Friday, July 17, 2015

సాయిపై నమ్మకాన్ని ధృవపరచుకోవడం ఎలా? (collectd by http://telugublogofshirdisai.blogspot.in/2015/07/blog-post_17.html)



సాయిలీలాస్.ఆర్గ్ నుండి సేకరింపబడిన ఈ వ్యాసాన్ని చదివిన తరువాత  మనకు సాయిమీద ఎంత నమ్మకం, శ్రధ్ధ, భక్తి ఉన్నాయో పరిశీలించుకోవాలి.  నమ్మకాన్ని ఇంకా ఇంకా పెంచుకోవడం ఎలా అన్నది అర్ధమవుతుంది. దానికి అనుగుణంగా మనం ఆచరిస్తే తప్పక సత్ఫలితాలను, సాయి యొక్క నిరంతర అనుగ్రహాన్ని పొందగలం.  

సాయిపై నమ్మకాన్ని ధృవపరచుకోవడం ఎలా?

సాయిభక్తులెందరో "ఓ! బాబా, నీపై నాకు నమ్మకం కలిగేలా చేయి" అని ఎంతో ఉత్సహంతో అంటూ ఉంటామని నాతో చెబుతూ ఉంటారు.  ఇటువంటివారెనెందరినో చూశాను.  నాకుమాత్రం యిటువంటి వ్యక్తులతో ఓర్పుగా వ్యవహరించడం కష్టసాధ్యమయిన పని.  ఊరికే కూర్చుని నాకు సాయి మీద విశ్వాసం, భక్తి కుదరాలి అని అనుకున్న మాత్రం చేత ఏర్పడేవి కావు.  మనం కారు డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా, ఈత నేర్చుకోవాలన్నా, ఊరికినే కుర్చీలో కూర్చొని నాకివన్నీ రావాలి అనుకుంటే వచ్చేవు కావు.  కారు డ్రైవ్ చేయాలంటే డ్రైవింగ్ స్కూల్ కి వెళ్ళి నేర్చుకోవాలి.  అలాగే ఈతనేర్పేవారి వద్దకెళ్ళి ఈత నేర్చుకోవాలి.  నేర్చుకున్న తరువాత అభ్యాసం చేయాలి.  అప్పుడే మనం వాటిలోని మెళకువలు నేర్చుకొని ప్రావీణ్యం సంపాదిస్తాము.  
       

అలాగే మన జీవితంలో మనకు సాయిబాబా బలీయమైన స్థానం పొంది స్థిరంగా నిలచిపోవాలనుకున్నా యిదే సూత్రం వర్తిస్తుంది.  

బాబా మనజీవితంలో సుస్థిరంగా నిలచి ఉండాలంటే మొట్టమొదటగా మనం చేయవలసినది జీవితంలో ప్రతిక్షణం మనం సాయిబాబాకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి.  నమ్మకం అన్నది ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది.  కాని,  శ్రీసాయి సత్ చరిత్ర చదవకుండా, షిరిడీ దర్శించకుండా, సాయి అనుగ్రహానికి దూరంగా ఉంటే నీలో నమ్మిక అనేది ఎప్పటికీ రాదు.  అలాగే షిరిడీ వెళ్ళి సాయిని దర్శించుకున్నంత మాత్రం చేత కూడా నమ్మకం ఏర్పడదు.  సాయి శక్తిని మనలోకి ప్రవహింపచేసుకోవాలంటే నిరంతరం శ్రమించాలి.  సాయి శక్తి ఉన్నచోటకి వెళ్ళి నాలో సాయిశక్తి నిండిపోవాలి అని అనుకుంటే ఎటువంటి ఉపయోగం ఉండదు.  శరీరం మొత్తం తడవకుండా మైకా కోటు, కాళ్ళకి బూట్లు వేసుకొని, వర్షంలో నిలబడితే శరీరం మీద ఒక్క వర్షపు చుక్క కూడా పడదు.  
ముఖ్యంగా కావలసినది సాయి మీద నమ్మకం.  బాబా చెప్పిన ఏకాదశ సూత్రాలను మననం చేసుకుంటూ ఉండాలి.  "ఆర్తులైన నేమి, నిరుపేదలైన నేమి, ద్వారకామాయి ప్రవేశమొనరించినంతనే సుఖసంపదలను పొందగలరు"   "ఈ ఫకీరు చాలా దయామయుడు.  మీ వ్యాధులను బాపి, మిమ్ములను ప్రేమ కరుణలతో రక్షించెదను" అని బాబా చెప్పారు. 


బాబా చెప్పిన ఈ వచనాలను చదివినవారు, (నేను ద్వారకామాయిని దర్శించుకున్నాను, బాబాను దర్శించుకున్నాను) నాకు బాబా చెప్పినట్లుగా ఎటువంటి కష్టాలు  తీరలేదు, నాకేమీ సుఖశాంతులు కలుగలేదు అని అన్నారంటే కుళాయిలోనుండి వచ్చే నీటి ప్రవాహాన్ని, కుళాయి కట్టివేసి ఆపినట్లుగా, మనలోనికి ప్రవహించే సాయి-దయ అనే ప్రవాహాన్ని నిరోధించడమే.  సాయినాధుడు తనతో మనలని అనుబంధం పెంచుకోవాలని కోరుకొంటారు.  నన్నే స్మరించువారిని నేనెల్లప్పుడూ గుర్తుంచుకుంటానని బాబా మాటిచ్చారు.  మనం మనస్ఫూర్తిగా, శ్రధ్ధ సబూరీతో ఆయననే స్మరిస్తూ, నిజాయితీగా ఆయనని ప్రార్ధిస్తూ బాబాపై నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన తప్పక మనకి సహాయం చేస్తారు.    

బాబాపై మనం చూపించే శ్రధ్ధ సబూరీలో మనకే సంతృప్తి లేదనుకోండి.  ఎందువల్ల?   దానికి కారణాలేమిటి అని మనం విశ్లేషించుకోవాలి.  మనకు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి.  మనలో కోపం, ద్వేషం, అసూయ, ఇతరులమీద ఆగ్రహం, భయం, అపరాధభావన, ఇలాంటివేమన్నా మనలో దాగి ఉన్నాయేమో  పరిశీలించుకోవాలి.  
   
    

కొన్ని విలాసాలను కూడా మనం త్యజించాలి.  వాటికి మనం లోబడి ఉండకూడదు.  వాటినుంచి మనం దూరంగా ఉండటానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేసినపుడే వాటిని బయటకు తరిమివేయగలం.  అందువల్లనే బాబా "నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండాలని" బోధించారు.   
మనకి మనం ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకుంటే, మనలో ఉన్న అవలక్షణాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకోగలుగుతాము.  దానితో మనకి కాస్త నిరాశ, దిగులు కలుగుతుంది.  కాని బాబాపై మనకున్న శ్రధ్ధకన్న, బాబాకు మనయందు విశ్వసనీయమైన ధృఢమయిన శ్రధ్ధ ఉందనే విషయం మనకి నమ్మకంగా తెలుస్తుంది.

"నాయందెవరి దృష్టి ఉన్నదో వారియందే నాదృష్టి" ఇది బాబా చెప్పిన భవిష్యవాణి.  ఒక్కసారి కనక మనము ఆయనకి అవకాశం యిస్తే ఆయన అనుగ్రహం మనలోకి ప్రవేశిస్తుంది. 

      

 బాబా ఏమార్గాన్నెంచుకుంటారు అన్నదాని గురించి నేను మాట్లాడుతున్నాను.  అదే  నమ్మకం.  మనందరికి ఆశక్తి ఉంది.  దానిని ఎలా ఉపయోగించాలన్నదే మనం నేర్చుకోవాలి. 

బాబా మనకు చెప్పిన అమృతతుల్యమయిన, అభయ వచనాలు మనచెవులలో మార్మోగుతూనే ఉన్నాయి కదా!  "నాయందు నమ్మకముంచండి.  ఈభౌతిక దేహానంతరము కూడా నేనప్రమత్తుడనే.  నా సమాధినుండే నామానుష శరీరము మాటలాడును. నా ఎముకలు మాటలాడును.  నన్నాశ్రయించువారిని, నన్ను శరణు జొచ్చువారిని నిరంతరంగా రక్షించుటయే నాకర్తవ్యము". 

బాబా చెప్పిన ఈమాటలు నూటికి నూరుశాతం యదార్ధమని నమ్మకముంచండి.  ఇది వంచనకాదు.  ఆధ్యాత్మికంగా ఆచరించదగ్గవి.  ఆచరణలో పెట్టినంతనే అద్భుతమయిన ఫలితాలను మనం అనుభవించవచ్చు.   

విజ్ఞానశాస్త్రంలో ఒక సిధ్ధాంతాన్ని అది నిజమవునా కాదా అని నిరూపించాలంటే ప్రారంభంలో  ప్రయోగాలు చేసి నిర్ధారించాలి.

ఎన్నోమారులు మరలా మరలా ఆచరణలో పెట్టి ఫలితాన్నిస్తుందని నేను స్వయంగా తెలుసుకున్నాను.  అందుచేత సందేహించేవారికి, చంచల మనస్కులకి నేను చెప్పదలచుకున్నదేమిటంటే, అపనమ్మకం అనేది మనసులో పెట్టుకోకుండా నమ్మడానికి ప్రయత్నం చేయండి. నిజాయితీగా నమ్మకాన్నే ఆచరిస్తూ  దానికి కట్టుబడి ఉండటానికే ప్రయత్నం చేసినట్లయితే మన నమ్మకం యొక్క స్థాయి యింకా యింకా పెరగడం ప్రారంభమవుతుంది.  నమ్మేకొద్దీ యింకా ధృఢతరమవుతుంది.



ప్రముఖ సైకాలజిస్టు విలియం జేంస్ చెప్పిన మాట *"నమ్మకం నిద్రాణమైన స్థితి అన్న కావచ్చు లేదా తీవ్రమైన జ్వరమైనా కావచ్చు" ...సాయిబంధువులకు కావలసినది అదే.   

అద్భుతమయిన బాబావారి ప్రేమ , జ్ఞానం వీటితో  మమేకమై ఉన్న సాయి భక్తులకు యింకేమికావాలి?  ప్రయత్నించి చూడండి.   

(విశ్లేషణ: బాబా చరిత్ర పారాయణ చేసేవారికి, బాబాను దర్శించుకునేవారికి నమ్మకం ఉండబట్టే బాబాతొ సాన్నిహిత్యం ఏర్పడింది.  అందరికీ నమ్మకం అనేది ఉంది.  ఇక్కడ నిద్రాణమైన స్థితి అంటే ఎవరికి  వాళ్ళం ఆత్మ విమర్శ చేసుకోవాలి.  నమ్మకం ఉండబట్టే పారాయణ చేస్తున్నాము.  కాని ఇక్కడ నమ్మకం తీవ్రమైన జ్వరం అని విలియం జేంస్ అన్న దానికి అర్ధం మన మనసులో నమ్మకం తీవ్రంగా ప్రజ్వలిస్తూ ఉండాలి.  అంతటి తీవ్రమైన నమ్మకం ఉన్న సాయి భక్తులు కొంతమంది ఉన్నారు, ఉంటారు.  సాయి సత్ చరిత్ర పారాయణ చేసే వీరు, బాబా చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు.  ఎదటివారిని అందరినీ కూడా సాయీ అనె సంబోధిస్తూ ఉంటారు. ఆఖరికి రైలు లో టీ అమ్మే వానిని కూడా సాయీ టీ పట్టుకురా అని అనడం కూడా నేను చూశాను. ఎదుటివారిలో కూడా సాయే ఉన్నాడనే భావన రావాలి. అంటే ప్రతినిమిషం సాయిని తలచుకుంటూ ఉంటారు.  అంటే సాయిమీద అంత నమ్మకం పెట్టుకున్నారన్నది మనకి అర్ధమవుతుంది.  అందు చేత నిద్రాణస్థితిలో ఉన్న నమ్మకాన్ని తీవ్రతరం చేసుకోవాలి.   (త్యాగరాజు ) 

ఎం.కే.ఎస్.సీతవిజయకుమార్
కిల్ కోటగిరి ఎస్టేట్
కిల్ కోటగిరి - 643216
నీల్ గిరిస్
(సాయిప్రభ జూలై 1987)
    

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment