Monday, February 4, 2013

శ్రీ సాయి సత్ చరిత్రము ముప్పదియెనిమిదవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ముప్పదియెనిమిదవ అధ్యాయము

(ఆరవదినము పారాయణము – మంగళవారము)

1. బాబా వంటపాత్ర, 2. దేవాలయమును గౌరవించుట, 3. కాలా లేదా మిశ్రమము, 4. మజ్జిగ

గత అధ్యాయములో బాబాగారి చావడి యుత్సవము వర్ణించితిమి. ఈ యధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగువానిని గుర్చి చదివెదము.

తొలిపలుకు

ఓ సద్గురుసాయీ! నీవు పావనమూర్తివి, ప్రపంచమంతటికి ఆనందము కలుగజేసితివి, భక్తులకు మేలు కలుగజేసితివి. నీ పాదముల నాశ్రయించినవారి బాధలను తొలగించితివి. నిన్ను శరణు జొచ్చిన వారిని ఉదారస్వభావుడవగుటచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుటకొరకు నీవవతరించెదవు. పవిత్రాత్మయగు ద్రవసారము బ్రహ్మమనెడి యచ్చులో పోయగా దానినుండి యోగులలో నలంకారమగు సాయి వెడలెను. ఈ సాయి యాత్మారాముడే, స్వచ్ఛమైన దైనికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్చ లన్నియు పొందినవారై, వారు భక్తులను నిష్కాములను జేసి విముక్తుల జేసిరి.

బాబా వంటపాత్ర

యుగయుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసియున్నవి. కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపరముగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానము లన్నింటిలో అన్నదానమే శ్రేష్ఠమయినది. మధ్యాహ్నము 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాల బాధపడెదము. అట్టి పరిస్థితులలో నితర జీవులుకూడ నట్లే బాధ పడును. ఈ విషయము తెలిసి యెవరయితే బీదలకు, ఆకలితో నున్న వారికి, భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది. “ఆహారమే పరబ్రహ్మస్వరూపము, ఆహారమునుండియే సమస్తజీవులు ఊద్భవించినవి. చచ్చిన పిమ్మట నవి తిరిగి ఆహారములో ప్రవేశించును. ” మిట్టమధ్యాహ్నము మన యింటికెవరైన అతిథి వచ్చినచో, వారి నాహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతరదానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి యిచ్చు నపుడు కొంత విచక్షణ కావలెను. కాని యాహారవిషయములో నట్టి యాలోచన యనవసరము. మన యింటికి మిట్టమధ్యాహ్న మెవరువచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటుపిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మంచి యెంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో నితరదానములు ప్రకాశించవు. ఎట్లన చంద్రుడు లేని నక్షత్రములవలె, పతకములేని కంఠాహారమువలె, పింఛము లేని కిరీటమువలె, కమలము లేని చెఱువువలె, భక్తి లేని భజనవలె, కుంకుమబొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠముగలవాని పాటవలె, ఉప్పు లేని మజ్జిగవలె రుచించవు. అన్ని వ్యంజనములకంటె పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదాన మెక్కువ. బాబా ఆహారము నెట్లు తయారుచేసి పంచి పెట్టుచుండెనో చూచెదము.

బాబాకొరకు చాలా తక్కువభోజనము కావలసియుండెను. అదియు కొన్ని యిండ్లనుండి భిక్షాటనము చేసి తెచ్చుకొనెడివారని యిదివరకే తెలిసికొంటిమి. ఏనాడైన అందరికి భోజనము పెట్టవలెనని బాబా నిశ్చయించుకొన్నచో మొదటనుండి చివరవరకు కావలసిన యేర్పాటు లన్నియు వారే స్వయముగా చేసికొనెడివారు. ఈ విషయమై ఇతరులపై ఆధారపడలేదు; ఎవరికిని బాధ కలుగజేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలాదినుసులు మొదలగువని యన్నియు నగదు నిచ్చికొనెడివారు. వారే విసరుచుండెడి వారు. మసీదు ముందున్న ఖాళీస్థలములో మధ్యన పొయ్యిబెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలతప్రకారము నీళ్ళుపోసి పెట్టెడివారు. వారివద్ద వంటపాత్రలు రెండు గలవు. ఒకటి పెద్దది వందమందకి సరిపోవునది. రెండవది చిన్నది 50 మందికి మాత్రము సరిపోవునది. ఒక్కొక్కప్పుడు చక్కెరపొంగలి వండేవారు. మరొకప్పుడు మాంసపు పొలావ్ వండెడివారు. ఒక్కొక్కప్పుడు పప్పుచా రుడుకునప్పుడు గోధుమపిండి బిళ్ళల నందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా నుండుట కెంత శ్రమ తీసికొనవలెనో అంత శ్రమను పడుచుండెడివారు. అప్పుడప్పుడు అంబలి వండెడివారు. అనగా జొన్నపిండిని నీళ్ళలో నుడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండెడివారు. భోజనపదార్థములతో ఈ అంబలినికూడ అందరికి కొంచెము కొంచెముగా పెట్టెడివారు. అన్నము సరిగా నుడికినదో లేదో యని పరీక్షించుటకు బాబా తన కఫినీ పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న దేకిసాలో బెట్టి కలుపుచుండేవారు. వారి ముఖమునందు భయచిహ్నములు గాని చేయి కాలునట్లుగాని కనిపించెడిది కాదు. వంట పూర్తి కాగానే, బాబా ఆ పాత్రలను మసీదులోనికి దెచ్చి, మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహళ్సాపతికి, తాత్యాకు ప్రసాదరూపముగ పంపించిన పిమ్మట మిగతదానిని బీదవాండ్రకు దిక్కులేనివారికి సంతృప్తిగా బెట్టుచుండిరి. బాబా స్వయముగా తన చేతులతో తయారుచేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసినవారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులయి యుండవలెను. 

బాబా తన భక్తులందరికి శాకాహారము మాంసాహార మొకేరీతిగా బెట్టుచుండెనా యని ఎవరికైన సందేహము కలుగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారకే ఆ వంట పాత్రలోనిది పెట్టెడివారు. మాంసాహారులు కానివారి నా పాత్రను గూడ ముట్టనీయలేదు. వారి మనసులో దీనిని తినుటకు కోరిక కూడ కలుగ నిచ్చెడివారు కారు. గురువుగారేదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా యని యోచించు శిష్యుడు నరకమునకు పోవునను రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచూటకు బాబా యెక్కొక్కప్పుడు పరీక్షించుచుండెడివారు. దీనికొక ఉదాహరణము. ఒక ఏకాదశినాడు దాదా కేల్కరుకు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాకు పోయి మాంసమును కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడును ఆచారవంతుడును. సద్గురువుకు ధనము, ధాన్యము, వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటే యనియు గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే యనియు, ఇదియే నిజమైన దక్షిణ యనియు, దీనివల్లనే గురువు సంతుష్టి చెందెదరనియు అతనికి తెలియును. కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరెను. కాని బాబా అతనిని వెంటనే పిలచి తానే స్వయముగా పోవలదనియు నింకెవరినైన పంపుమనెను. అతడు పాండువను నౌకరును బంపెను. వాడు బయలుదేరుట చూచి బాబా వానినికూడ వెనుకకు బిలిపించి యానాడు మాంసము వండుట మానుకొనిరి. ఇంకొకసారి బాబా దాదాకేల్కరును బిలచి పొయ్యిమీదనున్న పొలావ్ ఉడికినదో లేదో చూడుమనెను. కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగా నున్నదని జవాబిచ్చెను. అప్పుడు బాబా “నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగానున్న దని ఎట్లు చెప్పితివి. మూత తీసి చూడుము. ” అనుచు బాబా యతని చేతిని బట్టుకొని మరుగుచున్న దేకిసాలో బెట్టెను. ఇంకను నిట్లునెను. నీ చేయిని తీయుము. “నీ ఆచారము నొక ప్రక్కకు బెట్టి తెడ్డుతో దీసి, కొంచెము ప్లేటులో వేసి సరిగా ఉడికినది లేనిది తెలిసికొనుము. ” తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించునప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ యేడ్చునపుడు దానిని కౌగిలించి ముద్దుబెట్టుకొనును. అట్లనే బాబా కూడ కన్నతల్లివలె దాదా కేల్కరును ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగిగాని, గురువుగాని తన శిష్యునకు నిషేధాహారమును తిని చెడిపొమ్మని చెప్పడు.

ఈ వంటపాత్రలో వండుట 1910వ సంవత్సరము వరకు జరిగిన పిమ్మట ఆగిపోయెను. పూర్వము చెప్పిన రీతిగా దాసుగణు బాబా కీర్తిని తన హరికథలద్వారా బొంబాయి రాష్ట్రములో వెల్లడి చేసెను. ఆ ప్రాంతమునుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండిరి. కొలది దినములలో షిరిడీ యొక పుణ్యక్షేత్రమాయెను. భక్తులనేక రకముల యాహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు, బీదలు తినగా నింకను మిగులుచుండెను. నైవేద్యమునెట్లు పంచిపెట్టెడివారో చెప్పుటకు ముందు బాబాకు షిరిడీ లోని దేవాలయములందును, నందుండు దేవతలయందును గల గౌరవమును చాటెడు నానాసాహెబు చాందోర్కరు కథ తెలిసికొందుము.

నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట

ఎవరికి తోచినట్లు వారాలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా యేజాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏజాతి యందు పుట్టిరో, వారి తల్లిదండ్రు లెవరో యెవరికిని తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని, మహమ్మదీయుడుగాని యెట్లు కాగలరు? వారు మహమ్మదీయు లయినచో మసీదులో నెప్పుడు ధుని నెట్లు మండనిత్తురు? అచ్చోట తులసీబృందావన మెట్లుండును? శంఖము లూదుట కెట్లు ఒప్పుకుందురు? గంటలను మ్రోయించుట కెట్లు సమ్మతింతురు? సంగీతవాద్యముల నెటుల వాయించనిత్తురు? వారు మహమ్మదీయులయినచో చెవులకు కుట్లు (రంధ్రము) ఎటు లుండును? గ్రామములోని హిందుదేవాలయములను దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరకొనెడివారు కారు.

ఒకనాడు నానాసాహెబు చాందోర్కర్ తన షడ్డకుడగు బినివల్లెతో షిరిడీకి వచ్చెను. బాబావద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానామీద బాబా హఠాత్తుగా కోపగించి, “నా సహవాసము ఇన్నాళ్ళు చేసియు నిట్లేల చేసితివి?” అనెను. నానాసాహెబు మొదట దీనిని గ్రహించలేకపోయెను. కనుక అదేమిటో వివరింపవలసినదిగా ప్రార్థించెను. కోపర్ గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా యతని నడిగెను. నానాసాహెబ్ వెంటనే తన తప్పును గ్రహించెను. సాధారణముగా షిరిడీకి పోవునపుడెల్ల నానాసాహెబ్ కోపర్ గాం లో దిగి దత్తదర్శనము చేసికొనెడివారు. కాని, ఈసారి తన బంధువు దత్తభక్తుడయినప్పటికి అతనినిగూడ వెళ్ళనీయక, యాలస్యమయిపోవునని చెప్పుచు తిన్నగా షిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబాకు తెలియజేయుచు, తాను గోదావరిలో స్నానము చేయునప్పుడొక ముల్లు పాదములో గ్రుచ్చుకొని తనను చాల బాధ పెట్టెనని చెప్పెను. బాబా యది కొంతవరకు ప్రాయశ్చిత్తమే యనుచు నికమీదట జాగ్రత్తయని హెచ్చరించెను.

కాలా (మిశ్రమము)

ఇక నైవేద్యమెటుల పంచిపెట్టెడువారో చూచెదము. హారతి పిమ్మట, భక్తులందరికి ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి బోయి నీంబారువైపు వీపుపెట్టి కూర్చొనుచుండెను. కుడివైపు నెడమవైపు భక్తులు పంక్తులలో కూర్చొనుచుండిరి. నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో బెట్టి బాబా యాశీర్వాదములకై ఊదీకై కని పెట్టుకొని బయట నిలుచుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు, బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, పరమాన్నము మొదలగునవన్నియు ఒక్కదానిలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దేవునకు సమర్పించి, పావన మొనర్చుచుండెను. అందులో కొంతభాగము బయట కనిపెట్టుకొని యున్న వారికి పంచి తక్కినది బాబాకు అటునిటు రెండు వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామ, నానాసాహెబు నిమొంకర్ వడ్డించువారు. వచ్చినవారి సౌకర్యములను వీరు చూచువారు. వారాపని అతిజాగ్రత్తగాను, ఇష్టముగాను చేయుచుండిరి. తిను ప్రతిరేణువు కూడ తృప్తియు, సత్తువయు కలుగజేయుచుండెను. అది యట్టి రుచి, ప్రేమ, శక్తి గలిగిన యాహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది.

ఒక గిన్నెడు మజ్జిగ

ఒకనాడు హేమాడ్ పంతు మసీదులో నందరితో కడుపునిండ తినెను. అట్టిసమయమున బాబా అతనికొక గిన్నెడు మజ్జిగ త్రాగుమని యిచ్చెను. అది తెల్లగా చూచట కింపుగా నుండెను. కాని యతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగానుండెను. అతని గుంజాటనము గనిపెట్టి బాబా యతనితో నిట్లనెను. “దాని నంతయు త్రాగుము. నీకికమీదట ఇట్టి యవకాశము దొరకదు”. అతడు వెంటనే దాని నంతయు త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యెను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి.

చదువరులారా! హేమాడ్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను. కాని మనకు కావలసినంత యమృతమును బాబా లీలల రూపముగా నిచ్చెను. మనము ఈ యమృతము గిన్నెలతో త్రాగి సంతుష్టిచెంది యానందించెదముగాక.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ముప్పదియెనిమిదవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|


No comments:

Post a Comment