భగవంతుని పట్ల మనం ఎంత ఆరాధనాభావంతో ఉండాలో, వినయవిధేయతలు చూపాలో షిర్డీ సాయిబాబా స్వయంగా ఆచరించి చూపారు. దేవునికి వినమ్రంగా చేతులు జోడించాలని, మనల్ని మనం అర్పించుకోవాలని చెప్పేవారు బాబా.
సాయిబాబా అపూర్వ శక్తిసంపన్నుడు అయ్యుండీ తాను దైవాన్ని అని ఎన్నడూ చెప్పుకోలేదు. దేవుడు తనకు అప్పగించిన కార్యాలను నిర్వహించడానికి వచ్చానని చెప్పేవారు. భగవంతుని పట్ల అంతులేని ప్రేమను, వినయాన్ని ప్రకటించేవారు. సృష్టిలో దైవాన్ని మించింది ఇంకేదీ లేదని నిగర్వంగా చెప్పేవారు.
ఒక సందర్భంలో సాయిబాబా "నేను బానిసల్లో బానిసని. నీకు ఎంతగానో రుణపడి ఉన్నాను. నీ అపురూపమైన దర్శనంతో ఎనలేని ఆనందం కలుగుతోంది. సంతృప్తి చెందుతున్నాను. నీ పాదసేవ చేసుకోవడం నా అదృష్టం. ఈ భాగ్యాన్ని నాకు ఎన్నడూ దూరం చేయకు..." అన్నారు.
సాయిబాబా తన నడవడినే మనకు ఆదర్శంగా చేసి చూపారు. మనం ఆయన్ను అనుసరించే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఒక్కరోజులో సర్వం వంటబట్టకున్నా క్రమక్రమంగా ఒక్కో లక్షణాన్నీ అలవరచుకోవచ్చు.
భగవంతునికి లేని సంపదలు అంటూ లేవు. ఆయన జ్ఞానానికి, కీర్తికి ఆకాశమే కొలమానం. దేవుడు మహా మహిమాన్వితుడు. భగవంతునికి ఏ ఒక్కరిమీదా ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉండవు. కానీ అందరిమీదా ఔదార్యం చూపిస్తాడు.
మనం ఈ లోకలో అడుగుపెట్టింది జలసాలు, విలాసాలతో కాలక్షేపం చేస్తూ, సమయాన్ని వ్యర్ధం చేసుకోడానిక్కాదు. భగవన్నామస్మరణతో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భక్తులు, భగవంతుని చేరుకునే మార్గం సులభమైందేమీ కాదు. అది కొంచెం కష్టంతో కూడుకున్నదే. అభ్యాసంతో తేలికౌతుంది. సద్గురువు చేయి పట్టుకు నడిస్తే మరింత సులభసాధ్యమౌతుంది.
సాయిబాబా తనను దైవంగా చెప్పుకోక గురువుగా భావించమని మాత్రమే అనేవారు. బాబా సద్గురువు మాత్రమే కాదు, భగవంతుడేనని ఆయనతో కలిసి జీవించిన చాలామంది విశ్వసించారు. బాబా లీలలు మనలో చాలామందికి అనుభవమౌతున్నాయి.
సాయిబాబా చూపిన వినమ్రత, దయ, కరుణ, ఔదార్యం మొదలైన అద్భుత గుణాలను మనమూ అలవరచుకుందాం. వ్యర్థ విషయాలతో కాలాన్ని హరింపచేయకుండా, సాయి భగవాన్ నామస్మరణతో సద్వినియోగం చేసుకుందాం. జీవితాన్ని సార్ధకం చేసుకుందాం. సాయి నామం సుఖశాంతులనిస్తుంది.
0 comments:
Post a Comment