షిరిడీలో గురుపూర్ణిమ ప్రారంభమ్
సద్గురు పూజ
భక్తుల నుండి దక్షిణ, నమస్కారమ్ అంగీకరించినా సాయి మహరాజు తనకు ఔపచారిక పూజలు చేస్తానంటే మాత్రం ప్రోత్సహించేవారు కాదు. ధుని ఎదుట వున్న స్తంభాన్ని పూజించమని భక్తులకి చెప్పేవారు. గంటల తరబడి ఈ స్తంభాన్నానుకుని బాబా కూర్చునేవారు. ఉషోదయపు వేళ 5 గంటల సమయంలో ద్వారకామాయి కి వెళ్ళిన భక్తులకు ధుని మాయి వైపు తదేక దృష్టితో చూస్తూ వుండే బాబా కన్పించేవారు.
పండరీపురం సబ్ జడ్జి అయిన తాత్యా సాహెబ్ నూల్కర్ గారు 1908 లో షిరిడీలో నివశించడానికి వచ్చారు. మహరాజ్ వారిని చావడిలో వుండమన్నారు.
ఒక రోజు వుదయం బాబా శ్యామాని పిలిచి మహతరా ని (ముసలివాడిని) స్తంభాన్ని పూజించమని చెప్పమన్నారు. బాబా వాక్కులను పొల్లుపోకుండా శ్యామా తాత్యా సాహెబ్ నూల్కర్ (బాబా ఈయననే మహతరా అని పిలిచేవారు) తో చెప్పాడు. ఇద్దరూ స్తంభాన్ని పూజించమనడంలొ బాబా ఆంతర్యమేమయివుంటుందో అని చర్చించుకున్నారు, కానీ సమాధానం లభించలేదు. చివరి ప్రయత్నంగా పంచాంగం చూడగా ఆరోజు వ్యాస పూర్ణిమ లేదా గురుపూర్ణిమ అని తెలిసికున్నారు. కానీ బాబా స్తంభాన్ని పూజించమన్నారు కానీ, తనను పూజించమనలేదే అని సతమతమయ్యారు. కనీసం ద్వారకామాయి లో పూజ చేయడానికి మహరాజ్ అంగీకరించడం వారిద్దరికీ ఆనంద హేతువయింది. నూల్కర్ స్తంభానికి పూజ నిర్వహిస్తున్న సమయానికి అక్కడికి చేరుకున్న శ్యామాతో మహరాజ్ సాయి ’మహతరా ఒక్కడే పూజచేస్తున్నాడు, నువ్వుకూడా పూజ ఎందుకు చేయడంలేదు’ అని ప్రశ్నించారు. అందుకు శ్యామా ’నేనీ స్తంభాన్ని పూజించను, మీరు అనుమతిస్తే మిమ్మలను ఆనందంగా పూజించుకుంటాను, నేను మిమ్ములను మాత్రమే పూజించుకుంటాను, ఈ స్తంభాన్ని కానీ, మరేదో స్తంభాన్ని కానీ పూజించను’ అని చెప్పాడు. చాలా వాదప్రతివాదాల తర్వాత బాబా చివరికి శ్యామా కోరిక ను అంగీకరించారు.
దాదా కేల్కర్ కి ఆరోజు గురుపూర్ణిమ అని తెలుసు, ఆయన తాత్యాని పిలిపించారు. ఇద్దరూ పూజా సామగ్రి తీసికునివచ్చి గురు పూజ నిర్వహించారు. మిగిలిన భక్తులూ వారిని అనుసరించారు. వాళ్లు ఫలములు, దక్షిణ మరియూ వస్త్రాలు (పంచెల చాపు) తమ గురువు (బాబా) కి సమర్పించుకున్నారు. బాబా కి పంచెలచాపు లతో పని లేదు కానీ భక్తులకు గురుపూర్ణిమ అయిన ఆరోజు తమ గురువుని పూజించుకునే అవకాశం లభించింది, ఈ సంప్రదాయం మున్ముందుకూడా కొనసాగుతుందని భక్తులు ఆశించసాగారు.
ఆ విధంగా షిరిడీలో గురుపూర్ణిమ ప్రారంభించబడింది, ఇప్పుడది మూడురోజుల ఉత్సవమ్. మొదటిరోజు అఖండపారాయణము, రెండవరోజు ముఖ్యమైన పండుగ మరియూ మూడవరోజు గోపాల్ కాలోత్సవమ్ తో ముగింపు. గురుపూర్ణిమ ఆషాఢ మాసం (జూన్-జులై) లో జరుపబడుతుంది.
- డాక్టర్ కేశవ్ బి. గావన్కర్ రచించిన ’షిలధి’ ఆధారంగా విన్నీ చిట్లూరి ’బాబాస్ గురుకుల్’ లోని వ్యాసానికి స్వేచ్చానువాదం
- సాయి పాదధూళి చాగంటి సాయిబాబా, జట్నీ, ఒడిషా.
No comments:
Post a Comment