Sunday, February 3, 2013

శ్రీ సాయి సత్ చరిత్రము ఇరువదియెనిమిదవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదియెనిమిదవ అధ్యాయము

పిచ్చుకలను షిరిడీకి లాగుట

1. లక్ష్మీచంద్ 2. బురహాన్ పూరు మహిళ 3. మేఘశ్యాముడు - కథలు.

ప్రస్తావన

సాయి యనంతుడు. చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మపర్యంతము సకలజీవులందు నివసించును. వారు సర్వాంతర్యామి. వేదజ్ఞానమందు, ఆత్మాసాక్షాత్కారవిద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్య ముండుటచే వారు సద్గురువు లనిపించు కొనుటకు సమర్థులు. పండితులయినప్పటికి శిష్యుల నెవరైతే ప్రేరేపించి యాత్మసాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగ తండ్రి శరీరమును పుట్టించును. పిమ్మట చావు జీవితమును వెంబడించును. కాని, సద్గురువు చావుపుట్టుకలను రెంటిని దాటింతురు కాబట్టి వారందరికంటె దయార్ద్రహృదయులు.

సాయిబాబా యనేకసారు లిట్లు నుడివిరి. "నా మనుష్యుడు ఎంత దూరమున నున్నప్పటికి, 1000 క్రోసుల దూరమున నున్నప్పటికి, పిచ్చుక కాళ్ళకు దారము కట్టియీడ్చినటుల అతనిని షిరిడీకి లాగెదను." అటువంటి మూడుపిచ్చుకలగురించి, ఈ అధ్యాయములో చెప్పుకొందుము.

1. బాలా లక్ష్మీచంద్

అతడు మొట్టమొదట రైల్వేలోను, అటుతరువాత బొంబాయిలోని శ్రీవేంకటేశ్వర ముద్రణాలయమునందును తదుపరి ర్యాబి బ్రదర్సు కంపెనీలో గుమాస్తాగును ఉద్యోగము చేసెను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను. శాంతాక్రుజులో, క్రిస్టమస్ పండుగకు ఒకటిరెండు మాసములకు పూర్వము, స్వప్నములో గడ్డముతో నున్న యొక ముసలివానిని, చుట్టు భక్తులు గుంపులు గూడియున్నట్లు చూచెను. కొన్నాళ్ళ తరువాత దాసుగణు కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజార్ యింటికివెళ్ళెను. కీర్తన చేయునప్పుడు దాసుగణు బాబా పటమును సభలో పెట్టుట యాచారము. స్వప్నములో చూచిన ముసలివాని ముఖలక్షణములు ఈ పటములో నున్నవానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నములో జూచినటుల గ్రహించెను. పటము, దాసుగణు కీర్తన, తుకారాం జీవితము (అప్పుడు దాసుగణు చెప్పుచున్న హరికథ) ఇవన్నియు మనస్సున నాటి, లక్ష్మీచంద్ షిరిడీకి పోవుట కువ్విళ్లూరుచుండెను. సద్గురుని వెదకుటలోను ఆధ్యాత్మికకృషియందును దేవుడు భక్తులకు సహాయపడు ననునది భక్తుల యనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకరరావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చెదవాయని యడిగెను. అతని యానందమున కంతులేకుండెను. షిరిడీకి పోవలెనని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకువద్ద 15 రూపాయలు అప్పుపుచ్చుకొని కావలసిన యేర్పాటులన్నియును జేసికొనిన పిమ్మట షిరిడీకి పయనమయ్యెను. రైలులో నతడును, అతని స్నేహితుడగు శంకరరావును భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోడి ప్రయాణీకుల నడిగిరి. చాల సంవత్సరములనుంచి షిరిడీలో నున్నసాయిబాబా గొప్ప యోగిపుంగవులని వారు చెప్పిరి. కోపర్ గాం రాగానే బాబాకొరకు జామపండ్లను కొనవలె ననుకొనెను. కాని, యా గ్రామ పరిసరములను ప్రకృతి దృశ్యములను జూచి యానందించి యావిషయమును మరచెను. షిరిడీ సమీపించుచుండగా వారికాసంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే యొక ముసలమ్మ నెత్తిపై జామపండ్లగంప పెట్టుకొని తమ గుఱ్ఱపుబండి వెంట పరుగెత్తుకొని వచ్చుచుండెను. బండి నాపి కొన్నియెంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడా ముసలమ్మ తక్కిన పండ్లను కూడ తీసికొని తన పక్షమున బాబా కర్పితము చేయుడని కోరెను. జామపండ్లను కొనవలె ననుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలిసికొనుట, యామె భక్తి, యివన్నియు నిద్దరికి ఆశ్చర్యమును కలుగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూచిన ముసలివాని బంధువై యుండవచ్చు ననుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. మసీదుపయి జండాలను చూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచితవిధముగా పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరగెను. బాబాను జూచి చాల సంతసించెను. సువాసనగల తామరపువ్వును భ్రమరము జూచి సంతసించునటుల బాబా పాదముల జూచి సంతసించెను. అప్పుడు బాబా యిట్లనెను. "టక్కరి వాడు; దారిలో భజన చేసెను. ఇతరులను కనుగొనుచుండెను. ఇతరుల నడుగనేల? మన కండ్లతోడ సమస్తము చూడవలెను. ఇతరులను నడుగవలసిన యవసరమేమి? నీ స్వప్నము నిజమయినదా కాదా యనునది యాలోచించుము. మార్వడివద్ద 15రూపాయలు అప్పుతీసికొని దర్శనము చేయవలసిన యవసరమేమి? హృదయములోని కోరిక యిప్పుడయిన నెరవేరినదా?"

ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ యాశ్చర్యపడెను. బాబాకీ సంగతులన్నియు నెటుల దెలిసినవని అతడాశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకుగాని, సెలవురోజు అనగా పండుగదినము గడుపుటకు గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా యభిప్రాయము.

సాంజా

మధ్యాహ్నభోజనమునకు గూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను. ఆ మరుసటిదినము కూడ దాని నాశించెను. కాని, యెవరును సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకొని యుండెను. మూడవరోజు హారతి సమయమునందు బాపుసాహెబ్ జోగ్ యేమి నైవేద్యము తీసికొని రావలెనని బాబాను అడిగెను. సాంజాతీసికొని రమ్మని బాబా చెప్పెను. భక్తులు రెండు కుండల నిండ సాంజాతెచ్చిరి. లక్ష్మీచందు చాల యాకలితో నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను. బాబా యిట్లనెను. "నీవు ఆకలితో నుండుట మేలయినది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదయిన ఔషధము తీసికొనుము." బాబా తన మనస్సును కనుగొనెనని లక్ష్మీచంద్ రెండవసారి యాశ్చర్వపడెను. బాబా యెంత సర్వజ్ఞుడు!


దోష దృష్టి

ఆ సమయముననే లక్ష్మీచందు చావడి యుత్సవమును జూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకొనెను. ఆ మరుసటి యుదయము లక్ష్మీచందు మసీదుకు పోగా, బాబా శ్యామాతో నిట్లనియె. "ఎవరిదో దోషదృష్టి నాపయి పడుటచే నేను బాధపడుచున్నాను." లక్ష్మీచందు మనస్సులో నేమి భావించుచుండెనో యది యంతయు బాబా వెల్లడి చేయుచుండెను.

ఈ విధముగా సర్వజ్ఞతకు, కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములను గని లక్ష్మీచందు బాబా పాదములపైబడి "మీ దర్శనము వలన నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడు నాయందు దయాదాక్షిణ్యములు జూపి నన్ను రక్షించుము. నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప యితరదైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడును మీ పాదపూజయందు, మీ భజనయందు ప్రీతి జెందునుగాక, మీ కటాక్షముచే నన్ను ప్రపంచబాధలనుండి కాపాడుదురు గాక!" యని ప్రార్థించెను.

బాబా యాశీర్వాదమును, ఊదీప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా నుండెను. పరిచితులు షిరిడీకి పోవువారి ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను.

2. బురహాన్ పూరు మహిళ

ఇంకొక పిచ్చుక (భక్తురాలి) వృత్తాంతము జూచెదము. బురహాన్ పురూలో నొక మహిళకు సాయి స్వప్నములో కనబడి గుమ్మము పద్దకు వచ్చి తినుటకు 'కిచిడీ' కావలెననెను. మేల్కొని చూడగా తన ద్వారమువద్ద నెవ్వరు లేకుండిరి. చూచిన దృశ్యమునకు చాల సంతసించి ఆమె యందరికి తెలియజేసెను. తన భర్తకు గూడ తెలిపెను. అతడు పోస్టాఫీసులో నుద్యోగము చేయుచుండెను. అతనిని అకోలా బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీ పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీతీర్థమును దర్శించి షిరిడీ చేరి, అచట రెండుమాసము లుండిరి. ప్రతిరోజు మసీదుకు బోయి బాబాను దర్శించి, పుజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీప్రసాదము నర్పించవలెనని షిరిడీకి వచ్చిరి. కాని యది 14 రోజులవరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన యిష్టము లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12గంటలకు వచ్చెను. మసీదులో నందరు భోజనమునకు కూర్చొనిరి. కనుక తెర వేసి యుండెను. తెరవేసి యుండునపుడు ఎవరు లోపల ప్రవేశించుటకు సాహసించరు. కాని ఆమెనిలువలేక పోయెను. ఒకచేతితో తెరపైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా యానాడు కిచిడీకొరకు కనిపెట్టుకొని యున్నట్లు తోచెను. ఆమె కిచిడీ యచట పెట్టగనే బాబా సంతసముతో ముద్దమీదముద్ద మ్రింగుట ప్రారంభించెను. బాబా యీ యాతురతను జూచియందరు ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ యుండుననుటను విశ్వసించిరి.

3. మేఘశ్యాముడు

ఇక అన్నిటికంటె పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుడు. విరమ్ గాం నివాసియగు మేఘశ్యాముడు హరి వినాయక సాఠెగారి వంటబ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన, చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడు శివపంచాక్షరి 'నమశ్శివాయ' జపించువాడు. అతనికి సంధ్యావందనముగాని, గాయత్రీ మంత్రముగాని, తెలియకుండెను. సాఠేగారికి వీనియందు శ్రద్ధ గలిగి గాయత్రీమంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని యవతారమని సాఠే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను. బ్రోచి స్టేషనువద్ద సాయిబాబా మహమ్మదీయుడని యెవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కాని ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయి తీరవలెనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు టుత్తరము షిరిడీ వాసి తన మామగారగు దాదా కేల్కరుకు వ్రాసి సాయిబాబాతో వరిచయము కలుగజేయవలెనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానీయక "వెధవను తన్ని తరిమివేయుడు" అని గర్జించి, మేఘునితో నిట్లనెను. "నీవు గొప్పజాతి బ్రాహ్మణుడవు. నేనా తక్కువజాతి మహమ్మదీయుడను. నీ విచటకు వచ్చినచో, నీ కులము పోవును, కనుక వెడలిపొమ్ము." ఈ మాటలు విని మేఘుడు వణక నారంభించెను. అతడు తన మసస్సులోనున్న విషయములు బాబాకెట్లు దెలిసెనని యాశ్చర్యపడెను. కొన్నిదినము లచటనే యుండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కాని యతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన యింటికి బోయెను. అక్కడనుండి త్ర్యంబక్ (నాసిక్ జిల్లా) పోయి యచట ఒకసంవత్సరము 6 మాసములుండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే నాతడు మసీదులో ప్రవేశించుటకు, షిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశముద్వారా సహాయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పుకలుగజేయుచు చాలా మేలుచేసెను. అప్పటినుండి అతడు సాయిబాబాను శివుని యవతారముగా భావించుచుండెను. శివుని యర్చనకు బిల్వపత్రి కావలెను. మేఘుడు ప్రతిరోజు మైళ్ళకొలది నడిచి పత్రిని దెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామములో నున్న దేవతలనందరిని పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదముల నొత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివాడు. ఒకనాడు మందిరము వాకిలి మూసియుండుటచే ఖండోబాదేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజకు అంగీకరించక తిరిగి పంపివేసెను. ఖండోబామందిరము వాకిలి తెరిచియున్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచి యుండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను.

గంగా స్నానము

ఒక మకరసంక్రాంతినాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము పూసి, గంగానదీజలముతో నభిషేకము చేయదలంచెను. బాబాకు అది ఇష్టములేకుండెను. కాని యత డనేకసారులు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రానుపోను 8 క్రోసుల దూరము నడచి గోమతీనదీతీర్థము తేవలసియుండెను. అతడు తీర్థము దెచ్చి, యత్నము లన్నియు జేసికొని, బాబావద్దకు 12గంటలకు వచ్చి, స్నానమునకు సిద్ధముగా నుండుమనెను. బాబా తనకా యభిషేకము వలదనియు, ఫకీరగుటచే గంగానదీజలముతో నెట్టిసంబంధము లేదనియు చెప్పెను. కాని మేఘుడు వినలేదు. శివుని కభిషేక మిష్టము గనుక, తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసితీరవలెనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపయి కూర్చుండి తల ముందుకు సాచి, ఇట్లనెను. "ఓ మేఘా! ఈ చిన్న యుపకారము చేసిపెట్టుము. శరీరమునకు తల ముఖ్యము. కావున తలపైనే నీళ్ళు పోయుము. శరీరమంతటిపై పోసినట్లగును." అట్లనే యని మేఘశ్యాము డొప్పుకొని, నీళ్ళకుండను పైకెత్తి తలపై పోయ యత్నించెను. కాని, భక్తిపారవశ్యమున 'హరగంగే, హరగంగే' యనుచు శరీరమంతటిపై నీళ్ళు పోసెను. కుండ నొక ప్రక్కకు బెట్టి, బాబా వయిపు జూచెను. వాని యాశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి, శరీరమంతయు పొడిగా నుండెను.

త్రిశూలము, లింగము

మేఘశ్యాముడు బాబాను రెండుచోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానా సాహెబు చాందోర్క రిచ్చినపటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొనెనని తెలుపుటకు బాబా అతనికొక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపయి పండుకొని కండ్లు మూసియున్నప్పటికి, లోపల ధ్యానము చేయుచు, బాబా రూపమును జూచెను. అతడు మేలుకొన్నటుల తెలిసికొని, బాబా యక్షతలు చల్లి "మేఘా, త్రిశూలమును వ్రాయుము" అని అదృశ్యుడయ్యెను. బాబా మాటలు విని, యాతురతగా కండ్లు దెరచెను. బాబాను చూడలేదు గాని, యక్షత లక్కడక్కడ పడియుండెను. బాబా వద్దకు పోయి, చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశులమును వ్రాయుట కాజ్ఞ నిమ్మనెను. బాబా యిట్లనెను. "నా మాటలు వినలేదా? త్రిశూలమును వ్రాయుమంటిని. అది దృశ్యము కాదు. స్వయముగా వచ్చి, నేనే చెప్పితిని. నా మాటలు పొల్లుగావు. అర్థవంతములు." మేఘు డిట్లుపలికెను. "మీరు నన్ను లేపినటుల భావించితిని. తలుపులన్ని వేసి యుండుటచే, నది దృశ్యమను కొంటిని." బాబా తిరిగి యిట్లు జవాబిచ్చెను. "ప్రవేశించుటకు నాకు వాకిలి యవసరము లేదు. నాకు రూపము లేదు. నేనన్నిచోట్ల నివసించుచున్నాను. ఎవరయితే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి యుందురో వారి పనులన్నియు సూత్రధారినై నేనే నడిపించెదను."

మేఘుడు వాడాకు తిరిగి వచ్చి, బాబా పటమువద్ద గోడపై త్రిశూలము ఎర్రరంగుతో వ్రాసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనానుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడ అచటకు వచ్చెను. బాబా యిట్లనెను. "చూడు శంకరుడు వచ్చినాడు; జాగ్రత్తగా పూజింపుము." మేఘుడు త్రిశూలమును వ్రాసిన వెంటనే లింగము వచ్చుట జూచి యాశ్చర్యపడెను. వాడాలో కాకాసాహెబు దీక్షిత్ స్నానము చేసి సాయిని తలంచుకొనుచుండగా తన మనోదృష్టియందు లింగము వచ్చుట గాంచెను. అతడాశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి, బాబా తనకు లింగము కానుకగా నిచ్చెనని చూపెను. దీక్షితుడు దానిని జూచి సరిగా నది తన ధ్యానములో కనపడినదానివలె నున్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తికాగా, బాబా మేఘశ్యాముడు పూజచేయుచున్న పెద్దపటమువద్ద లింగములు ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి గనుక త్రిశూలము వ్రాయించి, లింగమును ప్రతిష్ఠించుట ద్వారా, బాబా వానియందుండు నమ్మకమును స్థిరపరచెను.

అనేకసంవత్సరములు బాబా సేవచేసి యనగా పూజా, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలము నొందెను. బాబా వాని కళేబరముపయి చేతులుచాచి "ఇతడు నా నిజమయిన భక్తు"డనెను. బాబా తన సొంతఖర్చులతో బ్రాహ్మణులకు చావుభోజీ ఏర్పాటు చేయుమనెను. కాకా సాహెబు దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదియెనిమిదవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|

No comments:

Post a Comment