Saturday, August 30, 2014

శ్రీ సాయి సత్ చరిత్ర-----------బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన యభయప్రధానవాక్యములు

హేమాడ్ పంతు మనకొక కొత్తరకము పూజావిధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుట కానందబాష్పములనే వేడినీళ్ళ నుపయోగించెదముగాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక. దృఢవిశ్వాసమను వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. అష్టసాత్త్వికభావము లనెడు ఎనిమిది తామరపుష్పములు సమర్పించెదముగాక. ఏకాగ్ర చిత్తమను ఫలమును సమర్పించెదముగాక. భావమను బక్కా వారి శిరముపై జల్లి భక్తియనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటనవ్రేళ్ళపై నుంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో నలంకరించి మన సర్వమును వారికి సమర్పింతుముగాక. వేడిని తొలగించుటకు భక్తియనే చామరమును వీచెదముగాక. అట్టి యానందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించెదముగాక.

"మా మనస్సును అంతర్ముఖము చేయుము. దానిని లోపలివయిపు పోవునటుల జేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును దెలిసికొను శక్తి దయచేయుము. ప్రపంచవస్తువులందు మాకు గల యాసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునటుల చేయుము. మేము మా శరీరమును, ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖ దుఃఖానుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీన మందుంచుకొనుచు నీ యిష్టము వచ్చినటుల చేయుము. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక.”
"ఏమైనను కానిండు, పట్టు విడువరాదు. నీ గురునియందే యాశ్రయము నిలుపుము; ఎల్లప్పుడు నిలకడగా నుండుము. ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి యుండుము." పంతు ఈ మాటలయొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి దెచ్చుకొనెను. అతడు తన జీవితములో బాబా చేసిన యీ మేలును మరువలేదు.
బాబా పాదములకు వినయముతో సాష్టాంగనమస్కారము చేసి వారి పాదముల నొత్తుచు కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన యుపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో నిట్లనియె. "నీ యాలోచనలు, సంశయములు, భయోత్పాతములు, ఇప్పుడు చల్ల బడినవా? ఎవరికయితే నమ్మకము, ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును." దేవునివలె యోగీశ్వరులు కూడ తమ భక్తులపయి నాధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను, మనఃపూర్వకముగను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. "గతజన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తీరదు. నీ యనుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మమెత్తి, బాధ యనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాల మేల నీకర్మ ననుభవించరాదు? గత జన్మముల పాపముల నేల తుడిచివేయ రాదు? దానిని శాశ్వతముగా పోవునట్లు జేయుము."
మానవుడు సముద్రములో మునుగగానే, అన్ని తీర్థములలోను పుణ్యనదులలోను స్నానముచేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదారవిందముల నాశ్రయింపగనే, త్రిమూర్తులకు (బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు) నమస్కరించిన ఫలముతోపాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితముకూడ లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు, జ్ఞానమునకు సముద్రము, మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగ జేయునట్టి శ్రీ సాయిమహారాజునకు జయమగు గాక. ఓ సాయీ! నీ కథలందు మాకు శ్రద్ధను కలుగజేయుము. చాతకపక్షి మేఘజలము త్రాగి యెట్లు సంతసించునో, అటులనే నీకథలను చదువువారును, వినువారును, మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. నీ కథలు విను నప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్వికభావములు కలుగునుగాక. వారి శరీరములు చెమరించగాక; వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక; వారి ప్రాణములు స్థిరపడుగాక; వారి మనస్సులు ఏకాగ్రమగుగాక; వారికి గగుర్పాటు కలుగుగాక; వారు వెక్కుచు ఏడ్చి వణకెదరుగాక; వారిలోగల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో, గురువుగారి కటాక్షము వారి పైన ప్రసరించినదను కొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు, గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధములనుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకశరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయయనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే యాపని చేయగలరు. సర్వజీవకోటియందును భగవంతుని చూచునట్లు చేయగలరు.
"ఓ శ్యామా! యీ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది, కనుక నీకిది బహూకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధ పడితిని, నా హృదయము కొట్టుకొనెను. నా జీవిత మపాయములో నుండెను. అట్టి సందిగ్థస్థితియందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామా! అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసెనని యనుకొంటిని. అందుచే దీనిని నీ కిచ్చుచున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము. రోజున కొక నామము చదివినను మేలు కలుగజేయును." విష్ణుసహస్రనామ పారాయణము చిత్తశుద్ధి కొక విశాలమయిన చక్కటి మార్గముగురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించు చున్నది. ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసికొనవలెను. వారిద్దరికి మధ్య భేదము లేదు. ఇద్ద రొకటే. ఒకరు లేనిదే మరియొకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద బెట్టుట, బాహ్యదృశ్యమేగాని, యథార్థముగా వారిరువురు లోపల ఒక్కటే. వారి మధ్య బేధము పాటించువారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారును.
సాయి యనంతుడు. చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మపర్యంతము సకలజీవులందు నివసించును. వారు సర్వాంతర్యామి. వేదజ్ఞానమందు, ఆత్మాసాక్షాత్కారవిద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్య ముండుటచే వారు సద్గురువు లనిపించు కొనుటకు సమర్థులు. పండితులయినప్పటికి శిష్యుల నెవరైతే ప్రేరేపించి యాత్మసాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగ తండ్రి శరీరమును పుట్టించును. పిమ్మట చావు జీవితమును వెంబడించును. కాని, సద్గురువు చావుపుట్టుకలను రెంటిని దాటింతురు కాబట్టి వారందరికంటె దయార్ద్రహృదయులు.

సాయిబాబా యనేకసారు లిట్లు నుడివిరి. "నా మనుష్యుడు ఎంత దూరమున నున్నప్పటికి, 1000 క్రోసుల దూరమున నున్నప్పటికి, పిచ్చుక కాళ్ళకు దారము కట్టియీడ్చినటుల అతనిని షిరిడీకి లాగెదను." ." బాబా తిరిగి యిట్లు జవాబిచ్చెను. "ప్రవేశించుటకు నాకు వాకిలి యవసరము లేదు. నాకు రూపము లేదు. నేనన్నిచోట్ల నివసించుచున్నాను. ఎవరయితే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి యుందురో వారి పనులన్నియు సూత్రధారినై నేనే నడిపించెదను."
బాబా యామె కిట్లనెను. "నాయందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రికశాస్త్రజ్ఞుల పలుకు లోకప్రక్కకు ద్రోసి, తన పాఠములు చదువుకొనుమని చెప్పుము. శాంతమనస్సుతో పరీక్షకు వెళ్ళుమనుము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నాయందే నమ్మకముంచు మనుము. నిరుత్సాహము చెందవద్దనుము." గ్రహములు వ్యతిరేకముగా నున్నను, బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యెను. సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును; మనల పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో, మన ప్రయత్నములన్నియు తుదకు విజయవంతమగును. వరికేది క్షేమమో వారికే తెలియును.

దయామయుడు, భక్తవత్సలుడునగు శ్రీ సాయికి నమస్కారము. వారు దర్శనమాత్రమునే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణస్వరూపులైనను, భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తుల కాత్మసాక్షాత్కారము కలిగించుటే యోగుల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమ మైనది, తప్పనిసరి యైనది. వారి పాదముల నాశ్రయించిన వారి పాపము లెల్ల నశించును. అట్టివారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రములనుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి, గాయత్రీమంత్రమును జపించెదరు. దుర్బలులము, పుణ్యహీనుల మగుటచే భక్తి యనగా నేమో మనకు దెలియదు. మనకింత మాత్రము తెలియును, ఇతరులు మనలను విడిచి పెట్టునప్పటికి సాయి మాత్రము మనలను విడువరు. వారి కృపకు పాత్రులైనవారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్యవివేకములను పొందెదరు.

భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వానిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది, కృతజ్ఞతతో నుండెదరు. కాని మేము వారికి సాష్టాంగనమస్కారము చేసి, వేడు కొనెదము. మా తప్పులన్నియు క్షమించి సాయి మా యారాటములన్నియు బాపుగాక. కష్టములపాలై సాయి నీవిధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి, బాబా కటాక్షముచే వారు సంతుష్టి నొందెదరు.

దయాసముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాడ్ పంతు ఈ గ్రంథమును వ్రాయగలిగెనని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత యెంత? ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరనెను. శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్ పంతుకు కష్టము గాని, శ్రమగాని కానరాకుండెను. తన వాక్కును, కలమును గూడ ప్రేరేపించుటకు శక్తివంత మగు జ్ఞానమనే వెలుతురుండగా నతడు సంశయము గాని, ఆరాటము గాని పొందనేల? అతడు వ్రాసిన యీ పుస్తకరూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది యతని గత జన్మల పుణ్యపరంపరచే ప్రాప్తించెను. కావున నాతడదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను.

ఈ క్రింది కథ సాధారణ కథ కాదు; స్వచ్ఛమైన యమృతము. దీని నెవరు త్రాగెదరో, వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును దెలిసికొందురు. వాదించు వారు, విమర్శించువారు ఈ కథలను చదువనక్కరలేదు. దీనికి కావలసినది యంతులేని ప్రేమ, భక్తి; వివాదము కాదు. జ్ఞానులు, భక్తివిశ్వాసములు గలవారు లేదా యోగులసేవకుల మనుకొనువారు, ఈ కథల నిష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మకథ లనుకొందురు. అదృష్టవంతులయిన సాయిభక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువుల కిది సాధనగా నుపకరించును
ఎవరయిన యోగీశ్వరుని చూడవలె ననుకున్నచో, ఆ యోగియేగాక దైవముకూడ అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యధార్థముగా యోగియు, భగవంతుడును నొకరే వారిలో నేమియు భేదము లేదు. ఎవరైన తానై పోయి యోగిని దర్శించుటన్నది యుత్తబూటకము. యోగి సంకల్పించనిదే వారిని జూడగలుగు వారెవరు? అతని యాజ్ఞ లేక చెట్టు ఆకు గూడ కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తివిశ్వాసములు జూపునో, యంత త్వరగాను, బలముగాను, అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగతసన్నాహము లొనర్చును. కాకాజీ విషయములో అట్లే స్వాగతసన్నాహము లొనర్చెను.
'ఏమి ఈ యద్భుతశక్తి, బాబా యేమియు పలుకలేదు. ఉత్తరప్రత్యుత్తరములు కూడ జరుగలేదు. ఆశీర్వచనముల నైన పలుకలేదు. కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యెను. వారి దర్శనమాత్రముననే నామనశ్చాంచల్యము పోయినది. అంతరంగమున ఆనంద ముద్భవించినది. ఇదియే దర్శనభాగ్యము.' అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని, యతని సంతోషమున కంతులేకుండెను. బాబాను సర్వస్య శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్ఛమైన యానందమును పొందెను.

No comments:

Post a Comment