Total Pageviews

Tuesday, November 19, 2013

సాయి ధర్మసూక్ష్మం

సాయితత్వాన్ని నిత్య జీవితంలో ఆచరిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. జీవితం ధన్యమౌతుంది. సాధన అనేది జీవితంలో ఒక భాగం కావటం కాక, జీవితమే ఒక సాధనగా మారుతుంది. షిర్డీ సాయిబాబా ఈ యుగావతారం. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ‘ శ్రీ సాయి సచ్చరిత్ర’లో పరిష్కారం లభిస్తుంది. ఎవరు ఏ సమస్యతో వెతికితే ఆ సమస్యకు తగిన సమాధానం దొరుకుతుంది.
సాయి బోధనలు, చదివి, విని ఊరుకోవటం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరిస్తేనే ఫలం, ఫలితం. బాబా అడుగు జాడల్లో నడవడానికి మనం ఏదైనా ప్రయత్నం చేసి ఒకడుగు వేస్తె బాబా మనవైపు పదడుగులు వేస్తారు. సాయి తత్వాన్ని ఆచరిస్తే మన బుద్ధి, మనసు, జ్ఞానం, వ్యక్తిత్వం వికసించి సుసంపన్నం అవుతాయి. శ్రీ సాయి సద్గురువు. ధర్మసూత్రాలు, సత్య ప్రవచనాలు చెప్పి ఊరుకోలేదు. స్వయంగా ఆచరించి చూపారు.
అందుకే బాబా సమర్థ సద్గురువు అయ్యారు. మనిషి జీవిత పరమార్థం ఏమిటి? ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకోకూడదు? ఇదంతా బాబా ఆచరించి చూపారు. ఆచరించి చూపటమే అవతార పురుషుని ప్రథమ కర్తవ్యం కదా! బాబా చెప్పిన విషయాలను, బాబా జీవన విధానాన్ని చదివి మననం చేసుకోవటం ముఖ్యం. బాబా బోధనలు, మంచి మాటలు మన హృదయ క్షేత్రంలో మొలిచిన దుష్టబుద్ధులు, చెడు లక్షణాలు అనే కలుపు మొకల్ని పెకలించి వేస్తాయి. శ్రీ సాయి ఆచరింప సాధ్యం కాని విధానాలను ఆచరించమని చెప్పలేదు. అర్థం కాని తత్వాన్ని బోధించలేదు. జీవన వికాసానికి, జ్ఞాన సముపార్జనకు సులభోపాయాన్ని చెప్పారు. సులభ మార్గాన్ని చూపారు. కోరికలు విడిచిపెట్టాల్సిన పని లేదన్నారు. సంసార బంధాలను తెంచుకోమని అసలే చెప్పలేదు. ఆడంబరాలకు, భేషజాలకు పోవద్దన్నారు. నలుగురి హితాన్ని కోరేదే అందరి అభిమతం కావాలని చాటారు. సాయి ఆదర్శ జీవన విధానం మానవ సంశయాలను పటాపంచలు చేస్తుంది. బాబా బోధనలు మనో వికాసాన్ని కలిగిస్తాయి. ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలను అలవరుస్తాయి. అదే సాయితత్వ రహస్యం.

0 comments:

Post a Comment