Total Pageviews

Friday, December 20, 2013

నా ఊదీలో నీకు నమ్మకం లేదా? ప్రచురించడానికి అనుమతినిచ్చిన saileelas.orgవారికి కృతజ్ఞతలతో

వివిధ ప్రదేశాలనుండి భక్తులు షిరిడీకి పాదయాత్ర చేస్తారు.  కొంతమంది పల్లకినీ మోసుకొని వెడితే కొంతమంది నడచి వెడుతూ ఉంటారు.  భారతదేశంలోని వివిధ ప్రాంతాలనుండి భక్తులు పాదరక్షలతో గాని, లేకుండాగాని షిరిడీ వరకు పాదయాత్ర చేస్తారు.  విఠోభా భక్తులు పండరిపూర్ వరకు పాదయాత్ర చేయడం ప్రారంభించినప్పటినుండీ ఈ పాదయాత్రలు మొదలయ్యాయి.  షిరిడీకి పాదయాత్ర చేయడమంటే భక్తులకి అదొక అపూర్వమయిన అనుభూతి.

తమ దగ్గిర ఎటువంటి ధనము ఉంచుకోకుండా దారిలో కేవలం భిక్ష మీదనే ఆధారపడుతూ షిరిడీకి పాదయాత్ర చేసిన భక్తులు కూడా ఉన్నారు.  అటువంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయి.  అటువంటి పాదయాత్ర గురించి ఒక అధ్బుతమయిన అనుభవం తెలుసుకొందాము.

2007వ.సంవత్సరం జూన్ నాలుగవ తారీకున అనిల్ సాహెబ్ రావి షిల్కే గారు ఆఫీసునుండి యింటికి తిరిగి వెడుతుండగా తీవ్రమయిన అనారోగ్యానికి గురయ్యారు.  హటాత్తుగా ఒళ్ళంతా చెమటలు పట్టి గొంతుక ఎండిపోయింది.  పొత్తికడుపంతా ఉబ్బిపోయి బాధ పెట్టసాగింది.  లక్షణాలన్ని బాగా తీవ్రంగా ఉండటంతో దగ్గరలోనున్న షాపులోనికి వెంటనె వెళ్ళి యింటికి ఫోన్ చేద్దామని వెళ్ళారు .  ఫోన్ డయల్ చేసి మాట్లాడలేక స్పృహతప్పి పడిపోయారు.  ఆయనకు తెలివి వచ్చేటప్పటికి  చించివాడ్ ఆస్పత్రి ఐ.సీ.యూ. లో ఉన్నారు. 

రక్తపరీక్షలు, స్కాన్ రిపోర్టులు చూసిన తరువాత ఆయన కిడ్నీలు రెండూ పని చేయటంలేదని, ఆరోజునుండి డయాలసిస్ చేయాలని డాక్టర్  చెప్పారు.  ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన తరువాత కూడా జీవితాంతం ప్రతి వారం మంగళ, శుక్రవారాలలో డయాలసిస్ చేయించుకుంటూ ఉండవలసినదేనని చెప్పారు.  డాక్టర్ నిర్ధారణ చేసి తనకు వచ్చిన జబ్బు గురించి చెప్పగానే ఆయన వెన్నులో చలిజ్వరం వచ్చినట్లయి నిస్సహాయులైపోయారు.  నిరాశ నిస్పృహలతో ఆయన బాబాను "బాబా, జీవితాంతం డయాలసిస్ మీదే బ్రతికే జీవితం నాకు వద్దు.  దానికన్నా నాకు మరణాన్ని ప్రసాదించు" అని అర్ధించారు.

17వ.తేదీన ఆయన యింటికి తిరిగి వచ్చారు.  సరిగ్గా తరువాతి నెలలోనే పూనానుండి షిరిడీవరకు పాదయాత్ర జరగబోతోంది.  గడచిన 8 సంవత్సరాలుగా ఆయన పాదయాత్ర లో పాల్గొంటున్నారు.  ఈసారి పాల్గొనలేకపోతున్నాననే బాధ కలిగింది.  ఆయన మన్స్పూర్తిగా బాబాని యిలా ప్రార్ధించారు.  "అనారోగ్యం వల్ల నేను ఈసంవత్సరం పాదయాత్ర చేయలేకపోతున్నాను బాబా.  వచ్చే సంత్సరం పల్లకీతో పాదయాత్ర చేసేలాగ నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు.  వచ్చే సంవత్సరం నేనే కనక నీపల్లకీ ముందు గుఱ్ఱం లాగ పరిగెత్తగలిగితే, అందుకు కృతజ్ఞతగా నీకు వెండి గుఱ్ఱాన్ని సమర్పించుకుంటాను" అని మొక్కుకొన్నారు.  నుదిటికి ఊదీ రాసుకొని నిద్రపోయారు.    

ఆరాత్రి ఆయనకు బిగ్గరగా ఒక స్వరం వినపడింది.."నా ఊదీలో నీకు నమ్మకం లేదా"? --  ఆయన తన భార్యను లేపి ఆమెకు ఆస్వరం ఎమన్నా వినిపించిందా అని అడిగారు.  భర్త ఏదో పరాకు మాటలు మాట్లాడుతున్నారనుకొని భయపడింది.  ఆయన మళ్ళీ పడుకొని మరలా ఉదయం 5 గంటలకే లేచారు.  ఈసారి ఆయనకు కాకడ ఆరతి స్పష్టంగా వినిపించింది.  ఆయన మరలా తన భార్యను లేపారు. ఇంటిలోనివారందరూ లేచారు.  వారికెవరికీ కాకడ ఆరతి వినపడలేదు ఆయనకు తప్ప.  ఇదే పెద్ద మలుపు.  రెండు గంటల  తరువాత ఆయన కాస్త మూత్రం విసర్జించారు.  ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే గడచిన 15 రోజులుగా ఒక్క చుక్క కూడా మూత్రం రాలేదు.  కొద్ది రోజుల తరువాత ఆయన ఆస్పత్రికి వెళ్ళి, పరీక్ష చేయించుకున్నారు.  రక్త పరీక్షలో ఆయన ఆరోగ్యం కూడా మెరుగు పడిందని తెలిసింది.  డయాలసిస్ కూడా అవసరం లేదని చెప్పారు.  అనిల్ గారి ఆరోగ్యం కుదుటపడి నిలకడగా ఉంది.   

ఆయన తనభార్య, స్నేహితునితో కలసి షిరిడీ వరకు పాదయాత్ర చేసి, మొక్కున్న విధంగా బాబాకు వెండి గుఱ్ఱాన్ని సమర్పించారు. 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) (తెలుగు అనువాదం త్యాగరాజు గారు నరసాపురం)

0 comments:

Post a Comment