గారు వ్రాసిన అనుభవం.  

ఈ మధ్యనే నాభర్తకు కలిగిన అనుభవాన్ని వివరిస్తాను. ప్రతిరోజు నేను నా భర్తకన్నా ముందుగానే నిద్రనుండి మేల్కొంటాను.  ఒకరోజు ఉదయాన్నే ఆయన నాకన్నా ముందే నిద్రలేచి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నారు.  తను మాట్లాడే మాటలవల్ల నాకర్ధమైందేమిటంటే ఒక కంపెనీకి సంబంధించిన షేర్లలో పెట్టుబడి పెట్టడానికి తన స్నేహితునితో సంప్రదిస్తున్నారు.  ఆయన స్నేహితుడు ఒక షేర్ బ్రోకరు.  నాభర్త షేర్లలో పెట్టుబడి పెట్టడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు.  ఆ కంపెనీలో పెట్టుబడి పెడితే త్వరలోనే ఆ కంపెనీ షేరు విలువ బాగా పెరిగి లాభాలు విపరీతంగా  వస్తాయని ఆతరువాత నాతో చెప్పారు.  

నా భర్తకి బాబా అంటే చాలా నమ్మకం.  కొద్ది రోజులుగా సాయి సత్ చరిత్ర పారాయణ కూడా మొదలు పెట్టారు.  ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే సత్ చరిత్రలోని ఏదో ఒక పేజీ తీసి చదువుతారు.  ఆరోజున స్నానం చేసిన తరువాత పూజా మందిరం లో కూర్చొని సత్ చరిత్ర చేతిలోకి తీసుకొని ఒక పేజీ తెరిచారు.  ఆశ్చర్యం, అది 25వ. అధ్యాయం.  ఆ అధ్యాయంలో దామూ అన్నా ప్రత్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అధిక లాబాలను గడిద్దామని, దాని కోసం బాబా సహాయం కోరదలచిన సంఘటన ఉంది.  దామూ అన్నా మాధవరావుకు ఉత్తరం వ్రాశాడు.  మాధవరావు బాబాకు ఆ ఉత్తరం చదివి వినిపించగానె బాబా " ఉన్నదానితో తృప్తి పడమను.  అతనికి యింటిలో ఏలోటూ లేదు.  లక్షల కోసం వెంటపడవద్దని చెప్పు" అన్నారు.  నాభర్త ఆ అధ్యాయాన్ని చదివిన తరువాత అది బాబా యిచ్చిన సలహాగా భావించారు.  అసలు ఆరోజున చాలా పెద్ద మొత్తంలో తను అనుకున్న కంపెనీ షేర్ లలో పెట్టుబడి పెడదామనుకున్నారు.  ఈ సంఘటన బాబా చేసిన హెచ్చరిక అనుకొని, పెట్టుబడి పెట్టకూడని నిర్ణయించుకొన్నారు.  కాని ఆయన స్నేహితునికి నా భర్త అటువంటి నిర్ణయం తీసుకోవడం నచ్చలేదు.  అతను చాలా హతాసుడయ్యాడు.  కనీసం కొద్ది మొత్తమయిన పెట్టుబడి పెట్టమని బలవంతపెట్టి ఒప్పించాడు.  రెండురోజులలోనే ఆ షేరు విలువ బాగా పడిపోయి, పెట్టుబడి పెట్టినవాళ్ళందరూ బాగా నష్టపోయారు. 
 ముందే అనుకున్న ప్రకారం ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఉంటే మేము బాగా నష్టపోయి కష్టాలు పడేవాళ్ళం.  ఎప్పటికీ పూడ్చలేని నష్టాలను అనుభవించి ఉండేవాళ్ళం.  అటువంటి కష్టానికి లోనుకాకుండా సమయానికి సలహా యిచ్చిన బాబావారికి ఎంతో ఋణపడి ఉన్నాము.  బాబా హెచ్చరించినా కూడా నా భర్త తెగించి పెట్టిన కొద్దిపాటి మొత్తం నష్టాన్ని మిగిల్చింది.  బాబా యిచ్చిన సలహాని నాభర్త పూర్తిగా పాటించలేదు.  మానవుడు ఒక్కసారిగా శిఖరాగ్రం నుండి ఏవిధంగా కిందకు జారిపోతాడొ నిరూపిస్తుంది ఈ సంఘటన.  ఇది ఒక కనువిప్పు.       

కావలసినదల్లా పూర్తి నమ్మకం.  

ఓం శ్రీ సమర్ధ సద్గురు శ్రీసాయినాధ్ మహరాజ్ కీ జై.

(సాయిదర్బార్ యూ ఎస్ ఏ వారి సౌజన్యంతో)   

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)  

0 comments:

Post a Comment