Sunday, February 3, 2013

శ్రీ సాయి సత్ చరిత్రము ఇరువదియైదవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదియైదవ అధ్యాయము

దాము అన్నా కాసార్ (అహమదునగరు)

1. సట్టా వ్యాపారము 2. మామిడిపండ్ల కథ.

ప్రస్తావన

భగవదవతారమును, పరబ్రహ్మస్వరూపుడును, మహాయోగేశ్వరుడును, కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాధునకు సాష్టాంగ చూడామణియగు శ్రీ సాయినాధమహారాజుకు జయమగు గాక! సమస్త శుభములకు నిలయము, మన ఆత్మారాముడు, భక్తులపాలిటి ఆశ్రయదాత యగు సాయికి జయమగు గాక, జీవితాశయమును, పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు.

సాయిబాబా యెల్లప్పుడు కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారియందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణభక్తి యున్నప్పుడు వానికోరికలన్నియు శీఘ్రముగా నెరవేరును. హేమాడ్ పంతు మనస్సునందు బాబా జీవితలీలలను వ్రాయుకోరిక జనించగనే, బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహముగా సంగతులను వ్రాసికొనుమని బాబా యాజ్ఞ యిచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణకలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయుయోగ్యత మొదట అతనికి లేకుండెను. కాని బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దాని నతడు పూర్తి చేయగలిగెను. ఈ విధముగా సత్చరిత్ర సిద్ధమైనది. అది యొక చంద్రకాంతిమణి వంటిది. దానినుండి సాయిలీలలను నమృతము స్రవించును. దానిని చదువరులు మనసార త్రాగవచ్చును.

భక్తునకు సాయియందు పూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖములనుండి, యపాయములనుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహమద్ నగర నివాసియగు (ప్రస్తుతము పూనా వాసి) దామోదర్ సావల్ రామ్ రాసనె కాసార్ వురఫ్ దాము అన్నాకథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువ నివ్వబడినది.

దాము అన్నా

(దామోదర్ సావల్ రామ్ రాసనె)
6వ అధ్యాయములో శ్రీరామనవమి యుత్సవసందర్భమున ఇతనిగూర్చి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తియందుంచుకొనియే యుందురు. అతడు 1895వ సంవత్సరమున శ్రీరామనవమి యుత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటినుండి ఇప్పటివరకు అలంకరించిన పతాక మొకటి కానుకగా నిచ్చుచున్నాడు. అదియును గాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు.

అతని జట్టీ వ్యాపారములు

1. ప్రత్తి
బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు, ప్రత్తిలో జట్టీ వ్యాపారము చేసి భాగస్థుడుగా సుమారు రెండులక్షల రూపాయలు లాభము సంపాదించవలెనని వ్రాసెను. వ్యాపారము లాభకరమైన దనియు, నెంత మాత్రము ప్రమాదకరము కాదనియు, గనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను. దాము అన్నా యాబేరమును చేయుటయా? మానుటయా? యను నాందోళనలో పడెను. జట్టీ వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గూర్చి బాగుగ ఆలోచించి, తాను బాబా భక్తుడగుటను వివరములతో శ్యామాకొక ఉత్తరము ప్రాసి బాబానడిగి, వారి సలహాను తెలిసికొనుమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను. శ్యామా దానిని తీసికొని మసీదుకు బోయెను. బాబా ముందరబట్టెను. బాబా యా కాగితమేమని యడిగెను. సమాచార మేమనెను? శ్యామా అహమద్ నగరు నుండి దాము అన్నా యేదో కనుగొనుటకు వ్రాసినాడనెను. బాబా యిట్లనెను. "ఏమి వ్రాయుచున్నాడు? ఏమి యెత్తు వేయుచున్నాడు? భగవంతు డిచ్చినదానితో సంతుష్టిజెందక యాకాశమున కెగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని యుత్తరము చదువుము." బాబా చెప్పినదే ఆయుత్తరములో గల సమాచారమని, శ్యామా "దేవా! నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని, భక్తుల నాందోళనపాలు చేసెదవు. వారు వ్యాకులులగుటతో, వారి నిచట కీడ్చుకొని వచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను, కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసియు నన్నేల చదువుమని బలవంత పెట్టుచున్నావు?" అనెను. బాబా యిట్లనియె: "ఓ శ్యామా! దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడెదను. నన్ను విశ్వసించు వారెవ్వరు?"

అప్పుడు శ్యామా ఉత్తరము చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో నిట్లనియె. "సేటుకు పిచ్చి యెత్తినది. అతని గృహమందేలోటు లేదని వ్రాయుము. తన కున్న సగము రొట్టెతో సంతుష్టి చెందుమని వ్రాయుము. లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము." శ్యామా జవాబును పంపెను. దానికొర కాతురతతో దాము అన్నా కని పెట్టుకొని యుండెను. జాబు చదువుకొని అతడు తన యాశయంతయు అడియాస యైన దనుకొనెను. కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామా వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలెనని యనుకొనెను. అందుచే షిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచు కూర్చుండెను. అతనికి బాబాను బహింరంగముగా జట్టీ వ్యాపారము గూర్చి యడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారములో కొంతలాభము బాబా కిచ్చినచో బాగుండు ననుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్నా తన మనస్సున ననుకొనెను. బాబాకు తెలియనిదేమియు లేదు. అరచేతనున్న యుసిరికాయవలె భూతభవిష్యత్ వర్తమానమును కూడ బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలయును. కాని తల్లి చేదుమాత్రలిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును జెరచును. చేదుమాత్ర లారోగ్యమును వృద్ధిచేయును. తల్లి తన బిడ్డయొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదుమాత్రలే యిచ్చును. బాబా దయగల తల్లివంటివారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గూర్చి బాగుగ దెలిసినవారు. దాము అన్నా మనస్సును గనిపెట్టి బాబా యిట్లనెను. "ప్రపంచ విషయములలో తగుల్కొనుటకు నాకిష్టము లేదు." బాబా యొక్క యసమ్మతి గ్రహించి దాము అన్నా యా పనిని మానుకొనెను.

2. ధాన్యముల బేరము
పిమ్మట ధాన్యము, బియ్యము, గోధుమలు మొదలగు వాని వ్యాపారము చేయు తలపెట్టెను. ఈ యాలోచనకూడ బాబా గ్రహించి యిట్లనెను. "నీవు 5 నేర్లచొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును. కనుక నీ వ్యాపారము కూడ మానుకొను"మనెను. కొన్నాళ్ళువరకు ధాన్యము ధర హెచ్చుగానే యుండెను. కాని యొక మాసము రెండు మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిలువచేసినవారెల్ల నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్నా కాపాడబడెను. ప్రత్తి జట్టీవ్యాపారము కూడ కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టినవారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను రెండుసారులు గొప్ప నష్టములనుండి తప్పించెనని, దాము అన్నాకు బాబా యందుగల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందువరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట గూడ ఇప్పటివరకు భక్తితో నున్నాడు.


ఆమ్రలీల (మామిడిపండ్ల చమత్కారము)

ఒకనాడు 300 మామిడిపండ్ల పార్సెలు వచ్చెను. రాలేయను మామలతదారు గోవానుంచి శ్యామా పేరున బాబాకు పంపెను. అది తెరచునప్పటికి పండ్లన్నియు బాగానే యుండెను. అది శ్యామా స్వాధీనములో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రము బాబా కొలంబలో (కుండలో) పెట్టెను. బాబా "ఈ నాలుగు దాము అన్నాకు, అవి యక్కడనే యుండవలె" ననెను.

దాము అన్నాకు ముగ్గురు భార్యలు గలరు. అతడే చెప్పిన ప్రకారము వాని కిద్దరే భార్యలు. కాని యతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడ జ్యోతిష్యమును కొంతవరకు చదివెను. తన జాతకములో దుష్టగ్రహప్రభావ ముండుటచే అతనికి సంతానము కలుగు నవకాశము లేదనుకొనెను. కాని అతనికి బాబాయందు మిక్కిలి నమ్మకము గలదు. మామిడిపండ్లు అందిన రెండుగంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా యిట్లనెను. "అందరు మామిడిపండ్లవైపు చూచుచూన్నారు. కాని అవి దాముకొరకుంచినవి. కావున అవి దామూయే తిని చావవలెను." దాము ఈ మాటలు విని భయపడెను. కాని మహాళ్సాపతి (బాబా ముఖ్యభక్తుడు) దాని నిట్లు సమర్థించెను. "చావనునది యహంకారమునుగూర్చి. దానిని బాబాయందు చంపుట యొక యాశీర్వాదము." బాబా యతడి నిట్లనియె; "నీవు తినవద్దు, నీ చిన్నభార్య కిమ్ము. ఈ యామ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను, నలుగురు కొమార్తెలను ప్రసాదించును." దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను. జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమేగాక ఇప్పుడు గూడ వారి మహత్మ్యమును స్థాపించుచున్నవి. బాబా యిట్లనెను. "సమాధి చెందినప్పటికి నా సమాధిలోనుంచి నా యెముకలు మాట్లాడును. అవి మీకు ఆశను నమ్మకమును కలిగించును. నేనేగాక నా సమాధికూడ మాట్లాడును; కదులును. మనస్ఫూర్తిగ శరణుజొచ్చినవారితో మాట్లాడును. నేను మీవద్దనుండనేమో యని మీరాందోళన పడవద్దు. నా యెముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు. నాయందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలుపొందెదరు."

ప్రార్థన

హేమాడ్ పంతు ఈ అధ్యాయము నొక ప్రార్థనతో ముగించుచున్నాడు. "ఓ సాయి సద్గురూ! భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా! మీ పాదముల మేమెన్నటికి మరువకుందుము గాక. మీ పాదముల నెప్పుడు చూచుచుండెదము గాక. ఈ సంసారమున చావుపుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావుపుట్టుకలనుంచి మమ్ము తప్పింపుము. మా ఇంద్రియములు విషయములపై బోనీయకుండ యడ్డుకొనుము. మా దృష్టిని లోపలకు మరల్చి యాత్మతో ముఖాముఖి జేయుము. ఇంద్రియములు, మనస్సు బయటకు పోవు నైజము నాపు నంతవరకు, ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని, భార్య గాని, స్నేహితుడు గాని యుపయోగపడరు. నీవే మాకు ఆనందమును, మోక్షమును కలుగ జేయువాడవు. వివాదములందు, దుర్మార్గపు పనులందు మాకు గల యాసక్తిని పూర్తిగ నశింపజేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ యుత్సహించుగాక, సమాలోచనలు అన్ని మంచివే యగుగాక చెడ్డవే యగుగాక, తరిమివేయుము. మాగృహములను శరీరములను మరచునట్లుజేయుము. మా యహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడు జ్ఞప్తి యందుండునటుల చేయుము. తక్కిన వస్తువలన్నిటిని మరచునట్లు జేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్ములను గట్టిగ పట్టియుంచినచో మా యజ్ఞానాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేముసంతోషముగా నుండెదము. మమ్ములను నిద్రనుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యమువలనను కలిగినది."

నోటు:- దాము అన్నా యిచ్చిన వాఙ్మూలము ఈ సందర్భమున గమనింప దగినది.

ఒకనా డనేకమందితో నేనుగూడ బాబా పాదములవద్ద కూర్చొని యున్నప్పుడు, నా మనస్సున రెండు సంశయములు కలిగెను. ఆ రెంటికి బాబా యిట్లు జవాబిచ్చెను. 1. సాయిబాబావద్ద అనేకమంది గుమిగూడు చున్నారు. వారందరు బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా యిట్లు జవాబిచ్చెను. "మామిడిచెట్ల వయిపు పూత పూసియున్నప్పుడు చూడుము. పువ్వులన్నియు పండ్లు అయినచో, నెంత మంచి పంట యగును? కాని యట్లు జరుగునా? పువ్వుగానే చాలమట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెన రాలిపోవును. కొన్ని మాత్రమే మిగులును. 2. ఇది నాగురించి యడిగినది. బాబా భౌతికశరీరము విడిచిన పిమ్మట, నా జీవితమనే ఓడ నెట్లు నడపగలను? అది యెటో కొట్టుకొని పోవునా? అయినచో నాగతి యేమి? దీనికి బాబా జవాబిట్లు ఇచ్చెను. "ఎక్కడైనను నెప్పుడయినను నా గురించి చింతించినచో నే నక్కడనే యుండెదను." 1918కి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండిరి. 1918 తరువాత కూడ నెరవేర్చుచున్నారు. ఇప్పటికి నాతోనే యున్నారు. ఇప్పటికి నాకు దారి చూపుచున్నారు. ఇది 1910-11 కాలములో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నియు నన్ను కల్లోలపరచినవి. నా సోదరి చనిపోగా, నా మనస్సు వికలమయ్యెను. నేను జీవితమును సుఖములను లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా, వారు ఉపదేశముతో శాంతింపజేసి, అప్పా కులకర్ని యింటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనము పూసిరి.

నా యింటిలో దొంగతనము జరిగినది. నాకు ముప్పది సంపత్సరములనుండి యొక స్నేహితుడుండెను. అతడు నా భార్యయొక్క నగలపెట్టె దొంగలించెను. అందులో శుభమగు సత్తు (నాసికాభరణము) ఉండెను. బాబా ఫోటోముందేడ్చితిని, ఆ మరుసటి దినమే యా మనిషి నగలపెట్టెను తిరిగి యిచ్చివేసి క్షమాపణ కోరెను.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదియైదవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|

No comments:

Post a Comment