1910 తరువాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. గొప్ప మహత్తులు చూపే సాదువనీ, లేదా అవతారమని విశ్వసించే భక్తులు పెక్కురు బాబా దర్శనానికి రాసాగారు. అక్టోబరు 15, 1918 మధ్యాహ్నం 2.30కి బాబా తన భక్తుని వడిలో మహా సమాధి చెందారు. ఆయన దేహం బూటెవాడలో ఖననం చేయబడింది. అక్కడే 'సమాధి మందిరం' నిర్మించబడింది.
తన స్వరూపం తాను తెలుసుకున్నవాడు జ్ఞాని. సూర్యుడికి చీకటి తెలియదు. జ్ఞానికి దుఃఖం తెలియదు. ఈ లోకాన్ని జ్ఞాని మాత్రమే ప్రేమించగలడు. జ్ఞానిది శివదృష్టి. అజ్ఞానిది శవ దృష్టి. ‘నేను ఆత్మను... నాకు ఒక దేహం ఉంది’ అని జ్ఞానికి తెలుసు. ‘నేను దేహాన్ని... నాకు ఒక ఆత్మ ఉంది’ అనుకొంటాడు అజ్ఞాని. జ్ఞాని దేహం దేవాలయం. దేహ ప్రారబ్ధాన్ని అనుసరించి జ్ఞానికి జరగవలసిన పనులు జరుగుతుంటాయి కాని, కర్తృత్వం ఉండదు. జ్ఞాని శరీరం ధరించి ఉన్నంతమాత్రం చేతనే లోకానికి మేలు జరుగుతుంది. మల్లెతోటలో కూర్చుని మనకు పరిమళం రావాలని కోరుకోనక్కర్లేదు. అదేవిధంగా జ్ఞాని సన్నిధిలో కాంతి, శక్తి, శాంతి నిండి ఉంటాయి.