Sunday, February 3, 2013

శ్రీ సాయి సత్ చరిత్రము ఇరువదవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదవ అధ్యాయము

కాకా నౌకరిపిల్ల ద్వారా దాసుగణు సమస్య పరిష్కరించుట

ఈ అధ్యాయములో దాసుగణు సమస్య కాకాసాహెబు పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హెమడ్ పంతు, చెప్పెను.

ప్రస్తావన

మౌలికముగా సాయి నిరాకారుడు. భక్తులకొరకాకారమును ధరించెను. ఈ మహాజగన్నాటకమునందు మాయ యను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతుము గాక. షిరిడీకి పోయి యచ్చటి మధ్యాహ్నహారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతుము. హారతి అయినపిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి, గోడప్రక్కన నిలిచి ప్రేమతోను, దయతోను భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను. భక్తులు కూడ సమానమయిన ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి పాదములకు నమస్కరించి, బాబా వైపు చూచుచు ఊదీ ప్రసాదపు జల్లు లనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్ళతో ఊదీ పోయుచు, వారి నుదుటపై తమ చేతులతో ఊదీబొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తులయెడ అమితమైన ప్రేమ. బాబా భక్తుల నీ క్రింది విధముగా పలుకరించు చుండెను. “అన్నా! మధ్యాహ్న భోజనమునకు పొమ్ము; బాబా! నీ బసకు పో; బాపూ; భోజనము చేయుము.” ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి యింటికి సాగనంపుచుండెను. ఇప్పటికి అది యంతయు ఊహించు కొన్నచో ఆ దృశ్యములను గాంచి సంతసించవచ్చును. వానిని భావనకు దెచ్చుకొని యానందించవచ్చును. మనోదృశ్యమున సాయిని నిల్పి, వారిని ఆపాదమస్తకము ధ్యానింతుము. వారి పాదముల పై బడి సగౌరవముగ ప్రేమతోను వినయముగ సాష్టాంగనమస్కార మొనర్చుచు ఈ అధ్యాయములోని కథను చెప్పెదము.

ఈశావాస్యోపనిషత్తు

ఒకప్పుడు దాసుగణు ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీభాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలిడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పెదము.

వేదసంహితలోని మంత్రములు గలుగుటచే దానిని మంత్రోపనిషత్తు అని యందురు. దానిలో యజుర్వేదములోని 40వ అధ్యాయమగు ‘వాజసనేయ సంహిత’ యుండుటచే దానికి వాజసనేయ సంహితోపనిషత్తని కూడ పేరు. వైదిక సంహితలుండుటచే, దీని నితర ఉపనిషత్తులన్నిటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు పై వ్యాఖ్యయని పండితుడగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు.

పప్రొఫెసరు రానడెగా రిట్లనుచున్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికి దానిలో అంతర్ దృష్టిని కలిగించు అనేకాంశములున్నవి. 18 శ్లోకములలో, ఆత్మగూర్చి విలువైన యపురూపమగు వర్ణన, అనేకాకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యముగల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన యిందున్నవి. తరువాతి కాలమున సూత్రీకరింప బడిన కర్మయోగసిద్ధాంతముల ప్రతిబింబిమే యుపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగనున్న సంగతులు చెప్పబడినవి. ఈ యుపనిషత్తులోని సారాంశమేమన జ్ఞానమార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట. ఇంకొకచోట వారిట్లనిరి. ‘ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము నీతి, నిగూఢతత్వము, వేదాంతముల మిశ్రమము’.

పైవర్ణముబట్టి యీ ఉపనిషత్తు మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట యెంతకష్టమో గమనించవచ్చును. దాసుగణు దీనిని మరాఠీ ఓవీ ఛందములో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే వ్రాసినదానితో నతడు తృప్తి చెందలేదు. కొందరు పండితుల నడిగెను. వారితో చర్చించెను. కాని, వారు సరియైన సమాధాన మియ్యకుండిరి. కావున దాసుగణు కొంతవరకు వికలమనస్కు డయ్యెను.


సద్గురువే బోధించుటకు యోగ్యత, సమర్థత గలవారు

ఈ యుపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది యాత్మసాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక నెవరయితే యాత్మసాక్షాత్కారము పొందియున్నారో యట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్ప గలరని అతడు భావించెను. ఎవరును దీనికి తగిన సమాధానము నివ్వనపుడు దాసుగణు సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశము దొరికినప్పుడు షిరిడీకి పోయి సాయిబాబాను కలిసి, వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తులోని కష్టముల జెప్పి, సరియైన యర్థము చెప్పుమని వారిని వేడుకొనెను. సాయిబాబా యాశీర్వదించి యిట్లనెను. “నీవు తొందర పడవద్దు. ఆ విషయములో నెట్టి కష్టము లేదు. కాకాసాహెబు దీక్షితుని పనిపిల్ల తిరుగుప్రయాణములో నీ సందేహమును విలీపార్లేలో తీర్చును.” అప్పుడక్కడ నున్న వారు దీనిని విని, బాబా తమాషా చేయుచున్నారని యనుకొనిరి. భాషాజ్ఞానములేని పనిపిల్ల ఈ విషయమెట్లు చెప్పగల దనిరి. కాని దాసుగణు ఇట్లనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కు లనుకొనెను.

కాకా యొక్క పనిపిల్ల

బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి, దాసుగణు షిరిడీ విడిచి విలీపార్లే చేరి కాకాసాహెబు దీక్షితు ఇంటిలో బసచేసెను. ఆ మరుసటిదిన ముదయము దాసుగణు నిద్రనుంచి లేవగనే యొక బీదపిల్ల చక్కనిపాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము యెఱ్ఱచీర వర్ణనము. అది చాల బాగుండెననియు, దాని కుట్టుపని చక్కగా నుండెననియు దాని యంచులు చివరలు చాల సుందరముగా నుండెననియు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల, ఆమె చింకిగుడ్డను కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము ఆమె సంతోషభావమును గాంచి, దాసుగణు ఆమెపై జాలిగొనెను. ఆమరుసటిదినము రావు బహద్దర్ యమ్. వి. ప్రధాన్ తనకు దోవతులచావు లివ్వగ, ఆ పేదపిల్లకు చిన్న చీరనిమ్మని చెప్పెను. రావుబహద్దుర్ యొక మంచి చిన్న చీరను కొని యామెకు బహుకరించెను. ఆకలితో నున్నవారికి విందు భోజనము దొరికినట్లు ఆమె యమితానందపరవశురాలయ్యెను. ఆ మరుసటిదిన మామె యా క్రొత్తచీరను ధరించెను. సంతసముతో తక్కిన పిల్లలతో గిర్రున తిరుగుచు నాట్యము చేసెను. అందరికంటె తాను బాగుగ ఆడి పాడెను. మరుసటిదినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకిబట్ట కట్టుకొని వచ్చెనుగాని యామె యానందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూచి దాసుగణు జాలిభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకిగుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్తచీర గలదు, గాని, దానిని పెట్టెలో దాచు కొనెను. అయినప్పటికి విచారమనునది గాని, నిరాశ యనునదిగాని లేక యాడుచు పాడుచుండెను. కాబట్టి కష్టసుఃఖములను మనోభావములు మన మనోవైఖరిపై నాధారపడి యుండునని అతడు గ్రహించెను. ఈ విషయమునుగూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతు డిచ్చినదానితో మనము సంతసింపవలెను. భగవంతుడు మనల నన్ని దిశలనుండి కాపాడిమనకు కావలసినది ఇచ్చుచుండును. కాన భగవంతుడు ప్రసాదించిన దంతయు మన మేలుకొరకే యని గ్రహించెను. ఈ ప్రత్యేకవిషయములో ఆ పిల్లయొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, క్రొత్తచీర, దాని నిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దానభావము – ఇవి యన్నయు భగవంతుని యంశములే. భగవంతుడు ఈయన్నిటియందు వ్యాపించియున్నాడు. ఇచట దాసుగణు ఉపనిషత్తులలోని నీతిని, అనగా ఉన్న దానితో సంతుష్టిచెందుట, ఏది మనకు సంభవించుచున్నదో – యది యెల్లయు భగవంతుని యాజ్ఞచే జరుగుచున్న దనియు, తుదకది మన మేలుకొరకేయనియు గ్రహించెను.

విశిష్టమైన బోధన విధానము

పై కథనుబట్టి చదువరి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైన దనియు అపూర్వమైనదనియు గ్రహించును. బాబా షిరిడీని విడువనప్పటికి, కొందరిని మఛీంద్రగడ్ కు; కొందరిని కొల్హాపూరుకు గాని, షోలాపూరుకు గాని సాధననిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపములోను కొందరికి స్వప్నావస్తలోను, అది రాత్రిగాని పగలుగాని, కాన్పించి కోరికలు నెరవేర్చు చుండెను. భక్తులకు బాబా బోధించుమార్గములు వర్ణింప నలవి కాదు. ఈ ప్రత్యేక విషయములో దాసుగణును విలీపార్లే పంపించి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కాని విలీపార్లే పంపకుండ షిరిడీలోనే బాబా బోధించరాదాయని కొంద రనవచ్చును. కాని బాబా అవలంబించినదే సరియైన మార్గము. కానిచో పేద నౌకరి పిల్ల, యామె చీరకూడ, భగవంతునిచె వ్యాపింప బడియున్నదని దాసుగణు ఎట్లు నేర్చుకొని యుండును?

ఈశావాస్యోపనిషత్తులోని నీతి

ఈశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్యవిషయము అది బోధించు నీతిమార్గమే. ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడియున్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి యని చెప్పుచున్నవి. దీనినిబట్టి మనము గ్రహించవలసిన దేమన మానవుడు భగవంతు డిచ్చినదానితో సంతుష్టిచెందవలెను. ఏలయన భగవంతుడన్ని వస్తువులయందు గలడు. కావున భగవంతు డేది యిచ్చెనో అదియెల్ల తన మేలుకొరకే యని గ్రహించవలెను. దీనిని బట్టి యితరుల సొత్తుకై యాశించరాదనియు ఉన్నదానితో సంతుష్టి చెందవలెననియు, భగవంతుడు మన మేలుకొరకే దాని నిచ్చియున్నాడనియు, కావున నది మనకు మేలు కలుగజేయుననియు గ్రహించవలెను. దీనిలోని ఇంకొక నీతి యేమన మనుష్యుడెల్లప్పుడేదోతనకు విధింపబడిన కర్మను చేయుచునే యుండవలెను. శాస్త్రములో చెప్పిన కర్మలను నెరవేర్చవలెను. భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండ నుండుట యాత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుటవలన వైష్కర్మ్యాదర్శనము పొందును. ఏమానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ యన్నిటియం దుండునట్లు చూచునో, వేయేల సమస్త జీవరాశియు, సకలవస్తువులు ఆత్మగా భావించునో, యట్టివాడెందుకు మోహమును పొందును? వాడెందులకు విచారించును? అన్ని వస్తువులలో నాత్మను చూడకపోవుటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడయితే సకలవస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవనికయితే సమస్తమాత్మయగునో, వానికి మానవులు పడు సామాన్యబాధలతో సంబంధము లేదు. అనగా నతడు కష్టములకు మార్పుజెందడు. 

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

No comments:

Post a Comment