"కథను, అనుభవములను, ప్రోగు చేయుమను. అక్కడక్కడ కొన్ని
ముఖ్యవిషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయము చేసెదను. వాడు కారణమాత్రుడే కాని నా
జీవితచరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన యహంకారమును
విడువవలెను. దానిని నా పాదములపైన బెట్టవలెను. ఎవరయితే వారి జీవితములో నిట్లు
చేసెదరో వారికే నేను మిక్కిలి సహాయపడెదను. వారి జీవిత చర్యలకొరకే కాదు.
సాధ్యమైనంతవరకు వారి గృహకృత్యములందును తోడ్పడెదను. వాని యహంకారము పూర్తిగా
పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడ లేకుండనప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా
చరిత్రను నేనే వ్రాసికొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు
కుదురును. వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచినదానినే
నీవు నిర్థారణ చేయుటకు ప్రయత్నించకుము. ఇతరుల యభిప్రాయములను కొట్టివేయుటకు
ప్రయత్నించకుము. ఏ విషయముపైనైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు."
"సత్చరిత్ర
వ్రాయువిషయములో నా పూర్తి సమ్మతినిచ్చెదను. నీ పనిని నీవు నిర్వర్తించుము.
భయపడకుము. మనస్సు నిలకడగా నుంచుము. నా మాటలయందు విశ్వాసముంచుము. నా లీలలు
వ్రాసినచో నవిద్య నిష్క్రమించి పోవును. వానిని శ్రద్ధాభక్తులతో నెవరు వినెదరో
వారకి ప్రపంచమందు మమత క్షీణించును. బలమైన భక్తి ప్రేమ కెరటములు లేచును. ఎవరయితే నా
లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును."
"నా నామము ప్రేమతో
నుచ్చరించిన వారి కోరిక లన్నియు నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారి
నన్ని దిశలందు కాపాడెదను. ఏ భక్తులయితే మనఃపూర్వకముగా నాపై నాధారపడియున్నారో వారీ
కథలు వినునప్పుడు మిక్కిలి సంతసించెదరు. నా లీలలు పాడువారి కంతులేని యానందమును
శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము. ఎవరయితే శరణాగతి వేడెదరో, నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో, నన్నే
స్మరించెదరో, నా యాకారమును మనస్సున నిలిపెదరో వారిని బంధనములనుండి
తప్పించుట నా ముఖ్యలక్షణము. ప్రపంచములోని వానినన్నిటిని మరచి నా నామమునే జపించుచు,
నా పూజనే సల్పుచు, నా కథలను జీవితమున
మననము చేయుచు, ఎల్లప్పుడు నన్ను జ్ఞప్తియందుంచుకొనువారు
ప్రపంచ విషయములందెట్లు తగులుకొందురు? వారిని మరణమునుండి
బయటకు లాగెదను. నా కథలే వినినచో అది సకల రోగములు నివారించును. కాబట్టి
భక్తిశ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి
నిదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించిపోవును. వినువారికి
శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకముగలవారికి శుద్ధచైతన్యముతో తాదాత్మ్యము
కలుగును. సాయి సాయి యను నామమును జ్ఞప్తి యందుంచుకొన్నంత మాత్రమున, చెడు పలుకుటవలన, వినుటవలన కలుగు పాపములు
తొలగిపోవును."
"నా భక్తుని యింటిలో
అన్నవస్త్రములకు ఎప్పుడు లోటుండదు. నాయందే మనస్సు నిలిపి, భక్తిశ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే యారాధించువారి యోగక్షేమముల నేను
జూచెదను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడ ఇట్లనే చెప్పియున్నాడు. కావున వస్త్రాహారముల
కొరకు ప్రయాసపడవద్దు. నీ కేమైన కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచములో
పేరుకీర్తులు సంపాదించుట మాని భగవంతుని కరుణాకటాక్షములు పొందుటకు, భగవంతునిచే గౌరవమందుటకు యత్నించుము. ప్రపంచగౌరవమందుకొను భ్రమను
విడువుము. మనస్సునందు ఇష్టదైవముయొక్క యాకారము నిలుపుము. సమస్తేంద్రియములను
మనస్సును భగవంతుని యారాధనకొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకుము.
ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనునట్లు మనస్సును నిలుపుము. అప్పుడది శాంతి
వహించి నెమ్మదిగాను, యెట్టి చికాకు లేక యుండును. అప్పుడే
మనస్సు సరియైన సాంగత్యములో నున్నదని గ్రహింపుము. మనస్సు చంచలముగ నున్నచో దానికి
ఏకాగ్రత లేనట్లే".
0 comments:
Post a Comment