Tuesday, July 21, 2015

బాబానే నమ్ముకోండి - అనుభూతులు పొందండి(article from http://telugublogofshirdisai.blogspot.in/2015/04/blog-post.html)

బాబా నాకు విద్యనిచ్చారు 

మనజీవితాలకి మార్గదర్శకుడు సాయిమాత.  ఆయన మనలని సరియైన మార్గంలో నడిపిస్తూ దిశానిర్దేశం చేస్తారు.  బాబాతో నా అనుభవాలని వివరిస్తాను.  నేను 12వ.తరగతి చదువుతుండగా సాయి గురించి తెలిసింది.  నేను ఎప్పుడూ భగవంతుడిని ప్రార్ధిస్తూ ఉంటాను.  కాని గాఢమైన నమ్మకం, భక్తి మాత్రం లేదు.  కాని బాబాని పూజించడం ఎప్పుడయితే మొదలుపెట్టానో ఆయనతో నా అనుబంధం తొందరలోనే బాగా ఎక్కువయింది.  బాబా లేకపోతే నేనే లేను అన్నంత ధృఢంగా  ఆయన మీద భక్తి కలిగింది. 


బాబా దయవల్ల నాకు 12వ.తరగతిలో మంచి మార్కులు వచ్చాయి.  మాకుటుంబంలోని వారే కాదు స్నేహితులు కూడా చాలా ఆశ్చర్యపోయారు.  ఆతరువాత నేను యింజనీరింగ్ కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేశాను. కౌన్సిలింగ్ లో నాకు మంచి కాలేజీలో సీటు వచ్చేలా చేయమని బాబాని ప్రార్ధించాను.  మేము ఉంటున్న ఊరిలోనే సీటు వచ్చేలా చేయమని బాబాని ప్రార్ధించాను.  ఉన్న ఊరిలోనే  కాలేజీలో సీటు రాకపోతే ఏమిచేయాలా అని అందరం ఆలోచనలో పడ్డాము.  నాతల్లిదండ్రులకు నేను ఒక్కతినే అమ్మాయిని.  అందుచేత మానేజ్ మేంటు కోటాలోనయినా యింజనీరింగ్ లో చేర్పిద్దామనుకొన్నారు.  కాని అది చాలా ఖర్చుతో  కూడుకున్న వ్యవహారం.  నాకొచ్చిన మార్కులు చూసి ఫీజు ఒక్కటే కట్టమన్నారు కాలేజీవారు.  మొదటి సంవత్సరం మా అమ్మగారు ఫీజు కట్టారు.  ఒకసంవత్సరం గడిచిపోయింది.  ఇక్కడి కాలేజీలో చదివేలా ఎందుకు చేశావని బాబా మీద కోపంగా ఉండేది.  కాని తరువాత ఆవిషయం గురించి ఆలోచించకుండా బాబాని ఎప్పటిలాగే పూజిస్తూ వచ్చాను. 

రెండవ సంవత్సరంలోకి అడుగు పెట్టగానె కాలేజీ ఫీజు కట్టవలసి వచ్చింది.  బస్సు చార్జీలు, ఫీజులు అన్ని కలుపుకొని దాదాపు లక్షరూపాయలు కట్టాలి.  మా అమ్మగారికి ఏమిచేయాలో తోచలేదు.  చాలా ఆదుర్దాపడిపోయింది.  నగలన్నిటినీ బ్యాంకులో తాకట్టుపెట్టి లక్షరూపాయలు తీసుకొని వచ్చింది.  ఫీజు చెల్లించడానికి కాలేజీకి వెళ్ళింది.  అప్పుడు సాయి చేసిన అధ్బుతం చూడండి.  ఫీజు కడుతూండగా "మీ అమ్మాయికి స్కాలర్ షిప్ వచ్చింది ఫీజు కట్టనవసరం లేదు" అని కాలేజీవాళ్ళు చెప్పారు.  మా అమ్మగారికిది నమ్మలేని విషయం.  నాకు కూడా నమ్మబుధ్ధి కాలేదు.  కారణం నాకు మేనేజ్ మెంటి కోటాలో సీటు వచ్చింది.  ఇదెలా జరిగిందో తెలీక చాలా ఆశ్చర్యపోయాము.  తరువాత మూడు సంవత్సరాలు నేను ఫీజు కట్టలేదు.  బాబా అనుగ్రహమే లేకపోతే యిది సాధ్యమయేదే కాదు.

                బాబా ఇప్పించిన ఉద్యోగం

కాలేజీలో చదువుకునే రోజులలోనే, చదువు పూర్తవగానే నాకు మంచి ఉధ్యోగం యిప్పించు బాబా అని ప్రార్ధిస్తూ ఉండేదానిని.  ఆఖరి సంవత్సరం లో మా కాలేజీ, విద్యార్ధులకు ఉద్యోగంలో నియామకాలు ఏర్పాటు చేసింది.  కాని నాకు ఉద్యోగం రాలేదు.  ఏంచేయాలో నాకేమీ అర్ధం కాలేదు.  నాస్నేహితులందిరికీ ఉద్యోగాలు వచ్చాయి.  తరచుగా నాముందే వాళ్ళంతా తమకు వచ్చిన ఉధ్యోగాల గురించి మాటలాడుకుంటూ వుండేవారు.  దాంతో నాకు మరీ నిరాశ ఎక్కువయింది.  బాబా ముందు ఏడిచేదానిని.  ఎటువంటి మార్పు లేకుండా రోజులు గడిచిపోతున్నాయి.  అనుకోకుండా మా సోదరుడు పనిచేసే పాఠశాలలోనే పనిచేస్తున్న ఒక ఉద్యోగిని కలుసుకోవడం తటస్థించింది.  తనంతట తానే నా ఉద్యోగం గురించి అడిగాడు.  అతను కూడా బాబా భక్తుడని ఆ తరువాత తెలిసింది.  బాయే అతనిని పంపించాడనిపించింది.  అతని దయవల్ల నాకు ఉద్యోగం వచ్చింది.  ఆఖరి సెమిస్టర్లో పరీక్షల సమయంలో యింటర్వ్యూ జరిగింది.  నేను కోరుకొన్నట్టుగానె యిక కాలేజీ ఆఖరయే ముందు ఆఫర్ లెటర్ వచ్చింది.  యివన్నీ బాబా దయవల్లే జరిగాయి.


నాకు కడుపులో అల్సర్ (పుండు) ఉంది.  ఆ బాధతో కారాలు ఏవీ లేకుండా ఆహారం తీసుకొంటున్నాను.  కడుపులో పుండు తగ్గిపోయి ఉంటుందిలే అనుకొని ఒకరోజు రాత్రి అన్నంలో ఊరగాయ వేసుకొని తిన్నాను.  తరువాత నిద్రపోయాను.  కాని అర్ధరాత్రి కడుపులో బాగా మంట, నొప్పి విపరీతంగా బాధపెట్టసాగాయి.  అంత రాత్రివేళ ఏమిచేయాలో నాకు పాలుపోలేదు.  అప్పుడు బాబా ఊదీ గుర్తుకు వచ్చింది.  మా అమ్మగారు బాబాని ప్రార్ధించి చిటికెడు ఊదీ నానోటిలో వేశారు.  మరునిమిషంలోనే అద్బుతంగా  నొప్పి తగ్గసాగింది.  రాత్రి హాయిగా నిద్రపోయాను.  బాబా అనుగ్రహంతోనే యిది సాధ్యమయింది.  ఆయన నాకు చేసిన వైద్యం మాటలలో వర్ణించలేను.  

                   అన్నింటికీ బాబాయే ఉన్నారు

ఎప్పుడయినా నామనసు చికాకుగాను, విచారంగాను ఉన్నపుడు బాబా గుడికి వెడుతూ ఉంటాను.  కోయంబత్తూర్ లో నాగసాయి మందిరం ఉంది. నేను మందిరానికి వెళ్ళేంతవరకు మనసంతా అస్థిమితంగా ఉంది. మందిరంలోకి అడుగుపెట్టిన మరుక్షణం అన్నీ మరచిపోయాను.  మనసంతా ప్రశాంతంగా హాయిగా ఉంది.  ఈ విధంగా ఎలా జరుగుతోందో నాకు తెలీదు. సాయి అందరినీ కనిపెట్టుకొని ఉంటారు.  ఆయన తన బిడ్డలనెప్పుడూ కష్టాల బారిన పడనివ్వరు.
                                                   
మనమంతా మానవమాత్రులం.  అందరికీ సమస్యలు సహజంగానే ఉంటాయి.  కాని మనందరికీ సాయి మాత ఆశీస్సులు ఉన్నాయి.  నేను మీ అందరినీ కోరేదేమిటంటే మీకెప్పుడు మనసు ఆందోళనగా ఉన్నా బాబాని స్మరించుకోండి.  వీలయితే బాబా మందిరానికి వెళ్ళి ఆయనను దర్శించుకోండి.  లేకపోతే యింటిలోనయినా ఆయనని ప్రార్ధించండి.  ఈవిధంగా చేస్తే బాబా మీతోనే ఉన్నాడన్న అనుభూతి కలుగుతుంది.  ఇక ఎటువంటి చింతా ఉండదు.  బాబా మీద మనకి అత్యంత భక్తి ప్రప్రత్తులు, నమ్మకం ఉన్నాయి.  ఆయనని ఒక్కసారి స్మరించుకోండి.  నా అనుభవం ప్రకారం మనం కోరుకొన్నది బాబా మనకి ప్రసాదించరు.  మనకి ఏదిమంచో దానినే మనకు ప్రసాదిస్తారు.  మనం కోరుకునేదానికి, మనకేదయితే మంచి చేస్తుందో దానికి, ఈరెండిటికీ చాలా భేదం ఉంది.  అదిమాత్రం గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ సాయిని స్మరిస్తూ ఉండండి.  అది మనలో ఆత్మస్థైర్యం పెరగడానికి దోహద పడుతుంది.    

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

No comments:

Post a Comment