సచ్చరిత్ర ను విమర్శించడం నేరం, పాపం
’సచ్ఛరిత్ర’ పారాయణాన్ని, హేమాడ్ పంతను శ్రీ చాగంటి కోటీశ్వరరావు గారు విమర్శించారన్న విషయం సాయిభక్తులు చాలామందికి తెలిసింది. సంవత్సరం క్రితం బాగ్ అంబర్ పేట శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థానం లో వారు శ్రీ సాయి తత్త్వం గురించి మాట్లాడారు.
వారు మాట్లాడిన తీరు ’ఏదో పెద్దాయన చెప్పాడులే’ అని అనుకోవడానికి వీలులేదు. తెలియక చెప్పలేదు. బుద్ధిపూర్వకంగానే, సాయిభక్తుల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడారు. ఆయన వుపన్యాసం నెట్ లో విన్న తర్వాత నాలో కల్గిన ఆవేదనను ఈ రకంగా కొంతైనా వ్యక్తపరిచేప్రయత్నం చేస్తాను.
’సచ్ఛరిత్ర’ అపౌరుషేయం, సాయి భక్తులకు సాయి సచ్ఛరిత వేదము. శ్రీ సాయికీ, సచ్ఛరిత్రకూ తేడాలేదు. అలాంటి సచ్ఛరిత్ర గురించి సాయిభక్తుల ముందు “మీరు ఎన్ని సార్లు పారాయణ చేసినా ప్రయోజనం లేదు. వ్రాసిన వ్యక్తి పాపం చేసాడు. మీకూ పాపం వస్తుంది” అన్నారాయన. వారెంత సంస్కార వంతులో తెలియని వారికి కూడా ఈ వ్యాఖ్యల వలన తేటతెల్లమైపోయింది. కనీసం ఒక్కసారి పారాయణ చేసినా పరనింద చేయడు సాయి భక్తుడు. అదే సచ్ఛరిత్ర పారాయణ వలన భక్తుడు పొందుతున్న ’ఆస్తి’ సంస్కారం. అటువంటి సచ్ఛరిత్ర ను నిందించడమ్ శ్రీ చాగంటి కోటోశ్వరరావు గారు చేసిన మహాపెద్ద తప్పూ, పాపమూ, నేరమూ కూడా.
’అయోమయావస్థలొ అర్ధం పర్దం లేకుండా చెప్పినట్లుగా బహుశః ఏ గురుస్వరూపం విషయంలోనూ ఇలా చెప్పబడలేదు’ అన్నారాయన. ఒక్క గురువు స్వరూపం తెలిసికోవాలంటేనే కొన్ని జన్మలెత్తాలి. అలాంటిది ఎంతోమంది గురుస్వరూపాల విషయం గురించి తెలుసన్న ఆయన శ్రీ సాయి గురు స్వరూపం విషయం అయోమయంగా అర్దం పర్దం లేకుండా వుంది అనడానికి కారణం, హేమాడ్ పంతా వ్రాసిన సచ్ఛరిత ను శద్ధగా పారాయణ చేయక పొవడమే. గ్రంధాన్ని శ్రద్ధగా పారాయణం చేసే భక్తులు ఎవరూ అయోమయావస్థలో లేరు.
’సచ్ఛరిత్ర’ లో బీజాక్షరాలు లేవు. గురుచరిత్ర పారాయణ వలన చెప్పుకోదగిన తృప్తి కలుగదు’ అని ప్రవచించారు చాగంటివారు. సచ్ఛరిత్ర పారాయణ వలన తృప్తి కలుగుతున్నదో లేదో సచ్చరిత్ర పారాయణ చేస్తే తెలుస్తుంది. ’నాకు పారాయణ చేసే అలవాటు లేదు. నేను పారాయణ చెయ్యను’ అంటున్న ఆయన తృప్తి ఎలా అనుభవిస్తారు? కొన్ని శతాబ్దాలుగా మరాఠీలో వ్రాసిన ’గురుచరిత్ర’ ను నిత్యం పవిత్రమైన శ్రద్ధసక్తులతో పారాయణం చేసి లక్షలాది మంది భక్తులు అనుభవాలు పొందుతున్నారు. మార్గదర్శకులూ, మహత్ములూ అవుతున్నారు. గురుచరిత్రలో బీజాక్షరాలున్నవో లేవో గానీ గురువుమీద అపారమైన విశ్వాసం వుంటుంది. అదే సంప్రదాయంతో ’సచ్ఛరిత్ర’ ను కోట్లాదిమంది సాయిభక్తులు పారాయణం చేస్తున్నారు. తనపాండిత్యంతో ’సౌందర్య లహరి’ గొప్పతనం చెప్పిన ఆయన ఈ విషయం తెలిసికోకుండా సాయిభక్తులముందు మాట్లాడడం ’విజ్ఞత’ అనిపించుకోదు.
’కోరికలతో చరిత్రను పారాయణ చేయడమంత పనికిమాలిన వెధవ పని ఇంకొకటి లేదు’ అని నోరు పారేసుకున్నారాయన. నీ ఇంటిలో, నలుగురి మధ్యా మాట్లాడేతీరులో, సభలొ అందులో సాయిమందిరంలో సాయిభక్తుల ముందర పారాయణాన్నిగురించి చులకనా గా మాట్లాడారు శ్రీ చాగంటి కోటీశ్వరరావు గారు.
సర్వసౌఖ్యకరంచైవ, భుక్తి ముక్తి ప్రదాయకమ్ అని శివుడు అమ్మవారితో అన్నారని గురుగీతలో వ్యాసులవారు చెప్పారు. సౌఖ్యము, భుక్తికొరకు కూడా గురువును ఆశ్రయించవచ్చని గురుగీత చెబుతున్నది. అందరూ జిజ్ఞాసులూ, ముముక్షువులే వుండరు కదా! ఎక్కువమంది ఆర్తులూ, అర్దార్దులే వుంటారు. కన్నతల్లికి వుండే వాత్సల్యం కల్గిన గురువు సాయి అని హేమాడ్ పంత్ తన అనుభవాన్ని సచ్ఛరిత్ర లో వ్రాసారు. ముందు గురుచరిత్ర చదువాలనే కోరిక కలగాలి – ’చదువు, నీ కోరిక తీరుతుంది’ అంటే ఎవరైనా చదువుతారు. చదివిన వారి మనోభీష్టం నెరవేరితే బాబా మీద నమ్మకం కుదురుతుంది. తర్వాతే ఆత్మ సాక్షాత్కారం. ఇది సాయిభక్తులు పొందుతున్న అనుభవము. అసలు ఈ గ్రంధాన్ని పారాయణ చేయను అన్న వ్యక్తి పారాయణాన్ని గురించి ’పనికిమాలిన వెధవ పని’ అనడం మహాపాపం.
’సాయి కధలు ఎవరెవరొ రాసారు, ఒక్కటీ ప్రామాణికంగా లేదు’ అంటూ శనగల కధని వుదహరిస్తూ గ్రంధకర్త కుచేలుడిని గర్భదరిద్రుడని వ్రాసి మహా పాపం చేసాడనీ, అలాటి గ్రంధం చదవడం మహాపాపమనీ అన్నారాయన. సాయి సన్నిధిలో తనలోని దుర్గుణం గుర్తించిన హేమాడ్ పంత్ తనెంత పొరపాటు చేసానో అనుకుంటూ సుధాముని గుర్తుచేసికున్నాడే కానీ కుచేలుడ్ని నిందించలేదు. సచ్ఛరిత వ్రాసిన హేమాడ్ పంత్ పాపం చేయలేదు. ఆగ్రంధాన్ని పారాయణమ్ చేస్తున్న మేమూ పాపులం కాదు. ఎంతో పుణ్యం చేసికుంటే కానీ సచ్ఛరిత్ర పారాయణ భాగ్యం లభించదు.
సచ్ఛరిత్రను చదువకుండా, అర్ధం చేసికోకుండా రచయితని నిందించడం క్షమించరాని మహాపాపం. ఎవరెవరో వ్రాసారు, ఒకటీ ప్రామాణికంగా లేదన్నారు వారు. మాట్లాడేముందు ఎవరో ఇచ్చిన పుస్తకాలతో అటూఇటూ తిప్పి కనిపించిన రెండు పేజీలు చదివి అయిదురోజుల పాటు రోజుకో ముప్పావుగంట సాయితత్త్వం గురించి చెప్పారాయన. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకున్నారు. సాయితత్త్వం గురించి మాట్లాడిన ఆయనకు వున్న అశ్రద్ధ, నిర్లక్ష్యం తెలిసిపోయేలా వుంది ఆయన ప్రవచించిన తీరు. షిరిడీ సాయిబాబా సంబంధించి షిరిడీలో సంస్థానం వుందనీ, సాయి గురించిన ప్రామాణికమైన గ్రంధమైన శ్రీ సాయి సచ్ఛరిత్ర ని అందిస్తుందనీ వారికి తెలియదా? తెలిసికునే అవుసరం లేదనుకున్నారాయన. అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు ఆయన.
సచ్ఛరిత్ర లో హేమాడ్ పంత్ గుర్తుచేసికున్న సుధాముని కధగురించి చెబుతూ ’అర్దం పర్దం లేని కధ అల్లి ఇష్టం వచ్చినట్లు వ్రాయడం మహాదోషం, అటువంటి వాటిని పారాయణ గ్రంధాలని పేరుపెట్టి చదవడం వలన పాపం సంక్రమిస్తుంది, చాలా తప్పు, అది ఎవరు రాసారో నాకు తెలియదు, నాకు ఎడ్రసు ఇస్తే నేను వుత్తరం రాసి ఉండేవాడిని నాకు ప్రమాణం చూపమని. లేదు, ఏ గ్రంధంలోనూ లేదీ కధ, నేను పురాణాలు చదివాను, కావ్యాలు చదివాను, ఎక్కడా ఈ కధలేదు, ఈ కధకి తాడూ లేదు, బొంగరమూ లేదు, మీకు రాసిన రచయిత ఎక్కడైనా కనబడితే కోటీశ్వరరావు గారు ఇలా రాయకూడదన్నారని చెప్పారని చెప్పండి’ అన్నారాయన. ఈవిధంగా మరెక్కదిఅనా గురుగ్రంధకర్త గురించి మాట్లాడే సాహసం ఆయన చేయలేరు. చేస్తే ఏమవుతుందొ ఆయనకి తెలుసు.
’సచ్ఛరిత్ర’ నూ హేమాడ్ పంత్ నూ ఏమన్నా సాయిభక్తులు నన్నేమీ చేయలేరన్న అహంకారంతోనే ఈ వ్యాఖ్యానాలు చేసారాయన. ఈ మధ్యకాలంలో ప్రతిచోటా, ప్రతిఇంటా సాయిబాబా, సచ్ఛరిత్ర వినబడుతున్నాయి. నాస్తికులూ, విప్లవవాదులూ కూడా సచ్ఛరిత్ర చదివి సంస్కారవంతులవుతున్నారు. ఇది వింటూ, చూస్తూ భరించలేకా, సహించలేకా అలా మాట్లాడివుండవచ్చు ఆయన.
గురువు చెప్పిన నీతిని కొంచెం పక్కకు తప్పడం వలన సంసారంలో తీవ్రమైన దెబ్బతగులుతుందనీ, ప్రక్కన వున్నవారికి పెట్టి తినాలి, అలాగే ప్రక్కన ఎవరూలేరని తినడం తప్పు అనీ భాగవతంలో సుధాముని కధ గుర్తుకు తెచ్చుకున్నారు హేమాడ్ పంత్. అంతే గానీ ఈ సందర్బంలో ’నివేదన’ గురించి భాగవతంలో లేదు, హేమాడ్ పంత్ కూడా రాయలేదు. కుచేలోపాఖ్యానంలో లేని, వ్రాయని ’నివేదని’ గురించి ఏవేవో చెబుతూ హేమాడ్ పంతని దూషించారు కోటీశ్వరరావు గారు. బహిరంగంగా హేమాడ్ పంత్ ని నిందించిన వారు ఈయన ఒక్కరే! సాయి కధలు ఎందరో వ్రాసారు. కానీ ఇలా ఇంతవరకూ ఎవరూ హేమాడ్ పంత్ ని అగౌరవపరుచలేదు.
హేమాడ్ పంత్ కధలు ఎలా రాయాలో చాగంటి వారిని అడిగి రాయాలా? కనబడితే చెప్పమన్నారు. హేమాడ్ పంత్ కనబడరు. ఆయనకు పునర్జన్మ లేదు, అంతటా వున్న సాయిలో ఆయన 1929 లోనే కలిసి పోయారు. ఆ అడ్రసు ఎక్కడో చాగంటి కోటీశ్వరరావు గారే కనుక్కుని ఉత్తరం రాస్తే మంచిది. తల్లి తండ్రీ, గురువుల దగ్గర గుర్తుచేసికునే పురాణాల కధల ప్రమాణాలు అడగడం అనుచితమూ అవికేమమూను.
సుధాముని కధని గుర్తుచేసికున్న హేమాడ్ పంత్ ని అర్ధంపర్ధం లేని కధలల్లారన్న చాగంటి కోటీశ్వరరావుగారే సచ్ఛరిత్రలో మేకల కధని ప్రస్తావిస్తూ సాయి మేకలవెంట పరుగెత్తారనీ, శిష్యులైన (కష్టపడి పేర్లు గుర్తుచేసికుని) తాత్యా, శ్యామా లు కూడా సాయి వెంట పరిగెత్తారనీ కధలల్లి కవిత్వం చెప్పారు. సాయి మేకల వెంట పరిగెత్తారని ఆయన ఎక్కడ చదివారు? శ్యామా, తాత్యాలు తన శిష్యులని సాయి కోటీశ్వరరావుగారికి చెప్పారా? లేదా శ్యామా, తాత్యాలు మేము సాయి శిష్యులమని ఎక్కడైనా చెప్పారా? ప్రమాణం చూపమనండి! ఒకరిని విమర్శించడం ఎంతసులువో, అంతే పాపమన్న సంగతి ఆయన తెలిసికోవాలి. సచ్ఛరిత్రలో జరిగింది జరిగినట్లు రాసారు హేమాడ్ పంత్. అలా కాకుండా సాయి మేకల వెంట పరుగెత్తుకు వెళ్ళారనీ, తాత్యా, శ్యామాలు సాయి శిష్యులనీ అనవసరమైన అసందర్బమైన వ్యాఖ్యలు చేసారు కోటీశ్వరరావుగారు. తాత్యా సాయి ని ఏమని పిలుస్తారో, శ్యామా సాయిని ఏవిధంగా గౌరవిస్తారొ తెలియని ఆ మహానుభావుడు సాయితత్త్వమ్ గురించి మాట్లాడుతారు తనకు మాత్రమే సాయి అనుగ్రహమ్ కలిగిందన్న అహంభావంతో. చివరకు మేకలకధ గురించి 5వ తరగతి పిల్లవాడు కూడా చెబుతాడు అంటారాయన చులకన భావంతో.
వందేళ్లక్రితం హేమాడ్ పంత్ అని సాయిచే పిలువబడిన అన్నాసాహెబ్ దభోళ్కర్ శ్రీ సాయిదివ్య దేహం ముందు కూర్చుని కళ్లారా చూస్తూ కాలు మీద కాలు సాయి వేసికున్న తీరును చూస్తూ పొందిన అనుభవాన్ని అక్షరబద్ధం చేసి, సాయి భక్తుల మదిలో చెరగని ముద్ర వేసారు. సచ్ఛరిత్ర ని చదువకుండా హేమాడ్ పంత్ ని దూషించిన చాగంటి వారు సాయి కూర్చున్న పద్దతి ’వీరాసనమ్’ నీ, సాయి ముందు కూర్చోడానికి అర్హత వుండాలనీ ఏవేవో చెప్పారు.
శంకర భగవత్పాదులనూ, వ్యాసుల వారినీ, శంకర మఠ పీఠాధిపతులనూ గొప్పవారని చెప్పారాయన సాయిబాబా మందిరంలో. ఆయనకు ఎవరిమీద శ్రద్దవుందో అందరికీ తెలుసు. మనసులోని శ్రద్ధకూ, చెప్తున్న మాటలకూ పొంతన లేకుండా, లక్ష్యం లేకుండా, శ్రద్దలేకుండా, సచ్ఛరిత్ర చదువకుండా, సచ్ఛరిత పారాయణాన్ని కించపరుస్తూ మాట్లాడడము, హేమాడ్ పంత్ పాపం చేసాడనడం సాయిభక్తుల కు ఎంత బాధ కలిగిస్తుందో ఆలోచించండి.
సచ్ఛరిత్ర ను హేమాడ్ పంత్ ని గురించి ఇలా అన్నారు, ఏదో పెద్దవారు అన్నారులే అనీ, ఏదో దృష్టితో అనివుంటారులే, అయినా ఆయన అంటే మాత్రమ్ మన నమ్మకం తగ్గిపోతుందా, ఏమిటి అనీ, నేను రాసిన పుస్తకాల గురించి కాదుగా అనీ, మా సాయిబాబా మందిరంలో అనలేదుగా అనీ, అయినా ఆయన బాబాని ఏమీ అనలేదుగా అనీ అనుకుంటూ మనల్ని మనం మభ్యపెట్టుకుంటూ వుదాశీనం గా వుండడం ధర్మం కాదు. సచ్ఛరిత పారాయణనూ, హేమాడ్ పంత్ నూ అలా అవమానించడం తప్పు అని నిరసించండి! సాయిభక్తులందరూ చాగంటి కోటీశ్వరరావుగారి వ్యాఖ్యలను ఖండించండి! రాయండి! చెప్పండి! ఇక ముందెవ్వరూ సచ్ఛరిత్ర గురించీ, హేమాడ్ పంత్ గురించీ అవాకులూ చెవాకులూ మాట్లాడడానికి సాహసించకూడదు!
సాయి సేవలో
కృష్ణావఝ్ఝుల రాజేంద్రప్రసాద్,
Jai Sairam I agree with Sri Krishnavajjula Rajendra Prasad garu, I pray GOD to give SADBHUDHI to Sri Chaganti Koteswararao-Saibanisa Gopalarao Ravada
ReplyDelete