Friday, August 23, 2013

from sai amrithadhara sai vaksudhamritamu

 


సాయి నాధుని అభిన్న రూపము – శ్రీ సాయి సచ్ఛరిత్రము
                ఏకం అనేకం అయినట్టి, నిరాధారుడు, సర్వాధారుడైన పరమేశ్వరుడు జగదోద్ధరణకై భూమిపై శిరిడి సాయినాధుడి రూపంలో అవతరించాడనే విషయం నిస్సందేహంగా చెప్పవచ్చు.
            సాయినాధుడి అభిన్న రూపమే ’శ్రీ సాయిసచ్చరిత్ర’. పరమేశ్వరుడి ద్వారా గురుగీత లోకానికి ప్రసాదించబడినట్లే శిరిడీ సాయీశ్వరుడి ద్వారా ’శ్రీసాయి సచ్చరిత్ర’ లోకానికి అందజేయబడింది. ఈశ్వరానుగ్రహం పొందాలంటే ఈశ్వరుడికి ప్రతిరూపమైన నందీశ్వరుడి ద్వారానే సాధ్యమవుతుంది. అదే విధంగా సాయినాధుని అనుగ్రహం పొందాలంటే వారికి అభిన్న స్వరూపమైనట్టి ’సాయి సచ్చరిత్ర’ పారాయణ ద్వారానే పొందగలుగుతాము. అటువంటి గ్రంధాన్ని తన స్వహస్తాలతో వ్రాసి మనందరికీ అందజేసిన మహానుభావుడు శ్రీ హేమాఢ్ పంత్ అనే విషయం లోక విదితమే. సాక్షాత్ సాయినాధుని చేతిలో కలం  గా మారిన శ్రీ హేమాఢ్ పంత్ గురించి కానీ, గ్రంధకర్త అయిన సాయీశ్వరుడి గురించి గానీ విమర్శించే హక్కు ఎవరికీ లేదు. ఈ గ్రంధం ద్వారా కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలను ఒకటిగా చేసి ఈ మూడు మార్గాలలో ఏ మార్గాన్ని అనుసరించినా జన్మ రాహిత్యం తధ్యమని సాయినాధుడు నిరూపించారు. ఇటువంటి సులభమార్గాన్ని బోధించిన సాయినాధుని పైన ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో ఈ గ్రంధము లో వున్న అంశాలను విమర్శించడం జరిగి వుండాలి. ఈశ్వరుడిగా మారగలిగిన వాడే ఈశ్వరుడిని గుర్తించగలుగుతారు. సాయి ఎవరో గుర్తించి ప్రశంసించినట్లే కంచి పట్టణమునందు నడిచే దైవంగా ఖ్యాతి గాంచిన కామకొటి పీఠాధిపతి మహాస్వామి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు (ఈ రూపంలో సాయినాధుడు ఈ జీవికిచ్చిన అనుభవాలు కోకొల్లలు, భగవాన్ రమణ మహర్షి, శేషాద్రి స్వామి, శివస్వరూపులైన కందుకూరి శివానందమూర్తి, ఆలిండియా సాయి సమాజ్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ బి.వి.నరసింహస్వామి, సాయి స్పిరిట్యుయల్ సెంటర్ వ్యవస్థాపకులు సాయిపదానంద శ్రీ రాధాకృష్ణ స్వామి మొదలైన వారందరూ పిచ్చివారా? భగవండిచ్చిన వాక్చాతుర్యాన్ని జోడించి, గ్రంధాలు క్షుణ్ణంగా చదివి అద్వైతం గురించి అఖండం గా వుపన్యాసాలిచ్చే ఉపన్యాస చక్రవర్తి గురునింద కావించడం కేవలం అద్వైతానికి అప్రతిష్ట తేవడమేకదా?
            నాస్తికులు ఎందరో ’శ్రీ సాయిసచ్ఛరిత’ వలన ఆస్తికులైన సంఘటనలు ఎన్నిటినో నాజీవితంతో చూసాను. ’సచ్ఛరిత’ పారాయణ వలన నేను పొందిన లౌకిక, అలౌకిక అనుభవాలను, ’సచ్ఛరిత్ర’ తనకు అభిన్నమని సాయినాధుడు నిరూపించిన సంఘటనలనూ మీతో పంచుకుంటున్నాను. ఈ గ్రంధాన్ని నాకు మారెండవ అన్నయ్య దుర్గా వరప్రసాద్ ద్వారా సాయినాధుడు ఇప్పించారు. మా అన్నయ్యకు సాయినాధుడే సర్వస్వం, సాయినాధుడే వూపిరీను.
            మొదటిసారి పారాయణ నేను లౌకిక వాంఛలతోనే చేసాను. నా భర్త రూపొందించిన ’సాయి సౌరభ’ అనే కేసట్టు ఏ సమస్యలూ లేకుండా విడుదలవ్వాలనే కోరికతో చేసాను. ఆ కోరిక ను సాయి నెరవేర్చారు. మరెన్నో సార్లు సప్తాహ పారాయణలు చేసాను, నాకొరకే కాకుండా, ఇతరులు గురించి కూడా చేసెడిదానిని. రెండవసారి పారాయణ చేసేటప్పుడు రెండవ అధ్యాయం మొదటి పేజీలో అక్షరాల స్థానంలో సాయినాధుని సుందర స్వరూపం ఒక నిముషమ్ సేపు దర్శనమిచ్చింది. ఇంకొక సారి హూబ్లీ వాస్తవ్యులైన శ్రీ జ. శ్రీ పాదరావు గారిచే మరాఠి భాషనుండి కన్నడ భాషలోనిని అనువదింపబడ్డ ’సాయి సచ్ఛరిత్ర’ ను పారాయణ చేయాలనే సంకల్పంతో గ్రంధాన్ని పీఠంపై పెట్టి నమస్కరిస్తూంటే గ్రంధం స్థానంలో సాయినాధుడు ఆసీనులై దర్శనమిచ్చారు. సాయి సచ్చరిత్ర తనకు అభిన్న రూపముతా గుర్తించి శ్రద్దా భక్తులతో పారాయణ చేయవలసిందిగా తెలియజేయడానికే సాయినాధుడు నాకీ అనుభవాన్నిచ్చారన్నది సుస్పష్టం. ఇటువంటి అనుభవాలు ఎంతోమంది భక్తులకు సాయి నాధుడు ప్రసాదించి వుంటారనే నా నమ్మకం. ఈ గ్రంధాన్ని శ్రద్దాభక్తులతో పారాయణ చేసిన వారందరికీ ఈ గ్రంధంలో రామాయణ, మహాభారత, భాగవతాల సారాంశమంటా ఇమిడి వున్నదనే విషయం స్పష్టంగా అర్దమవుతుంది. ఇటువంటి మహొన్నత గ్రంధాన్ని విమర్శించే అధికారం ఆ ప్రవచకుడికి ఎవరిచ్చారు?
            గురువు తల్లిలాంటివారు. ఏ తల్లీ కూడా తనబిడ్డలను అసహ్యించుకోవడం అసంభవం. సాయినాధుదు కూడా దుర్బుద్ధితో గానీ, దురాశతొ గానీ కోరిన కోరికలను తీర్చినట్లుగా సచ్చరిత్ర లోఎక్కడా కనిపించదు. ఈ గ్రంధంలోని ప్రతి యొక్క అధ్యాయమూ ఒక్కొక్క సందేశాన్ని లోకానికి అందించింది. శ్రద్దాభక్తులతో క్షుణ్ణంగా చదువగలిగిన వారు మటుకే దానిలోని అంశాలు అర్దం చేసికోగల్గుతారు. కేవలం వుపన్యాసాలు దంచడానికి పుస్తకాలు బట్టీ పట్టేవారికి ఎప్పుడో ఒకసారి పైపైన పేజీలు తిరగేసిన వారికేట్లా అర్దమవుతుంది? సుధాముడి కధ వ్యాస భాగవతంలో లేకపోవచ్చు, కానీ దానిలోని అంతరార్దమును అర్దం చేసికొని వుంటే ఈ విధమైన చెత్త విమర్శ చేసివుండేవారు కాదు. సాయినాధుడు అందించిన ఈ సాయి సచ్చరిత్ర లోని ప్రతి ఒక్క అక్షరం కూడా మాకు బీజాక్షరమే. ఒకప్పుడు ఒక వుత్తరం కూడా సరిగా వ్రాయడం చేతకాని నేను ఈ రోజు కొన్ని కన్నడ పుస్తకాలను తెలుగులోనికి అనువదించగలుగుతున్నానంటే కేవలం సచ్చరిత పారాయణ ప్రభావమే!
            ఆ ఉపన్యాస చక్రవర్తి గారంటే నాకు అపారమైన గౌరవముండెడిది, బెంగుళూరులో ఒకప్పుడు ఆయన వుపన్యాసం మా యింటికి 70 కిలోమీటర్ల దూరంలో వున్న చోట జరిగింది. వేరే ఏవిధమైన సౌకర్యములేనందువలన నేనూమ్ నాభర్తా స్కూటర్ మీద అంత దూరం వెళ్లాము. వెళ్లేముందర నాకిష్టమైన విషయం గురించి ఆయనచేత ఉపన్యాసమిప్పించమని నేను సాయినాధుని వేడుకుని వెళ్లాను. నాకత్యంత ప్రీతిపాత్రమైన సుందరకాండ గురించి ఆయన మాట్లాడారు. మరి నాకోరిక తీర్చింది సద్గురు సాయినాధుడా? లేక ఆ వుపన్యాస చక్రవర్తి గారా? దానికి సమాధానం ఆయనే చెప్పాలి. ఇప్పటికీ వారంటే నాకెంతో గౌరవం. దీనికి కారణం సాయినాధుడు నాకిచ్చిన సంస్కారం.
            మోక్షం పొందడమనేది కేవలం మన సాధన మీద ఆధార పడి యుంటుంది. ఆ సాధన ఎట్లా చేయాలనేది కేవలం సాయి కి అభిన్నమైన సాయిసచ్చరిత్ర పారాయన వలన మాత్రమే అవగతమవుతుంది. నామనసు నందు కలిగే సద్వచారాలే సాయినాధుడు నాకిచ్చే సందేశాలుగాను, ఆయన నాకు చేసే బోధనలు గానూ నేను భావిస్తాను. సాయినాధుడు మనకిచ్చే అనుభవాలు మనకి మాత్రమే కాకుండ ఇతరులకు కూడా ప్రయోజనం కలిగేటట్లు చేస్తారు. ఒకసారి నాకు శస్త్ర చికిత్స జరిగినప్పుదు డాక్టరుకే అర్దం కాని అయోమయ పరిస్థితి ఏర్పడ్డది. కేవలం సాయి అనుగ్రహం వలన నేను బ్రతికి బయట పడ్దానన్న సంగతి నాకు ఆపరేషన్ చేసిన డాక్టరు నోటిద్వారానే ఆపరేషన్ జరిగిన మూడవరోజున తెలిసింది. నా వద్దనున్న ’శ్రీ సాయి సచ్ఛరిత్ర’ చూసి అక్కడి నర్సులూ మిగిలినవారూ కూడా అప్పటికప్పుడు తెప్పించుకున్నారు. తర్వాత అప్పుడప్పుడు వాళ్లు కన్పించినప్పుడల్లా ’సచ్ఛరిత’ పారాయణ వలన వాళ్లు పొందిన అనుభవాలను చెబుతూవుంటారు. ఆపరేషన్ జరిగిన తర్వాత నేను రెండు మాసాలు విశ్రాంతి తీసికోవాల్సి వచ్చింది, ఆ సమయంలో నేనెప్పుడో 9 వ తరగతిలో చదువుకున్న గజేంద్ర మోక్షం గురించిన విశేషాలన్నీ శ్రీ సాయినాధుడు నా మనసులోనికి రప్పించారు. ఎందుకు శ్రీ సాయినాధుడు గజేంద్ర మోక్షం గురించి గుర్తుకు తెచ్చారా అని అర్దంకాక, సాయి నాధునే అర్దం చెప్పమని ప్రార్దించగా దానిలోని అర్దాన్ని స్ఫురింపజేసారు. భక్తుడు నిరహంకారంగా భగవంతుడిని ఆర్తితో ప్రార్దించినప్పుడు, బిడ్డ ఏడుపు విని ఏ స్థితిలో వున్నా అన్నీ వదులుకుని పరుగుపరుగున వచ్చే తల్లి లాగా భగవంతుడొచ్చి కాపాడుతాడనేది నాకు సాయినాధుడు స్పష్టపరిచారు. ఎవరివో, ఏవో వుపన్యాసాలు వినాలన్న కాంక్షతో దూరాలకు పరుగెత్తనవసరం లేకుండా మన మనస్సనే వేదిక పై కూర్చుని మనలోనే, మన తోనే వుండి బోధనలనందించే మహాశక్తి సాయినాధుడు.
            నాకు సాయినాధుడే తల్లి, తండ్రీ, నా సర్వస్వమూ సాయినాధుడే. నేను అనుభవించే భోగభాగ్యాలన్నీ సాయినాధుని ప్రసాదమే. నాకిద్దరు బిడ్డలను ప్రసాదించి సాక్షాత్తూ ఆయనే వాళ్లిద్దరినీ పెద్దచేసి ఉన్నత విద్యావంతులుగా చేసి లోకోద్ధారకులుగా తయారుచేసారు. ఇటువంటి నా తండ్రిని విమర్శించిన వారిని క్షమించే శక్తి లేదు నాకు. ఈ విధంగా నేను ప్రవర్తించడం నా తండ్రికి ఇష్టం లేకపోయినప్పటికీ నాలో వున్న బలహీనత నాచేత ఈ విధంగా వ్రాయిస్తోంది. సాక్షాత్ పరమేశ్వరుడయిన సాయినాధుడు వీరిలో నున్న ’గురునింద’ అనే బూజును దులిపి సత్యాన్ని అర్దం చేసికునేలా చేయమని ప్రార్దిస్తున్నాను. గురువు తల్లి వంటివారు. తన బిడ్డకు పట్టిన మురికిని వదిలించి బిడ్డను తల్లి శుభ్రపరచి శుభ్రమైన వస్త్రాలు తొడిగి ఎంతో అందంగా తయారు చేస్తుంది. ఈ నిందితుడిని కూడా ఆవిధంగా తయారు చేయమని సాయినాధుడిని ప్రార్దిస్తున్నాను.
            పై విషయమే కాక పాఠికులు గమనించాల్సిన విషయాలు ఇంకా ఎన్నో వున్నాయి. సాయినాధుడు తనకూ, తన భక్తుడికీ మధ్యలో ఎటువంటి తెరలను సృష్టించలేదు. దీనికి వ్యతిరేకంగా ఎంతోమంది ఆధునిక గురువులు తామే సాయికి ప్రతినిధులుగా ప్రవర్తిస్తూ తమ ప్రసంగాలతో ఎంతోమంది అమాయక సాయి భక్తులను ఆకట్టుకుంటున్నారు. ఈ భక్తులు కూడా తమ కోర్కెలు ఈ గురువుల వద్దకు వచ్చిన తర్వాతనే తీరుతున్నాయని అనుకుంటున్నారు తప్పితే సర్వ హృత్కమలవాసియైన  సాయినాధుని ప్రభావమన్నది విస్మరిస్తున్నారు. ఈ భక్తులు సాయిసచ్ఛరిత్రని సరియైన పద్దతిలో పారాయణ చేయక పోవడమే దీనికి కారణమనిపిస్తుంది. అంతేకాదు వారు ఆశ్రయించిన గురువులు కూడా తమ ఆశ్రయమే సాయినాధుని అనుగ్రహమ్ ఆభక్తులకు కలగడానికి కారణమనే నమ్మకాన్ని వాళ్లలో చెలామణి చేస్తున్నారు. అంటే ఆగురువులు కూడా ’శ్రీ సాయి సచ్ఛరిత్ర’ ని పారాయణ చేసి సరైన పద్దతిలో అవగాహన చేసికోలేదని అన్పిస్తుంది. కొంతమంది అమాయక భక్తులు ఈ గురువుల ద్వారా సాయినాధుడికి చేరువ కావాలనే కోరికతో ఈ గురువులను కలిసేందుకు వెళ్లినప్పుడు ఈ గురువుల చుట్టూ వుండే భట్రాజులు కొన్ని పరీక్షలలో ఉత్తీర్ణులవుతేనే గురువుగారిని కలువడానికి వీలవుతుందని చెప్పారని నాతో కొందరు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. సాయినాధుడు ఏనాడూ కూడా ఇటువంటి నియమ నిబంధనలను తన భక్తులపై విధించినట్లుగా నేను ఎక్కడా చదువలేదు, వినలేదు. నడక రాని బిడ్డల వద్దకు తల్లి తనంతట తానే వచ్చి బిడ్డనెత్తుకుని ఏవిధంగా అక్కున చేర్చుకుంటుందో, అదే విధంగా సాయినాధుడు తన భక్తులను అక్కున చేర్చుకుని జన్మ రాహిత్యమనే యోగాన్ని కలుగజేస్తాడు. ఇది కేవలం ’సచ్ఛరిత్ర’ పారాయణ వలన మటుకే అర్దమవుతుంది.
            అటువంటి మహోన్నతమైన సద్గ్రంధాన్ని విమర్శించవలదనీ, అర్దం పర్దంలేని వ్యర్ద ప్రసంగాలతో భక్తులను సాయినాధుడికీ, వారికి అభిన్నమైన ’శ్రీ సాయి సచ్ఛరిత్ర’ పారాయణకూ దూరం చేయవద్దని నా రెండు చేతులూ ఎత్తి శతకోటి నమస్కారములు చేస్తూ ప్రార్దిస్తున్నాను.

బెంగుళూరు                                                            అన్నపూర్ణా తిలక్
10 ఆగస్టు 2013                      

No comments:

Post a Comment