Total Pageviews

Tuesday, February 5, 2013

శ్రీ సాయి సత్ చరిత్రము ఏబదియొకటవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఏబదియొకటవ అధ్యాయము

సత్చరిత్రములోని 52, 53 అధ్యాయములిందు 51వ అధ్యాయముగా పరిగణించవలెను.

తుదిపలుకు

ఇదియే చివరి అధ్యాయము. ఇందు హేమడ్ పంతు ఉపసంహారవాక్యములు వ్రాసెను. పీఠికతో విషయసూచిక నిచ్చునట్లు వాగ్దానము చేసెను. కాని యది హేమడ్ పంతు కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బి. వి. దేవు (ఠాణా వాసి, ఉద్యోగమును విరమించుకొనిన మామలతదారు) కూర్చెను. ప్రతి అధ్యాయప్రారంభమున దానిలోని యంశములను ఇచ్చుటచే విషయసూచిక యనవసరము. కాబట్టి దీనినే తుదిపలుకుగా భావించెదము. ఈ అధ్యాయమును సవరించుటకు, ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసియున్నట్లు కనబడలేదు. అచ్చటచ్చట చేతి వ్రాతను బోల్చుకొనుటగూడ కష్టముగా నుండెను. కాని యదంతయు నున్నదున్నట్లుగా ప్రచురింపవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్యవిషయములు ఈ దిగువ క్లుప్తముగా జెప్పబడినవి.

సద్గురు సాయియొక్క గొప్పదనము

శ్రీ సాయి సమర్థునకు సాష్ఠాంగనమస్కారము చేసి వారి యాశ్రయమును పొందెదము. వారు జీవజంతువులయందును, జీవములేని వస్తువులయందు కూడ వ్యాపించియున్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మస్వరూపమువరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగాగలవాని యన్నిటియందు వ్యాపించియున్నారు. జీవరాశియందంతటను కూడ వ్యాపించియున్నారు. భక్తులందరు వారికి సమానమే. వారికి మానావమానములు లేవు. వారికిష్టమైనవి యయిష్టమయినవియు లేవు. వారినే జ్ఞప్తియందుంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటిని నెరవేర్చి మనము జీవితపరమావధిని పొందునట్లుచేసెదరు.

ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహాకష్టము. విషయసుఖములనెడు కెరటములు దురాలోచలనే ఒడ్డును తాకుచు ధైర్యమను చెట్లను కూడ విరుగగొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము, అసూయలను మొసళ్లు నిర్భయముగా సంచరించును. అచట నేను, నాది యను సుడిగుండములును, ఇతర సంషయములును గిర్రున తిరుగుచుండును. పరనింద, అసూయ, ఓర్వలేనితనము అను చేప లచట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికి సాయి సద్గురువు దానికి అగస్త్యునివంటి వాడు (నాశనముచేయువాడు). సాయిభక్తులకు దానివల్ల భయమేమియుండదు. ఈమహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావవంటి వారు. వారు మనలను సురక్షితముగ దాటించెదరు.


ప్రార్థన

మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగనమస్కారము చేసి వారి పాదములు బట్టుకొని సర్వజనులకొరకు ఈ క్రింది ప్రార్థనము చేసెదము. మా మనస్సు అటునిటు సంచారము చేయకుండు గాక. నీవు దప్ప మరేమియు కోరకుండు గాక. ఈ సత్ చరిత్రము ప్రతి గృహమందుండు గాక. దీనిని ప్రతినిత్యము పారాయణ చేసెదెముగాక. ఎవరయితే దీనిని నిత్యము పారాయణ చేసెదరో వారి యాపదలు తొలగిపోవుగాక.

ఫలశ్రుతి

ఈ గ్రంథమును పారాయణ చేసినచో గలుగు ఫలితమునుగూర్చి కొంచెము చెప్పుదుము. పవిత్రగోదావరిలో స్నానము చేసి, షిరిడీలో సమాధిని దర్శించి, సాయి సత్ చరిత్రము పారాయణ చేయుటకు ప్రారంభింపుము. నీ విట్లు చేసినచో నీకుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధకలుగును. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయు చున్నచో నీ పాపములన్నియు నశించును. జననమరణములనే చక్రమునుండి తప్పించుకొనవలెనన్నచో సాయికథలను చదువుము. వాని నెల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొనుము, వారి పాదములనే యాశ్రయింపుము; వానినే భక్తితో పూజింపుము. సాయికథలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో నందు క్రొత్తసంగతులను గ్రహించగలవు. వినువారిని పాపములనుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణస్వరూపుమునే ధ్యానించినచో క్రమముగా నది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. ఆత్మసాక్షాత్కారమును పొందుట బహుకష్టము. కాని నీవు సాయి సగుణస్వరూపముద్వారా పోయినచో నీప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్యశరణాగతి వేడినచో నతడు 'తాను' అనుదానిని పోగొట్టుకొని నది సముద్రములో గలియునట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో ననగా జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థలలో నేదయిన యొక్క యవస్థలో వారియందు లీనమయినచో సంసారబంధమునుండి తప్పుకొందువు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోను, పూర్తినమ్మకముతోను పారాయణ చేసి వారము రోజులలో ముగింతురో, వారి యాపద లన్నియు నశించగలవు. దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారము వృద్ధియగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలమాధారపడియున్నది. ఈ రెండును లేనిచో నెట్టి యనుభవమును కలుగదు. దీనిని గౌరవముతో పారాయణ చేసినచో, శ్రీ సాయి ప్రీతి చెందును. నీ యజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యముల నొసంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో నది యపరిమితానందమును కలుగజేయును. ఎవరు హృదయమునందు తమ శ్రేయస్సును కోరేదరో వారు దానిని జాగరూకతతో పారాయణ చేయవలయును. అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో, సంతసముతో జన్మజన్మములవరకు మదిలో నుంచుకొనును. ఈ గ్రంధమును గురుపౌర్ణమినాడు (అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమినాడు) గోకులాష్టమినాడు, శ్రీ రామనవమినాడు, దసరానాడు (అనగా బాబా పుణ్యతిథినాడు) ఇంటివద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసినయెడల వారల కోరిక లన్నియును నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మినయెడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు. దీనిని పారాయణ చేసినయెడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు. అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నియు పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును.

ఓ ప్రియమైన భక్తులారా! పాఠకులారా! శ్రోతలారా!

మీకు కూడ మేము నమస్కరించి మీ కొక మనవి చేయుచున్నాము. ఎవరి కథలను ప్రతిరోజు, ప్రతినెల, మీరు పారాయణ చేసితిరో వారిని మరువవద్దు. ఈ కథల నెంత తీవ్రముగా చదివెదరో, వినెదరో - అంత తీవ్రముగా మీకు ధైర్యము, ప్రోత్సాహము, సాయిబాబా కలుగచేసి, మీచే సేవ చేయించి, మీ కుపయుక్తముగా నుండునట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు, చదువరులును సహకరించవలెను. ఒండొరులు సహాయము చేసికొని సుఖపడవలెను.

ప్రసాద యాచనము

దీనిని సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము. ఈ దిగువ కారుణ్యమును జూపుమని వారిని వేడెదము. దీనిని చదువువారును, భక్తులును హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక! సాయి సగుణస్వరూపము వారి నేత్రములందు నాటిపోవును గాక! వారు శ్రీ సాయిని సర్వజీవములయందు చూచెదరు గాక! తథాస్తు.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
శ్రీ సాయిసత్చరిత్రము సర్వము సంపూర్ణము.

।।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।।
।।శుభం భవతు।। 

1 comment:

  1. ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

    మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

    సాయి రామ్ సేవక బృందం,
    తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
    సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
    * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

    ReplyDelete