Monday, February 4, 2013

శ్రీ సాయి సత్ చరిత్రము ముప్పదితొమ్మిదవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ముప్పదితొమ్మిదవ అధ్యాయము

బాబాగారి సంస్కృత పరిజ్ఞానము

1. భగవద్గీత శ్లోకమునకు బాబాగారి యర్ధము. 2. మహాసమాధి మందిర నిర్మాణము

ఈ యధ్యాయములో భగవద్గీతయందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన యర్ధమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు అది నానాసాహెబు చాందోర్కర్ యనువారిదనియు ననుటచే హేమాడ్ పంతు 50వ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించెను. రెండధ్యాయములలోను నొకే విషయ ముండుటచే రెండును నిందులో పొందుపరచనైనవి.

తొలిపలుకు

షిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి గూడ పావనమైనదే. ఏలన శ్రీసాయి యచటనే నివసించుచు, తిరుగుచు, మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడీ గ్రామప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. వారికొరకే చాలాదూరము నుండి యచటకు వచ్చెను. మొదట షిరిడీ చాల చిన్నగ్రామము, సాయిబాబా యచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థల మాయెను. అచటనుండు స్త్రీలుకూడ ధన్యులు. బాబాయందు వారిభక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసరునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి, విన్న వారికి మనశ్శాంతి కలుగజేయుచుండెను.

బాబా చెప్పిన యర్థము

బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని యర్థమును నానా సాహెబు చాందోర్కరుకు బోధించి ఆశ్చర్యము కలుగజేసెను. ఈ విషయమును గూర్చి బి.వి.దేవుగారు (శ్రీ సాయి లీల సంపుటి 4, పుట 563 – స్ఫుట విషయ) వ్రాసినారు. వారు స్వయముగా నానాసాహెబు చాందోర్కర్ వద్దనుంచి కొన్ని సంగతులు తేలిసికొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువ నివ్వబడెను.

నానాసాహెబు చాందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధవ్యాఖ్యానములతో చదివియున్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకీ విషయముగాని, సంస్కృతముగాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా యతని గర్వమణచెను. ఆ తొలిరోజులలో భక్తులు గుంపులుగుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయముల దీర్చుటకు నొంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండెను. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళనొత్తుచు నోటిలో ఏదో గొణుగుకొనుచుండెను.

బాబా : నానా ! యేమి గొణుగుచున్నావు?
నానా : సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను.
బాబా : ఏ శ్లోకము?
నానా : భగవద్గీతలోనిది.
బాబా : గట్టిగా చదువుము.
నానా : (భగవద్గీత 4వ అధ్యాయము, 34వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివెను.)
“తద్వద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః”
బాబా : నానా! అది నీకు బోధపడినదా?
నానా : అవును.
బాబా : నీకు తెలిసినచో నాకు చెప్పుము.
నానా : దాని తాత్పర్యమిది. సాష్టాంగనమస్కారము చేయుట అనగా పాదములపై బడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవచేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలిసికొనెదము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానముగలవారు అనగా, పరబ్రహ్మమును దెలిసినవారు ఆ జ్ఞానము నుపదేశించెదరు.
బాబా : నానా! శ్లోకముయొక్క తాత్పర్యమక్కరలేదు. ప్రతిపదార్థము వ్యాకరణము, మరియు దాని యర్థము చెప్పుము.

అప్పుడు నానా ప్రతి పదమున కర్థము చెప్పెను.

బాబా : నానా! ఉత్త సాష్టాంగనమస్కారము చేసినచో చాలునా?
నానా : ప్రణిపాత యను పదమున కింకొక యర్థము నాకు తెలియదు. ప్రణిపాత యనగా సాష్టాంగనమస్కారమని నాకు తెలియును.
బాబా : పరిప్రశ్న యనగా నేమి?
నానా : ప్రశ్నించుట.
బాబా : ప్రశ్న యనగా నేమి?
నానా : అదే, అనగా ప్రశ్నించుట.
బాబా : పరిప్రశ్న యన్నను ప్రశ్న యన్నను ఒక్కటే యయినచో, వ్యాసుడు ‘పరి’ యను ప్రత్యయమును ప్రశ్నకు ముందేల యుపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువవాడా?
నానా : పరిప్రశ్న యను మాటకు నా కితరయర్థ మేమియు తెలియదు
బాబా : సేవ యనగా నెట్టిది?
నానా : ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది.
బాబా : అట్టి సేవ చేసిన చాలునా?
నానా : సేవ యను పదమున కింకను వేరే యర్థమేమి గలదో నాకు తోచుట లేదు.
బాబా : రెండవ పంక్తిలోని “ఉపదేక్ష్యంతి తే జ్ఞానం” అను దానిలో జ్ఞానమను పదముపయోగించకుండ యింకొకపదము ఉపయోగించ గలవా?
నానా : అవును.
బాబా : ఏ పదము
నానా : అజ్ఞానము.
బాబా : జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో, ఈ శ్లోకములో నేమైనా అర్థము గలదా?
నానా : లేదు. శంకరభాష్యమావిధముగా చెప్పుట లేదు.
బాబా : వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానము అనుపదము నుపయోగించిన యెడల తగిన యర్థము వచ్చునప్పుడు దాని నుపయోగించుట కేమైన ఆక్షేపణ కలదా?
నానా : అజ్ఞానమను పదమును చేర్చి దాని యర్థమును విశదపరచుట నాకు తెలియదు.
బాబా : కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము, ప్రశ్నించుట, సేవ చేయుమని చెప్పనేల? స్వయముగా కృష్ణుడు తత్త్వదర్శికాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా!
నానా : అవును, అతడు తత్వదర్శియే, కాని అర్జును నితర జ్ఞానుల నేల సేవించుమనెనో నాకు తోచుటలేదు.
బాబా : నీకిది బోధపడలేదా?

నానా సిగ్గుపడెను. అతని గర్వమణగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను.

1. జ్ఞానులముందు ఉత్త సాష్టాంగము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్యశరణాగతి చేయవలెను.

2. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో గాని, దొంగయెత్తుతో గాని, వారిని బుట్టలో వేయుటకుగాని, వారి తప్పులను పట్టుటకు గాని, పనికిమాలిన యాసక్తితో యడుగకూడదు. నిజముగా తెలిసి దానిచే మోక్షము పొందుటకుగాని, ఆధ్యాత్మికాభివృద్ధికిగాని యడుగవలెను.

3. సేవ యనగా ఇష్టమున్నచో చేయవచ్చును లేనిచో మానవచ్చుననే యభిప్రాయముతో చేయునది సేవకాదు. శరీరము తనదికాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువుగారి దనియు, వారిసేవకొరకే శరీరమున్నదనియు భావింపవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానము బోధించును.

గురు వజ్ఞానమును బోధించుననగా, నానాకు అర్థముకాలేదు.

బాబా: జ్ఞానము ఉపదేశ మెట్లగును? అనగా సాక్షాత్కారము బోధించుట యెట్లు? అజ్ఞానమును నశింపజేయుటయే జ్ఞానము.

జ్ఞానేశ్వరమహారాజు ఇట్లు చెప్పియున్నారు. ‘అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జునా! స్వప్నము, నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా నజ్ఞానమును నశింప జేయుటయే. చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపజేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపజేసెద మనగా, అద్వైతమును గూర్చిచెప్పుట. చీకటిని నశింపజేసెద మనినచో, వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలెననినచో, ద్వైతమను భావమును మనసులోనుంచి తీసివేయవలెను. అదియే అద్వైతమును పొందుజ్ఞానము. ద్వైతములోనే యుండి అద్వైతముగూర్చి మాట్లాడగలవారెవ్వరు? ఎవరైన నట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది యెట్లుతెలియును? దాని నెట్లు పొందెదరు? శిష్యుడు గురువువలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికి భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్యము, మహాశక్తిమత్వము, మరియు ఐశ్వర్యయోగము. సద్గురువు నిర్గుణుడు, సత్చిదానందుడు. వారు మానవాకారమున నవతరించుట, మానవులను లేవనెత్తుటకును ప్రపంచము నుద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి యసలయిన నిర్గునస్వభావము కొంచెము గూడ చెడిపోదు. వారి సత్యస్వరూపము, దైవికశక్తి, జ్ఞానము తరుగకుండ నుండును. శిష్యుడు కూడ నట్టిస్వరూపము కలవాడే. కాని యతని అనేకజన్మల యజ్ఞానము యతని శుద్ధచైతన్యమను సంగతిని కప్పివేయును. అతడు “నేను సామాన్య నికృష్ట జీవుడను.” అనుకొనెను. గురువు యజ్ఞానమును మూలముతో తీసివేయవలెను. తగిన యుపదేశము నివ్వవలెను. లెక్కలేనన్ని జన్మలనుంచి సంపాదించిన యజ్ఞానమును గురువు నిర్మూలించి యుపదేశించవలెను. ఎన్నోజన్మలనుంచి తాను నికృష్టజీవుడ ననుకొను శిష్యుని గురువు “నీవే దైవము, శక్తియుతడవు, ఐశ్వర్యశాలివి” అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా యహంకారమనియు, దేవుడు, లోకము తనకంటె వేరనియు తలంచు నిత్యాంతభ్రమ అనేక జన్మలనుంచి వచ్చుచున్న దోషము. దానిపై నాధారపడి చేసిన కర్మలనుండి వానికి సంతోషము, విచారము, ఈ రెంటియొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమునుగూర్చి అతడు విచారమారంభించవలెను. ఈ ఆజ్ఞానమెట్లు అంకురించినది? అది యెక్కడ నున్నది? అను దానిని చూపుటయే గురుపదేశమందురు. ఈ దిగువ వివరించినవి యజ్ఞానలక్షణములు

1. నేను జీవిని (ప్రాణిని).
2. శరీరమే యాత్మ (నేను శరీరమును).
3. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేర్వేరు.
4. నేను దేవుడను కాను.
5. శరీర మాత్మకాదని తెలిసికొనకుండుట.
6. దేవుడు, జీవుడు ప్రపంచము ఒకటేయని తెలియకుండుట.


ఈ తప్పులన్నియు చూపించనిదే, శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగానేమో తెలియజాలడు. వానిలో వానికి ఎట్టి సంబంధము కలదో, ఒకటి యింకొకటికంటె వేరైనదా లేక రెండును ఒకటేనా యను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని యజ్ఞానము నశింపజేయుటకు చెప్పునది జ్ఞానమా? అజ్ఞానమా? జ్ఞానమూర్తియైన జీవునకు జ్ఞానోపదేశము చేయనేల? ఉపదేశమనునది వాని తప్పును వానికి చూపి వాని యజ్ఞానమును సశింపజేయుటకొరకే’ బాబా యింకను ఇట్లనెను.

1. ప్రణిపాత మనగా శరణాగతిచేయుట, 2. శరణాగతి యనగా తను (శరీరము), మన (మనస్సు), ధనముల (ఐశ్వర్యము) నర్పించుట, 3. శ్రీ కృష్ణుడు అర్జునుని ఇతరజ్ఞానుల నాశ్రయించు మననేల?

సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైన శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీ కృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము, ఆత్మలు గాను భావించును. అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీ కృష్ణునికి తేలిసి యుండుటచే, వారినిగూర్చి అర్జునునికి చెప్పెను. అట్టివారి గొప్పతనము హెచ్చియందరికి తెలియవలెననియే కృష్ణుడట్లు పేర్కొనెను.

సమాధిమందిర నిర్మాణము

బాబా తాను చేయ నిశ్చయించుకొనిన పనులగూర్చి ఎప్పుడును మాట్లాడువారు కారు. ఏమియు సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి ఫలితములు కలిగించుచుండువారు. అందుకు సమాధిమందిర నిర్మాణము ఒక ఉదాహరణము. నాగపూరు కోటీశ్వరుడు, శ్రీమాన్ బాపుసాహెబు బుట్టీ, షిరిడీలో సకుటుంబముగా నుండెడివారు. అతనికి అచట సొంత భవనముండిన బాగుండునని యాలోచన కలిగెను. కొన్నాళ్ళ పిదప దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికొక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నములో నగుపడి యొక వాడాను మందిరముతో సహ నిర్మించుమనెను. బాపుసాహెబు లేచి శ్యామా యేడ్చుచుండుట చూచి కారణమడిగెను. శ్యామా యిట్లు చెప్పెను. “బాబా నా దగ్గరకు వచ్చి మందిరముతో వాడాను నిర్మింపుము. నేను అందరి కోరికలను నెరవేర్చెద ననెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని, నేను భావావేశమున మైమరచితిని; నా గొంతుక యార్చుకొనిపోయెను. నా కండ్ల నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలిడితిని.” వారిద్దరి దృశ్యములు ఒకటే యయినందులకు బాపుసాహెబు బుట్టీ విస్మయమందెను. ధనవంతుడగుటచేతను, చేతనయినవా డగుటచేతను, అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు (శ్యామా) సహాయముతో ఒక ప్లాను వ్రాసెను. కాకాసాహెబు దీక్షిత్ దాని నామోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామా పర్యవేక్షణ చేయుచుండెను. భూమ్యుపరి గృహము, భూగృహము, బావి పూర్తియయ్యెను. బాబాకూడ లెండీకి పోవునప్పుడు, తిరిగి వచ్చునపుడు కొన్ని మార్పులను సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పనియంతయు బాపుసాహెబు జోగును చూడుమనిరి. అది నిర్మించునపుడు, బాపుసాహెబు బుట్టీకి ఒక యాలోచన కలిగెను. చుట్టు గదులుండి, దాని మధ్యనొక విశాలమైన హాలులో మురళీధరుని (శ్రీ కృష్ణుని) ప్రతిమ ప్రతిష్ఠ చేయవలెనని శ్యామాకు చెప్పెను. వాడా ప్రక్కనుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామా యీ విషయము నడుగగా బాబా యందులకు సమ్మతించి “దేవాలయము పూర్తి కాగానే నేనే యచ్చట నివసించుటకు వచ్చెదను” అని వాడా వయిపు జూచుచు “వాడా పూర్తియయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించు కొనవలెను. మనమందరమచ్చట నుందుము. అందరు కలసిమెలసి యాడుకొందుము. ఒకరి నొకరు కౌగిలించుకొని సంతోషముగా నుండవచ్చును.” అనెను. దేవస్థాన మధ్యమందిరము కట్టుట కది తగిన శుభసమయమా యని శ్యామా యడుగగా, బాబా సమ్మతించుటచే శ్యామా కొబ్బరికాయ తెచ్చి పగులగొట్టి పనిని ప్రారంభించిరి. కొద్ది కాలములో పని పూర్తి యాయెను. మురళీథర్ విగ్రహము తయారు చేయుట కాజ్ఞాపించిరి. అది తయారు కాకమునుపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి. బాపుసాహెబు మిక్కిలి విచారగ్రస్తుడాయెను; నిరాశపడెను. బాబా సమాధి చెందినచో, తన వాడా బాబా పాదములచే పవిత్రము కాదనియు, తాను మదుపు పెట్టిన లక్షరూపాయలు వ్యర్థమగుననియు చింతించెను. కాని బాబా సమాధి చెందకముందు “నన్ను రాతి మందిరములో నుంచుడు.” అన్నట్టి పలుకు బాపుసాహెబు కేగాక యందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరము మధ్యమందిరములో బెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధర్ కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధిచేయుటచే బాబాయే మురళీధరుడనియు, బుట్టీ వాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలెను. వారి విచత్రజీవితము లోతును కనుగొన శక్యము గాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్రశరీరము సమాధి యగుటచే బాపుసాహెబ్ బుట్టీ మిగుల ధన్యుడు, అదృష్టశాలి.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ముప్పదితొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|

No comments:

Post a Comment