Tuesday, February 5, 2013

శ్రీ సాయి సత్ చరిత్రము నలుబదియొకటవ అధ్యాయము


శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

నలుబదియొకటవ ఆధ్యాయము

1. చిత్రపటము యొక్క వృత్తాంతము, 2. గుడ్డపేలికలను దొంగిలించుట, 3. జ్ఞానేశ్వరి పారాయణము.

గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ ఆధ్యాయములో చిత్రపటముయొక్క వృత్తాంతమును జెప్పెదము.

గత ఆధ్యాయములోని విషయము జరిగిన 9 సంవత్సరముల తదుపరి అలీ మహమ్మద్ హేమద్పంతును కలిసి ఈ దిగువ కథ నతనికి జెప్పెను.

యొకనాడు బొంబాయి వీధులలో బొవునపుడు, వీధిలో తిరిగి యమ్మువానివద్ద అలీమహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి, తన బాంద్రా యింటిలో గోడకు వ్రేలాడ వేసెను. యతడు బాబాను ప్రెమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమడ్పంతుకు ఆ పటమిచ్చుటకు 2 (౨) నెలల ముందు యతడు కాలుమీద కురుపులేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడతడు బొంబాయిలోనున్న తన బావమరిది యగు నూర్ మహమ్మద్ పీర్ భాయి యింటిలో పడియుండెను. బాంద్రాలో తన యిల్లు మూడుమాసములవరకు మూయబడియుండెను. యక్కడ యెవ్వరును లేకుండిరి. అచ్చట ప్రసిద్ధిజెందిన అబ్దుల్ రహిమాన్ బాబా, మౌలానాసాహెబు మహమ్మద్ హుసేను, సాయిబాబా, తాజుద్దిన్ బాబా మొదలగు (సజీవ) యోగుల పటము లుండెను. వానిని కూడ కాలచక్రము విడువలేదు అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను. బాంద్రాలో యా పటములేల బాధపడవలెను? పటములకు గూడ చావుపుట్టుక లున్నట్లుండెను. పటములన్నియు వాని వాని యదృష్టము లనుభవించెను గాని సాయిబాబా పటము మాత్రము యా కాలచక్రమును తప్పించుకొనెను. అదెట్లు తప్పించుకొనగలిగెనో నాకింతవరకు చెప్పలేరైరి. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి యనియు, సర్వవ్యాపి యనియు ననంత శక్తుడనియు దెలియుచున్నది.

అనేక సంవత్సరముల క్రిందట యోగియగు అబ్దుల్ రహిమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ తారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమరిదియగు నూర్ మహమ్మద్ పీర్ భాయికి యిచ్చెను. అది యతని టేబిల్ లో 8 (౮) సంవత్సరములు పడియుండెను. యొకనాడు అతడు జూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు దీసికొనిపోయి సజీవప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టెను. అందులో నొకటి అలీ మహమ్మద్ కిచ్చెను. దాని నతడు తన బాంద్రా యింటిలో బెట్టెను. నూర్ మహమ్మద్, అబ్దుల్ రహిమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో నుండగా నతడు గురువుగారికి దీనిని కానుకగా నిచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మదు నచటనుండి తరిమి వేసిరి. యతడు మిగుల విచారపడి చీకాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయేగాక గురువుగారి కోపమునకు, అసంతుష్టికి కారణమాయెనుగదా యని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి యిష్టము లేకుండెను. యా పటమును అపొలో బందరుకు తీసుకొని బోయి, యొక పడవను అద్దెకు గట్టించుకొని సముద్రములోనికి బోయి, దాని నక్కడ నీళ్ళలో ముంచివేసెను. తన బంధువుల వద్దనుంచి స్నేహితుల వద్దనుంచి పటములను దెప్పించి (6 (౬) పటములు) వానినికూడ బాంద్రా సముద్రములో ముంచెను. యా సమయమున అలీమహమ్మద్ తన బావమరిది యింటిలో యుండెను. యోగుల పటములను సముద్రములో పడవైచినచో తన వ్యాధి కుదురునని బావమరది జెప్పెను. యిది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ ను బాంద్రా యింటికి బంపి యక్కడున్న పటముల నన్నింటిని సముద్రములో బడివేయించెను.

రెండునెలల పిమ్మట అలీ మహమ్మద్ తన యింటికి తిరిగి రాగా బాబాపటము యెప్పటివలె గోడమీదనుండుట గమనించి యాశ్చర్యపడెను. తన మేనేజర్ పటములన్ని దీసివైచి బాబా పటము నెట్లు మరచెనో యతనికే తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్న తన బావగారు దానిని జూచినచో దానిని గూడా నాశనము చేయునని భయపడెను. దాని నెవ్వరి కివ్వవలెను? దాని నెవరు జాగ్రత్త పరచెదరు? దానిని భద్రముగా నెవరుంచగలరు? అను విషయముల నాలోచించుచుండగా, సాయిబాబాయే తనకు స్వయముగా సలహానిచ్చి మౌలానా ఇస్ము ముజాఫర్ ను కలిసి వారి యభిప్రాయము ప్రకారము చేయవలసినదని జెప్పెను. అలీమహమ్మద్ మౌలానాను గలిసికొని జరిగినదంతయు జెప్పెను. యిరువురును బాగుగా ఆలోచించి యా పటమును హేమడ్పంతు కివ్వ నిశ్చయించిరి. యతడు దానిని జాగ్రత్తపరచునని తోచెను. యిద్దరును హేమడ్పంతు వద్దకు బోయిరి. సరియైన కాలములో దానిని బహూకరించిరి.

ఈ కథను బట్టి బాబాకు భూతభవిష్యద్వర్తమానములు తెలియుననియు, చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలనెట్లు నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. యెవరికయితే ఆధ్యాత్మిక విషయములలో నెక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే గాక వారి కష్టములను దొలగించి వారిని ఆనందభరితులుగా జేయుచుండిరని రాబోవు కథవలన తెలియును.


గుడ్డపేలికలను దొంగిలించుట – జ్ఞానేశ్వరి చదువుట

బి.వి దేవు దహనులో మామలతుదారు. జ్ఞానేశ్వరిని యితర మతగ్రంథములను చదువవలెనని చాలాకాలమునుండి కోరుచుండెను. భగవద్గీతపయి మరాఠీభాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో నొక యధ్యాయమును యితర గ్రంథములనుండి కొన్ని భాగములను పారాయణ జేయుచుండెను. కాని జ్ఞానేశ్వరిని ప్రారంభించగనే ఏదో యవాంతరము లేర్పడుటచే పారాయణమాగిపోవుచుండెను. మూడు నెలల సెలవు పెట్టి, షిరిడీకి వెళ్ళి యక్కడ నుండి తన స్వగ్రామమగు పౌడుకు బోయెను. ఇతర గ్రంథములన్నియు నచట చదువగలిగెను. కాని జ్ఞానేశ్వరి ప్రారంభించగనే యేమో విపరీతమైన చెడ్డ యాలోచనలు తన మనస్సున ప్రవేశించుటచే చదువలేకుండెను. యాతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదువలేకబోయెను. కాబట్టి బాబా తనకు యా గ్రంథమందు శ్రద్ధ కలుగ జేసినప్పుడే, దానిని చదువుమని వారి నోటివెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించెదననియు యంతవరకు దానిని తెరువననియు, నిశ్చయము చేసికొనెను. అతడు 1914వ (౧౯౧౪) సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబసహితముగా షిరిడీకి వెశ్ళెను. యక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివాయని బాపుసాహెబు జోగ్, దేవుగారి నడిగెను. దేవు తనకు అట్టి కోరిక గలదనియు, గాని దానిని చదువుటకు శక్తి చాలకుండెననియు, బాబా యాజ్ఞాపించినచో, దానిని ప్రారంభించెదననియు జెప్పెను. అప్పుడు జోగ్, ఒక పుస్తకమును దీసికొని బాబా కిచ్చినచో, దానిని వారు తాకి పవిత్రము జేసి యిచ్చెదరనియు అప్పటినుండి నిరాటంకముగా చదువవచ్చుననియు దేవుకు సలహా నిచ్చెను. బాబాకు తన యుద్దేశము దెలియును గనుక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేడా? దానిని పారాయణ జేయుమని స్పష్టముగా నాజ్ఞాపించలేడా? యనెను.

దేవు బాబాను దర్శించి, ఒక రూపాయి దక్షిణ నిచ్చెను. బాబా 20 (౨౦) రూపాయలు దక్షిణ యడుగగా దానిని చెల్లించెను. యానాడు రాత్రి బాలకరాముడను వానిని కలిసికొని యతడు బాబాయందు భక్తిని, వారి యనుగ్రహమును యెట్లు సంపాదించెనని ప్రశ్నించెను. మరుసటి దినము హారతి పిమ్మట యంతయు దెలిపెదనని యతడు బదులిచ్చెను. యా మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా యతనిని 20 (౨౦) రూపాయలు దక్షిణ యిమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండి యుండుటచే దేవు యొక మూలకు బోయి కూర్చుండెను. బాబా యతనిని బిలిచి తన దగ్గర శాంతముగా కూర్చొనమనియెను. దేవు అట్లనే చేసెను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరు పోయిన తరువాత దేవు, బాలకరాముని జూచి యాతని పూర్వవృత్తాంతముతో పాటు బాబా యాతని కేమేమి జెప్పెనో, ధ్యానము నెట్లు నేర్పిరో యని యడుగగా బాలకరాముడు వివరములు జెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠురోగభక్తుని బంపి, దేవును తీసికొని రమ్మనెను. దేవు బాబా పద్దకు బోగా నెవరితో యేమి మాట్లాడుచుంటివని బాబా యడిగెను. బాలకరామునితో మాట్లాడుచుంటి ననియు, బాబా కీర్తిని వినుచుంటిననియు యతడు చెప్పెను. తిరిగి బాబా యిరుబది యయిదు (౨౫) రూపాయలు దక్షిణ అడిగెను. వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించెను. అతనిని బాబా లోపలకు దీసికొనిపోయి స్తంభమువద్ద కూర్చుండి “నా గుడ్డ పేలికలను నాకు దెలియకుండ దొంగిలించితివేల?” యనెను. దేవు తనకు ఆ గుడ్డ పేలికలగూర్చి యేమియు తెలియదనెను. బాబా యతనిని వెదకు మనెను. అతడు వెదకెను. కాని యచ్చట యేమియు దొరకలేదు. బాబా కోపగించి యిట్లనెను. “ఇక్కడ యింకెవ్వరు లేరు. నీ వొక్కడివే దొంగవు. ముసలితనముచే వెండ్రుకలు పండినప్పటికిని యిచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా?” యని కోపగించెను. బాబా మతి చెడిన వానివలె తిట్టి కోపగించి చీవాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవు తాను సటకా దెబ్బలు కూడా తినునేమో యను కొనెను. ఒక గంట తరువాత బాబా యతనిని వాడాకు వెళ్ళు మనెను. దేవు అచటికేగి జరిగినదంతయు జోగుకు, బాలకరామునకు దెలియజేసెను. సాయంకాల మందరిని రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యముగా దేవును రమ్మనెను, “నా మాటలు వృద్ధుని బాధించి యుండవచ్చునుగాని, యతడు దొంగిలించుటచే నేనట్లు పలుకవలసి వచ్చె” నని బాబా నుడివెను. తిరిగి బాబా పదిరెండు (౧౨) రూపాయలు దక్షిణ యడిగెను. దేవు దానిని వసూలుచేసి చెల్లించి, సాష్టాంగనమస్కారము జేసెను. బాబా యిట్లనెను. “ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము. పోయి వాడాలో కూర్చుండుము. ప్రతినిత్యము కొంచమైనను క్రమము తప్పక చదువుము. చదువునపుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో భోధపరచి చెప్పుము. నేను నీకు జాల్తారు సెల్లానిచ్చుటకు ఇచట కూర్చొనియున్నాను. ఇతరులవద్దకు పోయి దొంగిలించెదవేల? నీకు దొంగతనమునకు అలవాటు పడవలెనని యున్నదా?”

బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించుమని యాజ్ఞాపించెననియు, తనకు కావలసినదేదో యది దొరికె ననియు, యప్పటినుండి తాను సులభముగా చదువగల ననియు యనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్ఠాంగనమస్కారమొనర్చెను. తాను శరణువేడెను. కనుక తనను బిడ్డగా నెంచి, జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను. పేలికలు దొంగిలించుట యనగా నేమో దేవు అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డపేలికలు దొంగిలించుట. బాబాకట్టి వైఖరి యిష్టము లేదు. యే ప్రశ్నకైనా సమాధానము యిచ్చుటకు తామే సిద్ధముగా నుండిరి. యితరుల నడుగుట బాబాకు యిష్టములేదు. అందుచే నతని బాధించి చీకాకు పెట్టెను. అదియునుగాక యితరుల నడుగకుండ బాబానే సర్వము యడిగి దెలిసికొనవలెననియు, నితరుల ప్రశ్నించుట నిష్ప్రయెజనమనియు జెప్పెను. దేవు యా తిట్లను పువ్వులు, అశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి బోయెను.

యా సంగతి యంతటితో సమాప్తి కాలేదు. చదువుమని యాజ్ఞాపించి బాబా యూరుకొనలేదు. యొక సంవత్సరము లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని యభివృద్ధిని కనుగొనెను. 1914వ (౧౯౧౪ వ) సంవత్సరము ఏప్రిల్ నెల రెండవ (౨ వ) తేదీ గురువారము ఉదయము బాబా స్వప్నములో సాక్షాత్కరించి పై అంతస్తులోకూర్చుండి “జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా?” యని యడిగెను. “లేదు” యని దేవు జవాబిచ్చెను.

బాబా: ఇంకా యెప్పుడు దెలిసికొనెదవు?
దేవు కండ్ల తడిపెట్టుకొని “నీకృపను వర్షింపనిదే పారాయణము చీకాకుగా నున్నది, బోధపడుట చాల కష్టముగా యున్నది. నేను దీనిని నిశ్చయముగా జెప్పుచున్నాను.” యనెను.
బాబా: చదువునపుడు, నీవు తొందరపడుచున్నావు. నాముందర చదువుము. నా సమక్షమున చదువుము.
దేవు: యేమి చదువవలెను?
బాబా: యాధ్యాత్మ చదువుము.
పుస్తకమును దీసికొని వచ్చుటకు దేవు వెళ్ళెను. యంతలో మెలకువ వచ్చి కండ్లు తెరచెను. యీ దృశ్యమును జూచిన పిమ్మట దేవు కెంత యానందము, సంతోషము కలిగెనో చదువరులే గ్రహింతురు గాక!
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
నలుబదియొకటవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణ
మస్తు।
।శుభం భవతు। 

No comments:

Post a Comment