Saturday, February 2, 2013

శ్రీ సాయి సత్ చరిత్రము ఏడవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఏడవ అధ్యాయము

అద్భుతావతారము; సాయిబాబా వైఖరి; వారి యోగాభ్యాసము; వారి సర్వాంతర్యామిత్వము; కుష్ఠుభక్తుని సేవ; ఖాపర్డేకొడుకు ప్లేగు సంగతి; పండరీపురము పోవుట.

అద్భుతావతారము

సాయిబాబాకు యోగాభ్యాసము లన్నియు తెలిసియుండెను. షణ్మార్గములందును బాబా ఆరితేరినవారు. అందులో కొన్ని ధౌతి, ఖండయోగము, సమాధి మొదలగునవి. ధౌతి యనగా 3 అంగుళముల వెడల్పు, 22 1/2 అడుగుల పొడవుగల తడిగుడ్డతో కడుపును లోపల శుభ్రపరచుట. ఖండయోగమనగా శరీరావయములన్నియు విడదీసి తిరిగి కలుపుట.

బాబా హిందువన్నచో వారు మహమ్మదీయ దుస్తులతో నుండెడివారు. మహమ్మదీయుడన్నచో హిందూమతాచార సంపన్నుడుగ గాన్పించుచుండెను. బాబా శాస్త్రోక్తముగ హిందువుల శ్రీరామనవమి యుత్సవమును జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ యుత్సవసమయమందు కుస్తీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచినవారికి బహుమతులిచ్చువారు. గోకులాష్టమినాడు "గోపాల్ కాలా" యుత్సవము జరిపించుచుండెను. ఈదుల్ ఫితర్ పండుగనాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించుచుండెడివారు. మోహర్రం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజీయా లేక తాబూతు నిల్పి కొన్ని దినములు దాని నచ్చట నుంచినపిమ్మట గ్రామములో నూరేగించెదమనిరి. నాలుగు దినములవరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి యయిదవనాడు నిర్విచారముగ ఏ సంశయము లేక దానిని తానే తీసివేసెను. వారు మహమ్మదీయులన్నచో హిందువుల వలె వారి చెవులకు కుట్లుండెను. వారు హిందువులన్నచో సున్తీ చేసికొనుమని సలహా నిచ్చుచుండెడివారు. కాని వారు మాత్రము సున్తీ చేసికొనియుండలేదు. బాబా హిందువైనచో మసీదునందేల యుండును? మహమ్మదీయుడైనచో ధునియు అగ్నిహోత్రమును ఏల వెలిగించియుండువారు? అదేగాక మహమ్మదీయమతమునకు వ్యతిరేకముగా తిరుగలితో విసరుట, శంఖమూదుట, గంటవాయించుట, హోమముచేయుట, భజన చేయుట, సంతర్పణ చేయుట, అర్ఘ్యపాద్యములు సమర్పించుట మొదలగునవి జరుగుచుండెను. వారే మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచారపారాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారము లెట్లు చేయుచుండెడివారు? వారేతెగవారని యడుగబోయిన వారెల్లరు వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువుడో మహమ్మదీయుడో ఎవరును సరిగా నిర్ణయించలేకుండిరి. ఇదియొక వింత కాదు. ఎవరయితే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్యశరణాగతి యొనరించెదరో వారు దేవునిలో నైక్యమైపోయెదరు. వారికి దేనితో సంబంధముగాని, భేదభావముగాని యుండదు. వారికి జాతిమతములతో నెట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము గన్పించకుండెను. బాబా ఫకీరులతో కలిసి మత్స్యమాంసములు భుజించుచుండెను. కాని వారి భోజనపళ్ళెములో కుక్కలు మూతిపెట్టినను నడుగువారు కారు.

శ్రీ సాయి యవతారము విశిష్టమైనది; యద్భుతమైనది. నా పూర్వజన్మసుకృతముచే వారి పాదములవద్ద కూర్చొను భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా యదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన యానందము ఉల్లాసము చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును, విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు మోక్షమునకై పాటుపడు తదితరు లనేకమంది సాయిబాబా వద్దకు వచ్చెడివారు. బాబా వారితో నడచుచు, మాట్లాడుచు, నవ్వుచు అల్లా మాలిక్ యని యెల్లప్పుడు పలుకుచుండెడివారు. వారికి వివాదములుగాని, చర్చలుగాని యిష్టము లేదు. అప్పుడప్పుడు కోపించినప్పటికి వారెల్లప్పుడు నెమ్మదిగానుండి శరీరమును పూర్తిగా స్వాధీనములో నుంచు కొనెడివారు. ఎల్లప్పుడు వేదాంతమును బోధించుచుండెడివారు. ఆఖరువరకు బాబా యెవరో ఎవరికి తెలియనేలేదు. వారు రాజులను, భిక్షుకులను నొకేరీతిగా ఆదరించిరి. అందరి యంతరంగములందు గల రహస్యములన్ని బాబా యెరింగెడివారు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగనే యందరు ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞు లయినప్పటికి ఏమియు తెలియనివానివలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికి అయిష్టము. సాయిబాబా నైజమట్టిది. మానవశరీరముతో నున్నప్పటికి వారు చేయు పనులను జూడ సాక్షాత్తు భగవంతుడని చెప్పవలెను. అందరును వారిని జూచి షిరిడీలో వెలసిన భగవంతుడనియే యనుకొనుచుండిరి.

సాయిబాబా వైఖరి

నేను వట్టి మూర్ఖుడనగుటచే బాబా మహిమలను వర్ణించలేను. బాబా షిరిడీలోనున్న దేవాలయములన్నిటిని మరామతు చేయించెను. తాత్యాపాటీలు సహాయముతో గ్రామములోనున్న శని, గణపతి, పార్వతీ శంకర, గ్రామదేవత, మారుతీదేవాలయముల మరామతు చేయించెను. వారి దానము పొగడబడినది. దక్షిణరూపముగా వసూలయిన పైకమంతయు నొక్కొక్కరికి రోజు కొక్కంటికి రూ. 50/- 30/- 15/- చొప్పున ఇష్టము వచ్చినట్లు పంచిపెట్టెడివారు.

బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభము పొందువారు. కొందరు ఆరోగ్యవంతు లగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. కంటిలో రసముగాని మందుగాని వేయకనే గ్రుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను; కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును, పారమును ఎవ్వరును కనుగొనకుండిరి. వారి కీర్తి చాల దూరమువరకు వ్యాపించెను. అన్నిదేశముల భక్తులు షిరిడీలో గుమిగూడుచుండిరి. బాబా ఎల్లప్పుడు ధునివద్దనే ధ్యానమగ్నులయి కూర్చొనుచుండెను. ఒక్కొక్కప్పుడు స్నానము కూడ మానెడివారు.

తొలిదినములలో బాబా తెల్ల తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించువారు. మొదట గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చెడివారు. వారి చేతితో నిచ్చిన మందులు పనిచేయుచుండెడివి. మంచి హస్తవాసిగల డాక్టరని పేరు వచ్చెను. ఈ సందర్భమున నొక వింత విషయము చెప్పవలెను. ఒక భక్తుని కండ్లు వాచి మిక్కిలి యెర్రబడెను. షిరిడీలో డాక్టరు దొరకలేదు. ఇతరభక్తు లాతనిని బాబావద్దకు గొనిపోయిరి. అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరముతో చేసిన యౌషధములు డాక్టర్లు ఉపయోగించెదరు. కాని బాబా చేసిన చికిత్స విశిష్టమైనది. నల్ల జీడిగింజలను నూరి రెండు మాత్రలు చేసి యొక్కొక్క కంటిలో నొక్కొక్కదానిని దూర్చి గుడ్డతో కట్టుకట్టెను. మరుసటి దినము కట్టులను విప్పి నీళ్ళను ధారగా పోసెను. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్లజీడిపిక్కలమందు పెట్టినప్పుడు సున్నితమైన కండ్లు మండనేలేదు. అటువంటి చిత్రము లనేకములు గలవు. కాని యందు ఒకటి మాత్రమే చెప్పబడినది.


బాబా యోగాభ్యాసములు

బాబాకు యోగములన్నియు దెలియును. కాని యందులో రెండు మాత్రమే వర్ణింపడెను.

1. ధౌతి లేక శుభ్రపరచు విధానము
మసీదుకు చాల దూరమున ఒక మఱ్ఱిచెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి మూడవరోజు బాబా యచ్చటకు పోయి ముఖప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఒకనాడు బాబా తన యూపిరి తిత్తులను బయటకు కక్కి వాటిని నీటితో శుభ్రపరచి నేరేడుచెట్టుపై ఆరవేయుట కొందరు గమనించిరి. షిరిడీలోని కొందరు దీనిని కండ్లార చూచి చెప్పిరి. మామూలుగా ధౌతియనగా 3 అంగుళముల వెడల్పు 22 1/2 అడుగుల పొడవుగల గుడ్డను మ్రింగి కడుపులో అరగంటవరకు నుండనిచ్చిన పిమ్మట తీసెదరు. కాని బాబాగారి ధౌతి చాల విశిష్టము, అసాధారణము నైనది.

2. ఖండయోగము
బాబా తన శరీరావయము లన్నియు వేరుచేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టువారు. ఒకనాడొక పెద్దమనిషి మసీదుకు పోయి బాబా యవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట జూచి భయకంపితుడై బాబాను ఎవరో ఖూనీచేసిర నుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదుచేయ నిశ్చయించుకొనెను. కాని మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయముగుర్చి కొంచమైన తెలిసియుండునని తననే అనుమానించెదరని యూరకొనెను. మరుసటిదినమతడు మసీదుకు బోయెను. బాబా యెప్పటివలె హాయిగా కూర్చొనియుండుట జూచి యాశ్చర్యపడెను. ముందుదినము తాను చూచినదంతయు స్వప్నమనుకొనెను..

3. యోగము
బాల్యమునుంచి బాబా యోగాభ్యాసము చెయుచుండెను. దానిలో వారెంత నిష్ణాతులో యెవరికీ తెలియదు. వారి ఊదీ ప్రసాదము వల్ల బాగుపడిన రోగులవద్దనుంచి డబ్బు పుచ్చుకొనక యుచితముగానే సేవ చేయుచుండిరి. అనేకమందిని యారోగ్యవంతులుగ జేసిరి. వారు చేయు పుణ్యకార్యములబట్టి వారికి గొప్పకీర్తి వచ్చెను. బాబా సొంతము కొరకు ఏమియు చెయక యితరుల మేలుకొరకే యెల్లప్పుడు పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తనపై వేసికొని తాము మిక్కిలి బాధ ననుభవించేవారు. అందులో నొకటి యీ దిగువ పేర్కొందును. దీనినిబట్టి బాబా సర్వజ్ఞుడనియు మిక్కిలి దయార్ద్రహృదయుడనియు తెలియును.

బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము

1910వ సంవత్సరము దీపావళి పండుగనాడు బాబా ధునివద్ద కూర్చుండి చలి కాగుచుండెను. బాబా ధునిలో కట్టెలు వేయుచుండెను; ధుని బాగుగా మండుచుండెను. కొంతసేపయిన తరువాత కట్టెలను వేయుట మాని తనచేతిని ధునిలో పెట్టెను. వెంటనే చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును, మాధవరావు దేశపాండేయు దీనిని జూచిరి. వెంటనే పరుగెత్తి బాబాను పట్టి వెనుకకు లాగిరి. దేవా! ఇట్లేల చేసితిరని యడిగిరి. స్పృహ తెచ్చుకొని బాబా యిట్లు జవాబిచ్చెను. "దూరదేశమున ఒక కమ్మరి భార్య కొలిమితిత్తులను ఊదుచుండెను. అంతలో నామె భర్త పిలిచెను. తనయొడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచి పరుగిడజొచ్చెను. ఆ బిడ్డ మండుచున్న కొలిమిలో బడెను. అందుచేత వెంటనే నాచేతిని కొలిమిలోనికి దూర్చి బిడ్డను రక్షించితిని. నా చేయి కాలుట నాకంత బాధాకరము కాదు. కాని బిడ్డ రక్షింపబడెనను విషయము నా కానందము గలుగచేయుచున్న" దని బాబా నుడివెను.

కుష్ఠురోగభక్తుని సేవ

బాబా చెయ్యి కాల్చుకొనెనని మాధవరావు దేశపాండే నానా సాహెబు చాందోర్కరుకు తెలియజేసెను. వెంటనే ఆయన బొంబాయి నుండి డాక్టరు పరమానందుని మందుల పెట్టెతో వెంటబెట్టుకొని వచ్చెను. నానా బాబాను చికిత్స చేయుటకై డాక్టరును చేయి చూడనిమ్మని కోరెను. బాబా యందుల కొప్పుకొనలేదు. చేయి కాలిన లగాయితు బాగోజీశిందే యను కుష్ఠురోగియే కట్టు కట్టుచుండెను. కాలిన చేతిపైన నెయ్యి రాసి, యాకు వేసి, గుడ్డతో కట్టు కట్టెడివాడు. నానా యెంత వేడినను బాబా డాక్టరుగారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టరుగారుకూడ అనేకసారులు వేడుకొనిరి. కాని అల్లాయే తన డాక్టరని బాబా కాలయాపన చేయుచుండెను. అందుచే డాక్టరు మందుల పెట్టె మూతయైన తీయకుండనే తిరిగిపోయెను. కాని డాక్టరుగారికి బాబా దర్శనభాగ్యము లభించెను. బాబా ప్రతిరోజు భాగోజీ చే చేతికి కట్టు కట్టించుకొనుచుండెను. కొన్నిదినముల తరువాత చేయి బాగుపడెను. అందరు సంతోషించిరి. ఇప్పటికిని ఏమైన నొప్పి మిగలిపోయినదా యను సంగతి యెవరికి తెలియదు. ప్రతిరోజు ఉదయము భాగోజీ కట్టులను విప్పి, నేతితో తోమి, తిరిగి కట్టులను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునేయుండెను. బాబా సిద్ధపురుషుడగుటచే వారి కిదంతయు నవసరములేనప్పటికి భాగోజీ భక్తునియందు గల ప్రేమచే అతడొనర్చు ఉపాసనాసేవకు సమ్మతించెడివారు. బాబా లెండితోటకు పోవునపుడు భాగోజి బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట వెళ్ళేవాడు. ప్రతిరోజు ఉదయము బాబా ధునియొద్ద కూర్చొనగనే, భాగోజి తన సేవాకార్యము మొదలిడువాడు. గతజన్మయందు భాగోజి పాపి, కనుకనే కుష్ఠురోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్ళు ఈడ్చుకొని పోయియుండెను. వాని శరీరమంతయు చీము కారుచు, దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు దురదృష్టవంతునివలె గాన్పించునప్పటికి అతడు అదృష్టశాలియు, సంతోషియు. ఎందుకనగా అతడు బాబాసేవకులందరిలో మొదటివాడు; బాబా సహవాసము పూర్తిగా ననుభవించెను.

ఖాపర్డే కుర్రవాని ప్లేగు జాడ్యము

బాబా విచిత్ర లీలలలో నింకొకదానిని వర్ణించెదను. అమరావతి నివాసియగు దాదాసాహెబు ఖాపర్డే భార్య తన చిన్న కొడుకుతో షిరిడీలో మకాం చేసెను. కొడుకుకు జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము క్రింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడచి అమరావతి పోవలెననుకొని సాయంకాలము బాబా బుట్టీవాడావద్దకు వచ్చుచున్నప్పుడు వారి సెలవు నడుగ బోయెను. వణుకుచున్న గొంతుతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను. బాబా యామెతో కారుణ్యముతో, నెమ్మదిగా మాట్లాడదొడగెను. ప్రస్తుతము ఆకాశము మేఘములచే కప్పబడియున్నది గాని యవి చెదిరి పోయి కొద్దిసేపట్లో నాకాశమంతయు మామూలు రీతిగా నగునని బాబా యోదార్చెను. అట్లనుచు తన కఫనీని పైకెత్తి చంకలో కోడి గ్రుడ్లంత పెద్దవి నాలుగు ప్లేగు పొక్కులను అచటవారికి జూపెను. "చూచితిరా! నా భక్తులకొరకు నే నెట్లు బాధపడెదనో! వారి కష్టములన్నియు నావిగనే భావించెదను." ఈ మహాద్భుతలీలలను జూచి యోగీశ్వరులు భక్తులకొర కెట్లు బాధ లనుభవింతురో జనులకు విశ్వాసము కుదిరెను. యోగీశ్వరుల మనస్సు మైనముకన్న మెత్తనిది, వెన్నెలవలె మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారము కోరకయే ప్రేమించెదరు. భక్తులను తమ బంధువులవలె జూచెదరు.

పండరీపురము పోయి యచ్చటుండుట

సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను, అవసరముల నెట్లు గ్రహించుచుండెనో యను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబు చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేషులోని నందురుబారులో మామలతదారుగా నుండెను. అతనికి పండరీపురమునకు బదిలీ జరిగెను. సాయిబాబా యందు అతనికిగల భక్తియను ఫలమానాటికి పండెను. పండరీపురమును భూలోకవైకుంఠ మనెదరు. అట్టి స్థలమునకు బదిలీ యగుటచే నాతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబు వెంటనే పండరి పోయి ఉద్యోగములో ప్రవేశించవలసి యుండెను. కాన షిరిడీకి ఉత్తరము వ్రాయకయే పండరీపురము పోవలెనని బయలుదేరెను. షిరిడీకి హఠాత్తుగా పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి పండరి పోవలె ననుకొనెను. నానాసాహెబు షిరిడీ వచ్చునను సంగతి యెవరికి తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబు నీమగాం చేరుసరికి షిరిడీ మసీదులో కలకలము కలిగెను. బాబా మసీదులో కూర్చుండి మహాళ్సాపతి, అప్పాశిందే, కాశీరాములతో మాట్లాడుచుండెను. వెంటనే బాబా యిట్లనియెను. "మన నలుగురము కలసి భజన చేసెదము. పండరీద్వారములు తెరచినారు. కనుక ఆనందముగా పాడెదము లెండు." అందరు కలసి పాడదొడంగిరి. ఆ పాట భావమేమన, "నేను పండరి పోవలెను. నే నక్కడ నివసించవలెను. అది నా దైవము యొక్క భవనము."

బాబా పాడుచుండెను. భక్తులందరు బాబాను అనుగమించిరి. కొద్ది సేపటికి నానా కుటుంబముతో వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి, బాబాను పండరీపురము వచ్చి వారితో కలసి యక్కడుండుమని వేడుకొనియెను. ఈ బతిమాలుట కవసరము లేకుండెను. ఏలన బాబా యప్పటికే పండరి పోవలెను; అచ్చట నుండవలెనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై బడెను. బాబాయొక్క ఆజ్ఞను పొంది ఊదీ ప్రసాదమును గ్రహించి, ఆశీర్వాదమును పొంది నానాసాహెబు పండరికి పోయెను. ఇట్టి బాబా లీలల కంతులేదు.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
ఏడవ అధ్యాయము సంపూర్ణము.

మొదటిరోజు పారాయణము సమాప్తము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

No comments:

Post a Comment