Wednesday, November 13, 2013

షిర్డీ సాయిబాబా



షిర్డీ సాయిబాబా ఎలాంటి హంగులూ, ఆర్భాటాలూ చూపలేదు. మంత్రాలూ తంత్రాలూ ప్రదర్శించలేదు. నిరాడంబర జీవితం గడిపి చూపారు. సాయిబాబాకు మసీదే మహలు అయింది. అందరూ, అన్ని జీవులూ తినగా మిగిలిన పదార్ధాలనే పంచ భక్ష్య పరమాన్నాలుగా భావించారు. షిర్డీ సాయిబాబా మసీదులో స్తంభాన్ని ఆనుకునో, నింబ వృక్షం కిందనో ఆడంబరాలూ లేకుండా కూర్చుని, శ్యామా, మహల్సాపతి, బయజాబాయి లాంటి భక్తులకు జీవన సత్యాలు బోధిస్తూ ఉండేవారు. అవి మామూలు మాటలు కాదు, అమూల్యమైన ఆణిముత్యాల మూటలు. ఒక సందర్భంలో సాయిబాబా ఇలా చెప్పారు.
''
మీరు ఎవర్నీ నొప్పించకండి. తోటివారు మిమ్మల్ని రకంగా నయినా కష్టపెట్టినా సరే, వారిని క్షమించండి. మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయండి. ఇలా చేయడం వల్ల మేలు జరగడము, మనశ్శాంతిగా ఉండడమే కాదు, మీకు హాని చేసినవారు, లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది కూడా. ''శ్రద్ధ, సబూరి చాలా అవసరం. మీరందరూ శ్రద్ధ, సబూరీలను అలవర్చుకోవాలి. సహనం, విశ్వాసం లేనివారు జీవితంలో ఏమీ సాధించలేరు. ఎందుకూ కొరకాకుండా పోతారు. పని చేసినా శ్రద్ధగా చేయండి. అన్ని సమయాల్లో సహనంగా వ్యవహరించండి. ఎవరైనా, కారణంగా నయినా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకండి. ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి. ఓర్పుతో మెల్లగా నొప్పించని విధంగా సమాధానం చెప్పి, అక్కడినుండి వెళ్లిపోండి.
''
ఇతరులు మీపైన అనవసరంగా నిందలు వేసినా మీరు చలించకండి. అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక, నిశ్చలంగా, నిబ్బరంగా ఉండండి. వారితో పోట్లాటకు దిగారంటే, మీరు కూడా వారితో సమానులే అవుతారు. ''దేవునిపట్ల విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితిలో నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. తోటివారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు. మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. మనను మనం పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి. ఇతరులు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కలిగిస్తున్నా, పైన భగవంతుడు ఉన్నాడని నమ్మండి. దేవుడు మీకు తప్పక సాయం చేస్తాడనే విశ్వాసాన్ని ఉంచండి. దేవుడివైపు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే, దేవుడు మిమ్మల్ని కాపాడటానికి పది అడుగులు ముందుకు వస్తాడని తెలుసుకోండి..'' సాయిబాబా చిప్పిన మాటలను మర్చిపోకండి. ఆచరించేందుకు ప్రయత్నించండి.

No comments:

Post a Comment