Saturday, May 31, 2014

భక్త మహల్సాపతి సేకరణ

 
(మహాల్సాపతి గృహము)
 జనారధనరావు గారి బ్లాగునుండి సంగ్రహింపబడినవి.  వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.

(మొట్టమొదటగా బాబా షిరిడీలోకి అడుగుపెట్టినపుడు ఆయనను "సాయి" అని పిలిచినది మహల్సాపతి.  ఆతరువాతనుంచి బాబాకు సాయి అన్న పేరు స్థిరపడింది.  1886వ.సంవత్సరంలో బాబా ఆయన ఒడిలో పడుకొని తమ ప్రాణాన్ని బ్రహ్మండంలో లీనం చేసి సమాధిలోకి వెళ్ళారు.  మరుసటిరోజు షిరిడీ గ్రామ ప్రజలందరూ వచ్చి చలనం, ఉచ్చ్వాశ నిశ్వాసాలు లేని బాబా శరీరం చూసి ఆయన మరణించారని భావించారు.  మహల్సాపతి చెప్పినదానికి వ్యతిరేకించి, లాంచనాలన్నీ పూర్తిచేసి బాబా శరీరాన్ని సమాధి చేయవసిందేనని అన్నారు.  కాని మహల్సాపతి ఒక్క అంగుళం కూడా కదలక "మూడురోజులు వేచి చూసినందువల్ల నష్టమేమీ లేదనీ, బాబా మూడు రోజులలో మరల తిరిగి వస్తారని చెప్పారు. బాబా మాటలు సత్యమని నమ్మకంగా చెప్పాడు.)
బాబా షిరిడీ గ్రామంలోనికి అడుగు పెట్టగానే మహల్సాపతి ఆయనను "ఆవో సాయి" అని ఎదురేగి ఆహ్వానించాడు. 

 తర్వాత బాబా "సాయిబాబా" గా ప్రసిధ్ధి చెందారు.  తన స్నేహితులయిన కాశీరాం షింపీ, అప్పా జాగ్లే లను మహల్సాపతి బాబాకు పరిచయం చేశాడు.  వారిద్దరూ కూడా ఎంతో ఉదార స్వభావులు, భక్తి భావం కలిగినటువంటి వారు.  సాధువులు, సన్యాసులు అంటే వారికెంతో గౌరవం. అటువంటి వ్యక్తులు గ్రామంలోకి ఎవరు వచ్చినా వారెంతో గౌరవభావంతో స్వాగతం పలికేవారు. ఆవిధంగానే బాబాను కూడా గ్రామంలోనికి ఆరాధనా భావంతో స్వాగతం పలికారు.
ఆయన పేరు మహల్సాపతి చిమనాజీ నగారే.  ఎప్పుడు జన్మించారో ఆవివరాలు తెలియవు.  కాని, చనిపోయేనాటికి ఆయన వయస్సు 85 సంవత్సరాలు.  ఆయన వృత్తిరీత్యా కంసాలి.  తండ్రితాతలనుంచి అందరూ కూడా షిరిడీలోనే నివాసమేర్పరచుకొన్నారు.
వారి కులదేవత ఖండేరాజ్ (ఖండోబా).  పూనా జిల్లా జెజూరీ గ్రామంలోని దేవాలయం  ఖండేరాయ్ (ఖండోబాకి) అంకిత భక్తుడు.  సంవత్సరంలో ఒకసారయినా జిజూరీ యాత్రకి వెడుతూండేవాడు.  
                 స్వభావ సిధ్ధంగా ఆయనకు ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి లేదు.  తన వృత్తిద్వారా లభించిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించేవారు.  ఇక సాయిబాబాను మస్ఫూర్తిగా నమ్మిన తరువాత నుంచీ ఆయనకు ప్రాపంచిక సుఖాలమీద పూర్తిగా ఆశ నశించింది.
శ్రీ బీ.వీ.నరసిం హ స్వామీజీగారు మహల్సాపతిని సాయి పూజ, సాయి ప్రచారానికి ఒక మార్గదర్శకుడని, ఆద్యుడని ప్రకటించారు.  మహల్సాపతికి నలుగురు కుమార్తెలు.  వారు జానకీబాయి, సీతాబాయి, రఖుమా బాయి, విఠాబాయి.  వారికి వరుసగా అసక్ గావు, దొఖాలె, దొర్వాలే, సీ , గ్రామాలనుంచి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరిగాయి.  మహల్సాపతికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.  కాని అతను చిన్న వయసులోనే 1880 సంవత్సరంలో మరణించాడు.  ఈకారణంగానే మహల్సాపతికి ప్రాపంచిక విషయాలమీద అయిష్టత ఏర్పడింది. 
బాబాకు మహల్సాపతి మీద ప్రీతి.  అందువల్ల అతనిని యింటికి వెళ్ళిపొమ్మని, మరలా రెండవ కుమారుని కోసం ప్రయత్నించమనీ అనేకసార్లు బాబా సలహా యిచ్చారు.  ఆయనకు ప్రాపంచిక విషయాలమీద ఆసక్తి లేకపోవడం వల్ల బాబా చెప్పిన మాటలను ఆయన పాటించలేదు.  నిజానికి ఆయనకు మరొక కొడుకుని కందామనే కోరిక లేదు.  ఒక రోజున కృష్ణాష్టమినాడు కాశీరాం షింపీ బాబా ఆజ్ఞ ప్రకారం మహల్సాపతిని బలవంతంగా ఆయన యింటికి తీసుకొని వెళ్ళి యింటిలోపల వుంచి బయట తాళం పెట్టేసాడు.  ఈ విధంగా మహల్సాపతి పూర్తిగా ఒక సంవత్సరం యింటిలోనే ఉండిపోయాడు.  బాబా అనుగ్రహంతో 1897 లో ఆయనకు కుమారుడు జన్మించాడు.  బాబా సూచించిన ప్రకారం కొడుకుకి 'మార్తాండ్' అని నామకరణం చేశారు.  మార్తాడ్ తన కొడుకులను కూతుళ్ళను పెంచి పెద్ద చేసి, 1986 లో మరణించాడు. 
బాబా మహల్సాపతిని 'సొనర్దా' అని తరువాత 'భట్' అని పిలిచేవారు.  అనగా సన్నిహిత శిష్యుడు అని అర్ధం.  బాబా మసీదులో నివసించడానికి ప్రవేశించినప్పటినుండి, మహల్సాపతి, తాత్యాపాటిల్ యిద్దరూ ఆయనతో కలిసి నిదురించేవారు.  చావడి సిధ్ధమయిన తరువాత బాబా ఒకరోజు మసీదు మరొక రోజు చావడిలోను నిదురించేవారు.  మసీదులో బాబాతో కలసి నిదురించే అదృష్టం వీరిద్దరికే దక్కింది.  బావా మానవాతీత శక్తులను, ప్రేమను స్వయంగా చూసి అనుభవించిన మహల్సాపతి తరువాతనుంచి ప్రాపంచిక విషయాలను పూర్తిగా వదలి ఆయనకు అంకితమయిపోయారు.  మహల్సాపతి సంప్రదాయంగా వస్తున్న తన వృత్తిని వదలి సన్యాసిలా కుటుంబంతో కూడా ఎక్కువ కాలం గడిపేవారు కారు.   భోజనానికి మాత్రమే యింటికి వెళ్ళేవారు.  ఇతర సమయాలలో ఆయన బాబాకు సేవ చేస్తూ ఉండిపోయేవారు.  రాత్రులందు బాబాతో మసీదులో నిద్రపోయేవారు.   


ఆరోజు 1886వ.సంవత్సరం డిశెంబరు నెల.  సూర్యాస్తమానమయి 4 గంటలయింది.  బాబా విపరీతమయిన ఆస్థమాతో బాధ పడుతున్నారు.  అయన మహల్సాపతితో తాను తాత్కాలికంగా సమాధి స్థితిలోనికి వెడుతున్నానని  చెప్పారు. తన శరీరంలో ప్రాణం ఉండదనీ, మూడు రోజులు విశ్రాంతిగా ఉంటాననీ చెప్పారు.  మూడు రోజుల తరువాత తిరిగి తన శరీరంలోకి ప్రాణం వస్తుందనీ అప్పటివరకు కదలకుండా తన శరీరాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమని చెప్పారు.  ఒకవేళ అలా కాక తన ప్రాణం తిరిగి రాకపోయినట్లయితే ఒక స్థలాన్ని చూపించి ఆ ప్రదేశంలో తన శరీరాన్ని సమాధి చేసి ఆసమాధి మీద గుర్తుగా రెండు జండాలను పాతమని చెప్పారు. 
     
మహల్సాపతికి అంతా వివరించి బాబా ఆయన ఒడిలో పడుకొన్నారు.   మరునాడు షిరిడీ గ్రామ ప్రజలందరూ నిర్జీవంగా ఉచ్చ్వాశ నిశ్వాసలు లేని బాబా శరీరాన్ని చూసి ఆయన మరణించారని భావించారు.  జరగవలసిన లాంచనాలన్నీ నిర్ణయించి మహల్సాపతి చెప్పినదానికి ఏమీ అంగీకరించక బాబా శరీరాన్ని సమాధి చేయవలసిందేనని తీర్మానించారు.  మహల్సాపతి ఒక్క అంగుళం కూడా కదలలేదు.  బాబ చెప్పిన ప్రకారం మూడు రోజులపాటు వేచి చూసినందువల్ల కలిగే నష్టమేమీ లేదని మహల్సాపతి అక్కడున్నవారితో చెప్పారు.  బాబా చెప్పిన మాట ప్రకారం మూడు రోజుల తరువాత తప్పకుండా బాబా తిరిగి వస్తారని ఘంటాపధంగా చెప్పారు.  మూడు రోజుల పాటు కృతనిశ్చయంతో నిద్రాహారాలు మని మహల్సాపతి బాబా శరీరాన్ని తన ఒడిలో ఉంచుకొన్నారు.  72గంటలు గడిచిపోయాయి.  సూర్యోదయానికి 3గంటల ముందుగా అనగా తెల్లవారుఝాము 3 గంటలకు బాబా శరీరంలో చైతన్యం కలిగింది.  శ్వాస నిశ్వాసలు ఆడసాగాయి.  బాబా మహల్సాపతి ఒడిలోనించి లేచారు.  మహల్సాపపతికి ఆనంద పారవశ్యంతో కళ్ళంబట నీరు కారింది.
బాబాకు తొలిసారిగా పూజ మహల్సాపతి చేశారు.  అనేక సందర్భాలలో మహల్సాపతి బాబాతో కలిసి మసీదులో ఏకాంతంగా అనేక రాత్రులు గడిపాడు.  అర్ధరాత్రివరకూ వారిద్దరూ సంభాషించుకొనేవారు.  బాబాకు మహల్సాపతికి మధ్యనున్న సంబంధం చాలా వింతగాను ఆసక్తికరంగాను ఉండేది.  ఈ కారణం చేతనే వారిద్దరిమధ్య అద్భుతమయిన చర్చలు ఏకాంతంగా జరిగేవని తెలుస్తుంది.  చిలుం పీలుస్తూ అందులోని ఆనందాన్ని అనుభవిస్తూ సాగే వారి చర్చలు చాలా ఆసక్తిదాయకంగా జరుగుతూ ఉండేవి. 
ప్రతిరోజూ సాయంత్రం దీపాలు వెలిగించిన తరువాత ఎవరినీ మసీదులోకి ప్రవేశించనిచ్చేవారు కాదు.  దాదా కేల్కర్, మహల్సాపతి, తాత్యా, మహదు, అబ్దుల్లా, లక్ష్మీబాయి వీరికి మాత్రమే ప్రవేశార్హత ఉండేది.  
బాబా మహాసమాధి చెందిన తరువాత కూడా మహల్సాపతి ఎప్పటిలాగే మసీదులో కూర్చొంటూ ఉండేవారు.  బాబాకు పూజ చేసేవారు.  రోజువిడచి రోజు అక్కడే నిద్రిస్తూ ఉండేవారు.   ఆయన చనిపోయే వరకు ఈ విధంగా జరిగింది. అయన తన కుమారునితో మంచి కార్యక్రమాలు చేస్తూ భక్తి మార్గంలో జీవించమని చెప్పారు. బాబా మహాసమాధి చెందిన నాలుగు సంవత్సరాలకి, మహల్సాపతి మసీదులో బాబాకు పూజ చేసి రాత్రి ఆరతి యిచ్చిన తరువాత బాబా ముందే చెప్పినట్లుగా 1922 సంవత్సరం సెప్టెంబరు 11వ.తారీకు ఏకాదశినాడు 'రామ' అని ఉచ్చరిస్తూ తనువు చాలించారు.  మొదటిసారిగా బాబాను "సాయి" అని స్వాగతించి 1886 సంవత్సరంలో 72 గంటలపాటు బాబా శరీరాన్ని ఆయన చెప్పిన మాటల మీద పరిపూర్ణ విశ్వాసంతో కాపాడిన మహల్సాపతి ధన్యజీవి.  బాబా తాను సమాధి చెందిన తరువాత  కూడా యిప్పటికీ ఆయన తన భక్తులనెందరినో అనుగ్రహిస్తూనే ఉన్నారు.  


ఆంగ్ల రచయిత 
శ్రీబొండాడ జనార్ధనరావు
సాయి ప్రచారక్
బెంగళూరు - 560 068 
(సర్వం  శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment