ఓం
శ్రీ సాయి నాథాయ నమః
శ్రీ
సాయిబాబా
జీవిత చరిత్రము
అయిదవ అధ్యాయము
పెండ్లి వారితో కలసి తిరిగి షిరిడీ వచ్చుట
ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయు డొకండుండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుఱ్ఱము తప్పిపోయెను. రెండుమాసములు శోధించినను దాని యంతు దొరకకుండెను. అతడు నిరాశచెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాదునుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. 9 మైళ్ళు నడచిన పిమ్మట నొక మామిడిచెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో నొక వింత పురుషుడు కూర్చొనియుండెను. అతడు తలపై టోపి, పొడుగైన చొక్కా ధరించియుండెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటీలును జూచి, అతనిని బిలిచి చిలుము త్రాగి కొంతతడవు విశ్రాంతిగొనుమనెను. జీనుగురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుఱ్ఱముదని చాంద్ పాటిల్ బదులు చెప్పెను. దగ్గరగా నున్న కాలువలో వెదకుమని ఫకీరు చెప్పెను. అతడచటకు పోయి గడ్డి మేయుచున్న గుఱ్ఱమును చూచి మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణమనుజుడు కాడనియు గొప్ప ఔలియా (యోగిపుంగవుడు) అయివుండవచ్చుననియు అనుకొనెను. గుఱ్ఱమును దీసికొని ఫకీరువద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కాని నీరు, నిప్పు కావలసి యుండెను. చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసియుండెను. ఫకీరు ఇనుపచువ్వను భూమిలోనికి గ్రుచ్చగా నిప్పు వచ్చెను. సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. చప్పి నా నీటితో తడిపి, నిప్పుతో చిలుమును వెలిగించెను. అంతయు సిద్ధముగా నుండుటచే ఫకీరు ముందుగా చిలుము పీల్చి చాంద్ పాటీలు కందించెను. ఇదంతయు జూచి చాంద్ పాటీలు ఆశ్చర్యమగ్నుడయ్యెను. ఫకీరును తన గృహము నకు రమ్మనియు, అతిథిగా నుండుమనియు చాంద్ పాటీలు వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి యచ్చట కొంతకాలముండెను. ఆ పాటీలు గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురుది షిరిడీ గ్రామము. అందుచే షిరిడీ పోవుటకు పాటీలు కావలసినవన్ని జాగ్రత్త చెసికొని ప్రయాణమునకు సిద్ధపడెను. పెండ్లి వారితో కూడ ఫకీరు బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లి వారు ధూప్ గ్రామము తిరిగి వచ్చిరి గాని ఫకీరు షిరిడీలో ఆగి యచ్చటనే స్ధిరముగా నిలిచెను.ఫకీరుకు సాయినామ మెట్లు వచ్చెను?
పెండ్లివారు షిరిడీ చేరగనే ఖండోబామందిరమునకు సమీపమున నున్న భక్తమహాళ్సాపతిగారి పొలములో నున్న మఱ్ఱిచెట్టు క్రింద బసచేసిరి. ఖండోబామందిరమునకు తగిలియున్న ఖాళీజాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో నున్నవారొకరితరువాత నొకరు దిగిరి. ఫకీరు కూడ అట్లనే దిగెను. భక్తమహాళ్సాపతి యా చిన్నఫకీరు దిగుట జూచి "దయచేయుము సాయీ" యని స్వాగతించెను. తక్కినవారు గూడ ఆయనను సాయి యని పిలువనారంభించిరి. అదిమొదలు వారు సాయిబాబా యని ప్రఖ్యాతులైరి.ఇతరయోగులతో సహవాసము
సాయిబాబా షిరిడీలో నొక మసీదులో నివాస మేర్పరచు కొనిరి. బాబా రాకపూర్వమే దేవిదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరములనుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమున కిష్టపడెను. అతనితో కలసి మారుతీ దేవాలయములోను, చావడిలోను, కొంతకాల మొంటరిగాను ఉండెను. అంతలో జానకీదాసు గోసావి అను నింకొక యోగి యచ్చటకు వచ్చెను. బాబా ఎల్లప్పుడు ఈ యోగితో మాట్లాడుచు కాలము గడుపుచుండువారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీ దాసు పోవుచుండెను. అట్లనే యొక వైశ్యయోగి పుణతాంబే నుంచి వచ్చుచుండెడివాడు. వారి పేరు గంగాఘీరు. అతనికి సంసార ముండెను. అతడు బాబా స్వయముగా కుండలతో నీళ్లుమోసి పూలచెట్లకు పోయుట జూచి యిట్లనెను. "ఈ మణి యిచ్చటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్ళు మోయుచున్నాడు. కాని యితడు సామాన్యమానవుడు కాడు. ఈ నేల పుణ్యము చేసికొనినది గనుక సాయిబాబా యను నీ మణిని రాబట్టుకొనగలిగెను." యేవేలా గ్రామములో నున్న మఠములో ఆనందనాథుడను యోగిపుంగవుడుండెను. అతడు అక్కల్ కోటకర్ మహారాజుగారి శిష్యుడు. అతడొకనాడు షిరిడీ గ్రామనివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను జూచి యిట్లనెను. "ఇది యమూల్యమైన రత్నము. ఈతడు సామాన్యమానవునివలె గాన్పించునప్పటికిని యిది మామూలు రాయికాదు. యిదియొక రత్నమణి. ముందు ముందు ఈ సంగతి మీకు తెలియగలదు." ఇట్లనుచు యేవలా చేరెను. ఇది శ్రీ సాయిబాబా బాల్యమున జరిగిన సంగతి.బాబా దుస్తులు - వారి నిత్యకృత్యములు
యౌవనమునందు బాబా తలవెంట్రుకలు కత్తిరించక జుట్టు పెంచుచుండెను. పహిల్వానువలె దుస్తులు వేసికొనిడివారు. షిరిడీకి మూడుమైళ్ళదూరములో నున్న రహాతా పోయినపుడు బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసికొనివచ్చి, నేలను చదునుచేసి, వానిని నాటి, నీళ్ళు పోయుచుండెను. బావినుండి నీళ్ళుచేది కుండలు భుజముపై పెట్టుకొని మోయుచుండెను. సాయంకాలము కుండలు వేపచెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చనివగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలుగుచుండెడివి. ఆ మరుసటి దినము తాత్యా యింకొక రెండు కుండలను ఇచ్చుచుండెడివాడు. ఇట్లు మూడుసంవత్సరములు గడచెను. సాయిబాబా కృషివలన అచ్చట నొక పూలతోట లేచెను. ఆ స్థలములోనే యిప్పుడు బాబా సమాధి యున్నది. దానినే సమాధిమందిర మందురు. దానిని దర్శించుట కొరకే యనేకమంది భక్తులు విశేషముగా పోవుచున్నారు.వేపచెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము
అక్కల్ కోటకర్ మహారాజుగారి భక్తుడు భాయి కృష్ణజీ అలి బాగ్ కర్. ఇతడు అక్కల్ కోటకర్ మహారాజుగారి ఫోటోను పూజించెడి వాడు. అతడొకప్పుడు షోలాపూరు జిల్లాలోని అక్కల్ కోట గ్రామమునకు పోయి మహారాజుగారి పాదుకలు దర్శించి పూజించవలెనని యనుకొనెను. అతడచ్చటికి పోకమునుపే స్వప్నములో మహారాజు దర్శనమిచ్చి యిట్లు చెప్పెను. "ప్రస్తుతము షిరిడీ నా నివాసస్థలము. అచ్చటికి పోయి నీ పూజ యొనరింపుము." అందుచే భాయి కృష్ణజీ తన నిర్ణయమును మార్చుకొని షిరిడీ చేరి బాబాను పూజించి యచ్చటనే యారు మాసములు ఆనందముతోనుండెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణమాసములో నొక శుభదినమున వేపచెట్టుక్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది 1912వ సంవత్సరములో జరిగెను. దాదా కేల్కర్, ఉపాసనీబాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. ఒక దీక్షిత బ్రాహ్మణుడు నిత్యపూజ చేయుటకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు అధికారము భక్తసగుణున కబ్బెను.ఈ కథయొక్క పూర్తి వివరములుఠాణేవాసి బి.వి.దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు విరమించిన మామలతదారు. వేపచెట్టుక్రింద పాదుకల విషయము సంగతులన్నియు భక్తసగుణనుండి గోవిందకమలాకర్ దీక్షిత్ నుండి సంపాదించి, పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీసాయిలీల 11వ సంపుటిలో నీరీతిగా ప్రచురించిరి.1912వ సంవత్సరము బొంబాయినుండి రామారావు కొఠారె యను డాక్టరొకడు షిరిడీ వచ్చెను. వాని మిత్రుడొకడు, వాని కాంపౌండర్ భాయికృష్ణజీ అలిబాగ్ కర్ అనునతడు వెంట వచ్చిరి. వారు భక్తసగుణుతోను జి. కె. దీక్షిత్ తోను స్నేహము చేసిరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకొనునపుడు బాబా ప్రప్రథమమున షిరిడీ ప్రవేశించి వేపచెట్టు క్రింద తపస్సు చేసినదాని జ్ఞాపకార్థము బాబా యొక్క పాదుకలను వేపచెట్టు క్రింద ప్రతిష్ఠించవలెనని నిశ్చయించుకొనిరి. పాదుకలను రాతితో చెక్కించుటకు నిశ్చయించిరి. అప్పుడు భాయి కృష్ణజీ స్నేహితుడగు కాంపౌండర్ లేచి యా సంగతి డాక్టరు రామారావుకొఠారెకు దెలిపినచో చక్కని పాదుకలు చెక్కించెదరని నుడివెను. అందరు ఈ సలహాకు సమ్మతించిరి. డాక్టరుగారికి ఈ విషయము తెలియపరచిరి. వారు వెంటనే షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకలను జూపిరి. వారు కొన్ని మార్పులను జేసి, పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేపచెట్టు గొప్పతనమును దెలుపు యీ క్రింది శ్లోకమును కూడ చెక్కుమనిరి. సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతమ్| తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం|| ఉపాసనీ సలహాల నామోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండరు ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమినాడు స్థాపన చేయుమని బాబా యాజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జి. కె. దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరమునుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా యా పాదుకలను తాకెను. అవి భగవంతుని పాదుకలని నుడివెను. చెట్టుక్రింద ప్రతిష్ఠింపుడని యాజ్ఞాపించెను. శ్రావణ పౌర్ణమి ముందురోజు బొంబాయి పాస్తాసేట్ యను పార్సీ భక్తుడొకడు మనియార్డరు ద్వారా రూ. 25లు పంపెను. బాబా యీ పైకము పాదుకలను స్థాపించు ఖర్చునిమిత్త మిచ్చెను. మొత్తము రూ. 100లు ఖర్చు పెట్టిరి. అందులో రూ. 75లు చందాలవల్ల వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జి.కె.దీక్షిత్ యను బ్రాహ్మణుడు ఈ పాదుకలకు పూజచేసెను. తరువాత లక్షణ్ కచేశ్వర్ జఖాడె యను బ్రాహ్మణుడు (నానుమామా పూజారి) పూజ చేయుచుండెను. మొదటి 5 సం||ములు నెలకు రూ. 2లు చొప్పున డాక్టర్ కొఠారె దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకలచుట్టు కంచెకూడ పంపెను. ఈ కంచెయు, పై కప్పును కోపర్ గాం స్టేషనునుండి షిరిడీ తెచ్చుటకు 7-8-0 ఖర్చు భక్తసగుణు ఇచ్చెను. ప్రస్తుతము జఖాడె పూజచేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును, దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట భాయికృష్ణజీ అక్కల్ కోటకర్ మహారాజు భక్తుడు. 1912వ సం||ములో వేపచెట్టు క్రింద పాదుకలు స్థాపించునపుడు అక్కల్ కోటకు పోవుచు మార్గమధ్యమున షిరిడీయందు దిగెను. బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్ కోట గ్రామమునకు పోవలెననుకొని బాబావద్దకేగి యనుమతి నిమ్మనెను. బాబా యిట్లనెను. "అక్కల్ కోటలో నేమున్నది? అక్కడకేల పోయెదవు? అక్కడుండే మహారాజు ప్రస్తుతమిక్కడ నున్నారు. వారు నేనే." ఇది విని భాయి కృష్ణజీ అక్కల్ కోటవెళ్లుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేసెను. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ - జీవితములో మార్పుషిరిడీగ్రామములో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తంబోలి యనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు. వానికి బాబాకు ఒక విషయములో భేదాభిప్రాయము వచ్చి కుస్తీపట్టిరి. అందులో బాబా యోడిపోయెను. అప్పటినుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను, నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని పొడవు చొక్కాను తొడిగికొని నెత్తిపైని గుడ్డ కట్టుకొనేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునేవారు. చింకిగుడ్డలతో సంతుష్టి చెందెడివారు. రాజ్య భోగముకంటె దారిద్ర్యమే మేలని నుడివెడివారు. దరిద్రుని స్నేహితుడు భగవంతుడే. గంగాఘీరుకు కూడ కుస్తీలయందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా వైరాగ్యము కలిగెను. అదే కాలమందు శరీరమును మాడ్చి దేవుని సహవాసము చేయవలెనని యాకాశవాణి పలికెను. అప్పటినుండి గంగాఘీరు సంసారమును విడిచెను. ఆత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను. పుణతాంబే దగ్గర నదియొడ్డున యొక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను.సాయిబాబా జనులతో కలసి మెలసి తిరుగువారు కారు. అడిగినపుడు మాత్రము జవాబిచ్చువారు. దినమంతయు వేపచెట్టునీడయందు, అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ యొడ్డునందుండు తుమ్మ చెట్టు నీడన కూర్చొనెడివారు. సాయంకాల మూరకనే పచారు చేయువారు. లేదా నీమగాం పోవుచుండెడివారు. త్రయంబక్ జీ డేంగ్లే యనునతని యింటికి తరచుగా పోవువారు. డేంగ్లేయందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబు. అతడు ద్వీతీయవివాహము చేసికొన్నను సంతానము కలుగలేదు. బాబాసాహెబు డేంగ్లే నానాసాహెబును సాయిబాబా వద్దకు పంపెను. వారి యనుగ్రహముచే పుత్ర సంతానము కలిగెను. అప్పటినుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా వచ్చుచుండిరి. వారికీర్తి యంతట వెల్లడియాయెను. అహమద్ నగరు వరకు వ్యాపించెను. అక్కడనుంచి నానాసాహెబు చాందోర్కరు, కేశవ చిదంబర్ మొదలుగాగల యనేకమంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టియుండెడివారు. బాబా రాత్రులందు పాడుపడిన పాతమసీదునందు శయనించుచుండెను. అప్పట్లో బాబాయొక్క సామానులు చాల తక్కువ. అవి చిలుము, పొగాకు, తంబిరేలు గ్లాసు, పొడుగుచొక్కా, తలపైనిగుడ్డ, ఎల్లప్పుడు దగ్గరనుంచుకొను సటకా మాత్రమే. తలపైగుడ్డ జడవలె చుట్టి యెడమచెవిపైనుంచి వెనుకకు వ్రెలాడునట్లు వేసికొనువారు. వీనిని వారములతరబడి ఉతుకకుండ నుంచువారు. చెప్పులను తొడిగే వారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చొనేవారు. కౌపీనము ధరించువారు. చలిని వారించుటకు ధుని కెదురుగా యెడమచేయి కట్టడాపై వేసి దక్షిణాభిముఖముగా కూర్చుండువారు. ఆ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో రెండుగదుల స్థలము మాత్రముండెను. భక్తులంద రచటకు పోయి బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి దానిలో మార్పు కలిగెను. పాతమసీదు మరామతు చేసి నేలపైని నగిషీ రాళ్ళు తాపనచేసిరి. బాబా యా మసీదుకు రాకపూర్వము 'తకియా' (రచ్చ)లో చాలాకాలము నివసించిరి. బాబా కాళ్ళకు చిన్న మువ్వలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు; భక్తి పూర్వకమయిన పాటలు పాడేవారు.
శాంతిః శాంతిః శాంతిః అయిదవ అధ్యాయము సంపూర్ణము. ।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు। ।శుభం భవతు। |
0 comments:
Post a Comment