Saturday, February 2, 2013

శ్రీ సాయి సత్ చరిత్రము పదునొకండవ అధ్యాయము

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

పదునొకండవ అధ్యాయము

సాయి సగుణబ్రహ్మ స్వరూపుడు, డాక్టర్ పండిత్ గారి పూజ; హజీ సిద్దీఖ్ ఫాల్కే; పంచభూతములు స్వాధీనము.

ఈ అధ్యాయములో సగుణబ్రహ్మముగా నవతరించిన సాయి ఎట్లు పూజింపబడిరో, వారు పంచభూతముల నెట్లు స్వాధీనమందుంచుకొనిరో వర్ణింతును.

సాయి, సగుణ బ్రహ్మస్వరూపము

భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా నవతరింప వచ్చును. (1)నిర్గుణస్వరూపము, (2) సగుణస్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు. సగుణస్వరూపమునకు ఆకారము గలదు. రెండు స్వరూపములును పరబ్రహ్మవే. మొదటిదానిని కొందురు పూజింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయములో సగుణస్వరూపమును పూజించుటయే సులభమని కలదు. కావున దానినే అనుసరింపవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారముతో నున్నాడు. కావున భగవంతుని గూడ ఆకారముతో నున్నట్లుగానే భావించి, పూజించుట సులభము; సహజము.

మన భక్తి ప్రేమలు కొన్నాళ్ళవరకు సగుణస్వరూపమగు బ్రహ్మమును పూజించినగాని వృద్ధిచెందవు. రానురాను ఆ భక్తి నిర్గుణస్వరూపమగు పరబ్రహ్మమును పూజించుటకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము - ఈ ఏడు పూజింపదగినవి. కాని సద్గురవు వీని యన్నిటికంటె సుత్కృష్టుడు. ఈ సందర్భములో సాయినాథుని మనమున ధ్యానించెదము. వారి నిర్మోహమున కవతారము; పరమభక్తులకు ఆశ్రయస్థానము. మనకు వారి వాక్కులయందుగల భక్తియే యాసనము. మనకోరికలన్నియు నిరసించుటయే సంకల్పము (పూజ ప్రారంభించి పూర్తిచేసెదమను మనో నిశ్చయము). కొందరు సాయిబాబా భగవద్భక్తుడనెదరు. కొందరు మహాభాగవతు డందురు. కాని మాకు బాబా భగవంతుని యవతారమే. వారు తప్పు చేసినవారిని క్షమించువారు. ఎన్నడు కోపించువారు కారు. సూటిగను, నెమ్మదిగను, ఓర్పుకలిగి, సంతుష్టిగ నుండువారు. శ్రీ సాయిబాబా యాకారముతోనున్నప్పటికి నిరాకారస్వరూపులు. వారెల్లప్పుడు ఉద్రేకము, అభిమానము లేకుండ నిత్యముక్తులుగా నుండువారు. గంగానది సముద్రమునకు పోవు మార్గమందు వేడిచే బాధపడు జీవులకు చల్లదనము కలుగజేయుచు చెట్లకు చేమలకు జీవకళ నిచ్చుచు ననేకుల దాహమును తీర్చుచున్నది. అట్లనే సాయివంటి యోగులు తమ జీవనము తాము గడపుచు తక్కినవారందరికి సుఖమును ఓర్పును ప్రసాదించుచున్నారు. భగవద్గీతయందు శ్రీ కృష్ణుడు యోగి తన యాత్మయనియు, జీవత్ప్రతిమయనియు, తానే వారనియు, వారే తాననియు నుడివియున్నాడు. వర్ణింప నలవికాని యా సత్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిరూపముగా నవతరించెను. శ్రుతులు బ్రహ్మమును ఆనందస్వరూపముగా వర్ణించుచున్నవి (తైత్తరీయ ఉపనిషత్తు). ఈ సంగతి ప్రతిరోజు పుస్తకములందు చదువుచున్నాము. కాని భక్తులు ఈ పరబ్రహ్మస్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా యెవరిని యాశ్రయించి యుండలేదు. వారి యాసనము కొరకు గోనెసంచి నుపయోగించిరి. వారి భక్తులు దానిపై చిన్నపరుపు వేసి వీపు ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల యభిప్రాయము నెరవేర్చును. వారి యిష్టానుసారము తనను పూజించుట కెట్టి యభ్యంతరము జూపకుండెను. కొందరు చామరముల తోను, విసనకఱ్ఱలతోను విసరుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారి చేతులను పాదములను కడుగుచుండిరి. కొందరు వారికి చందనము, అత్తరు పూయుచుండిరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించునట్లు గాన్పించినప్పటికి వారు సర్వాంతర్యామి; ఎక్కడ జూచినను వారే యుండువారు. వారి భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వము ప్రతిరోజు అనుభవించుచుండెడివారు. సర్వాంతర్యామియగు ఈ సద్గురువుకు మా వినమ్ర సాష్టాంగనమస్కారములు.

డాక్టరు పండితుని పూజ

తాత్యాసాహెబు నూల్కరు స్నేహితుడగు డాక్టరు పండిత్ బాబా దర్శనమునకై షిరిడీ వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్టు కేల్కరువద్దకు పొమ్మని బాబా చెప్పెను. అట్లనే డాక్టరు పండిత్ దాదాభట్టువద్దకు పోయెను. దాదాభట్టు అతనిని సగౌరవముగా ఆహ్వానించెను.

దాదాభట్టు బాబాను పూజించుటకై పూజాసామగ్రీ పళ్ళెముతో మసీదులోనున్న బాబా వద్దకు వచ్చెను. డాక్టరు పండిత్ కూడ అతని వెంట వచ్చెను. దాదా భట్టు, బాబాను పూజించెను. ఇంతవర కెవ్వరును బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు. ఒక్క మహాళ్సాపతియే బాబా కంఠమునకు చందనము పూయుచుండెను. కాని యీ అమాయకభక్తుడగు డాక్టరు పండిత్ దాదాభట్టుయొక్క పూజాపళ్ళెరమునుండి దీసికొని యా చందనమును బాబానుదిటిపై త్రిపుండ్రాకారముగ వ్రాసెను. అందరికి ఆశ్చర్యము కల్గునట్లు బాబా మాటయిన ఆడక యూరకుండెను. ఆనాడు సాయంకాలము దాదాభట్టు బాబాను ఇట్లడిగెను. "బాబా! ఎవరయిన నుదుటిపై చందనము పూయుదుమన్న నిరాకరింతువే? డాక్టరు పండిత్ వ్రాయగా ఈనాడేల యూరకుంటివి?" అందులకు బాబా యిట్లు సమాధానమిచ్చెను. "డాక్టరు పండితుని గురువు, రఘునాథ్ మహారాజు, ధోపేశ్వర నివాసి. వారిని కాకా పురాణిక్ యని కూడ పిలిచెదరు. డాక్టర్ పండిత్ నన్ను తన గురువుగా భావించి తన గురువునకు చందనము పూయుచున్నట్లు నా నుదుటిపై చందనము పూసెను. కాబట్టి నేను అడ్డు చెప్పలేకపోతి" ననెను. దాదాభట్టు డాక్టరు పండితుని ప్రశ్నించగా డాక్టరు, బాబాను తన గురువుగా భావించి తన గురువున కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసితిననెను.

భక్తుల యిష్టానుసారము తనను పూజించుటకు బాబా యొప్పుకొనినను ఒక్కొక్కప్పుడు బాబా మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పళ్ళెమును విసరివేయుచు కోపమునకు అవతారమువలె గనబడుచుండెను. అట్లయినచో బాబాను సమీపించు వారెవ్వరు? ఒక్కొక్కప్పుడు భక్తుల దిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనముకంటె మెత్తగా గనిపించుచుండెడివారు. ఇంకొకప్పుడు క్షమాశాంతముల ప్రతిమవలె గాన్పించుచుండెను. బయటికి కోపముతో వణకుచు, యెర్రకండ్లు ఇటునటు ద్రిప్పునప్పటికి, మాతృప్రేమ యనురాగముల ప్రవాహమువలె నుండువారు. వెంటనే తన భక్తులను బిలచి యిట్లనెను. "భక్తులను కోపించినట్లు తానెన్నడు నెరిగియుండలేదనెను. తల్లులు బిడ్డలను తరిమివేసినట్లయిన, సముద్రము నదులను తిరుగగొట్టినచో బాబా తన భక్తులను నిరాదరించును. భక్తుల యోగక్షేమములను ఉపేక్షించును. బాబా తన భక్తుల సేవకులమనిరి. భక్తులవెంటనే యుండి, వారు కోరునపుడెల్ల ఓహోయని సమాధానమిచ్చుటయే గాక వారి భక్తి ప్రేమలను కాంక్షించుచుండెద" నని చెప్పిరి. 


హాజీ సిద్దీఖ్ ఫాల్కేయను భక్తుడు

బాబా యెప్పుడు ఏ భక్తుని ఆశీర్వదించునో యెవరికి తెలియదు. ఆది వారి యిష్టముపై ఆధారపడి యుండెను. హాజీ సిద్దీఖ్ ఫాల్కే కథ ఇందు కుదాహరణము. సిద్దీఖ్ ఫాల్కే యను మహమ్మదీయుడు కల్యాణి నివాసి మక్కా మదీన యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చెరెను. చావడి ఉత్తరభాగమున బసచేసెను. మసీదు ముందున్న ఖాళీజాగాలో కూర్చొనుచుండెను. తొమ్మిది నెలలవరకు బాబా వాని నుపేక్షించెను. మసీదులో పాదము పెట్టనివ్వలేదు. ఫాల్కే మిక్కిలి యసంతుష్టి చెందెను. ఏమి చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని కొంద రోదార్చిరి. శ్యామా అను భక్తునిద్వారా బాబా వద్ద కేగుమని సలహా నిచ్చిరి. శివునివద్దకు అతని సేవకుడును, భక్తుడును అగు నందీశ్వరుని ద్వారా వెళ్ళునట్లు, సాయిబాబా వద్దకు మాధవరావు దేశపాండే-శ్యామా ద్వారా వెళ్ళుమని చెప్పిరి. ఫాల్కే దాని నామోదించెను. తన తరవున మాట్లాడుమని శ్యామాను వేడుకొనెను. శ్యామా యందులకు సమ్మతించెను. సమయము కనిపెట్టి బాబాతో నిట్లనియెను.

"బాబా! ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనీయవేల? అనేకమంది వచ్చి నిన్ను దర్శించి పోవుచున్నారు. వాని నేల యాశీర్వదించవు?" బాబా యిట్లని జవాబిచ్చెను. "శ్యామా! విషయములను గ్రహించే శక్తి నీకు లేదు. నీవు చిన్న వాడవు. అల్లా యొప్పుకొననిచో నేనేమి చేయగలను? వారి కటాక్షము లేనిచో మసీదులో పాదము పెట్టగలుగువా రెవ్వరు? సరే, నీవు వానివద్దకు పోయి వానిని బారవీ నూతికి దగ్గరనున్న కాలిబాటకు రాగలడేమో యడుగుము." శ్యామా పోయి కనుగొని హాజీ అందులకు సమ్మతించెనని చెప్పెను. నలుబదివేల రూపాయలు నాలుగు వాయిదాలలో నివ్వగలడేమో కనుగొనుమని తిరిగి బాబా యడిగెను. శ్యామా వెంటనే పోయి జవాబు తెచ్చెను. నాలుగు లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగా నున్నాడని బదులు చెప్పెను. సరే మరల పోయి వాని నిట్లడుగుము. "మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానికి దాని మాంసము కావలెనో రొండి కావలెనో కప్పూరములు (వృషణములు) కావలెనో కనుగొనుము." బాబావారి మట్టిపాత్రలో నున్న చిన్నముక్కతో సంతుష్టిచెందెదనని హాజి చెప్పెనని శ్యామా బదులు చెప్పెను. ఇది వినగానే బాబా మిగుల కోపించి మసీదులోని మట్టిపాత్రలు, కొలంబ విసరివైచి తిన్నగా చావడిలో నున్న హాజీవద్దకు బోయి కఫనీ (పొడుగైన చొక్కా)ని పై కెత్తి యిట్లనెను. "మహనీయునివలె ఏల నటించుచున్నావు? తెలిసిన వాని వలె ఏల కూయుచున్నావు? ముసలి హాజి వలె నటించుచున్నా వేల? ఖురాను ఇట్లే పారాయణ చేయుచున్నావా? మక్కాయాత్ర చేసితినని గర్వించి నన్ను కనుగొన లేకుంటివా?" ఇట్లు తిట్టినందుకు హాజీ గాబరాపడెను. బాబా మసీదుకు పోయెను. కొన్ని గంపల మామిడిపండ్లను గొని హాజీకి పంపెను. తిరిగి హాజీవద్దకు వచ్చి తన జేబులోనుంచి 55 రూపాయలు తీసి హాజీ చేతిలో పెట్టెను. అప్పటినుంచి హాజీ తన కిష్టము వచ్చినప్పు డెల్ల మసీదులోనికి వచ్చుచుండెను. బాబా యొక్కొక్కప్పుడు వానికి డబ్బు నిచ్చుచుండెను. బాబా దర్బారులో అతనిని గూడ చెర్చుకొనిరి.

పంచభూతములు బాబా స్వాధీనము

బాబాకు పంచభూతములు స్వాధీనమైనవని తెలుపు రెండు విషయములను వర్ణించిన పిమ్మట ఈ యధ్యామును ముగించెదము.

(1) ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేలయంతయు నీటిలో మునిగెను. జీవకోటులన్నియు పక్షులు, జంతువులు, మనుష్యులు, మిక్కిలి భయపడిరి. తలదాచుకొనుట కందరు మసీదులో ప్రవేశించిరి. షిరిడీలో అనేకస్థానిక దేవత లున్నను వారిని ఆదుకొనలేదు. కావున వారందరు తుఫానును ఆపి వేయుడిని బాబాను వేడుకొనిరి. బాబా వారి భక్తికి మెచ్చెను. బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి, బిగ్గరగా నిట్లు గర్జించిరి. "ఆగు, యాగు, నీ కోపమును తగ్గించు, నెమ్మదించు." కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున గనిపించెను. ప్రజలందరు సంతుష్టి చెంది వారి వారి గృహములకు బోయిరి.

(2) ఇంకొకప్పుడు మిట్టమధ్యాహ్నము ధునిలోని మంట యపరిమితముగా లేచెను; మసీదు వెన్ను పట్టీలవరకు పోవునట్లు గనిపించెను. మసీదులో కూర్చొన్నవారి కేమి చేయుటకు తోచకుండెను. బాబాతో ధునిలో నీళ్ళు పోయుమని గాని మంటలు చల్లార్చుటకు మరేమైన సలహా నిచ్చుటకుగాని వారు భయపడుచుండిరి. ఏమి జరుగుచున్నదో బాబా వెంటనే గ్రహించెను. తమ సటకాను (పొట్టి కఱ్ఱ) దీసి దగ్గరనున్న స్తంభముపై కొట్టుచు 'దిగు, దిగు, శాంతించుము' అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు, మంటలు తగ్గి దిగిపోవుచు కొన్ని నిమిషములలో ధుని చల్లబడి మామూలుగా నుండుదానివలె శాంతించెను. ఇట్టివారు భగవదవతారమైన శ్రీ సాయినాథుడు, వారి పాదములపైబడి సాష్టాంగనమస్కారము చేసి సర్వస్యశరణాగతి వేడినవారినెల్ల రక్షించును. ఎవరయితే భక్తి ప్రేమలతో నీ యధ్యాయములోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టము లన్నిటినుండి విముక్తులగుదురు. అంతేకాక సాయియందే యభిరుచి, భక్తి, కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నియు నెరవేరును. తుదకు కోరికలను విడచినవారై, మోక్షమును సంపాదించెదరు.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
పదునొకండవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

No comments:

Post a Comment