(ప్రతిరోజు ఉదయం బాబా
విగ్రహం ముందుగాని, పటం ముందుగాని, దీపం వెలిగించి, బాబా అష్టొత్తర
శతనామావళిని చదవండి. తరువాత శ్రధ్ధా,భక్తులతో ఈ ప్రార్ధన చేయండి. బాబా మీకు
రోజంతా సుఖ సంతోషాలను కలుగచేస్తారు.)
"సాయిబాబా నేను నీవద్దకు వచ్చాను.
నీ పవిత్ర పాదాలవద్ద నాశిరసునుంచి నీకు సర్వశ్యశరణాగతి చేస్తున్నాను.
మంచికి, చెడుకి భేదమెరుగలేను. నువ్వు సర్వత్రా నిండివున్నావు. సర్వ
శక్తిమంతుడవు. నన్నెల్లపుడూ సంతోషంగా ఉంచేది, నాకు అర్హమైనది ఏదో అదే
అనుగ్రహించు. జీవితంలో దురదృష్టాన్ని, విచారాన్ని భరించే శక్తి నాకులేదు.
యిది మాత్రమే నాకు తెలుసు. నేను, నాకుటుంబం, బంధుమిత్రులు, యింకా ఈ
సమాజంలోని వారందరూ కూడా ఒకరిమీద ఒకరు ప్రేమానురాగాలతో సుఖ సంతోషాలతో
కలసిమెలసి జీవించాలి. ఇదే నేనెల్లప్పుడూ కోరేది. బాబా నన్నెల్లప్పుడు
నీకంటికి రెప్పలా కాపాడు.
నా దైనందిన జీవితంలో నేనెవరికీ హాని
తలపెట్టకుండాను, నాకెవరూ హాని తలపెట్టకుండాను వుండేలాగ అనుగ్రహించు.
రేయింబవళ్ళు సదా నీ సాయి మంత్రాన్నే జపించే వరమివ్వు. అహంకారం, పగ,
ప్రతీకారం యిటువంటి దుష్ట ఆలోచనలు నాదరి చేరకుండా అనుగ్రహించు. నామాటలు
ఎవరినీ నొప్పించే విధంగా లేకుండా నన్ను దీవించు.
నీపాదాల వద్ద శరణువేడుకోవడం నేనెన్నటికీ మరువను. గతంలో నేను, తెలిసి గాని తెలియకగాని చేసిన తప్పులను దయచేసి మన్నించు.
సద్గురు సాయినాధా ! సుఖ సంతోషాలతో జీవించేలా నన్ను దీవించు.
ఓం శ్రీసాయిరాం
No comments:
Post a Comment