Tuesday, July 23, 2013

సాయితో సాయి బా ని స అనుభవాలు 18

సాయితో సాయి బా ని అనుభవాలు 18

బాబా స్వయంగా ఇచ్చిన ఔషధము

శ్రీ సాయి సచ్చరిత్ర 7 అధ్యాయములో బాబా షిరిడీకి వచ్చిన మొదటి రోజులలో షిరిడీ గ్రామస్తులకు వైద్యం చేసి మంచి పేరు గాంచిరి అనే విషయము వివరింపబడింది. శ్రీ సాయి 5 సంవత్సరాలు ముందే నాకు రాబోయే అనారోగ్యాన్ని గుర్తించి దానికి తగిన మందు ఇచ్చి నన్ను కాపాడిన వైనము ఇప్పుడు మీకు తెలియచేస్తాను.

1991
సంవత్సరములో నా చిన్ననాటి స్నేహితుని తల్లి చనిపోయిందని టెలిగ్రాం రావడంతో అజ్మీరులో ఉన్న వారి యింటికి వెళ్ళాను. దశ దిన కర్మ కాండలన్ని పూర్తి అయిన తరువాత తిరిగి హైదరాబాదుకు ప్రయాణానికి ముందు రోజున నేను ఒక ఆటోలో అక్కడ ప్రఖ్యాతి గాంచిన అజ్మీరు దర్గాని చూడటానికి బయలుదేరాను. దర్గాపై అన్ని మతాలలోనూ నమ్మకం ఉన్నవారు ఇక్కడకు ప్రార్థనలు చేసుకుందుకు వస్తారు. నేను ఆటోలో ప్రయాణిస్తూ సాయిని స్మరిస్తూ ఉండగా రోడ్డుపై ఒక ముసలి మార్వాడి వ్యక్తి ఆటోని ఆపి తనను కూడా దర్గాకు తీసుకువెళ్ళమని కోరాడు. ఆటో డ్రైవరు నాలుగు రూపాయలు ఇమ్మని అడిగినాడు. అప్పుడు మార్వాడీ వ్యక్తి నేను యెవరికయినా రెండు రూపాయలే ఇస్తాను, ఎవరినించయినా రెండు రూపాయలే స్వీకరిస్తాను అనే మాటలు నాలో అనేక ఆలోచనలను రేకెత్తించింది. శ్రీ సాయి ముసలివాని రూపములో నాతోపాటు దర్గాకు ప్రయాణం చేయబోతున్నారా అనే ఆలోచన కలగగానే ఆటోడ్రైవరును ఉద్దేశించి ముసలివాడు ఇవ్వవలసిన డబ్బు నేను ఇస్తానని చెప్పి ముసలివానిని నాపక్కన కూర్చోమని చెప్పాను. ఆటో ముందుకు కొనసాగుతూండగా ముసలివాడు నన్ను ఉద్దేశించి అన్న మాటలు "నీవు చూడటానికి స్వచ్చమయిన హిందూ బ్రాహ్మణుడిలా ఉన్నావు, నీవు అజ్మీరు దర్గాకు వచ్చి అక్కడ ఫకీరు సమాధికి నమస్కరించడానికి నీ మనస్సు అంగీకరిస్తుందా". "నేను షిరిడీ సాయి భక్తుడిని. అన్ని మతాలలోని మహాపురుషులకు నేను నమస్కరిస్తాను" అని సమాధానమిచ్చాను. మా సంభాషణ ఇలా కొనసాగుతుండగా ముసలివాడు దర్గాకు ముందు ఉన్న ఒక సందులో ఆటోను ఆపి నన్ను దర్గాకు జాగ్రత్తగా తీసుకువెళ్ళమని ఆటో డ్రైవరుకు చెప్పి "నువ్వు నాకోసం నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి నన్ను ఋణగ్రస్తుడిని చేశావు. నేను ఎవరి ఋణమూ ఉంచుకోను. అని చెప్పి తన భుజాన ఉన్న సంచీలోంచి శరీరంపై ఎక్కడయినా నొప్పి ఉన్నచో తగ్గడానికి రాసుకునే లేపనం ఉన్న ఒక సీసాని బహూకరిస్తూ "భవిష్యత్తులో నీవు నడవలేని స్థితిలో విపరీతమయిన నొప్పితో బాధ పడే సమయములో లేపనమును నీ బాధ నివారణ కోసం ఉపయోగించుకో" అని పలికినాడు. నాతో మాట్లాడుతూ ఆటో దిగి కొన్ని క్షణాలలో మాయమయినాడు. నా మనసులో ముసలివానికి నమస్కరించినాను.

అజ్మీరు దర్గాలో ప్రార్థనలు పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాదుకు ప్రయాణమయ్యాను. కాలం ఎవరికోసమూ ఆగదు. అది 1996 సంవత్సరము. జనవరి నెల. సయాటికా నెప్పితో నడవలేని స్థితిలో మంచం మీద పడి ఉన్నాను. కనీసము డాక్టరు దగ్గిరకు కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నాను. కాలకృత్యాలు పూర్తిచేసుకుందుకు బాత్ రూముకు కూడా వెళ్ళలేని స్థితిలో బాబాని ప్రార్థించాను. ఒక్కసారిగా అజ్మీరు సంఘటన గుర్తుకు వచ్చింది. నా భార్యను పిలిచి అజ్మీరులో ముసలివాడు నాకు ఇచ్చిన నెప్పినివారణ లేపనము సీసాను తెమ్మని చెప్పాను. నా భార్య వంటిల్లు అంతా వెదకి సీసాను గుర్తించి నాకు తెచ్చి ఇచ్చింది. లేపనమును నా నడుముకు ఆమె పూసినది. లేపనము నా శరీరముపై పూసిన రెండు గంటలలో లేచి కూర్చుని సాయంత్రానికి నా కాలకృత్యములు నిర్వర్తించుకోవడానికి బాత్ రూముకు వెళ్ళగలిగాను. మరుసటి రోజున లేచి ఇంటిలో నడవసాగాను. శ్రీ సాయి అయిదు సంవత్సరాల క్రితం ఒక వృధ్ధ మారవాడీ రూపములో నాతోపాటు అజ్మీరు దర్గాకు ప్రయాణము చేస్తూ నాకు ఇచ్చినటువంటి లేపనము నాకు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించింది. నేను నా భార్య నా హాలులో ఉన్న సాయి పటం దగ్గిరకి వచ్చి నమస్కరించాము. నేను సాయికి సాష్టాంగ నమస్కారము చేసి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు సాయికి ధన్యవాదాలు తెలియచేసుకున్నాను.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment