Tuesday, September 9, 2014

శ్రీ సాయి సత్ చరిత్ర-----------బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన యభయప్రధానవాక్యములు

ఓ సద్గురుసాయీ! నీవు పావనమూర్తివి, ప్రపంచమంతటికి ఆనందము కలుగజేసితివి, భక్తులకు మేలు కలుగజేసితివి. నీ పాదముల నాశ్రయించినవారి బాధలను తొలగించితివి. నిన్ను శరణు జొచ్చిన వారిని ఉదారస్వభావుడవగుటచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుటకొరకు నీవవతరించెదవు. పవిత్రాత్మయగు ద్రవసారము బ్రహ్మమనెడి యచ్చులో పోయగా దానినుండి యోగులలో నలంకారమగు సాయి వెడలెను. ఈ సాయి యాత్మారాముడే, స్వచ్ఛమైన దైనికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్చ లన్నియు పొందినవారై, వారు భక్తులను నిష్కాములను జేసి విముక్తుల జేసిరి. యుగయుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసియున్నవి. కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపరముగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానము లన్నింటిలో అన్నదానమే శ్రేష్ఠమయినది. మధ్యాహ్నము 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాల బాధపడెదము. అట్టి పరిస్థితులలో నితర జీవులుకూడ నట్లే బాధ పడును. ఈ విషయము తెలిసి యెవరయితే బీదలకు, ఆకలితో నున్న వారికి, భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది. ఆహారమే పరబ్రహ్మస్వరూపము, ఆహారమునుండియే సమస్తజీవులు ఊద్భవించినవి. చచ్చిన పిమ్మట నవి తిరిగి ఆహారములో ప్రవేశించును. మిట్టమధ్యాహ్నము మన యింటికెవరైన అతిథి వచ్చినచో, వారి నాహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతరదానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి యిచ్చు నపుడు కొంత విచక్షణ కావలెను. కాని యాహారవిషయములో నట్టి యాలోచన యనవసరము. మన యింటికి మిట్టమధ్యాహ్న మెవరువచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటుపిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మంచి యెంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో నితరదానములు ప్రకాశించవు. ఎట్లన చంద్రుడు లేని నక్షత్రములవలె, పతకములేని కంఠాహారమువలె, పింఛము లేని కిరీటమువలె, కమలము లేని చెఱువువలె, భక్తి లేని భజనవలె, కుంకుమబొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠముగలవాని పాటవలె, ఉప్పు లేని మజ్జిగవలె రుచించవు.

షిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి గూడ పావనమైనదే. ఏలన శ్రీసాయి యచటనే నివసించుచు, తిరుగుచు, మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడీ గ్రామప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. వారికొరకే చాలాదూరము నుండి యచటకు వచ్చెను. మొదట షిరిడీ చాల చిన్నగ్రామము, సాయిబాబా యచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థల మాయెను. అచటనుండు స్త్రీలుకూడ ధన్యులు. బాబాయందు వారిభక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసరునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి, విన్న వారికి మనశ్శాంతి కలుగజేయుచుండెను.

1.    జ్ఞానులముందు ఉత్త సాష్టాంగము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్యశరణాగతి చేయవలెను.

2. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో గాని, దొంగయెత్తుతో గాని, వారిని బుట్టలో వేయుటకుగాని, వారి తప్పులను పట్టుటకు గాని, పనికిమాలిన యాసక్తితో యడుగకూడదు. నిజముగా తెలిసి దానిచే మోక్షము పొందుటకుగాని, ఆధ్యాత్మికాభివృద్ధికిగాని యడుగవలెను.

3. సేవ యనగా ఇష్టమున్నచో చేయవచ్చును లేనిచో మానవచ్చుననే యభిప్రాయముతో చేయునది సేవకాదు. శరీరము తనదికాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువుగారి దనియు, వారిసేవకొరకే శరీరమున్నదనియు భావింపవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానము బోధించును. 

గురు వజ్ఞానమును బోధించుననగా, నానాకు అర్థముకాలేదు. 

బాబా: జ్ఞానము ఉపదేశ మెట్లగును? అనగా సాక్షాత్కారము బోధించుట యెట్లు? అజ్ఞానమును నశింపజేయుటయే జ్ఞానము. 

జ్ఞానేశ్వరమహారాజు ఇట్లు చెప్పియున్నారు. ‘అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జునా! స్వప్నము, నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా నజ్ఞానమును నశింప జేయుటయే. చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపజేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపజేసెద మనగా, అద్వైతమును గూర్చిచెప్పుట. చీకటిని నశింపజేసెద మనినచో, వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలెననినచో, ద్వైతమను భావమును మనసులోనుంచి తీసివేయవలెను. అదియే అద్వైతమును పొందుజ్ఞానము. ద్వైతములోనే యుండి అద్వైతముగూర్చి మాట్లాడగలవారెవ్వరు? ఎవరైన నట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది యెట్లుతెలియును? దాని నెట్లు పొందెదరు? శిష్యుడు గురువువలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికి భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్యము, మహాశక్తిమత్వము, మరియు ఐశ్వర్యయోగము. సద్గురువు నిర్గుణుడు, సత్చిదానందుడు. వారు మానవాకారమున నవతరించుట, మానవులను లేవనెత్తుటకును ప్రపంచము నుద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి యసలయిన నిర్గునస్వభావము కొంచెము గూడ చెడిపోదు. వారి సత్యస్వరూపము, దైవికశక్తి, జ్ఞానము తరుగకుండ నుండును. శిష్యుడు కూడ నట్టిస్వరూపము కలవాడే. కాని యతని అనేకజన్మల యజ్ఞానము యతని శుద్ధచైతన్యమను సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను.అనుకొనెను. గురువు యజ్ఞానమును మూలముతో తీసివేయవలెను. తగిన యుపదేశము నివ్వవలెను. లెక్కలేనన్ని జన్మలనుంచి సంపాదించిన యజ్ఞానమును గురువు నిర్మూలించి యుపదేశించవలెను. ఎన్నోజన్మలనుంచి తాను నికృష్టజీవుడ ననుకొను శిష్యుని గురువు నీవే దైవము, శక్తియుతడవు, ఐశ్వర్యశాలివిఅని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా యహంకారమనియు, దేవుడు, లోకము తనకంటె వేరనియు తలంచు నిత్యాంతభ్రమ అనేక జన్మలనుంచి వచ్చుచున్న దోషము. దానిపై నాధారపడి చేసిన కర్మలనుండి వానికి సంతోషము, విచారము, ఈ రెంటియొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమునుగూర్చి అతడు విచారమారంభించవలెను. ఈ ఆజ్ఞానమెట్లు అంకురించినది? అది యెక్కడ నున్నది? అను దానిని చూపుటయే గురుపదేశమందురు. ఈ దిగువ వివరించినవి యజ్ఞానలక్షణములు 

1. నేను జీవిని (ప్రాణిని).
2. శరీరమే యాత్మ (నేను శరీరమును).
3. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేర్వేరు.
4. నేను దేవుడను కాను.
5. శరీర మాత్మకాదని తెలిసికొనకుండుట.
6. దేవుడు, జీవుడు ప్రపంచము ఒకటేయని తెలియకుండుట.


ఈ తప్పులన్నియు చూపించనిదే, శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగానేమో తెలియజాలడు. వానిలో వానికి ఎట్టి సంబంధము కలదో, ఒకటి యింకొకటికంటె వేరైనదా లేక రెండును ఒకటేనా యను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని యజ్ఞానము నశింపజేయుటకు చెప్పునది జ్ఞానమా? అజ్ఞానమా? జ్ఞానమూర్తియైన జీవునకు జ్ఞానోపదేశము చేయనేల? ఉపదేశమనునది వాని తప్పును వానికి చూపి వాని యజ్ఞానమును సశింపజేయుటకొరకేబాబా యింకను ఇట్లనెను. 

1. ప్రణిపాత మనగా శరణాగతిచేయుట, 2. శరణాగతి యనగా తను (శరీరము), మన (మనస్సు), ధనముల (ఐశ్వర్యము) నర్పించుట, 3. శ్రీ కృష్ణుడు అర్జునుని ఇతరజ్ఞానుల నాశ్రయించు మననేల? 

సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైన శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీ కృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము, ఆత్మలు గాను భావించును. అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీ కృష్ణునికి తేలిసి యుండుటచే, వారినిగూర్చి అర్జునునికి చెప్పెను. అట్టివారి గొప్పతనము హెచ్చియందరికి తెలియవలెననియే కృష్ణుడట్లు పేర్కొనెను
2.   శ్రీ సాయిసమర్ధుడు, పావనమూర్తి. తన భక్తుల కిహపర విషయములందు తగిన సలహాల నిచ్చి జీవితపరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి, అప్రాప్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తులయెడ భేదము లేక నమస్కరించిన వారిని కౌగిలించుకొనువారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రమువలె బాబా భక్తులతో కలసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనినిబట్టి, యెవరయితే భగవద్ భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారికంటెగాని, యంతకంటె యెక్కువ గాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలెను
3.   నన్నే గురుతుంచుకొను వారిని నేను మరువను. నాకు బండిగాని, టాంగాగాని, రైలుగాని, విమానముగాని యవసరములేదు. నన్ను ప్రేమతో బిలచువారియొద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్ష్యమయ్యెదను. అతనికి సంతోషమయిన జవాబు వ్రాయుము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చెదమని వ్రాయుము.జోగ్ బాబా చెప్పినది దేవుకు వ్రాసెను. దేవుగా రెంతో సంతసించిరి. కాని బాబా రాహాతా, రుయి, నీమగాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియును. బాబాకు అశక్యమైన దేమియు లేదు. వారు సర్వాంతర్యామి యగుటచే హఠాత్తుగా నేరూపమున నయిన వచ్చి, తమ వాగ్ధానమును పాలించ వచ్చు ననుకొనెను. 
4.   భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో, వారు తమ భక్తుల యిండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు జూచెదరు అనునది యీ కథవల్ల స్పష్టపడుచున్నది. బాబాకు భూతభవిష్యద్వర్తమానములు తెలియుననియు, చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలనెట్లు నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. యెవరికయితే ఆధ్యాత్మిక విషయములలో నెక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే గాక వారి కష్టములను దొలగించి వారిని ఆనందభరితులుగా జేయుచుండిరని రాబోవు కథవలన తెలియును. ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము. పోయి వాడాలో కూర్చుండుము. ప్రతినిత్యము కొంచమైనను క్రమము తప్పక చదువుము. చదువునపుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో భోధపరచి చెప్పుము. నేను నీకు జాల్తారు సెల్లానిచ్చుటకు ఇచట కూర్చొనియున్నాను. ఇతరులవద్దకు పోయి దొంగిలించెదవేల? నీకు దొంగతనమునకు అలవాటు పడవలెనని యున్నదా?” 
5.   బాబా కృపయను కాంతిచే ఐహికజీవితమందలి భయము నెటుల త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గము నెట్లు తెలిసి కొనగలమో, మన కష్టములను సంతోషముగా నెట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదారవిందములను జ్ఞప్తియందుంచుకొనినచో, మన కష్టములు నశించును. మరణము దాని నైజమును కోలిపోవును. ఐహిక దుఃఖములు నశించును. ఎవరయితే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా విన వలెను. అది వారి మనస్సును పావనము చెయును.
6.   "అనవసరముగా విచారించెదవేల? కుక్క ఆకలి దీర్చుట నా ఆకలి దీర్చుట వంటిది. కుక్కకుకూడ ఆత్మగలదు. ప్రాణులు వేరు కావచ్చును. కాని అందరి ఆకలి యొకటియే. కొందరు మాట్లాడగలరు. కొందరు మూగవలె మాట్లాడలేరు. ఎవరయితే ఆకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము." ఇది చాల చిన్న విషయము గాని, బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి, ఇతరుల కెట్టి బాధయు కలుగకుండ నిత్యజీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించెను. ఆనాటినుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని యెంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగత రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే యెల్లప్పుడు తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవులయందు గలరని తెలిసి కొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు.  యోగులు శరీరము ధరించి యేదో పనిమీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొన మొదలిడిరి. మునుముందు ఎనిమిదేండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యెదనని బాబా తమ భక్తులతో చెప్పిరని యొకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక నెవ్వెరును సందేహింప నక్కరలేదు. ఏలన కృష్ణావతారములో శ్రీ మహావిష్ణు వీ కార్యమే యొనర్చెను. సుందర శరీరముతో, ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీ కృష్ణుడు దేవకీదేవికి కారాగారమున ఎనిమిదేండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యెను. ఆ యవతారమున శ్రీ కృష్ణుడు భూమిభారమును తగ్గించెను. ఈ యవతారము (సాయిబాబా) భక్తుల నుద్ధరించుటకై వచ్చినది. కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడ లగమ్యగోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధ మీయొక్క జన్మతోడిదే కాదు, అది కడచిన డెబ్బెదిరెండు జన్మల సంబంధము. ఇట్టి ప్రేమబంధములు కల్గించిన యా మహారాజు (సాయిబాబా) ఎచటికో పర్యటనకై పోయినట్లనిపించుట వలన వారు శ్రీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢవిశ్వాసము భక్తులకు గలదు. "ఇటుక కాదు, నా యదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడునీడ. దాని సహాయమువలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడివాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో, దానియందు నాకంత ప్రేమ. ఈ రోజు అది నన్ను విడచినది." ఎవరైన ఒక ప్రశ్న నడుగవచ్చును. "బాబా నిర్జీవియగు ఇటుకకోసమింత విచారపడనేల?" అందులకు హేమడ్ పంతు ఇట్లు సమాధాన మిచ్చెను. "యోగులు బీదవారికి, నిస్సహాయులకు సహాయముచేయుటకై యవతరించెదరు. వారు ప్రజలతో కలసి మసలునప్పుడు ప్రజలవలె నటింతురు. వారు మన వలె బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కాని లోపల వారు శుద్ధచైతన్యులయి వారి కర్తవ్యవిధుల నెరుగుదురు”. బాబా 3 మూరల శరీరమా లేక లోపలనున్న యాత్మయా? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును. శరీర మశాశ్వతము గాని, లోనున్న యాత్మ పరమసత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధసత్తాయే బ్రహ్మము, అదియే పంచేంద్రియములను, మనస్సును స్వాధీనమందుంచుకొనునది, పరిపాలించునది. అదియే సాయి. అదియే ఈ జగత్తునందు గల వస్తువు లన్నిటి యందు వ్యాపించి యున్నది. అది లేనిస్థలము లేదు. అది తాను సంకల్పించు కొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతికశరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట, శరీరమును విడిచెను. సాయి యెల్లప్పుడు ఉండు వారు. అట్లనే పూర్వము గాణ్గాపురములో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు. వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని, సమస్తచేతనాచేతనములందు గూడ నుండి వానిని నియమించువారును, పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికిని సర్వస్యశరణాగతి చేసిన వారికిని మనస్ఫూర్తిగ భక్తితో పూజించువారికిని అనుభవనీయమయిన సంగతి. 

ప్రస్తుతము బాబా రూపము చూడ వీలులేనప్పటికిని, మనము షిరిడీకి వెళ్ళినచో, వారి జీవిత మెత్తుపటము మసీదులో నున్నది. దీనిని శ్యామారావు జయకర్ యను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసియున్నాడు. భావుకుడు భక్తుడూ నైన ప్రేక్షకునికి ఈ పటము ఈ నాటికిని బాబాను భౌతికశరీరముతో చూచినంత తృప్తి కలుగజేయును. బాబాకు ప్రస్తుతము భౌతికశరీరము లేనప్పిటికి వారక్కడనేకాక ప్రతి చోటున నివసించుచు పూర్వమువలెనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబావంటి యోగులు ఎన్నడు మరణించరు. వారు మానవుల వలె గనిపించినను నిజముగా వారే దైవము.
అమృతతుల్యమగు బాబా పలుకులు
1.    దయాదాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసారులు మసీదులో ఈదిగువ మధురవాక్యములు పలికిరి. "ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడు నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమియు చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే యెల్లప్పుడు జపించుచుండును. ఎవరయితే సర్వస్యశరణాగతి చేసి, నన్నే ధ్యానింతురో వారికి నేను ఋణస్థుడను. వారికి మోక్షము నిచ్చి వారి ఋణము దీర్చుకొనెదను. ఎవరయితే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో నుందురో, ఎవరయితే నాకర్పించనిదే యేమియు తినరో అట్టివారిపై నేను ఆధారపడియుందును. ఎవరయితే నా సన్నిధానమునకు వచ్చెదరో, వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైన లేకుండ, నీ హృదయములో నున్న నన్ను సర్వస్యశరణాగతి వేడవలెను."
2.   నేను అనగా నెవ్వరో సాయిబాబా యెన్నోసార్లు బోధించెను. వారిట్లనిరి. "నన్ను వెదుకుటకు నీవు దూరము గాని మరెచ్చటికి గాని పోనక్కరలేదు. నీ నామము నీ యాకారము విడిచినచో నీలోనేగాక యన్ని జీవులలోను, చైతన్యము లేదా యంతరాత్మ యని యొకటి యుండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి, నీలోనేగాక అన్నిటిలోను నన్ను జూడుము. దీనిని నీవభ్యసించినచో, సర్వవ్యాపకత్వ మనుభవించి నాలో ఐక్యము పొందెదవు." 

3.   హేమడ్ పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమన వారు వినయవిధేయతలతో దైవమును, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక! బాబా పెక్కుసారులు "ఎవరయితే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించినవారగుదురు. ఎవరయితే బాధలనుభవించెదరో, ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు" అని చెప్పిరిగదా! బాబా సర్వవస్తుజీవసముదాయములో నైక్యమైయున్నారు. భక్తులకు నలుప్రక్కలనిలచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమియు కోరరు. ఇట్టి శుభమయిన పరిశుభ్రమయిన యమృతము వారి పెదవులనుండి స్రవించుచుండెను. హేమడ్ పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో, ఉభయులును సాయితో నైక్యమగుదురు. 

No comments:

Post a Comment