శ్రీ సాయి సచ్చరిత 13 వ అధ్యాయం లో ప్రస్తావించబడిన అళంది స్వామి 1923 వ సంవత్సరపు సాయి లీల పత్రిక లో స్వయంగా వ్రాసిన వివరాలు:
శ్రీ పద్మనాభ స్వామి (అళంది స్వామి) మాటల్లో....
“బొంబాయి లో నివసిస్తున్న నాకు అత్యంత ప్రియతములైన శ్రీ హరి సీతారాం దీక్షిత్ గారి సలహాననుసరించి షిరిడి ని దర్శించాను. శ్రీ సాయిబాబా కృప వలన నేను యధేష్టమైన ఆనందం లో మునిగి పోయాను. షిరిడి యాత్ర ముగించుకుని నేను జనవరి 29 గురువారం నాడు బొంబాయి నుండి అళంది వెళ్ళి ఫిబ్రవరి 2 న శ్రీ గురు తుకారాం మహరాజ్ వారి పుణ్యతిధి వుత్సవాల్లో పాల్గొని మంగళవారం నాటికి బొంబాయి చేరుకున్నాను. అక్కడ నా మెడ వరకు వ్యాపించిన చెవి నొప్పి గురించి మాట్లాడడానికి డాక్టర్ అండర్ వుడ్ వద్దకు వెళ్ళాను. ఆయన ఒక ఇంజెక్షన్ ఇచ్చి దీనితో మీకు నయమవుతుందని చెపుతూ శస్త్రచికిత్స అవసరం లేదు అన్నారు”.
ఇక్కడ శ్రీ పద్మనాభ స్వామి షిరిడి లో తన అనుభవాన్ని ఈ క్రింది విధం గా తెలియజేసారు.
“శ్రీ సాయిబాబా వారి ప్రకాశవంతమైన దివ్యత్వాన్ని వర్ణించడం అసాధ్యం. నన్ను అప్రతిభుడ్ని చేసిన అనుభవం అది. నేను అపరిమితమైన శాంతి ని అనుభవించాను. నా చెవి నొప్పి గురించి మహరాజ్ సాయి తో మనవి చేసికొమ్మని అక్కడ వున్న భక్తులందరూ నాకు సలహా ఇచ్చారు, కానీ నా మనసు అందుకు అంగీకరించ లేదు. మనసు లో ఏ విధమైన కోరికలూ లేకుండా కేవలం మహరాజ్ సాయి దర్శనం కోసం మాత్రమే నేను షిరిడి వెళ్ళాను. ప్రారబ్దకర్మ ఫలాన్ని అనుభవించి తీరాలని నా నమ్మకం. చివరికి మాధవ్ రావ్ దేశ్ పాండే (శ్యామా) ని నా చెవి నొప్పి గురించి మహరాజ్ తో ప్రస్తావించమని కోరాను. నేను మహరాజ్ దర్శనాని కి వెళ్ళినప్పుడు శ్యామా ప్రస్తావించాడు. అప్పుడు మహరాజ్ ప్రేమతో అల్లా అంతా మంచే చేస్తాడు (అల్లా సబ్ అఛ్చా కరేగా) అన్నారు. తక్షణం సతమతమవుతున్న నా మనసు కుదుటపడింది. నేను షిరిడి కి వెళ్ళడానికి ముందు నాగపూర్ మరియు అళంది లలో వైద్యులను నాచెవి విషయమై సంప్రదించినప్పుడు ఆ ఇద్దరూ శస్త్రచికిత్స చేయవలసి వుంటుందని చెప్పారు. మరి ఇప్పుడు ఈ బొంబాయి వైద్యుడు ఒక ఇంజెక్షన్ ఇచ్చి శస్త్రచికిత్స అవసరం లేదు అంటున్నాడు. దీనితో నాచెవి వాపు తగ్గడమే కాకుండా నొప్పి కూడా మటు మాయం అయిపొయింది. ఇదంతా షిరిడి లో మహరాజ్ ’అల్లా సబ్ అఛ్ఛా కరేగా’ అన్న తర్వాత జరిగింది. ఇదంతా తల్చుకుంటుంటే నాకు ఆశ్చర్యానందాలు కల్గుతున్నాయి”.
బాబా అళంది సన్యాసి ని దక్షిణ అడిగారు. ఆ వివరాలు స్వామి మాటల్లోనే....
“నేను వెళ్ళిన మొదటి రోజునే మహరాజ్ నన్ను దక్షిణ అడిగారు. అప్పుడు ’మహరాజ్, నేను సన్యాసి ని, ధనం ఎక్కడనుండి తేగలను’ అన్నాను. నేను దర్శనం చేసికుని వచ్ఛేస్తున్నప్పుడు మాధవ్ రావ్ దేశ్ పాండే (శ్యామా) తో బాబా ఇలా అన్నారు – అతను దక్షిణ ఏమైనా ఇస్తాడేమోనని తెలిసికోవాలనుకున్నాను, అతను ఏమీ ఇవ్వలేదు. కానీ అతను నన్ను దర్శించుకోవడానికి వచ్చాడు, నేనే అతనికి ఏదైనా ఇస్తాను – (స్వామీ మలా కాహీ దేతాస్ కా పాహిలే పరంతు తే కహీ దేణార్ నాహిత్!! తే మజకడే ఆలే ఆహేత్!! తేంవ్హా మలాచ్ త్యాంనా దిలే పాహిజో!!).
మహరాజ్ పై మాటలు అన్న మరు క్షణం నుండి నేను వ్యాకులరహితుడ్ని అయ్యాను. ఈ మహా సిధ్ధ పురుషుడ్ని గురించి మానవ రూపంలో అవతరించిన శ్రీ నారాయణుడేనని తప్ప మరి ఇంకేమి చెప్పగలను?”
(సాయి లీల 5 వ సంవుటి – 1923 – నుండి, శ్రీమతి విన్నీ చిట్లూరి ఆంగ్ల సంకలనం ‘బాబా స్ వాణి’ నుండి స్వేచ్ఛానువాదం)
చాగంటి సాయిబాబా, జట్ని, ఒడిషా – 9178265499, 8763114011.
No comments:
Post a Comment