తనను నమ్మిన భక్తులను బాబా జన్మజన్మాంతరాలలోను కాపాడుతునే వుంటాడు. వారికిచ్చిన మాటను ఆయన యధా నిలుపుకుంటాడు. అలాంటి ఉదంతం మనకు ఈ కథ ద్వారా తెలుస్తుంది.
ఒకరోజు బాబా ఒక నదీ తీరంలో నడుస్తు ఉన్నారు. కొంత దూరం ప్రయానించిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. చిలుము వెలిగించుకోవడానికి ప్రయత్నించుచుండగా ఒక కప్ప బెకబెకలాడుతున్న శబ్దం వినిపించింది. అంతలో ఒక భక్తుడు బాబా దగ్గరకు వచ్చి చిలుము వెలిగించే ఆయనకు అందించెను. భోజనానికి రావల్సిందిగా బాబాను ఆహ్వానించెను. మరలా కప్ప బెకబెకలాడెను. ఆ భక్తుడు అదేమి గమనించలేదు. కానీ, ఆ కప్ప శబ్దం విన్న బాబా ఆ కప్ప పూర్వ జన్మ పాపం అనుభవిస్తోందని చెప్పెను. పూర్వ జన్మ ఫలం అనుభవించవలసినదే. తప్పదు అని బాబా పలికెను. అప్పుడు ఆ వ్యక్తి కప్ప ఉన్న చోటుకి వెళ్లి చూసెను. ఆ కప్పను పాము నోట్లో కరుచుకొని వుంది. అది చూసి వచ్చి అతను బాబాతో - పది నిముషాల్లో పాము ఆ కప్పను మింగేస్తుంది అని చెప్పేను. దానికి బాబా - అలా జరుగదు. నేను తండ్రిని. అలా ఎప్పటికీ జరుగనివ్వను. ఆ పాము కప్పను తినలేదు. తప్పకుండా విడిపిస్తాను చూడు అన్నారు.
కాసేపు చిలుము పీల్చిన తర్వాత బాబా కప్ప వున్న చోటుకి వెళ్లెను. బాబాను పాము దగ్గరగా వెళ్లవద్దని ఆ వ్యక్తి హెచ్చరించాడు. బాబా అతని మాట పట్టించుకోకుండా, ముందుకు వెళ్లి, - వీరభద్రప్పా, నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మెత్తి తన తప్పు తెలుసుకున్నాడు. నీవు పాముగా పుట్టి నీ తప్పు తెలుసుకోలేదా... అతనిపై ఇంకా శత్రుత్వమా... నీకు సిగ్గుగా లేదా... ఇప్పటికైనా ఈ పగ విడిచిపెట్టు అని పలికెను. బాబా మాటలు విన్న పాము, కప్పను విడిచి నీటిలోకి వెళ్లిపోయింది. కప్ప కూడా తన దారిన పొదలలోకి వెళ్లిపోయింది. ఇదంతా చూస్తున్న ఆ వ్యక్తికి ఒక్క నిముషం ఏమీ అర్థం కాలేదు. ఈ వీరభద్రప్ప, చెన్నబసప్ప ఎవరు... వీరి మధ్య శత్రుత్వం ఏమిటి అని బాబాను ప్రశ్నించాడు. అప్పుడు బాబా ఈ వృత్తాంతం చెప్పుట ఆరంభించెను.
మా ఊరిలో ఒక పురాతన శివాలయం ఉంది. అది శిథిలావస్తకు చేరుకుంది. గ్రామస్తులు తమ ధనం కూడబెట్టి ఆ ఆలయానికి మరమ్మత్తులు చెయించాలని నిశ్చయించుకున్నారు. డబ్బు కూడేసి ఒక ధనవంతునికి ఒప్పజెప్పి మరమ్మత్తులు చేయించనమి చెప్పిరి. ఆ ధనవంతుడు పరమలోభి. దేవాలయం కోసం ఇచ్చిన డబ్బు మింగి, పనులేమి చేయలేదు. గ్రామస్తులకు తన మాటల చాతుర్యంతో మాయ చేసెను. వారిచ్చిన డబ్బు చాలలేదని మరింత ధనం పోగేసి రమ్మని పంపించెను. వారు మరలా డబ్బు జమ చేసి ఆ ధనవంతుడికిచ్చెను. అప్పుడు కూడా అతను గుడి బాగోగులు ఏమి పట్టించుకోలేదు. కొంతకాలం తర్వాత అతని భార్యకు కలలో శివుడు కనిపించి - గుడి శిఖరం కట్టించు నీవు చేసిన ఖర్చుకు వంద రెట్లు నీకు సంపద ప్రాప్తించును అని చెప్పెను. తనకొచ్చిన కల గురించి ఆమె తన భర్తకు చెప్పెను. అది దుస్వప్నమని, అది ఒకవేళ నిజమే అయితే శివుడు తన కలలోకి ఎందుకు రాలేదని, భార్యభర్తలను విడగొట్టేందుకు ఇలా ఎవరో ప్రయత్నిస్తున్నారని చెప్పి భార్య నోరు మూయించాడు ఆ ధనవంతుడు.
అలా మరలా కొన్ని రోజులు గడిచాయి. అతని భార్యకు మరో కల వచ్చింది. ఈ సారి భగవంతుడు, ఆమెను నీ భర్త దాచుకున్న చందాలు అక్కర్లేదని, బలవంతముగా చేయు ఏది కూడా తనకు అక్కర్లేదు అని, భక్తి పూర్వకముగా తానేదైనా చేయదలుచుకుంటే చేయమని సెలవిచ్చెను. ఆమె అప్పుడు తన తండ్రి ఇచ్చిన నగలు అమ్మి, పొలం కొని ఆ దేవాలయానికి దానం చేయాలనుకుంది. ఆమె చేయాలనుకున్న సంగతి భర్తకు చెప్పింది. ఈ విషయం అతనికి చికాకు కలిగించింది. అయినా ఏమి అనలేక వేరే విధంగా మోసం చేయుటకు నిశ్చయించుకొనెను. భార్య సొమ్ములు తక్కువ ధరకు తానే కొన్నాడు. అతని దగ్గర కుదవ పెట్టి ఉంచిన పొలాల్లో ఒకటి భార్యకు అమ్మెశాడు. ఆ పొలం కుదువ పెట్టింది డుబ్కీ అనే పేదరాలు. ఇలా దేవుడిని, భార్యను, డుబ్కీని ఆ ధనవంతుడు మోసం చేశాడు. సాగులో లేని పొలానికి ఎంతో ఎక్కువ విలువ చెప్పి భార్యతో కొనిపించాడు. విలువైన తన నగలకు వెయ్యి రూపాయలె ధర కట్టాడు. 200 రూపాయల విలువ చేసే పొలాన్ని వెయ్యి రూపాయలు పెట్టి కొనిపించాడు. సాగుకు వీలుగా లేని ఆ పొలం గుడి పూజారి ఆధీనంలో ఉండేది.
తర్వాత విచిత్రంగా ఆ లోభి, అతని భార్య చనిపోయారు. పెద్ద తుఫానులో, వారింటిపై పిడుగు పడి భార్యాభర్తలిద్దరూ చనిపోయారు. డుబ్కీ కూడా మరణించింది. తర్వాత జన్మలో ఆ లోభి బ్రాహ్మణ కుటుంబంలో వీరభద్రప్పగా పుట్టాడు. ఆమె ఆ పూజారి కూతురు గౌరిగా, డుబ్కీ చెన్నబసప్పగా గుడి అధికారిగా పుట్టెను. పూజారి కూతురికి, వీరభద్రప్పకు వివాహం బాబా వలనే జరిగింది. కానీ వీరభద్రప్పకు ఈ జన్మలో కూడా ధనదాహం తగ్గలేదు. హఠాత్తుగా ధరలు పెరిగి పూజారి పొలానికి వంద రెట్లు ధర పలికింది. లక్ష రూపాయలలో సగం నగదుగా వచ్చింది మిగతా 25 వాయిదాలలో యిచ్చేందుకు ఒప్పందం జరిగింది. కానీ ఆ ధనం కోసం తగువులాడుతూ వారు సలహాకోసం నా దగ్గరకు (బాబా) వచ్చారు. అప్పుడు నేను సర్వ హక్కులు గౌరీవే నని చెప్పాను. ఇది విన్న వీరభద్రప్పకు కోపం వచ్చింది. నేను ఆస్తి కోసం ఆరాటపడుతూ అలా చెప్పానని అతను దూషించాడు. గౌరి మాత్రం తనను కూతురుగా భావించమని ప్రార్థించింది. ఆమెను రక్షిస్తానని మాట యిచ్చాను.
మరలా గౌరికి కలలో మహాదేవుడు కనిపించి, ధనం ఎవరికీ ఇవ్వకు. అది అంతా నీదే. చెన్నబసప్పతో సంప్రదించి గుడి మరమ్మత్తులకు కొంత వినియోగించమని చెప్పెను. ఇతరత్రా సలహా కావలసిన మసీదులో బాబాని వేడుకొమ్మనెను. ఈ కల గురించి గౌరీ చెప్పుతుండగానే చెన్నబసప్ప, వీరభద్రప్ప పోట్లాడుతూ నా దగ్గరికి వచ్చారు. వీరభద్రప్ప బెదిరింపులకు భయపడిన చెన్నబసప్ప నా శరణు కోరాడు. వానిని కాపాడుతానని మాట ఇచ్చాను. ఆ తర్వాత వారు కొంతకాలానికి చనిపోయి ఇలా పాము కప్పలుగా జన్మించారు. అప్పుడు నేను చేసిన వాగ్దానం ఇప్పుడు కప్ప బెకబెక వినగానే జ్ఞప్తికి వచ్చింది. చెన్నబసప్పను రక్షించాను. ఇదంతా ఆయన లీల అని వివరించారు బాబా...
No comments:
Post a Comment