రేగే అను భక్తుడు హైకోర్టులో జడ్జిగా పనిచేశాడు. ఉపనయనమైనప్పటినుండి అతడు ఆసన, ప్రాణాయామా లతో పాటు సూర్యుని బింబము మధ్యలో శ్రీమన్నారాయణుడున్నట్లు ధ్యానిస్తూండేవాడు. అతనికి 1910లో ఒకే రాత్రి మూడు కలలు వచ్చాయి :
1) అతడు తన శరీరము నుండి విడివడి, ఎదుట శ్రీమన్నారాయణుని చూస్తున్నాడు.
2) ఈసారి శ్రీమన్నారాయణుడు తన ప్రక్కనున్న ఒక వ్యక్తిని చూపి, 'ఈ శిరిడీ సాయి నీవాడు; ఆయననాశ్రయించు అన్నాడు.
3) అతడు గాలిలో తేలి ఒక గ్రామం చేరాడు. ఒక వ్యక్తి కన్పించి అది శిరిడీ అని చెప్పి, అతనినొక మశీదుకు తీసుకెళ్ళాడు. అక్కడ సాయి కాళ్ళు చాపుకొని కూర్చొని వున్నారు. అతడు నమస్కరించగానే లేచి, అతనిని కౌగిలించుకొని, నీవు నా దర్శనానికి వచ్చావా? నేనే నీకు ఋణపడ్డాను; నేనే నీ వద్దకు రావాలి' అని అతనికి నమస్కరించారు. తర్వాత కొంతకాలానికి అతడు శిరిడీ వెళ్ళి బాబాకు నమస్కరించగానే ఆయన, అరే! మనిషిని పూజించడమేమిటి? అని అతని సంశయముపై దెబ్బతీసారు. స్వప్నంలోలాగ తనను దగ్గరకు తీయలేదని నిరాశ చెంది, మధ్యాహ్నం బాబా ఒక్కరే వున్నప్పుడు ఆయనను దర్శించాడు రేగే. ఆయన అతనిని కౌగిలించుకొని, "నీవు నా వాడివి. క్రొత్తవారి ఎదుట బిడ్డలను దగ్గరకు తీయము" అన్నారు. అతని కల నిజమైంది. ఇష్టదైవం అతనికి సదురువును చూపాడు! అతని ఆనందానికి అవధులు లేవు.
అతడు 1915లో రామనవమికి ఒక మస్లిన్ గుడ్డ తీసుకొని శిరిడీ చేరాడు. సహజంగా బాబా భక్తులిచ్చే గుడ్డలు ప్రసాదంగా తిరిగి వారికే యిచ్చేసేవారు. కాని తానిచ్చే గుడ్డను వారే వుంచుకోవాలనుకొని రేగే దానిని రహస్యంగా వారి ఆసనం క్రింద పెట్టాడు. బాబా అందరిచ్చిన గుడ్డలు తిరిగి యిచ్చివేసి, లేచి నిలబడి, ఆసనం దులిపివేయమన్నారు. అపుడు కన్పించిన ఆ మస్లిన్ను తీసి కప్పుకొని, "ఇది నాది! నేను కప్పుకొంటే బాగుండలేదూ?" అని అతనికేసి చూచి నవ్వారు. అలాగే ఒక గురుపూర్ణిమనాడు భక్తులందరూ బాబాకు మూలలు వేస్తున్నారు. తానేమీ తీసుకురాలేదని రేగే నొచ్చుకుంటుంటే బాబా తన మెడలోని మాలలన్నీ అతనికి చూపి, "ఇవన్నీ నీవే!" అన్నారు.
ఒకనాటి మధ్యాహ్నం రేగేను మశీదుకు పిలిపించి, బాబా ప్రేమగా "నా ఖజానా తాళంచెవి నీ చేతిలో పెట్టాను, నీకేమి కావాలో కోరుకో, యిస్తాను!" అన్నారు. రేగే వివేకంతో, అన్ని జన్మలలోనూ మీరు నాకు తోడుండాలి! అన్నాడు. ఆయన, "తప్పక వుంటాను" అని సంతోషంతో అతని వీపు తట్టారు. నాటినుండి అతనికెప్పుడూ బాబా తన దగ్గరున్నట్లే వుండేది. అతని బిడ్డ చనిపోయినప్పుడు రేగే ఎదుట సాయి ప్రత్యక్షమై "నీకు నేను కావాలా, బిడ్డ కావాలా? బిడ్డ కావాలంటే బ్రతికిస్తానుగాని, మనకెట్టి సంబంధమూ వుండదు. నీకింకా బిడ్డలు కలుగుతారు" "మాకు మీరే కావాలి?" అన్నాడు రేగే, "అయితే దుఃఖించకు!" అని బాబా అదృశ్యమయ్యారు
No comments:
Post a Comment